సిమెంట్ (cement) రంగ దిగ్గజం అల్ట్రాటెక్ తాజాగా ఇండియా సిమెంట్స్(India cements)లో ప్రమోటర్లకున్న 32.72 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఎన్.శ్రీనివాసన్ (srinivasan) సహా ఇతర ఇండియా సిమెంట్స్ ప్రమోటర్లు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఐసీఎల్‌లో 10.13 కోట్ల షేర్ల(32.72 శాతం వాటా)ను ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్ తాజాగా చేజిక్కించుకుంది. దీంతో ఐసీఎల్‌లో ఇప్పటికే 22.77 శాతం వాటా(7.05 కోట్ల షేర్లు) కలిగిన అల్ట్రాటెక్ దీంతో ప్రధాన ప్రమోటర్‌గా అవతరించింది.
ఇండియా సిమెంట్స్‌లో వాటాను 55.49 శాతానికి(17.19 కోట్ల షేర్లు) పెంచుకుంది. వెరసి ఈ నెల 24 నుంచి అల్ట్రాటెక్ (UltraTech)కు అనుబంధ సంస్థగా ఐసీఎల్ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో వైస్‌చైర్మన్, ఎండీ పదవులకు శ్రీనివాసన్ రాజీనామా చేసినట్లు ఐసీఎల్ వెల్లడించింది. అంతేకాకుండా ఆయన భార్య చిత్రా శ్రీనివాసన్, కుమార్తె రూపా గురునాథ్, వీఎం మోహన్ సైతం బోర్డు నుంచి తప్పుకున్నట్లు పేర్కొంది. ఈ బాటలో స్వతంత్ర డైరెక్టర్లు ఎస్.బాలసుబ్రమణ్యన్ ఆదిత్యన్, కృష్ణ శ్రీవాస్తవ, లక్ష్మీ అపర్ణ శ్రీకుమార్, సంధ్యా రాజన్ సైతం బుధవారం(25న) రాజీనామా చేసినట్లు తెలియజేసింది.
కొత్త డైరెక్టర్లు
కొత్తగా కేసీ జన్వర్, వివేక్ అగర్వాల్, ఈఆర్ రాజ్ నారాయణన్, అశోక్ రామచంద్రన్ డైరెక్టర్లుగా ఐసీఎల్ బోర్డు ఎంపిక చేసింది. స్వతంత్ర డైరెక్టర్లుగా అల్కా భరూచా, వికాస్ బాలియా, సుకన్య క్రిపాలు ఎంపికయ్యారు. ఐసీఎల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు(రూ. 7,000 కోట్ల డీల్) ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ గత వారం అల్ట్రాటెక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఓపెన్ ఆఫర్ ద్వారా ఐసీఎల్‌లో మరో 26% వాటాను సొంతం చేసుకునేందుకు సైతం అనుమతించింది.
ఏం జరిగిందంటే?
ఈ ఏడాది జూలై 28న ఐసీఎల్‌లో ప్రమోటర్ల నుంచి 32.72 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అల్ట్రాటెక్ సిమెంట్ ప్రతిపాదించింది. ఇందుకు రూ. 3,954 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించింది. దీంతో నిబంధనల ప్రకారం ఐసీఎల్ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలు(రూ. 3,142 కోట్ల విలువ)కు ఓపెన్ ఆఫర్ సైతం ప్రకటించింది. తద్వారా వేగవంత వృద్ధితోపాటు, తీవ్ర పోటీ నెలకొన్న దక్షిణాది సిమెంట్ మార్కెట్లో విస్తరించేందుకు ప్రణాళికలు అమలు చేసింది. మరోపక్క అంతకుముందే అంటే జూన్‌కల్లా ఐసీఎల్‌లో 23 శాతం వాటాను అల్ట్రాటెక్ సొంతం చేసుకుంది. ఈ బాటలో సుమారు రూ. 1,900 కోట్లు వెచ్చించి రెండు బ్లాక్‌డీల్స్ ద్వారా ఐసీఎల్‌లో డీమార్ట్ రిటైల్ స్టోర్ల దమానీ గ్రూప్‌నకు గల వాటాను చేజిక్కించుకుంది.
కన్సాలిడేషన్ బాట..
దేశీయంగా సిమెంట్ పరిశ్రమ కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధానంగా కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్, గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ పోటీ పడుతున్నాయి. చిన్న సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ 2026–27కల్లా వార్షికంగా 200 టన్నుల(ఎంటీపీఏ) సామర్థ్యంతో టాప్ ర్యాంకులో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు అదానీ గ్రూప్ 2027–28కల్లా సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 ఎంటీపీఏకు పెంచుకునే ప్రణాళికల్లో ఉంది.
అల్ట్రాటెక్ ప్రస్తుత సామర్థ్యం 156.66 ఎంటీపీఏగా ఉంది. ఇప్పటికే సంఘీ ఇండస్ట్రీస్, పెన్నా ఇండస్ట్రీస్‌ను సొంతం చేసుకున్న అదానీ సిమెంట్ ఇటీవలే సీకే బిర్లా గ్రూప్ కంపెనీ ఓరియంట్ సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది(2024–25) 100 ఎంటీపీఏను అందుకోనుంది. ఇదేవిధంగా అల్ట్రాటెక్ కేశోరామ్ ఇండస్ట్రీస్ సిమెంట్ బిజినెస్‌పై దృష్టి పెట్టింది. కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేందుకు నియంత్రణ సంస్థల అనుమతుల కోసం ఎదురు చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment