ఏం జరగనుంది? | Sakshi Editorial On Ebrahim Raisi helicopter accident | Sakshi
Sakshi News home page

ఏం జరగనుంది?

Published Wed, May 22 2024 5:12 AM | Last Updated on Wed, May 22 2024 5:12 AM

Sakshi Editorial On Ebrahim Raisi helicopter accident

ప్రపంచమంతటినీ ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన ప్రమాదం... విన్న వెంటనే రకరకాల ఆలోచనలు, అనుమానాలు తలెత్తిన అనూహ్య ఘటన... ప్రతికూల వాతావరణంలో చిక్కుకోవడంతో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీమ్‌ రైసీ, విదేశాంగమంత్రి హుసేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియన్‌లు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ వాయవ్య ఇరాన్‌లో ఆదివారం కుప్పకూలిందన్న వార్త పలు పాత, కొత్త విషయాలను ఏకకాలంలో స్ఫురణకు తెచ్చిన సంచలనం. అంతర్జాతీయ ఆంక్షలు, విమానాల నిర్వహణలో కష్టాల వల్ల ఇరాన్‌లో విమానయాన భద్రత దీర్ఘకాలంగా పెనుసవాలైంది. తాజా ఘటనతో ఆ సంగతి మళ్ళీ రుజువైంది. గగనయానంలో గతంలో పలువురు ప్రముఖుల దుర్మరణాల మొదలు రైసీ హయాంలో ఇరాన్‌ ప్రస్థానం, రానున్న కాలంలో వచ్చే మార్పుల వరకు అనేకం చర్చనీయాంశాలయ్యాయి.

ఇరాన్‌ – ఇరాక్‌ యుద్ధం నాటి నుంచి తన విపరీత వర్తనతో వార్తల్లో ఉన్న సంప్రదాయవాద మతబోధకుడు రైసీ దేశాధ్యక్షపదవిని చేపట్టింది 2021లోనే! ఆయన కన్నా ముందు మితవాది అయిన హసన్‌ రోహానీ ఎనిమిదేళ్ళు ఆ పదవిలో ఉన్నారు. చర్చల ద్వారా మార్పు తేవాలనీ, దేశాన్ని సుసంపన్నం చేయాలనీ భావించిన రోహానీకి పూర్తి భిన్నమైన వ్యక్తి రైసీ. కరడుగట్టిన ఛాందసం, హిజాబ్‌ «ధారణ సహా సమాజంలో కఠిన నిబంధనల అమలు, వందలాది ఉరిశిక్షలతో అంతులేని అపకీర్తి సంపాదించుకున్నారు. నిజానికి, అమెరికా సహా ప్రపంచ దేశాలతో అణు ఒప్పందంపై 2015లో రోహానీ సంతకం చేశారు. 

కానీ, ఆనక అమెరికా అధ్యక్షపీఠమెక్కిన ట్రంప్‌ మాటతప్పి, 2018లో ఇరాన్‌పై మళ్ళీ ఆంక్షలు విధించేసరికి దేశంలో చెల్లని కాసయ్యారు.ఫలితంగా మితవాదుల్ని తోసిపుచ్చి, ఛాందసులు పట్టు బిగించారు. మానవ హక్కుల సంఘాలు సహా అందరూ వ్యతిరేకించడంతో అంతకు ముందు ఒకటికి రెండు సార్లు ఎన్నికల్లో నెగ్గలేకపోయినప్పటికీ, ఎట్టకేలకు 2021లో రైసీ పీఠమెక్కారు. దేశాధ్యక్షుడిగా ఆయన వ్యవహరించింది కొద్ది కాలమే! ఆయన హయాంలో పొరుగున ఉన్న అరబ్‌ దేశాలతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌తో, పాశ్చాత్య ప్రపంచంతో ఘర్షణలు మరింత పెరిగాయి. 

ప్రాణాలు తీసిన హెలికాప్టర్‌ చాలా పాతదంటున్నారు. పాశ్చాత్య దేశాల కఠిన ఆంక్షల కారణంగా కొత్త ఛాపర్లు, విమానాలను ఇరాన్‌ సమకూర్చుకోలేకపోయిందట. అమెరికా మాటెలా ఉన్నా... చైనా, రష్యాలతో సాయిలా ఫాయిలాగా ఉంటున్న దేశానికి, అందులోనూ అసంఖ్యాకంగా డ్రోన్లు సహా అపమిత ఆయుధ సంపత్తి గల దేశానికి పాత ప్రయాణ సాధనాలే గతి అయ్యాయంటే ఆశ్చ ర్యమే. ఏమైనా, ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థలు హమాస్, హెజ్బుల్లా లాంటి వాటికి కొండంత అండగా నిలిచి రైసీ అక్షరాలా అమెరికాకు కంటిలో నలుసయ్యారు. అందుకే, హెలికాప్టర్‌ ప్రమాదంలో కుట్ర కోణం ఉండవచ్చనే అనుమానాలు వినవచ్చాయి. 

ఇటీవలి పశ్చిమాసియా పరిణామాలు... ఆ అను మానాలకు బలమిచ్చాయి. తమపై దాడి చేసిన హమాస్‌కు పెద్ద అండ ఇరాన్‌ గనక తెగబడి ఇజ్రా యెల్‌ గుట్టుగా హత్య చేయించి ఉండవచ్చనే పుకార్లు షికారు చేస్తున్నాయి. పైగా, గాజా చర్యల్లో ఇజ్రాయెల్‌ను బాహాటంగా సమర్థిస్తూ, దానితో వ్యూహాత్మక సహకారమున్న అజర్‌బైజాన్‌కు రైసీ వెళ్ళి వస్తున్నప్పుడే ఘటన జరగడం గమనార్హం. అయితే అనుమానాలకు తగిన ఆధారాలు కానీ, కనీసం ఇరాన్‌ నుంచి ఆరోపణలు కానీ... ఏవీ ఇప్పటి దాకా బయటకు రాలేదు. ఫలితంగా, దురదృష్టకర ప్రమాదంలోనే ఇరాన్‌ అధ్యక్షుడు దుర్మరణం పాలయ్యారని ప్రస్తుతానికి భావించాలి.

ప్రమాదంపై లోతుగా దర్యాప్తు జరిపి, నిజానిజాలను సమగ్రంగా బయటపెట్టాల్సిన బాధ్యత ఇరాన్‌దే! ఏమైనా, అమెరికా ఆంక్షలు, ఆర్థికరంగంలో ఇక్కట్లు, సమాజంలో అసంతృప్తి, నెత్తిన పశ్చిమాసియా కుంపటితో అస్తుబిస్తు అవుతున్న వేళ ఈ దుర్ఘటన ఆ దేశానికి అశనిపాతం. ఇక, ప్రస్తుతానికి దేశ ఉపాధ్యక్షుడికి తాత్కాలిక అధ్యక్ష హోదా ఇచ్చారు. యాభై రోజుల సంతాప దినాల తర్వాత ఇరాన్‌ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఆ దేశంలో అధినాయకుడి (అలీ ఖమేనీ)దే ఆఖరు మాట. అయినా అధ్యక్ష పదవి సైతం కీలకమే! దేశీయ, ప్రాంతీయ అనిశ్చితులు ఎన్నో ఉన్నా, రైసీ దుర్మరణంతో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఇరాన్‌ రాజకీయాల్లో, విధానాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయనీ అనుకోలేం. 

హెలికాప్టర్‌ ప్రమాదఘటన ఇరాన్‌కు తీరని విషాదమే తప్ప, రాజకీయ సంక్షోభం కాదని విశ్లేషకులూ తేల్చేస్తున్నారు. అధినాయకుడైన ఖమేనీకి ఆశ్రితుడిగా, ఆయన మాటను ధిక్కరించే ఆలోచనైనా లేని అధ్యక్షుడిగా, ఎనభై అయిదేళ్ళ వయసు మీద పడ్డ ఆయనకు అరవయ్యో పడిలోని వారసుడిగా అందరూ భావించిన రైసీ హఠాన్మరణంతో ఒక అధ్యాయమైతే ముగిసింది. ఇరాన్‌ చరిత్రలో కొత్త అధ్యాయం ఏమిటి, వారసుడెవరన్నది చర్చ. ఈ వారసత్వ రాజకీయాల కొత్త కూర్పులో ఖమేనీ కుమారుడు సయ్యిద్‌ మొజ్తబా హుసేనీ పైకి వస్తారని ఓ అంచనా. 

ఇస్లామిక్‌ ధర్మశాస్త్ర పాలన (వెలాయత్‌ ఎ ఫకీ) పేరిట మతాచార్యులకు పెద్ద అయిన షియా ధర్మశాస్త్రవేత్త అధినాయకుడిగా కొనసాగే పద్ధతి 1979లో ఇస్లామిక్‌ విప్లవం అనంతరం ఇరాన్‌లో వచ్చింది. అధినాయకుడు, ఆ తర్వాతే దేశాధ్యక్షుడు వగైరా అన్న విధానంపై విమర్శలు, చట్ట బద్ధతపై ప్రశ్నలు, అధికారానికి అనేక సవాళ్ళు వచ్చినా ఇన్నేళ్ళుగా అది కొనసాగింది. 1989 నుంచి ఖమేనీ కనుసన్నల్లోనే ఇరాన్‌ నడిచింది. కానీ, మారుతున్న భౌగోళిక రాజకీయాలు, దీర్ఘకాలంగా అణిచిపెడుతున్నప్పటికీ పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి లాంటివి ఈ ఇస్లామిక్‌ దేశం ముందున్న పెనుసవాళ్ళు. వాటిని అధినాయకత్వం ఎలా దీటుగా ఎదుర్కొంటుందో కచ్చితంగా ఆసక్తికరం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement