ఏడాది పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ వచ్చే నెల 1 నుంచి 5 వరకు ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై చార్జీషీట్లు విడుదల చేయాలని.. వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. వచ్చే నెల (డిసెంబర్) 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో... డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
రైతులు, మహిళలు, యువత, ఇతర వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమిటి, వాటిని సరిగా అమలు చేయని తీరుపై నియోజక వర్గ, మండల, గ్రామ స్థాయిల్లో వివిధ రూపాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్ నగర శివార్లలోని బొంగులూరులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ రాష్ట్రస్థాయి వర్క్‌షాపులో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో చార్జిషీట్లు..
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, నియోజక వర్గాల స్థాయిల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇచ్చిన ఇతర హామీల అమల్లో వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది. డిసెంబర్ 1న రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో ఈ మేరకు చార్జిషీట్లను విడుదల చేయనుంది. దీనితోపాటు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించనున్నారు.
ప్రభుత్వం హామీ లు, అమలు చేయని తీరును తెలుపుతూ జిల్లా కలెక్టర్లు మొదలు తహసీల్దార్ల దాకా మెమోరాండాలు సమర్పించనున్నారు. డిసెంబర్ 2, 3 తేదీల్లో మండలాల్లో మోటర్ సైకిల్ యాత్రలు... 4, 5 తేదీల్లో యువ, మహిళా, కిసాన్ తదితర మోర్చాల వారీగా ప్రచార కార్యక్రమాలు చేపడతారు.
తొలుత పాదయాత్రలు చేయాలనుకున్నా..
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎండగట్టేలా డిసెంబర్ 1 నుంచి 7 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, సభలు నిర్వహించాలని బీజేపీ తొలుత నిర్ణయించింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు ఉన్నందున.. ఇప్పుడే పాదయాత్రలు వంటివి చేపట్టడం కంటే వికేంద్రీకరణ పద్ధతుల్లో కార్యాచరణ ప్రణాళిక చేపట్టడం మంచిదనే ఆలోచనకు వచ్చినట్టు బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.
తొలుత సంస్థాగతంగా బలపడటంపై దృష్టి పెట్టనున్నట్టు వెల్లడించారు. బీజేపీ వర్క్‌షాపులో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డి,ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు.
‘6 గ్యారంటీలు కాదు.. 6 అబద్ధాలు’ పేరిట కరపత్రాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు అబద్ధాలతో ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శిస్తూ కరప త్రాలు పంపిణీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. వాటిలో మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణ లక్ష్మి పథకంలో అదనంగా తులం బంగారం, ఇతర హామీల అమలు నుంచి వెనక్కి వెళ్లడం, రైతుభరోసా, రూ.4 వేల నిరుద్యోగ భృతి జాడ లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించనుంది.
ఇక ఈ నెలాఖరుకల్లా రాష్ట్రంలో పోలింగ్ బూత్ కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకుని.. తర్వాత మండల, జిల్లా కమిటీల ఎన్నికలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. డిసెంబర్ 25 నాటికి రాష్ట్ర కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment