
ముంబై: సుమారు ఐదేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు పెద్ద సంచలనం. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తినే కారణమంటూ పెద్ద దుమారమే చెలరేగింది. 2020, జూన్ 14వ తేదీన సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో విగతజీవిలా పడివున్నాడు. మెడకు ఉరి వేసుకుని ఉన్న సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. దీనిపై దాదాపు ఐదేళ్ల పాటు విచారణ జరిపిన సీబీఐ.. ఎట్టకేలకు తుది రిపోర్ట్ ఇచ్చింది. సుశాంత్ మరణం వెనుక ఎవరి ప్రేరేపితం లేదని స్పష్టం చేసింది. అంటే ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియాకు భారీ ఊరట లభించినట్లయ్యింది.
అయితే దీనిపై రియా లాయర్ సతీష్ మనీషిండే మాట్లాడుతూ..‘ ఈ కేసులో ప్రతీకోణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తుది నివేదికను ఇచ్చిన సీబీఐకి కృతజ్ఞతలు. అటు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా రియాపై అనేక రకాలైన తప్పుడు కథనాలు వచ్చాయి. అది కోవిడ్ వచ్చిన సమయం కావడంతో ప్రతీ ఒక్కరూ టీవీలు, సోషల్ మీడియాను ఎక్కువ చూశారు. ఈ క్రమంలోనే రియాపై ఎన్నో తప్పుడు వార్తలు చుట్టుముట్టాయి. నిరాధారమైన ఆరోపణలతో ఆమెను, ఆమె కుటుంబాన్ని నానా యాగీ చేశారు. ఈ రకంగా చేయడం వల్ల అమాయకులు చాలా నష్టపోతారు. కానీ చివరకు రియా పాత్ర ఏమీ లేదని క్లియరెన్స్ వచ్చింది. ఇక్కడ రియాకు సెల్యూట్ చేస్తున్నా. ఎన్నో అవమానాలను భరించి ఎటువంటి నోరు విప్పకుండా మౌనం పాటించిన రియాకు, ఆమె కుటుంబానికి సెల్యూట్ చేస్తున్నా’ అని రియా లాయర్ సతీష్ మనీషిండే తెలిపారు.
సీబీఐ రిపోర్ట్‌లో ఏం చెప్పింది..?
సుశాంత్ మరణానికి సంబంధించి నమోదైన రెండు కేసుల్లో ఎవరి పాత్ర లేదని తెలిపింది. ఈ మేరకు ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్ రిపోర్ట్‌ను దాఖలు చేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం వెనుకు ఎవరి పాత్ర లేదని, ఎటువంటి కుట్రలు జరగలేదని తెలిపింది. సుశాంత్ మరణంలో నటి రియా, ఆమె కుటుంబ సభ్యుల పాత్ర లేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment