ultratech
-
అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్.. శ్రీనివాసన్ రాజీనామా
సిమెంట్ (cement) రంగ దిగ్గజం అల్ట్రాటెక్ తాజాగా ఇండియా సిమెంట్స్(India cements)లో ప్రమోటర్లకున్న 32.72 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఎన్.శ్రీనివాసన్ (srinivasan) సహా ఇతర ఇండియా సిమెంట్స్ ప్రమోటర్లు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఐసీఎల్‌లో 10.13 కోట్ల షేర్ల(32.72 శాతం వాటా)ను ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్ తాజాగా చేజిక్కించుకుంది. దీంతో ఐసీఎల్‌లో ఇప్పటికే 22.77 శాతం వాటా(7.05 కోట్ల షేర్లు) కలిగిన అల్ట్రాటెక్ దీంతో ప్రధాన ప్రమోటర్‌గా అవతరించింది.ఇండియా సిమెంట్స్‌లో వాటాను 55.49 శాతానికి(17.19 కోట్ల షేర్లు) పెంచుకుంది. వెరసి ఈ నెల 24 నుంచి అల్ట్రాటెక్ (UltraTech)కు అనుబంధ సంస్థగా ఐసీఎల్ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో వైస్‌చైర్మన్, ఎండీ పదవులకు శ్రీనివాసన్ రాజీనామా చేసినట్లు ఐసీఎల్ వెల్లడించింది. అంతేకాకుండా ఆయన భార్య చిత్రా శ్రీనివాసన్, కుమార్తె రూపా గురునాథ్, వీఎం మోహన్ సైతం బోర్డు నుంచి తప్పుకున్నట్లు పేర్కొంది. ఈ బాటలో స్వతంత్ర డైరెక్టర్లు ఎస్.బాలసుబ్రమణ్యన్ ఆదిత్యన్, కృష్ణ శ్రీవాస్తవ, లక్ష్మీ అపర్ణ శ్రీకుమార్, సంధ్యా రాజన్ సైతం బుధవారం(25న) రాజీనామా చేసినట్లు తెలియజేసింది. కొత్త డైరెక్టర్లు కొత్తగా కేసీ జన్వర్, వివేక్ అగర్వాల్, ఈఆర్ రాజ్ నారాయణన్, అశోక్ రామచంద్రన్ డైరెక్టర్లుగా ఐసీఎల్ బోర్డు ఎంపిక చేసింది. స్వతంత్ర డైరెక్టర్లుగా అల్కా భరూచా, వికాస్ బాలియా, సుకన్య క్రిపాలు ఎంపికయ్యారు. ఐసీఎల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు(రూ. 7,000 కోట్ల డీల్) ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ గత వారం అల్ట్రాటెక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఓపెన్ ఆఫర్ ద్వారా ఐసీఎల్‌లో మరో 26% వాటాను సొంతం చేసుకునేందుకు సైతం అనుమతించింది. ఏం జరిగిందంటే? ఈ ఏడాది జూలై 28న ఐసీఎల్‌లో ప్రమోటర్ల నుంచి 32.72 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అల్ట్రాటెక్ సిమెంట్ ప్రతిపాదించింది. ఇందుకు రూ. 3,954 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించింది. దీంతో నిబంధనల ప్రకారం ఐసీఎల్ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలు(రూ. 3,142 కోట్ల విలువ)కు ఓపెన్ ఆఫర్ సైతం ప్రకటించింది. తద్వారా వేగవంత వృద్ధితోపాటు, తీవ్ర పోటీ నెలకొన్న దక్షిణాది సిమెంట్ మార్కెట్లో విస్తరించేందుకు ప్రణాళికలు అమలు చేసింది. మరోపక్క అంతకుముందే అంటే జూన్‌కల్లా ఐసీఎల్‌లో 23 శాతం వాటాను అల్ట్రాటెక్ సొంతం చేసుకుంది. ఈ బాటలో సుమారు రూ. 1,900 కోట్లు వెచ్చించి రెండు బ్లాక్‌డీల్స్ ద్వారా ఐసీఎల్‌లో డీమార్ట్ రిటైల్ స్టోర్ల దమానీ గ్రూప్‌నకు గల వాటాను చేజిక్కించుకుంది.కన్సాలిడేషన్ బాట..దేశీయంగా సిమెంట్ పరిశ్రమ కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధానంగా కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్, గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ పోటీ పడుతున్నాయి. చిన్న సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ 2026–27కల్లా వార్షికంగా 200 టన్నుల(ఎంటీపీఏ) సామర్థ్యంతో టాప్ ర్యాంకులో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు అదానీ గ్రూప్ 2027–28కల్లా సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 ఎంటీపీఏకు పెంచుకునే ప్రణాళికల్లో ఉంది.అల్ట్రాటెక్ ప్రస్తుత సామర్థ్యం 156.66 ఎంటీపీఏగా ఉంది. ఇప్పటికే సంఘీ ఇండస్ట్రీస్, పెన్నా ఇండస్ట్రీస్‌ను సొంతం చేసుకున్న అదానీ సిమెంట్ ఇటీవలే సీకే బిర్లా గ్రూప్ కంపెనీ ఓరియంట్ సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది(2024–25) 100 ఎంటీపీఏను అందుకోనుంది. ఇదేవిధంగా అల్ట్రాటెక్ కేశోరామ్ ఇండస్ట్రీస్ సిమెంట్ బిజినెస్‌పై దృష్టి పెట్టింది. కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేందుకు నియంత్రణ సంస్థల అనుమతుల కోసం ఎదురు చూస్తోంది. -
అల్ట్రా టెక్ సిమెంట్ ఘటన.. రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం
-
అల్ట్రాటెక్ బిడ్‌ను పరిశీలించండి
కోల్‌కతా: బినానీ సిమెంట్ కొనుగోలు కోసం అల్ట్రాటెక్ దాఖలు చేసిన బిడ్‌ను పరిశీలించాలంటూ రుణదాతల కమిటీకి (కమిటీ ఆఫ్ క్రెడిటర్స్–సీవోసీ) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సూచించింది. దాల్మియా భారత్ గ్రూప్ సమర్పించిన దానికన్నా రూ.1,022 కోట్లు అధికంగా అల్ట్రాటెక్ బిడ్ వేసింది. ఒకవేళ దీనికి సమాన స్థాయిలో దాల్మియా భారత్ గ్రూప్ కొత్తగా మరో బిడ్ వేస్తే దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలని ఎన్సీఎల్టీ ఆదేశించింది. మొత్తం మీద జూన్ 24 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. బ్యాంకులకు దాదాపు రూ. 6,500 కోట్లు బకాయిపడిన బినానీ సిమెంట్స్ ప్రస్తుతం దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటోంది. -
ఆల్ట్రాటెక్ లాభం 31 శాతం డౌన్
న్యూఢిల్లీ: అల్ట్రాటెక్ సిమెంట్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 31 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.614 కోట్లుగా ఉన్న నికర లాభం... ఈ క్యూ2లో రూ.424 కోట్లకు తగ్గినట్లు అల్ట్రాటెక్ సిమెంట్ తెలిపింది. ఇక మొత్తం అమ్మకాలు రూ.6,667 కోట్ల నుంచి 6 శాతం పెరిగి రూ.7,091 కోట్లకు పెరిగాయి. ఇంధన ధరలు బాగా పెరగడంతో వ్యయాలు అధికం కావటం ఈ క్వార్టర్లో కూడా కొనసాగిందని వివరించింది. మొత్తం వ్యయాలు రూ.5,774 కోట్ల నుంచి 12 శాతం పెరిగి రూ.6,451 కోట్లకు చేరుకున్నాయి. ఇబిటా రూ.1,378 కోట్ల నుంచి 13% వృద్ధితో రూ.1,550 కోట్లకు ఎగసిందని సంస్థ తెలిపింది. నిర్వహణ మార్జిన్ 19% నుంచి 21%కి ఎగసింది. వాల్‌కేర్ పుట్టీ ప్లాంట్ కోసం రూ.194 కోట్లు.. వాల్ కేర్ పుట్టీ ప్లాంట్ ఏర్పాటు కోసం రూ.194 కోట్లు పెట్టుబడుల పెట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఈ ప్లాంట్ ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొంది. జైప్రకాశ్ అసోసియేట్స్, జేపీ సిమెంట్ కార్ప్ కంపెనీల నుంచి ప్లాంట్లను కొనుగోలు చేయడం వల్ల తమ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 93 మిలియన్ టన్నులకు పెరిగిందని కంపెనీ తెలిపింది. ఈ ప్లాంట్ల కొనుగోళ్ల వల్ల మధ్య భారత్, తూర్పు ఉత్తర ప్రదేశ్, తీర ఆంధ్ర ప్రాంతాల్లో మరింతగా బలపడ్డామని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఆల్ట్రాటెక్ సిమెంట్ 0.2 శాతం లాభపడి రూ.4,080 వద్ద ముగిసింది. -
మార్కెట్లు జూమ్.. ఏసీసీ అదరహో
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రయ్ మని దూసుకెళ్లాయి. యూరోపియన్ మార్కెట్లు స్ట్రాంగ్ గా ట్రేడవడంతో, మన దేశీయ మార్కెట్లు ర్యాలీ జరిపాయి. 300 పాయింట్లకు పైన ర్యాలీ జరిపిన సెన్సెక్స్ ఆఖరికి 290.54 పాయింట్ల లాభంలో 29,655.84 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఏప్రిల్ 12 తర్వాత మొదటిసారి తన కీలక మార్కు 9200 పైన నమోదైంది. 98.55 పాయింట్ల లాభంలో 9217.95 వద్ద క్లోజైంది. ఫ్రాన్స్ ఎన్నికల తొలి రౌండ్ ఫలితాల్లో ఇమ్మాన్యూల్ మాక్రోన్ గెలిచినట్టు వెల్లడికాగానే, యూరోపియన్ మార్కెట్లు బలపడ్డాయి. యూరోజోన్‌లో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఫ్రాన్స్‌లో రెండు రౌండ్లుగా జరిగే ఈ ఎన్నికల తుది ఫలితాలు మే 11న వస్తాయి. నేడు తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ సంకేతాలు మార్కెట్లకు మంచి ఊపునిచ్చాయి. హెచ్ డీఎఫ్సీ బ్యాంకు, హెచ్ డీఎఫ్సీ , రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ కంపెనీల షేర్లు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. నిఫ్టీ స్టాక్స్ లో ఎక్కువగా లాభాలార్జించిన కంపెనీగా ఏసీసీ నిలిచింది. ఈ కంపెనీ స్టాక్ 7.5 శాతం మేర దూసుకెళ్లింది. ఆల్ట్రా టెక్ సిమెంట్, గ్రాసిమ్, గెయిల్, అంబుజా సిమెంట్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్సీ బ్యాంకు, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీలు కూడా లాభాలు పండించాయి. మరోవైపు ఫార్మా దిగ్గజం లుపిన్ స్టాక్ 3.33 శాతం మేర పడిపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలు పాలైన ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు, చివర్లో కొంతమేర కోలుకున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 64.46 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 379 రూపాయలు పడిపోయి 29,039గా నమోదయ్యాయి. -
యువకుడి ఆత్మహత్య
- మూడు రోజుల తర్వాత వెలుగులోకి - తుమ్మలపెంట ఇందిరమ్మ కాలనీలో ఘటన కొలిమిగుండ్ల: తుమ్మలపెంట ఇందిరమ్మ కాలనీలో ఓయువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. పత్తికొండకు చెందిన వడ్డె రంగయ్య, మద్దమ్మ దంపతులు ఉపాధి నిమిత్తం చిన్న కుమారుడు అరుణ్‌కుమార్(26)తో కలిసి పదేళ్ల క్రితమే ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. తండ్రి ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అరుణ్‌కుమార్ సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో కాంట్రాక్ట్ లేబర్‌గా పని చేస్తుండేవాడు. తల్లి కూలీ పనుల నిమిత్తం రెండు నెలల క్రితం పత్తికొండకు వెళ్లింది. అప్పటి నుంచి ఒక్కడే ఉంటున్న అరుణ్‌కుమార్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. మృతుడి ఇళ్లు కాలనీ చివర్లో ఉండటం..జన సంచారం లేని కారణంగా విషయం వెలుగు చూడలేదు. గురువారం హౌసింగ్ ఈఈ సుధాకరరెడ్డి, ఏఈ వాసుదేవరెడ్డి కాలనీలో పర్యటిస్తూ దుర్వాసన వస్తుండడంతో వెళ్లి చూడగా విషయం తెలిసింది. ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రేమ వ్యవహరమే కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
అల్ట్రాటెక్తోడీల్ విలువను పెంచిన జేపీ
న్యూఢిల్లీ: తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి, బ్యాంకర్ల చేతికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న జైప్రకాశ్ అసోసియేట్స్(జేపీ) గ్రూప్.. అల్ట్రాటెక్‌తో ఒప్పందం విలువను పెంచింది. ఐదు రాష్ట్రాల్లో ఉన్న సిమెంట్ ప్లాంట్లను(వార్షిక సామర్థ్యం 21.2 మిలియన్ టన్నులు) విక్రయించడం కోసం గతంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్‌తో జేపీ రూ.15,900 కోట్లకు ఒప్పం దాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువను ఇప్పుడు రూ.16,189 కోట్లకు పెంచుతూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జేపీ అసోసియేట్స్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఉత్తర్ ప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న 4 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రైండింగ్ ప్లాంట్ పూర్తయ్యాక మరో రూ. 470 కోట్లు అదనంగా చెల్లించేందుకు కూడా అల్ట్రాటెక్ అంగీకరించినట్లు జేపీ గ్రూప్ వెల్లడిం చింది. కాగా, జేపీ రుణ ఖాతాను మొండిబకాయిగా మార్చిన బ్యాంకర్ల కన్సార్షియం వ్యూహా త్మక రుణ పునర్వ్యవస్థీకరణ(ఎస్డీఆర్) ప్రక్రియను మొదలుపెట్టిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఎస్డీఆర్ అమల్లోకివస్తే.. బ్యాంకర్లు తమ రుణ బకాయిలకుగాను కంపెనీలో వాటాలను తీసుకుం టాయి. దీంతో జేపీ గ్రూప్ నియంత్రణ పూర్తిగా బ్యాంకర్ల చేతిలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. -
అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంటు ప్లాంట్లు
♦ ఏపీ సహా ఇతర రాష్ట్రాల యూనిట్లలో కొన్నింటి విక్రయం ♦ డీల్ విలువ రూ. 15,900 కోట్లు న్యూఢిల్లీ: సిమెంటు రంగంలో కన్సాలిడేషన్‌కు తెరతీస్తూ రుణ సంక్షోభంలో ఉన్న జైప్రకాష్ అసోసియేట్స్ (జేఏఎల్) తమ సిమెంటు వ్యాపారంలో కొంత భాగాన్ని అల్ట్రాటెక్ సంస్థకు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 15,900 కోట్లు. గత నెలలో కర్ణాటక ప్లాంటును కూడా విక్రయించాలని యోచించినప్పటికీ... తాజాగా దాన్ని పక్కన పెట్టడంతో ఒప్పందం విలువ రూ. 16,500 కోట్ల నుంచి రూ. 15,900 కోట్లకు తగ్గింది. కర్ణాటక ప్లాంటు వార్షికోత్పత్తి సామర్థ్యం 1.2 మిలియన్ టన్నులుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని 17.2 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ప్లాంట్లను, 4 మిలియన్ టన్నుల గ్రైండింగ్ యూనిట్‌ను (యూపీ) అల్ట్రాటెక్‌కు విక్రయించేందుకు బోర్డు ఆమోదించినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు జేఏఎల్ వెల్లడించింది. కర్ణాటకలోని షాబాద్ ప్లాంటును మినహాయించేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. మొత్తం డీల్ విలువ రూ. 15,900 కోట్లు కాగా, గ్రైండింగ్ యూనిట్ పనుల పూర్తి కోసం గాను యూటీసీఎల్ మరో రూ.470 కోట్లు చెల్లిస్తుంది. 9-12 నెలల్లోగా విక్రయ ప్రక్రియ పూర్తి కాగలదని జేఏఎల్ తెలిపింది. ఒప్పందం అనంతరం ఆంధ్రప్రదేశ్ సహా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జేఏఎల్ వద్ద మొత్తం 10.6 మిలియన్ టన్నుల సామర్ధ్యం గల ప్లాంట్లు మిగులుతాయి. అటు అల్ట్రాటెక్ సామర్థ్యం 91.1 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. తమ అంచనాల ప్రకారం కొనుగోలు ప్రక్రియ పూర్తికావటానికి 12-14 నెలలు పట్టొచ్చని స్టాక్ ఎక్స్చేంజీలకు అల్ట్రాటెక్ తెలిపింది. వేల కోట్ల రుణాలతో సతమతమవుతున్న జేపీ అసోసియేట్స్‌కి తాజా డీల్‌తో కొంత ఊరట లభించనుంది. తాజా పరిణామంతో జేఏఎల్ షేర్లు బీఎస్ఈలో 3.66 శాతం పెరిగి రూ. 7.64 వద్ద, అల్ట్రాటెక్ షేర్లు 1.09 శాతం పెరిగి రూ. 3,227 వద్ద ముగిశాయి. -
లాకౌట్‌కు చేరువలో అల్ట్రాటెక్ !
తాడిపత్రి: సిమెంట్ ఉత్పత్తిలో ఆసియాలోనే అతిపెద్ద కర్మాగారమైన ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ కార్మాగారం మూత పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత నెల 22వ తేదీ నుంచి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో కర్మాగారం వద్ద ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ప్లాంట్‌లో సిమెంట్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. దీంతో యజమాన్యం ఇప్పటికే లాకౌట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తాడిపత్రి మండలంలోని బోగసముద్రం ప్లాంట్ వద్ద 10 రోజులుగా కార్యకలపాలు పూర్తిగా స్తంభించాయి. సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. రోజుకు 10 నుంచి 12 వేల మెట్రిక్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే సామార్థ్యం ఉన్న ఈ ప్లాంట్ ఆసియాలోనే పెద్దది. ఇక్కడ ప్రత్యేక్షంగా ఐదు వేల మంది కార్మికులు, ప్రత్యేక్షంగా 10వేల మందికార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఈ కర్మాగారం నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చాల సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. అయితే దశల వారిగా ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యం చెబుతూ వస్తోంది. కొద్ది మందికి ఇచ్చారు కూడా. ఈనెల 22వ తేదీ ఉదయం జేసీ దివాకర్ రెడ్డి ఏకంగా తన అనుచురులను, సమీప గ్రామాలకు చెందిన వారిని, రైతులను ప్లాంట్ వద్దకు రప్పించి మొత్తం ప్రధాన గేట్లను బలవంతంగా మూయించి రాకపోకలను స్తంభింపచేశారు. ప్లాంట్‌లోకి వేళ్లే రైల్వేవ్వాగిన్లను, వాహనాల రాకపోకలను కూడా అడ్డుకోవడంతో పరిశ్రమ ఆగిపోయింది. ఎం.పి.జె.సి.దివాకర్‌రెడ్డి నేతృత్వలో జరుగుతున్న అందోళన మరింత ఉపందుకుంది. ఒక దశలో ప్లాంట్‌లోకి నిత్యావసర వస్తువులు కూడా లోపలకి పంపేందుకు అందోళన కారులు అడ్డుకోవడంతో పోలీసులు జోక్యం కల్పించుకోని అనుమతించారు. ప్రధాన గేట్ల వద్ద రాత్రిం బవళ్లు కాపలా ఉంటూ ఆందోళన కొనసాగిస్తూ వస్తున్నారు. చాలా సార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. 15వేల మంది ఉపాధికి విఘాతం కల్పించే విధంగా ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వ కానీ, జిల్లా యంత్రంగం కానీ కల్పించుకున్న పాపాన పోలేదు. దీంతో చేసేది లేక లాకౌట్ దిశగా యాజమాన్యం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. లాకౌట్‌కు దారితీస్తున్న పరిణామాలపై జిల్లా యంత్రాంగానికి నివేదికలు పంపి త్వరలో అధికారికంగా ప్రకటన చేయనుంది. ఒక వైపు ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తామంటే ఉన్న పరిశ్రమలను మూసివేసే విధంగా సొంత నేతలే చేస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 20 ఏళ్ల తర్వాత స్పందించడంపై విమర్శల వెల్లువ 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు అయిన సిమెంట్ పరిశ్రమలో పూర్తిస్థాయిలో 18 సంవత్సరాల క్రితం ఉత్పత్తి ప్రారంభం అయింది. అప్పట్లో స్థానికులకు ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేయని ఎం.