పోలీస్ ‘నొక్కుడు’ | Preparation of reports on the retired officers | Sakshi
Sakshi News home page

పోలీస్ ‘నొక్కుడు’

Published Thu, Aug 14 2014 3:31 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

పోలీస్ ‘నొక్కుడు’ - Sakshi

పోలీస్ ‘నొక్కుడు’

- సీడీ ఫైల్స్, చార్జి షీట్లు తయారు చేయడం రాని సిబ్బంది
- విశ్రాంత అధికారులపై ఆధారపడి నివేదికల తయారీ
- కేసు షీట్లు టైపు చేయించాలని నిందితుల నుంచి గుంజుడు
సాక్షి, గుంటూరు: హత్య, ఆత్మహత్య, హత్యాయత్నం, అత్యాచారం వంటి సంఘటనలు జరిగినప్పుడు సహజంగా బాధితులు, స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవడం చూస్తుంటాం. జిల్లాలో మాత్రం పోలీసులు ఉలిక్కిపడుతుంటారు. ఇదేమిటని అనుకుంటున్నారా.. నేరాల్లో నిందితులను కోర్టుకు హాజరుపర్చే ముందు శాఖా పరంగా సీడీ ఫైల్స్, చార్జిషీట్ (90 రోజుల లోపు దర్యాప్తు నివేదిక) కోర్టుకు దాఖలు చేయాల్సి ఉంటుంది. నిందితులను పట్టుకురావడం ఒక ఎత్తు, కేసుకు సంబంధించి సీడీ ఫైల్స్, చార్జ్‌షీట్ తయారు చేయడం, టైపు చేయడం మరో ఎత్తు. సీడీ ఫైల్స్, చార్జిషీట్ తయారీకి అనుభవజ్ఞులైన సిబ్బంది లేకపోవడంతో విశ్రాంత ఉద్యోగులపై ఆధారపడాల్సిరావడం పోలీసుల ఉలికిపాటుకు కారణంగా నిలుస్తోంది. ఏ నేరం జరిగినా పోలీస్ శాఖలో రిటైర్డ్ అయిన కొందరు వ్యక్తుల వద్ద సీడీ ఫైల్స్, చార్జిషీట్ టైప్ చేయించి నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నారు.

కొందరు ఎస్‌హెచ్‌ఓలు విశ్రాంత ఉద్యోగులను స్టేషన్‌కు పిలిచి టైప్ చేయిస్తుండగా, మరి కొందరు విశ్రాంత ఉద్యోగుల ఇంటి వద్దే దర్యాప్తు నివేదికలను టైప్ చేయించుకోవాల్సిన దు స్థితి నెలకొంది.  
ఇలా పనిచేస్తున్న విశ్రాంత ఉద్యోగులకు ఖర్చులు ముట్టజెప్పేందుకు నిందితుల నుంచే ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుంటూరు అర్బన్‌లో 16, రూరల్ జిల్లా పరిధిలో 64 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని స్టేషన్లలో ‘టైపు’ పని కోసం విశ్రాంత ఉద్యోగులపై ఆధారపడుతున్నారు.
స్టేషనరీ ఖర్చుల నిమిత్తం పట్టణ స్టేషన్‌కు రూ. ఆరువేలు, రూరల్ స్టేషన్‌కు రూ. నాలుగు వేలు ప్రతినెలా పోలీస్‌శాఖ కేటాయిస్తోంది.
అయినప్పటికీ స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల నుంచి టైపు ఖర్చుల పేరిట పోలీస్ సిబ్బంది వేలకు వేలు వసూలు చేస్తున్నారు.
డబ్బులు ఇవ్వకుంటే వారి ఫైలు పక్కన పడేస్తూ పోలీసు భాషలో సమాధానమిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ బాధ తట్టుకోలేని నిందితులు తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.
సబ్‌జైళ్లలో ఉన్న నిందితులు బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటే వారి కేసు  దర్యాప్తు నివేదికను పోలీసులు కోర్టుకు అందించాలి. దీంతో చేసేది లేక టైపు ఖర్చులు ఇవ్వక తప్పడం లేదంటున్నారు.
నరసరావుపేటలో ఓ రిటైర్డు ఎస్‌ఐ, మరో హెడ్‌కానిస్టేబుల్, డివిజన్‌లోని పోలీస్ శాఖకు సంబంధించి సీడీ ఫైళ్లు టైప్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు.
గుంటూరు నగరంలో సైతం ఇద్దరు, ముగ్గురు విశ్రాంత ఉద్యోగులు పోలీసుల పనిలోనే ఉంటున్నారు. వీరికి పనిభారం ఎక్కువైన రోజు నిందితులను అరెస్టు చూపకుండా ఆపేస్తున్నారు.
ఏదైనా కేసును గట్టిగా బిగించి నిందితులను ఇబ్బంది పెట్టాలన్నా, కేసును నీరుగార్చి బాధితులకు అన్యాయం చేయాలన్నా అంతా వీరి చేతిలోనే ఉంటుంది. దీంతో డబ్బుకు అలవాటు పడి కేసులు తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
ఇలాంటి తంతులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నా పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు పట్టించు కోకపోవడం గమనార్హం.
విశ్రాంత ఉద్యోగుల సేవలను వినియోగించుకొని వారికి గౌరవ వేతనం అందిస్తే టైపు చార్జీల పేరిట పోలీసులు చేస్తున్న అక్రమ వసూళ్లకు కళ్లెం వేయవచ్చని బాధితులు సలహా ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement