charge sheets
-
కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ చార్జిషీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై చార్జీషీట్లు విడుదల చేయాలని.. వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. వచ్చే నెల (డిసెంబర్) 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో... డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. రైతులు, మహిళలు, యువత, ఇతర వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమిటి, వాటిని సరిగా అమలు చేయని తీరుపై నియోజక వర్గ, మండల, గ్రామ స్థాయిల్లో వివిధ రూపాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్ నగర శివార్లలోని బొంగులూరులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ రాష్ట్రస్థాయి వర్క్‌షాపులో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో చార్జిషీట్లు..కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, నియోజక వర్గాల స్థాయిల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇచ్చిన ఇతర హామీల అమల్లో వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది. డిసెంబర్ 1న రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో ఈ మేరకు చార్జిషీట్లను విడుదల చేయనుంది. దీనితోపాటు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం హామీ లు, అమలు చేయని తీరును తెలుపుతూ జిల్లా కలెక్టర్లు మొదలు తహసీల్దార్ల దాకా మెమోరాండాలు సమర్పించనున్నారు. డిసెంబర్ 2, 3 తేదీల్లో మండలాల్లో మోటర్ సైకిల్ యాత్రలు... 4, 5 తేదీల్లో యువ, మహిళా, కిసాన్ తదితర మోర్చాల వారీగా ప్రచార కార్యక్రమాలు చేపడతారు.తొలుత పాదయాత్రలు చేయాలనుకున్నా..కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎండగట్టేలా డిసెంబర్ 1 నుంచి 7 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, సభలు నిర్వహించాలని బీజేపీ తొలుత నిర్ణయించింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు ఉన్నందున.. ఇప్పుడే పాదయాత్రలు వంటివి చేపట్టడం కంటే వికేంద్రీకరణ పద్ధతుల్లో కార్యాచరణ ప్రణాళిక చేపట్టడం మంచిదనే ఆలోచనకు వచ్చినట్టు బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. తొలుత సంస్థాగతంగా బలపడటంపై దృష్టి పెట్టనున్నట్టు వెల్లడించారు. బీజేపీ వర్క్‌షాపులో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డి,ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు.‘6 గ్యారంటీలు కాదు.. 6 అబద్ధాలు’ పేరిట కరపత్రాలురాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు అబద్ధాలతో ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శిస్తూ కరప త్రాలు పంపిణీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. వాటిలో మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణ లక్ష్మి పథకంలో అదనంగా తులం బంగారం, ఇతర హామీల అమలు నుంచి వెనక్కి వెళ్లడం, రైతుభరోసా, రూ.4 వేల నిరుద్యోగ భృతి జాడ లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించనుంది. ఇక ఈ నెలాఖరుకల్లా రాష్ట్రంలో పోలింగ్ బూత్ కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకుని.. తర్వాత మండల, జిల్లా కమిటీల ఎన్నికలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. డిసెంబర్ 25 నాటికి రాష్ట్ర కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. -
ఆ రెండు పార్టీలపై బీజేపీ చార్జిషీట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల కంటే ఎక్కువ మెజారిటీ సీట్లను గెలిచి సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కనీసంగా పది నుంచి పన్నెండు స్థానాల్లో గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ రెండు పార్టీలను ల క్ష్యంగా చేసుకుని ‘అభియోగ పత్రాలు’(చార్జి షీట్లు) విడుదల చేయాలని నిర్ణయించింది. పదేళ్ల పాల నలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిన తప్పి దాలు, కుంభకోణాలను ఎత్తిచూపడంతో పాటు ప్రధాన వాగ్దానాలను నిలబెట్టుకోని నిర్వాకాన్ని చార్జిషీట్లలో ఎత్తిచూపాలని నిర్ణయించినట్టు పార్టీవర్గాల సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో పాటు అనేక హామీలిచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ చార్జిట్ట్లు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రచారం ఊపందుకోనున్న నేపథ్యంలో సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్పై చార్జిట్ట్ల సమర్పణకు బీజేపీ సమాయత్తమవుతోంది. తెలంగాణకూ ‘సంకల్ప పత్రం’ ఈ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి మెజారిటీ ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు చేకూర్చే ప్రయోజనాల గురించి అదనంగా సంకల్పపత్రంలో చేర్చాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇటీవలే బీజేపీ జాతీయ నాయకత్వం ఢిల్లీలో సంకల్పపత్రం పేరిట పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలను చేర్చాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించిందని అంటున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో విడిగా ఒక్క రాష్ట్రానికి మేనిఫెస్టో అంటూ ప్రకటించడం సరికాదని భావించిన బీజేపీ నేతలు.. జాతీయపార్టీ ఎన్నికల ప్రణాళికకు అదనంగా ఓ సంకల్పపత్రాన్ని జత చేయాలని సమాలోచనలు చేస్తున్నారు. ఈ నెల 25న నామినేషన్ల దాఖలు ముగిశాక రాష్ట్రానికి సంబంధించిన సంకల్పపత్రాన్ని విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలిచాక,రాష్ట్రానికి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపంలో చేకూర్చిన ప్రయోజనాలు, అందించిన సహాయసహకారాల గురించి ఇందులో పొందుపరచనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీజేపీని అత్యధిక సీట్లలో గెలిపిస్తే.. కేంద్రం ద్వారా అంతకు మించి ఎన్నో రెట్లు లబ్ధి చేకూరుస్తామని హామీనివ్వాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. -
‘విచారణ పేరుతో జాప్యం సరికాదు’
శ్రీరాంపూర్(మంచిర్యాల): విచారణ పేరుతో సింగరేణి యజమాన్యం జాప్యం చేయడం సరికాదని కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంవోఏఐ) ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్‌లోని ఇల్లందు క్లబ్లో బెల్లంపల్లి, రామగుండం రీజియన్ల పరిధిలోని ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తమ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సీఎంవోఏఐ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఓసీపీలో ఎలాంటి సంబంధం లేని 32 మంది అధికారులకు చార్జిషీట్లు ఇచ్చి ఎలాంటి చర్యలు లేకుండా నాలుగేళ్లుగా ఎంక్వయిరీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. దీంతో ఎలాంటి తప్పుచేయని అధికారులు తప్పుడు చార్జిషీట్ల కారణంగా శిక్ష అనుభవిస్తున్నారన్నారు. వెంటనే దీనిపై యజమాన్యం స్పందించి చార్జ్షీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏరియా జీఎం సంజీవరెడ్డికి దృష్టికి సమస్యలు తీసుకెళ్లగా ఉన్నతాధికారులకు నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో ఏరియా జీఎంలు చింతల శ్రీనివాస్(ఆర్జీ 1), మనోహర్(ఆర్జీ 2), అపెక్స్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఏవీ రెడ్డి, నాయకులు చిలక శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ చంద్రమౌళి రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. -
తబ్లిగీ జామత్ కేసులో వారిపై చార్జిషీట్!
సాక్షి, న్యూఢిల్లీ: తబ్లీగి జమాత్ కేసుకు సంబంధించి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం 82 మంది విదేశీయులపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని నిజాముద్దీన్‌లో తబ్లీగి మసీదుకు వెళ్లి వచ్చిన వారి కారణంగానే భారతదేశంలో కరోనా కేసులు వేగంగా విస్తరించిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే పలు సాక్ష్యాధారాలతో ఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. 15,449 పేజీలు ఉన్న ఈ చార్జ్‌షీట్‌ను జూన్ 12న పరిశీలించనున్నారు. ఈ చార్జ్‌షీట్‌లో 14 మంది ఫిజీ నుంచి వచ్చినవారు, 10 మంది సౌదీ అరేబియా, 8 మంది అల్జీరియా, ఏడుగురు బ్రెజిల్, చైనా, ఆరుగురు సూడాన్, ఫిలిఫైన్స్, అమెరికా నుంచి ఐదుగురు వేరే దేశాలకు చెందిన మరికొందరూ ఉన్నారు. దీనికి సంబంధించి మరో 14 చార్జీషీట్లను కూడా త్వరలో ఫైల్ చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారందరిపై ఫారినర్స్ యాక్ట్ 1946 సెక్షన్ 14(బి) కింద చార్జ్‌షీట్ ఫైల్ చేసినట్లు తెలిపారు. వీరందరిపై వీసా నిబంధనలు ఉల్లంఘించినందకు కేసులు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. (భారత్‌పై నేపాల్ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు) కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న వేళ.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్ భవనంలో తబ్లీగీ జమాత్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మత ప్రార్థనలు నిర్వహించారు. ఎక్కువ మంది మర్కజ్ భవనంలో గుమి గూడిన కారణంగా కరోనా వేగంగా వ్యాప్తి జరిగింది. దీంతో దేశంలో కనీసం 30 శాతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో వారిపై కేసులు పెట్టాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. (అత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం) -
82 మంది విదేశీయులపై చార్జీషీటు దాఖలు
న్యూఢిల్లీ : ఢిల్లీకి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 82 మంది విదేశీయులపై మంగళవారం చార్జీషీట్ దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడంలో ప్రముఖ పాత్ర పోషించిన నిజాముద్దీన్‌లోని తబ్లిగి జమాత్‌తో వీరికి సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 20 చార్జీషీట్లు దాఖలు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ స్పష్టం చేసింది. ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టులో మెజిస్ట్రేట్ సేమా జైల్ ఎదుట చార్జీషీట్లు దాఖలు చేశామని, మొత్తం 20 చార్జీషీట్లను 15449 పేజీలతో రూపొందించినట్లు తెలిపారు. చార్జీషీట్ దాఖలైన వారిలో 14 మంది ఫిజి దేశం నుంచి, 10 మంది సౌదీ అరేబియా, 8 మంది అల్జేరియా, బ్రెజిల్, చైనా నుంచి ఏడుగురు, సుడాన్, ఫిలిప్పీన్స్ నుంచి ఆరుగురు, ఐదుగురు యూఎస్ఏ, నలుగురు అప్ఘనిస్తాన్, ఇద్దరు చొప్పున ఆస్ట్రేలియా, కజకిస్తాన్, మొరాకొ, యూకే నుంచి ఉండగా, ఈజిప్ట్, రష్యా, బెల్జియం, జోర్డాన్, ఫ్రాన్స్, ట్యూనిషియా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీసా నిబంధలను ఉల్లఘించడంపై వీరిపై చార్జీషీట్ దాఖలు చేశామని అధికారులు పేర్కొన్నారు. మర్కజ్ సమావేశానికి హాజరయ్యారా లేదా అనే దానిపై ఇప్పటికే వారిని ప్రశ్నించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. (కరోనా : రాజకీయ సంక్షోభం తప్పదా..!) -
గాలి జనార్దన రెడ్డిపై సిట్ చార్జ్‌షీటు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చార్జ్‌షీటు దాఖలు చేసింది. గురువారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టులో చార్జ్‌షీట్‌ను సమర్పించింది. షేక్‌సాబ్ అనే వ్యక్తికి సంబంధించిన మైనింగ్ స్థలాన్ని కాంట్రాక్టుకు తీసుకుని అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు చార్జ్‌షీట్‌లో సిట్ ఆరోపించింది. ఏ1గా గాలి జనార్దనరెడ్డి, ఏ2గా అలీఖాన్, ఏ3గా శ్రీనివాసరెడ్డిల పేర్లను పేర్కొంది. -
పోలీస్ ‘నొక్కుడు’
- సీడీ ఫైల్స్, చార్జి షీట్లు తయారు చేయడం రాని సిబ్బంది - విశ్రాంత అధికారులపై ఆధారపడి నివేదికల తయారీ - కేసు షీట్లు టైపు చేయించాలని నిందితుల నుంచి గుంజుడు సాక్షి, గుంటూరు: హత్య, ఆత్మహత్య, హత్యాయత్నం, అత్యాచారం వంటి సంఘటనలు జరిగినప్పుడు సహజంగా బాధితులు, స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవడం చూస్తుంటాం. జిల్లాలో మాత్రం పోలీసులు ఉలిక్కిపడుతుంటారు. ఇదేమిటని అనుకుంటున్నారా.. నేరాల్లో నిందితులను కోర్టుకు హాజరుపర్చే ముందు శాఖా పరంగా సీడీ ఫైల్స్, చార్జిషీట్ (90 రోజుల లోపు దర్యాప్తు నివేదిక) కోర్టుకు దాఖలు చేయాల్సి ఉంటుంది. నిందితులను పట్టుకురావడం ఒక ఎత్తు, కేసుకు సంబంధించి సీడీ ఫైల్స్, చార్జ్‌షీట్ తయారు చేయడం, టైపు చేయడం మరో ఎత్తు. సీడీ ఫైల్స్, చార్జిషీట్ తయారీకి అనుభవజ్ఞులైన సిబ్బంది లేకపోవడంతో విశ్రాంత ఉద్యోగులపై ఆధారపడాల్సిరావడం పోలీసుల ఉలికిపాటుకు కారణంగా నిలుస్తోంది. ఏ నేరం జరిగినా పోలీస్ శాఖలో రిటైర్డ్ అయిన కొందరు వ్యక్తుల వద్ద సీడీ ఫైల్స్, చార్జిషీట్ టైప్ చేయించి నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నారు. ►కొందరు ఎస్హెచ్ఓలు విశ్రాంత ఉద్యోగులను స్టేషన్‌కు పిలిచి టైప్ చేయిస్తుండగా, మరి కొందరు విశ్రాంత ఉద్యోగుల ఇంటి వద్దే దర్యాప్తు నివేదికలను టైప్ చేయించుకోవాల్సిన దు స్థితి నెలకొంది. ►ఇలా పనిచేస్తున్న విశ్రాంత ఉద్యోగులకు ఖర్చులు ముట్టజెప్పేందుకు నిందితుల నుంచే ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ►గుంటూరు అర్బన్‌లో 16, రూరల్ జిల్లా పరిధిలో 64 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని స్టేషన్లలో ‘టైపు’ పని కోసం విశ్రాంత ఉద్యోగులపై ఆధారపడుతున్నారు. ►స్టేషనరీ ఖర్చుల నిమిత్తం పట్టణ స్టేషన్‌కు రూ. ఆరువేలు, రూరల్ స్టేషన్‌కు రూ. నాలుగు వేలు ప్రతినెలా పోలీస్‌శాఖ కేటాయిస్తోంది. ►అయినప్పటికీ స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల నుంచి టైపు ఖర్చుల పేరిట పోలీస్ సిబ్బంది వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ►డబ్బులు ఇవ్వకుంటే వారి ఫైలు పక్కన పడేస్తూ పోలీసు భాషలో సమాధానమిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ బాధ తట్టుకోలేని నిందితులు తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ►సబ్‌జైళ్లలో ఉన్న నిందితులు బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటే వారి కేసు దర్యాప్తు నివేదికను పోలీసులు కోర్టుకు అందించాలి. దీంతో చేసేది లేక టైపు ఖర్చులు ఇవ్వక తప్పడం లేదంటున్నారు. ►నరసరావుపేటలో ఓ రిటైర్డు ఎస్ఐ, మరో హెడ్‌కానిస్టేబుల్, డివిజన్లోని పోలీస్ శాఖకు సంబంధించి సీడీ ఫైళ్లు టైప్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ►గుంటూరు నగరంలో సైతం ఇద్దరు, ముగ్గురు విశ్రాంత ఉద్యోగులు పోలీసుల పనిలోనే ఉంటున్నారు. వీరికి పనిభారం ఎక్కువైన రోజు నిందితులను అరెస్టు చూపకుండా ఆపేస్తున్నారు. ►ఏదైనా కేసును గట్టిగా బిగించి నిందితులను ఇబ్బంది పెట్టాలన్నా, కేసును నీరుగార్చి బాధితులకు అన్యాయం చేయాలన్నా అంతా వీరి చేతిలోనే ఉంటుంది. దీంతో డబ్బుకు అలవాటు పడి కేసులు తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ►ఇలాంటి తంతులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నా పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు పట్టించు కోకపోవడం గమనార్హం. ►విశ్రాంత ఉద్యోగుల సేవలను వినియోగించుకొని వారికి గౌరవ వేతనం అందిస్తే టైపు చార్జీల పేరిట పోలీసులు చేస్తున్న అక్రమ వసూళ్లకు కళ్లెం వేయవచ్చని బాధితులు సలహా ఇస్తున్నారు. -
2008 పేలుళ్ల కేసులో చార్జిషీట్లు
న్యూఢిల్లీ: రాజధాని నడిబొడ్డున 2008 సెప్టెంబర్ 13న జరిగిన పేలుళ్ల కేసులో ఢిల్లీ పోలీసులు గురువారం వేర్వేరుగా రెండు చార్జిషీట్లు దాఖలు చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ సహా 29 మంది ఈ ఘటనకు కారకులని ఆరోపించారు. స్పెషల్‌సెల్ పోలీసులు అడిషనల్ సెషన్స్ జడ్జి దయాప్రకాశ్కు వీటిని సమర్పించారు. ఈ రెంటినీ 19న పరిశీలిస్తామని ఆయన ప్రకటించారు. 2008లో కన్నాట్‌ప్లేస్, గ్రేటర్ కైలాష్, కరోల్‌బాగ్‌లో జరిగిన వరుస పేలుళ్లలో 21 మంది మరణించగా, 135 మందికి గాయాలయ్యాయి. యాసిన్, ఇతని ముఖ్య అనుచరుడు అసదుల్లా అఖ్తర్ ఈ ఘటనకు సూత్రదారులని పోలీసులు ఆరోపించారు. వీరి కథనం ప్రకారం.. యాసిన్, అఖ్తర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గత ఆగస్టులో ఇండో-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేశారు. పాక్‌లో ఉంటున్న రియాజ్ ఆదేశాల మేరకు నిందితులు ఈ దాడులకు పాల్పడ్డారు. రియాజ్, అతని అనుచరుల అనుపానుల గురించి ఐఎం సభ్యులు తెహసీన్ అఖ్తర్, వకాస్‌ను ప్రశ్నిస్తున్నారు. వీరితోపాటు మహ్మద్ షకీల్, మహ్మద్ సైఫ్, జీషన్ అహ్మద్, జియా ఉర్ రెహమాన్, ఆసిఫ్ బషీరుద్దీన్, సాకిబ్ నిసార్, మహ్మద్ సాదిక్, ఖయాముద్దీన్ కపాడియా, మహ్మద్ హకీమ్, మహ్మద్ మన్సూర్ అస్గర్ పీర్బాయ్, ముబిన్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, షెహజాద్ తదితరుల పేర్లను చార్జిషీట్లలో చేర్చారు. ఈ కేసుల్లో ఇప్పటికే ప్రాసిక్యూషన్ 200 మంది సాక్షులను హాజరుపర్చింది. ఢిల్లీపై తాజా దాడులకు యత్నించిన ఐఎం ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అగ్రనాయకుడు తెహసీన్ అఖ్తర్ అలియాస్ మోనూ, అనుచరుల సాయంతో దేశరాజధానిపై బాంబుదాడులకు యత్నించాడని ఢిల్లీ పోలీసులు కోర్టుకు గతవారం తెలిపారు. పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ జిల్లా సమీపంలోని నేపాల్ సరిహద్దుల్లో ఇతణ్ని ఈ నెల 25న అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోనూ దాడులకు పాల్పడ్డాడని స్పెషల్‌సెల్ పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీపై దాడులకు యత్నిస్తున్న సమయంలోనే తమకు చిక్కాడని ప్రకటించారు. ఇండియన్ ముజాహిదీన్ దేశంలో మతసామరస్యాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాక్ జాతీయుడు జియా ఉర్ రెహమాన్ అలియాస్ వకాస్, మోనూ ఒకేచోట ప్రశ్నించాల్సి ఉందని కూడా తెలియజేశారు. ఐఎం వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టు తరువాత, మోనూయే ఈ సంస్థకు నేతృత్వం వహిస్తున్నారని విశదీకరించారు. గత ఏడాది బుద్ధగయ, పాట్నాలో జరిగిన పేలుళ్ల కేసులోనూ ఇతను కీలక నిందితుడని జాతీయ దర్యాప్తు సంస్థ వ ర్గాలు తెలిపాయి. -
కేసులు పెట్టారు.. చార్జిషీట్లు మరిచారు..
జనగామ టౌన్, న్యూస్‌లైన్ : హత్యలు.. లైంగికదాడుఉల.. దొంగతనాలు చేసిన నిందితులను పట్టుకుని విచారణ అనంతరం పోలీసులు కేసుకు సంబంధించిన చార్జీషీట్లు కోర్టులో దాఖలు చేస్తారు. ఆ తర్వాతే నిర్ణీత సమయంలో కోర్టుకు చట్టప్రకారం హాజరుపరుస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఐదేళ్లుగా జనగామ డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు మాత్రం వివిధ కేసుల్లో పట్టుబడ్డ నిందితులకు మాత్రం చార్జీషీట్లు వేయడం లేదు. చట్టం తమ పరిధిలోకి రాదన్న విధం గా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నిందితులు ఏళ్ల తరబడి తమ హక్కులను కోల్పోయి ముద్దాయిలుగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్సైజ్ చట్టం ప్రకారం పట్టుకున్న అక్రమ మద్యం, గుడుంబా రవాణా చేసిన నిందితులకు సీఆర్పీసీ-167 క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ ప్రకారం 60 రోజుల్లో చార్జీషీట్లు వేయాల్సి ఉంటుంది. ఎక్సైజ్ అధికారులు మాత్రం దాదాపు ఐదేళ్లు కావొస్తున్నా చార్జీషీట్లు వేయడం లేద న్న వి ష యం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే, ముద్దాయిలు వారి హక్కులను కొల్పోయి సమాజంలో ఏళ్ల తరబడి నిందితులుగానే ముద్రపడి ఉంటున్నారు. పట్టుబడిన వారిలో విద్యార్హతలు ఉన్న ముద్దాయిలపై కేసులు ఉండడంతో వారు ఉద్యోగాలకు సైతం దూరమవుతున్నారని తెలిసింది. ఇదీ కేసుల పరంపర.. గుడుంబా సెక్షన్ 7(ఏ)ఆర్/డబ్ల్యూ/ఈ ఏపీపీ యాక్ట్ -1995 ప్రకారం... 2009-10లో 195 కేసులను నమోదు చేసిన పోలీసులు 262 మందిని, 2010-11లో 245 కేసుల్లో 405 మందిని, 2011-12లో 269 కేసుల్లో 422 మందిని, 2012-13లో 272 కేసుల్లో 424 మందిని, 2013-14లో (ఆగస్టు వరకు) 120 కేసుల్లో 192 మందిని అరెస్టు చేశారు. ఇక వైన్స్‌షాపులు, అక్రమ మద్యం సెక్షన్ 34(ఏ) ఏపీఈ యాక్ట్, 1968 ప్రకారం.. ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసులు ఇలా ఉన్నాయి. 2009-10లో కేవలం ఒకేఒక కేసు నమోదు కాగా అందులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. 2010-11లో 8 కేసుల్లో 9 మంది అరెస్టయ్యూరు.2011-12లో 16 కేసుల్లో 20 మంది, 2012-13లో 43 కేసుల్లో 43 మంది, 2013 ఆగస్టు వరకు 8 కేసుల్లో 9 మంది అరెస్టయ్యూరు. ఐదేళ్లుగా సెక్షన్ 7(ఏ)ఆర్/డబ్ల్యూ/ఈ ఏపీపీ యాక్ట్ -1995 ప్రకారం.. మొత్తం 1081 కేసులకుగాను 1705 మందిని అరెస్టు చేయగా, సెక్షన్ 34(ఏ) ఏపీఈ యాక్ట్, 1968 ప్రకారం 76 కేసుల్లో 83 మందిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా చార్జీషీట్లు వేయకపోవడం గమనార్హం. జాతీయ లోక్‌అదాలత్‌ను వినియోగించుకోలేకపోయిన అధికారులు నవంబర్ 23న జనగామ కోర్టులో కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని కూడా ఎక్సైజ్ అధికారులు వినియోగించుకోలేకపోయూరు. తరచూ స్టేషన్ అధికారుల బదీలీలు, పలువురి ఉద్యోగ విరమణల వల్లే కేసులను దర్యాప్తు చేయలేకపోయూమని చెబుతుండటం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు చట్ట ప్రకారం ముద్దాయిలను కోర్టులో ప్రవేశపెట్టి.. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పకుండా వారి హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నవంబర్ 1న హాజరుకండి : సీబీఐ కోర్టు
జగన్, బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్, ఇతర నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు ఇండియా సిమెంట్స్ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విజయసాయిరెడ్డికి పీటీ వారెంట్ జారీ సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంపై దాఖలైన చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. చార్జిషీట్లో నిందితులుగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇండియా సిమెంట్స్ సీఎండీ, బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ సహా ఇతర నిందితులకు సమన్లు జారీచేశారు. నవంబర్ 1న ప్రత్యక్షంగా హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. నిందితులంతా నవంబర్ 1న కోర్టు ముందు హాజరై కోర్టు నిర్దేశించిన మేరకు పూచీకత్తు బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రిమాండ్‌లో ఉన్న ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డికి పీటీ వారెంట్ జారీచేశారు. నవంబర్ 1న సాయిరెడ్డిని ప్రత్యక్షంగా హాజరుపర్చాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు శామ్యూల్, ఆదిత్యానాథ్దాస్ల ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించని నేపథ్యంలో వారిపై అవినీతి నిరోధక చట్టం కింద మోపిన అభియోగాలను విచారణకు స్వీకరించలేదు. ఈ చార్జిషీట్లో అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తొమ్మిదో సాక్షిగా ఉన్నారు. అలాగే నీటిపారుదల శాఖకు చెందిన సీఈ వి.వేణుగోపాలాచారి, మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ పి.రామరాజు, మాజీ సీఈ బలభద్రుని సీతారామయ్యతోపాటు అనేక మంది అధికారులను సాక్షులుగా పేర్కొన్నారు. ఈ చార్జిషీట్లో మొత్తం 67 మంది సాక్ష్యులు ఉండగా...58 డాక్యుమెంట్లను సీబీఐ ఆధారాలుగా చూపింది. ‘‘చెన్నైకి చెందిన ఇండియా సిమెంట్స్‌కు నిబంధనలకు విరుద్దంగా లీజు రెన్యూవల్ చేయడం, కాగ్నా, కృష్ణా నదుల నుంచి నీటిని కేటాయించడం వంటి ప్రయోజనాలు కల్పించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ ఎండీ.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన మూడు కంపెనీల్లో రూ.140 కోట్లు పెట్టుబడిగా పెట్టారు’’ అని సీబీఐ తన చార్జిషీట్లో ఆరోపించింది. ఈ చార్జిషీట్‌కు సీసీ నెం-24/2013 కేటాయించారు. నిందితులు 1. వైఎస్ జగన్మోహన్రెడ్డి, 2. వి.విజయసాయిరెడ్డి, 3. ఎన్.శ్రీనివాసన్ (ఎండీ, ఇండియా సిమెంట్స్), 4. శ్యామ్యూల్ (సీనియర్ ఐఏఎస్ అధికారి), 5. ఆదిత్యానాథ్ దాస్ (సీనియర్ ఐఏఎస్), 6. రఘురామ్ సిమెంట్స్, 7. ఇండియా సిమెంట్స్, 8. జగతి పబ్లికేషన్స్, 9. కార్మెల్ ఏషియా -
కలవరం..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ షాక్ ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులో తాజాగా మరో చార్జిషీట్లో ఆమె పేరును చేర్చింది. ఇప్పటికే దాల్మియా సిమెంట్ సంస్థకు గనుల కేటాయింపుల్లో అభియోగాలను ఎదుర్కొంటున్న సబిత... తాజాగా మరో కేసులోనూ చిక్కుకున్నారు. ఇందూ సంస్థకు భూ కేటాయింపుల్లో ఆమెను 8వ నిందితురాలిగా మంగళవారం కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. ఆమె ఐటీ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఇందూ సంస్థకు ప్రభుత్వ భూములను కేటాయించారు. ఈ వ్యవహారంలో సదరు సంస్థకు అనుచిత లబ్ధి చేకూర్చినట్లు సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. వారం రోజుల క్రితం పెన్నా సిమెంట్ కంపెనీపై దాఖలు చేసిన చార్జిషీట్లో పేరు లేకపోవడంతో సబిత వర్గీయులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక జగన్ ఆస్తుల కేసులో తమకు ఊరట లభించినట్లేనని భావిస్తున్న తరుణంలో తాజా చార్జిషీట్లో ఆమె పేరు ఉండడం సబిత అనుచరుల్లో కలకలం రేపింది. దాల్మియా సంస్థకు భూ కేటాయింపుల్లో నిబంధనలకు భిన్నంగా నడుచుకున్నారని సీబీఐ అభియోగాలు నమోదు చేసిన వెంటనే సబిత హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆఖరికి పార్టీ సమావేశాల్లోనూ మునుపటి హుషారును ప్రదర్శించలేదు. డీఆర్సీ, డీసీసీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. ఇటీవల ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్ వంటి కీలక నేతలు పార్టీలో చేరే కార్యక్రమాలకు సైతం ఆమె హాజరుకాలేదు. అధిక సమయం సొంత నియోజకవర్గానికే కేటాయిస్తున్న సబిత... ఇప్పుడిప్పుడే ఇతర సెగ్మెంట్లలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కేసులో సీబీఐ ఆమెను ఇరికి ంచడం పార్టీ శ్రేణులను కలవరపరిచింది. జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న సబిత ఇటీవల జరిగిన డీసీఎంఎస్ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని కనబరిచారు. తన వ్యూహంతో వైరివర్గం చిరునామా గల్లంతయ్యేలా చేశారు. ఈ క్రమంలో తాజా పరిణామాలు ఆమెను ఒకింత ఆందోళనకు గురిచేసే అవకాశం లేకపోలేదు. సీబీఐ కేసుల తో మునుపటి తరహాలో దూకుడు ప్రదర్శించలేకపోతున్న సబితకు ఈ పరిణామాలు చికాకు కలిగిస్తున్నాయి.