టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని బలిగొన్న హెలికాఫ్టర్ ప్రమాదంపై తొలి నివేదిక బయటకు వచ్చింది. రైసీ మృతిపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. ఈ నివేదిక ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. హెలికాఫ్టర్‌పై దాడి జరిగినట్లు ఆనవాళ్లు లేవని ఆ నివేదిక స్పష్టం చేసింది. కానీ, దర్యాప్తు ఇంకా జరగాల్సి ఉందని, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాల్ని గుర్తించాల్సి ఉందని, తుది నివేదికలోనే ఆ వివరాల్ని ప్రస్తావిస్తామని ప్రాథమిక నివేదిక స్పష్టం చేసింది.
ఇరాన్ విడుదల చేసిన ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును పరిశీలిస్తే.. హెలికాప్టర్ ముందు నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించింది. ఎక్కడా దారి తప్పలేదు. ప్రమాదం సంభవించడానికి నిమిషం కంటే ముందు కూడా.. హెలికాఫ్టర్ పైలట్, రైసీ కాన్వాయ్‌లోని మిగిలిన రెండు హెలికాప్టర్లను కూడా సంప్రదించారు. బుల్లెట్లు, ఇతర పేలుడుకు సంబంధించిన వస్తువుల జాడ శకలాల్లో కనిపించలేదు. కొండను ఢీకొట్టిన తర్వాత హెలికాప్టర్‌లో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది..
.. ప్రతికూల వాతావరణం వల్లే ఘటనా స్థలానికి చేరుకోవడం ఆలస్యమైంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. రాత్రంతా గాలింపు కొనసాగింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకు డ్రోన్‌ల సహాయంతో ఘటన జరిగిన కచ్చితమైన ప్రదేశం తెలిసింది. హెలికాప్టర్ సిబ్బంది, వాచ్‌టవర్ మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఎలాంటి అనుమానాస్పద సంభాషణలను గుర్తించలేదు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత మిగిలిన విషయాలు వెల్లడిస్తాం.. అని ప్రాథమిక నివేదికలో ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే.. ఆదివారం(మే 19) జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొల్లాహియన్ సహా మరో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటికే ఇరాన్ సంతాప దినాలు పాటిస్తోంది. భారత కాలమానం ప్రకారం రైసీ అంత్యక్రియలు గురువారం షియా మతస్థులకు అత్యంత పవిత్రమైన మషహద్ నగరంలో జరిగాయి. విశేషం ఏంటంటే.. మషహద్ రైసీ స్వస్థలం కూడా.
Comments
Please login to add a commentAdd a comment