Hyderabad Cops Crack Gold, Diamond Jewellery Robbery Case - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కోటి విలువ చేసే వజ్రాభరణాలు చోరీ.. దొంగలను పట్టించిన భూతద్దం

Published Sat, Dec 24 2022 8:42 AM | Last Updated on Sat, Dec 24 2022 2:56 PM

Hyderabad cops crack gold robbery case - Sakshi

నిందితుడు మైలారం పవన్‌కుమార్‌.. అంజి అలియాస్‌ మచ్చ   

సాక్షి, హైదరాబాద్‌(బంజారాహిల్స్‌): రెండు రోజుల క్రితం ఫిలింనగర్‌ ఫేజ్‌–2లోని శమంతక డైమండ్స్‌ షోరూంలో జరిగిన భారీ చోరీ కేసులో నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. డైమండ్స్‌ నాణ్యతను పరిశీలించే భూతద్దం ఆధారంగా దొంగను పట్టుకోవడం విశేషం.

వివరాల్లోకి వెళితే... మాజీ మంత్రి చెంచు రామయ్య మన వడు పవన్‌కుమార్‌ ఫిలింనగర్‌లో శమంతక డైమండ్స్‌ షోరూం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 20న  సింగాడికుంటకు చెందిన మైలారం పవన్‌ కుమార్, చింతల్‌బస్తీకి చెందిన మచ్చ అలియాస్‌ అంజి నెంబరు ప్లేట్‌ లేని బైక్‌పై వచ్చి షోరూం కిటికీ అద్దాలు తొలగించి రూ. కోటి విలువైన ఆభరణాలతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తుండగా వారి ఓ దొంగ ఆ సమయంలో సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ కేసులో బంజారాహిల్స్‌ క్రైం పోలీసుల ఎదుటే ఉన్నాడు. 

చదవండి: (Hyderabad: రూ.కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ)

దొరికింది ఇలా..
ఈ నెల 19న పవన్‌కుమార్‌  సింగాడికుంటలోనే పక్కింట్లో రెండు సెల్‌ఫోన్లు, రూ. 5 వేల నగదు తస్కరించి పరారయ్యాడు. ఆ మర్నాడు రాత్రి స్నేహితుడు అంజితో కలిసి ఆభరణాల దొంగతనానికి పాల్పడ్డాడు. సెల్‌ఫోన్లు తస్కరించిన అనంతరం బాధితుడు ప్రవీణ్‌ అక్కడి సీసీ ఫుటేజీ పరిశీలించగా పక్కింట్లో ఉంటున్న పవన్‌ వాటిని దొంగిలించినట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని పవన్‌కు ఫోన్‌ చేసి అడగ్గా ఆ రెండు సెల్‌ఫోన్లు పంపించాడు. అయితే దొంగిలించిన నగదు ఇవ్వాలంటూ బాధితుడు కోరగా సమాధానం చెప్పలేదు. ఈ నెల 22న ఉదయం  జహీరానగర్‌ చౌరస్తాలో ఉన్న పవన్‌ను ప్రవీణ్‌ అతడి స్నేహితు పట్టుకున్నారు.

డబ్బుల కోసం నిలదీయగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బాధితుడు 100కు డయల్‌ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పవన్‌ను నెంబరు ప్లేట్‌ లేని స్కూటర్‌తో సహా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌లపై నిందితుడిని ప్రశ్నిస్తుండగా జేబుల్లో ఉన్న ఇతర సామగ్రిని తీసి క్రైం ఎస్‌ఐ టేబుల్‌పై ఉంచాడు. అందులో డైమండ్స్‌ను పరీక్షించే భూతద్దం కూడా ఉంది. దొంగతనం జరిగిన ఇంటికి పెయింటింగ్‌ వేసిన వారితో పాటు మరికొందరిని విచారించే క్రమంలో ఆభరణాల వ్యాపారి పవన్‌కుమార్‌ను పోలీసులు పిలిపించారు.

ఎస్‌ఐ ఎదురుగా ఉన్న భూతద్దాన్ని చూసిన నగల వ్యాపారి పవన్‌కుమార్‌ ఇది తమ షోరూంలోదేనని ఇక్కడికి ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. దీంతో నిందితుడు పవన్‌ను పోలీసులు లోతుగా విచారించగా సదరు భూతద్దాన్ని నగల షోరూం నుంచి తెచ్చిందేనని తనతో పాటు అంజి చోరీకి పాల్పడినట్లు వెల్లడించాడు. దొంగను ఎదురుగానే పెట్టుకుని సీసీ ఫుటేజీల పేరుతో ఐదు ప్రత్యేక బృందాలు నగరమంతా గాలిస్తున్న విషయాన్ని తెలుసుకుని అందరూ అవాక్కయ్యారు. చోరీకి వినియోగించిన బైక్‌ను పరిశీలించగా అందులో కొన్ని ఆభరణాలు, డైమండ్లు లభ్యమయ్యాయి. మిగతా వాటి కోసం గాలిస్తుండగా మరో దొంగ పరారీలో ఉన్నాడని, డైమండ్స్‌ ఉన్న లాకర్‌ను శ్మశానంలో పాతిపెట్టినట్లు తెలిపాడు. ఆ శ్మశానం ఎక్కడ ఉందో తేలాలంటే మరో దొంగ అంజి దొరకాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. 

పాత నేరస్తుడే..
చోరీ కేసులో నిందితుడు మైలారం పవన్‌కుమార్‌ సెపె్టంబర్‌ 15న పోక్సో యాక్ట్‌ కింద బంజారాహిల్స్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అంతకుముందే పవన్‌పై బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గోల్కొండ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రెండు చొప్పున ఆరు స్నాచింగ్‌ కేసులు నమోదై ఉన్నాయి.  

పేదోడి ఇంట సీసీ కెమెరా.. 
బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–10లోని సింగాడికుంటలో ఈ నెల 19న ప్రవీణ్‌ అనే వ్యక్తి ఇంట్లో రెండు సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఆయన ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ దొంగను పట్టించింది. స్థానికంగా పవన్‌ అనే పాత నేరస్తుడు ఈ సెల్‌ఫోన్‌ తస్కరించగా సీసీ ఫుటేజీలో స్పష్టంగా నమోదైంది. ఈ  సీసీ ఫుటేజీ ఆధారంగానే రూ. కోటి విలువైన ఆభరణాల దొంగను పట్టించాయి. తీరా చూస్తే ఆభరణాలు దొంగిలించిన షోరూం యజమా ని సీసీ కెమెరాలే పెట్టుకోలేదు. చుట్టుపక్కల ప్రాంతా లు, రహదారులపై కెమెరాలు లేకపోవడంతో పోలీసులు మళ్లగుల్లాలు పడ్డారు. ఎట్టకేలకు ఓ సాధారణ పౌరుడు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా ఓ పేరు మోసిన దొంగల ముఠాను పట్టించినట్లయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement