Investigation report
-
రైసీ హెలికాఫ్టర్ క్రాష్: ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లో ఏముందంటే..
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని బలిగొన్న హెలికాఫ్టర్ ప్రమాదంపై తొలి నివేదిక బయటకు వచ్చింది. రైసీ మృతిపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. ఈ నివేదిక ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. హెలికాఫ్టర్‌పై దాడి జరిగినట్లు ఆనవాళ్లు లేవని ఆ నివేదిక స్పష్టం చేసింది. కానీ, దర్యాప్తు ఇంకా జరగాల్సి ఉందని, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాల్ని గుర్తించాల్సి ఉందని, తుది నివేదికలోనే ఆ వివరాల్ని ప్రస్తావిస్తామని ప్రాథమిక నివేదిక స్పష్టం చేసింది.ఇరాన్ విడుదల చేసిన ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును పరిశీలిస్తే.. హెలికాప్టర్ ముందు నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించింది. ఎక్కడా దారి తప్పలేదు. ప్రమాదం సంభవించడానికి నిమిషం కంటే ముందు కూడా.. హెలికాఫ్టర్ పైలట్, రైసీ కాన్వాయ్‌లోని మిగిలిన రెండు హెలికాప్టర్లను కూడా సంప్రదించారు. బుల్లెట్లు, ఇతర పేలుడుకు సంబంధించిన వస్తువుల జాడ శకలాల్లో కనిపించలేదు. కొండను ఢీకొట్టిన తర్వాత హెలికాప్టర్లో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.... ప్రతికూల వాతావరణం వల్లే ఘటనా స్థలానికి చేరుకోవడం ఆలస్యమైంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. రాత్రంతా గాలింపు కొనసాగింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకు డ్రోన్ల సహాయంతో ఘటన జరిగిన కచ్చితమైన ప్రదేశం తెలిసింది. హెలికాప్టర్ సిబ్బంది, వాచ్‌టవర్ మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఎలాంటి అనుమానాస్పద సంభాషణలను గుర్తించలేదు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత మిగిలిన విషయాలు వెల్లడిస్తాం.. అని ప్రాథమిక నివేదికలో ప్రస్తావించారు.ఇదిలా ఉంటే.. ఆదివారం(మే 19) జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొల్లాహియన్ సహా మరో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటికే ఇరాన్ సంతాప దినాలు పాటిస్తోంది. భారత కాలమానం ప్రకారం రైసీ అంత్యక్రియలు గురువారం షియా మతస్థులకు అత్యంత పవిత్రమైన మషహద్ నగరంలో జరిగాయి. విశేషం ఏంటంటే.. మషహద్ రైసీ స్వస్థలం కూడా. -
స్పోర్ట్స్ స్కూల్లో వేధింపుల ఘటనపై విచారణ పూర్తి.. కలెక్టర్‌కు నివేదిక
సాక్షి, హైదరాబాద్: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై అధికారుల విచారణ ముగిసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆరున్నర గంటలకు పైగా సాగిన విచారణ కొనసాగింది. సస్పైండైన ఓఎస్డీ హరికృష్ణ, స్టూడెంట్స్, స్టాఫ్ స్టేట్మెంట్స్ను అధికారులు రికార్డులు చేశారు. ఇక, అధికారుల విచారణ సందర్భంగా చైల్డ్ ప్రొటెక్షన్ బృందం అధికారులు.. సమగ్ర సమాచారం సేకరించారు. కాగా, నివేదికను మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు అధికారులు సమర్పించనున్నారు. ఇదిలా ఉండగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని, స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మరోవైపు.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ దీనిపై స్పందించారు. తాజాగా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ చేసి నన్ను సస్పెండ్ చేశారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నవంబర్లోనే గ్రూప్-2.. రీషెడ్యూల్ తేదీలు ఇవే.. -
Chain Snatcher: తెంచిన గొలుసులన్నీ ఇక్కడే పడిపోయాయి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రెండు రోజుల్లో అయిదు స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేసిన సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ వ్యవహారంలో గుజరాత్ పోలీసులు షాక్ ఇచ్చారు. అతగాడు ఇక్కడ స్నాచ్ చేసిన 18.5 తులాల బంగారాన్నీ వాళ్లు ‘కాజేశారు’. దాన్ని తమ వద్ద జరిగిన నేరాల్లో రికవరీ చూపించిన అధికారులు ఇక్కడ ఒక స్నాచింగ్‌లో తెంచిన గొలుసు మరో నేరం చేస్తున్నప్పుడు రోడ్డుపై పడిపోయినట్లు రికార్డుల్లో పొందుపరిచారు. ఉమేష్ నేరాంగీకార వాంగ్మూలంలో ఈ విధంగానే రికార్డు చేశారు. దీన్ని చూసిన తెలంగాణ పోలీసుల అధికారులు కంగుతిన్నారు. మరోపక్క ఉమేష్‌ను ఇక్కడకు తరలించడానికి అనుమతి కోరుతూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు స్థానిక కోర్టుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేశారు. రికవరీలు కష్టం కావడంతో.. ► చాలా కాలం క్రితం తమ ప్రాంతాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన సొత్తు ఇప్పుడు రికవరీ కావడం కష్టం కావడంతో గుజరాత్ పోలీసులు అతి తెలివితో వ్యవహరించారు. ఉమేష్ ఈ నెల 19న హైదరాబాద్ చేరుకున్నాడు. అదే రోజు ఆసిఫ్‌నగర్‌లో యాక్టివా చోరీ చేశాడు. దానిపై సంచరిస్తూ 20న పేట్ బషీరాబాద్ మొదలుపెట్టి మేడిపల్లి వరకు అయిదు స్నాచింగ్స్ చేశాడు. మరో ఇద్దరు మెడలోని గొలుసులు లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక్కడ స్నాచ్ చేసిన 18.5 తులాల బంగారంతో నేరుగా అహ్మదాబాద్‌లోని చంద్లోడియా ప్రాంతంలో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడు. ► సుదీర్ఘ దర్యాప్తు నేపథ్యంలో ఈ విషయం 21 రాత్రి గుర్తించిన సిటీ పోలీసులు అహ్మదాబాద్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో 22న తెల్లవారుజామున ఉమేష్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈలోపు అతడు ఇక్కడ నుంచి ‘లాక్కెళ్లిన’ బంగారాన్ని అమ్మేందుకు ఆస్కారం లేదు. అయినప్పటికీ అతడి నేరాంగీకార వాంగ్మూలంలో ఎక్కడా మన బంగారం రికవరీ చూపించలేదు. దీన్ని ఆ అధికారులు తమ వద్ద జరిగిన నేరాల లెక్కలో వేసేసుకున్నారు. వరుసపెట్టి పడిపోయిందంటూ.. ► ఇక్కడి పోలీసులు ఉమేష్ ఖతిక్‌ను తీసుకురావాలన్నా, నగరంలో నేరాలకు సంబంధించిన బంగారం రికవరీ చేయాలన్నా దానికి అక్కడి పోలీసులకు అతడిచ్చిన నేరాంగీకార వాంగ్మూలమే ఆధారం. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ పోలీసులను సంప్రదించిన ఇక్కడి అధికారులు దాన్ని సేకరించారు. అందులోని అంశాలను చూసిన మూడు కమిషనరేట్ల పోలీసులూ షాక్ తిన్నారు. మేడిపల్లిలో స్నాచింగ్ మినహా మిగిలిన అన్ని నేరాలను ఇందులో పొందుపరిచారు. వీటిలో కొన్ని స్నాచింగ్‌కు యత్నాలు ఉన్నాయి. ► తాను ఓ నేరంలో మహిళ మెడ నుంచి లాక్కున్న గొలుసు మరో నేరం చేస్తున్న సమయంలో రోడ్డు పైనో, ఎక్కడో తెలియని ప్రాంతంలోనే పడిపోయిందని ఉమేష్ చెప్పినట్లు నమోదు చేశారు. దీని ప్రకారం చూస్తే ఉమేష్ నగరంలో స్నాచ్ చేసిన 18.5 తులాల బంగారం ఇక్కడే పడిపోయానట్లు లెక్క. ఫలితంగా అహ్మదాబాద్ పోలీసులను అడగడానికి కానీ, ఉమేష్ నుంచి రికవరీ చేయడానికి కానీ ఆస్కారం లేకుండా పోయింది. ఈ విషయంలో ఏం చేయాలనే అంశంపై మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు మల్లగుల్లాలుపడుతున్నారు. అక్కడివి అమ్మినట్లు రికార్డుల్లో.. ఉమేష్ ఖతిక్‌పై గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోనూ అనేక కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్టు చేసినట్లు అహ్మదాబాద్‌లోని వడజ్ పోలీసుస్టేషన్ అధికారులు మంగళవారం ప్రకటించారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలో నేరాంగీకార వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇందులో ఉమేష్ గేర్లు లేని వాహనాలను చోరీ చేసి వాటిపై సంచరిస్తూ చైన్ స్నాచింగ్స్ చేశాడని పొందుపరిచారు. ఇవన్నీ గతేడాది మే నుంచి నవంబర్ మధ్య చోటు చేసుకున్నవే అని చూపించారు. ఆ సొత్తును అహ్మదాబాద్‌లోని ఆనంద్‌నగర్‌కు చెందిన లబ్ధి జ్యువెలర్స్ యజమాని హర్ష భాయ్, మానిక్ చౌక్‌లోని హిమ్మత్ చౌక్, చాణక్యపురి ప్రాంతానికి చెందిన మహంకాళి జ్యువెలర్స్ యజమాని గిరీష్ భాయ్లకు అమ్మినట్లు రికార్డు చేశారు. -
సుప్రీంకు ‘సీబీఐ’ నివేదిక
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్‌కుమార్ వర్మ అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన ఉన్నత ధర్మాసనం ఈ నివేదికను స్వీకరించి తదుపరి విచారణ నవంబర్ 16కు వాయిదా వేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి శనివారమే ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. కాగా, ఆదివారం రిజిస్టర్ కార్యాలయం తెరిచే ఉన్నా ఎందుకు నివేదించలేదని సీవీసీని ప్రశ్నిస్తూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సీవీసీ తరఫున కోర్టుకు హాజరైనా సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా కోర్టును క్షమాపణలు కోరుతూ.. నివేదిక తయారీ, స్పైరల్ బైండింగ్ వల్ల ఆలస్యమైందని, తాము కోర్టుకు వచ్చే వరకు సమయం మించిపోవడంతో రిజిస్ట్రర్ కార్యాలయం మూసేసి ఉందని వివరించారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 23 నుంచి 26 మధ్య తాను తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదికను సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వర్రావు సీల్డ్కవర్లో కోర్టుకు అందించారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా అలోక్ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి జస్టిస్ పట్నాయక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని గతనెల 26న సీవీసీని సుప్రీం ఆదేశించింది. మరోవైపు, సీబీఐ అధికారులు అస్థానా, వర్మ, నాగేశ్వర్రావ్కు వ్యతిరేకంగా ఎన్జీవో దాఖలు చేసిన కామన్‌కాజ్ అనే పిల్‌ను సుప్రీం కొట్టేసింది. -
పోలీస్ ‘నొక్కుడు’
- సీడీ ఫైల్స్, చార్జి షీట్లు తయారు చేయడం రాని సిబ్బంది - విశ్రాంత అధికారులపై ఆధారపడి నివేదికల తయారీ - కేసు షీట్లు టైపు చేయించాలని నిందితుల నుంచి గుంజుడు సాక్షి, గుంటూరు: హత్య, ఆత్మహత్య, హత్యాయత్నం, అత్యాచారం వంటి సంఘటనలు జరిగినప్పుడు సహజంగా బాధితులు, స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవడం చూస్తుంటాం. జిల్లాలో మాత్రం పోలీసులు ఉలిక్కిపడుతుంటారు. ఇదేమిటని అనుకుంటున్నారా.. నేరాల్లో నిందితులను కోర్టుకు హాజరుపర్చే ముందు శాఖా పరంగా సీడీ ఫైల్స్, చార్జిషీట్ (90 రోజుల లోపు దర్యాప్తు నివేదిక) కోర్టుకు దాఖలు చేయాల్సి ఉంటుంది. నిందితులను పట్టుకురావడం ఒక ఎత్తు, కేసుకు సంబంధించి సీడీ ఫైల్స్, చార్జ్‌షీట్ తయారు చేయడం, టైపు చేయడం మరో ఎత్తు. సీడీ ఫైల్స్, చార్జిషీట్ తయారీకి అనుభవజ్ఞులైన సిబ్బంది లేకపోవడంతో విశ్రాంత ఉద్యోగులపై ఆధారపడాల్సిరావడం పోలీసుల ఉలికిపాటుకు కారణంగా నిలుస్తోంది. ఏ నేరం జరిగినా పోలీస్ శాఖలో రిటైర్డ్ అయిన కొందరు వ్యక్తుల వద్ద సీడీ ఫైల్స్, చార్జిషీట్ టైప్ చేయించి నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నారు. ►కొందరు ఎస్హెచ్ఓలు విశ్రాంత ఉద్యోగులను స్టేషన్‌కు పిలిచి టైప్ చేయిస్తుండగా, మరి కొందరు విశ్రాంత ఉద్యోగుల ఇంటి వద్దే దర్యాప్తు నివేదికలను టైప్ చేయించుకోవాల్సిన దు స్థితి నెలకొంది. ►ఇలా పనిచేస్తున్న విశ్రాంత ఉద్యోగులకు ఖర్చులు ముట్టజెప్పేందుకు నిందితుల నుంచే ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ►గుంటూరు అర్బన్‌లో 16, రూరల్ జిల్లా పరిధిలో 64 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని స్టేషన్లలో ‘టైపు’ పని కోసం విశ్రాంత ఉద్యోగులపై ఆధారపడుతున్నారు. ►స్టేషనరీ ఖర్చుల నిమిత్తం పట్టణ స్టేషన్‌కు రూ. ఆరువేలు, రూరల్ స్టేషన్‌కు రూ. నాలుగు వేలు ప్రతినెలా పోలీస్‌శాఖ కేటాయిస్తోంది. ►అయినప్పటికీ స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల నుంచి టైపు ఖర్చుల పేరిట పోలీస్ సిబ్బంది వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ►డబ్బులు ఇవ్వకుంటే వారి ఫైలు పక్కన పడేస్తూ పోలీసు భాషలో సమాధానమిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ బాధ తట్టుకోలేని నిందితులు తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ►సబ్‌జైళ్లలో ఉన్న నిందితులు బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటే వారి కేసు దర్యాప్తు నివేదికను పోలీసులు కోర్టుకు అందించాలి. దీంతో చేసేది లేక టైపు ఖర్చులు ఇవ్వక తప్పడం లేదంటున్నారు. ►నరసరావుపేటలో ఓ రిటైర్డు ఎస్ఐ, మరో హెడ్‌కానిస్టేబుల్, డివిజన్లోని పోలీస్ శాఖకు సంబంధించి సీడీ ఫైళ్లు టైప్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ►గుంటూరు నగరంలో సైతం ఇద్దరు, ముగ్గురు విశ్రాంత ఉద్యోగులు పోలీసుల పనిలోనే ఉంటున్నారు. వీరికి పనిభారం ఎక్కువైన రోజు నిందితులను అరెస్టు చూపకుండా ఆపేస్తున్నారు. ►ఏదైనా కేసును గట్టిగా బిగించి నిందితులను ఇబ్బంది పెట్టాలన్నా, కేసును నీరుగార్చి బాధితులకు అన్యాయం చేయాలన్నా అంతా వీరి చేతిలోనే ఉంటుంది. దీంతో డబ్బుకు అలవాటు పడి కేసులు తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ►ఇలాంటి తంతులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నా పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు పట్టించు కోకపోవడం గమనార్హం. ►విశ్రాంత ఉద్యోగుల సేవలను వినియోగించుకొని వారికి గౌరవ వేతనం అందిస్తే టైపు చార్జీల పేరిట పోలీసులు చేస్తున్న అక్రమ వసూళ్లకు కళ్లెం వేయవచ్చని బాధితులు సలహా ఇస్తున్నారు.