కోల్‌కతా ఆర్జీ కర్ ఘటనలో.. కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు భారీ షాకిచ్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. బెయిల్ నిరాకరించడంతో పాటు నేరం గనుక రుజువైతే మరణశిక్ష తప్పదని స్పష్టం చేసింది.
ఆగష్టు 9వ తేదీన ఆర్జీ కర్ ఆస్పత్రి సెమినార్ హాల్‌లో యువ వైద్యురాలిపై అత్యాచారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని సందీప్ ఘోష్‌పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని తలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోందాల్‌పై అభియోగాలు నమోదు చేసింది సీబీఐ.
ఘటన వెలుగుచూసిన అనంతరం ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నారని, ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్‌కు సందీప్ సూచనలు చేసినట్లు కోర్టులో సీబీఐ వెల్లడించింది. ఇద్దరూ కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపడం, కప్పి పుచ్చేందుకు యత్నించడం వంటివి చేశారని ఆరోపిస్తూ.. అరెస్ట్ చేసింది.
ఈ ఇద్దరూ బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని(సీల్దా కోర్టు కాంప్లెక్స్) ఆశ్రయించారు. కేసులో తన క్లయింట్ ఎలాంటి నేరానికి పాల్పడలేదని.. తప్పుడు ఉద్దేశంతో ఈ కేసులో ఇరికించారని ఘోష్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే.. కోర్టు మాత్రం బెయిల్ అభ్యర్థతను తోసిపుచ్చింది.
‘‘సందీప్ ఘోష్‌పై ఉన్న నేరారోపణ తీవ్రమైంది. ఈ కేసులో ఆయన్ని బెయిల్‌పై విడుదల చేయడం న్యాయపరంగా వీలు కాదు. ఒకవేళ ఆయనపై ఆరోపణ రుజువైతే గనుక.. అత్యంత అరుదైన కేసుగా భావించి మరణశిక్ష విధించాల్సి వస్తుంది’’ అని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ డే వ్యాఖ్యానించారు.
అలాగే.. అభిజిత్ మోందాల్ బెయిల్ పిటిషన్‌ను సైతం కోర్టు తోసిపుచ్చింది. ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. నిందితుల కస్టడీ కోరింది. దీంతో సెప్టెంబర్ 30వ తేదీదాకా కస్టడీకి అనుమతించింది కోర్టు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. ఆర్జీ కర్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్టయ్యాక మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ఘోష్ అవినీతి వ్యవహారం బయటపడటంతో పాటు.. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. మరోపక్క, ఘోష్.. పాలిగ్రాఫ్ పరీక్ష, లేయర్డ్ వాయిస్ అనాలసిస్‌లో కీలక ప్రశ్నలకు మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్లు తేలింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL).. ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. ఇక..ఆయనపై నమోదైన నేరారోపణల దృష్ట్యా.. ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దయింది.
కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థి విగత జీవిగా కనిపించి ఉండటాన్ని గుర్తించారు. తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ.. హత్యాచారమని దర్యాప్తులో తేలింది. వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌రాయ్‌ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment