జగన్, బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్, ఇతర నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు
ఇండియా సిమెంట్స్ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం
విజయసాయిరెడ్డికి పీటీ వారెంట్ జారీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంపై దాఖలైన చార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇండియా సిమెంట్స్ సీఎండీ, బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ సహా ఇతర నిందితులకు సమన్లు జారీచేశారు. నవంబర్ 1న ప్రత్యక్షంగా హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. నిందితులంతా నవంబర్ 1న కోర్టు ముందు హాజరై కోర్టు నిర్దేశించిన మేరకు పూచీకత్తు బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రిమాండ్‌లో ఉన్న ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డికి పీటీ వారెంట్ జారీచేశారు. నవంబర్ 1న సాయిరెడ్డిని ప్రత్యక్షంగా హాజరుపర్చాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు శామ్యూల్, ఆదిత్యానాథ్‌దాస్‌ల ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించని నేపథ్యంలో వారిపై అవినీతి నిరోధక చట్టం కింద మోపిన అభియోగాలను విచారణకు స్వీకరించలేదు. ఈ చార్జిషీట్‌లో అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తొమ్మిదో సాక్షిగా ఉన్నారు. అలాగే నీటిపారుదల శాఖకు చెందిన సీఈ వి.వేణుగోపాలాచారి, మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ పి.రామరాజు, మాజీ సీఈ బలభద్రుని సీతారామయ్యతోపాటు అనేక మంది అధికారులను సాక్షులుగా పేర్కొన్నారు. ఈ చార్జిషీట్‌లో మొత్తం 67 మంది సాక్ష్యులు ఉండగా...58 డాక్యుమెంట్లను సీబీఐ ఆధారాలుగా చూపింది. ‘‘చెన్నైకి చెందిన ఇండియా సిమెంట్స్‌కు నిబంధనలకు విరుద్దంగా లీజు రెన్యూవల్ చేయడం, కాగ్నా, కృష్ణా నదుల నుంచి నీటిని కేటాయించడం వంటి ప్రయోజనాలు కల్పించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ ఎండీ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన మూడు కంపెనీల్లో రూ.140 కోట్లు పెట్టుబడిగా పెట్టారు’’ అని సీబీఐ తన చార్జిషీట్‌లో ఆరోపించింది. ఈ చార్జిషీట్‌కు సీసీ నెం-24/2013 కేటాయించారు.
నిందితులు
1. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, 2. వి.విజయసాయిరెడ్డి, 3. ఎన్.శ్రీనివాసన్ (ఎండీ, ఇండియా సిమెంట్స్), 4. శ్యామ్యూల్ (సీనియర్ ఐఏఎస్ అధికారి), 5. ఆదిత్యానాథ్ దాస్ (సీనియర్ ఐఏఎస్), 6. రఘురామ్ సిమెంట్స్, 7. ఇండియా సిమెంట్స్, 8. జగతి పబ్లికేషన్స్, 9. కార్మెల్ ఏషియా
నవంబర్ 1న హాజరుకండి : సీబీఐ కోర్టు
Published Thu, Sep 26 2013 2:23 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM
Advertisement
Advertisement