కలవరం..!
Published Wed, Sep 18 2013 3:56 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ షాక్ ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులో తాజాగా మరో చార్జిషీట్‌లో ఆమె పేరును చేర్చింది. ఇప్పటికే దాల్మియా సిమెంట్ సంస్థకు గనుల కేటాయింపుల్లో అభియోగాలను ఎదుర్కొంటున్న సబిత... తాజాగా మరో కేసులోనూ చిక్కుకున్నారు. ఇందూ సంస్థకు భూ కేటాయింపుల్లో ఆమెను 8వ నిందితురాలిగా మంగళవారం కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది. ఆమె ఐటీ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఇందూ సంస్థకు ప్రభుత్వ భూములను కేటాయించారు. ఈ వ్యవహారంలో సదరు సంస్థకు అనుచిత లబ్ధి చేకూర్చినట్లు సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. వారం రోజుల క్రితం పెన్నా సిమెంట్ కంపెనీపై దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేరు లేకపోవడంతో సబిత వర్గీయులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక జగన్ ఆస్తుల కేసులో తమకు ఊరట లభించినట్లేనని భావిస్తున్న తరుణంలో తాజా చార్జిషీట్‌లో ఆమె పేరు ఉండడం సబిత అనుచరుల్లో కలకలం రేపింది. దాల్మియా సంస్థకు భూ కేటాయింపుల్లో నిబంధనలకు భిన్నంగా నడుచుకున్నారని సీబీఐ అభియోగాలు నమోదు చేసిన వెంటనే సబిత హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆఖరికి పార్టీ సమావేశాల్లోనూ మునుపటి హుషారును ప్రదర్శించలేదు. డీఆర్‌సీ, డీసీసీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. ఇటీవల ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్ వంటి కీలక నేతలు పార్టీలో చేరే కార్యక్రమాలకు సైతం ఆమె హాజరుకాలేదు. అధిక సమయం సొంత నియోజకవర్గానికే కేటాయిస్తున్న సబిత... ఇప్పుడిప్పుడే ఇతర సెగ్మెంట్లలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కేసులో సీబీఐ ఆమెను ఇరికి ంచడం పార్టీ శ్రేణులను కలవరపరిచింది.
జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న సబిత ఇటీవల జరిగిన డీసీఎంఎస్ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని కనబరిచారు. తన వ్యూహంతో వైరివర్గం చిరునామా గల్లంతయ్యేలా చేశారు. ఈ క్రమంలో తాజా పరిణామాలు ఆమెను ఒకింత ఆందోళనకు గురిచేసే అవకాశం లేకపోలేదు. సీబీఐ కేసుల తో మునుపటి తరహాలో దూకుడు ప్రదర్శించలేకపోతున్న సబితకు ఈ పరిణామాలు చికాకు కలిగిస్తున్నాయి.
Advertisement