పి. జె.సి.దివాకర్‌రెడ్డి ఇప్పుడు ఉధృతంగా ఆందోళన చేయించడం వెనుక ఉద్దేశం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార యంత్రంగం, పోలీసులు కూడా ఆందోళన కారులకే మద్దతు ఇస్తున్నట్లు ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
జేపీ సిమెంట్ గుజరాత్ యూనిట్ అల్ట్రాటెక్ పరం
న్యూఢిల్లీ: సిమెంట్ దిగ్గజాలు జేపీ, అల్ట్రాటెక్ల మధ్య ఏడాదికిపైగా జరిగిన చర్చలు ఎట్టకేలకు ఫలవంతం అయ్యాయి. ఫలితంగా జేపీ సిమెంట్ కార్పొరేషన్‌కు గుజరాత్‌లోగల సిమెంట్ ప్లాంట్ అల్ట్రాటెక్ సొంతం కానుంది. ఇందుకు జేపీ సిమెంట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ తెలిపింది. డీల్ విలువ రూ. 3,800 కోట్లుగా వెల్లడించింది. డీల్‌లో భాగంగా సేవాగ్రామ్‌లో గల సిమెంట్ యూనిట్‌తోపాటు, వాంక్బోరీలోగల గ్రైండింగ్ యూనిట్ కూడా తమ సొంతం కానున్నట్లు పేర్కొంది. రెండు ప్లాంట్లు సంయుక్తంగా ఏడాదికి 4.8 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటితోపాటు 57.5 మెగా వాట్ల బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్, 90ఏళ్లకు సరిపడే సున్నపురాయి నిల్వలు సైతం అల్ట్రాటెక్ సొంతంకానున్నాయి. తాజా కొనుగోలుతో అల్ట్రాటెక్ సిమెంట్ సామర్థ్యం 59 మిలియన్ టన్నులకు చేరనుంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లతో కలిపి 2015కల్లా సిమెంట్ తయారీ సామర్థ్యం 70 మిలియన్లకు పెరగనున్నట్లు కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పారు. గుజరాత్ యూనిట్ కొనుగోలుకి ఈక్విటీ ద్వారా రూ. 150 కోట్లు, రుణాల ద్వారా రూ. 2,000 కోట్లను, అంతర్గత వనరుల ద్వారా మరో 1,650 కోట్లను సమకూర్చుకోనున్నట్లు బిర్లా వివరించారు. సిమెంట్ యూనిట్ విక్రయం ద్వారా లభించనున్న నిధులను రుణాల చెల్లింపునకు వినియోగించనున్నట్లు జేపీ గ్రూప్ వెల్లడించింది. జేపీ సిమెంట్ వాటాదారులకు రూ. 150 కోట్ల విలువైన అల్ట్రాటెక్ షేర్లను జారీ చేయనున్నట్లు బిర్లా తెలిపారు. కాగా, జేపీ సిమెంట్ రూ. 350 కోట్లమేర నష్టాలను నమోదు చేసుకుంది. డీల్ నేపథ్యంలో బీఎస్ఈలో అల్ట్రాటెక్ షేరు 1.6% పుంజుకుని రూ. 1,733కు చేరగా, జేపీ అసోసియేట్స్ 6.2% ఎగసి రూ. 43.40 వద్ద ముగిసింది. -
అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంట్ ప్లాంట్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ జేపీ సిమెంట్ కార్పొరేషన్‌కు చెందిన గుజరాత్ ప్లాంట్‌లో 51% వాటాను కొనుగోలు చేయనుంది. 5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల గుజరాత్ సిమెంట్ ప్లాంట్‌లో జేపీకి గల 51% వాటాను కొనుగోలు చేసేందుకు అల్ట్రాటెక్ నిర్వహిస్తున్న చర్చలు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాటా విలువను రూ. 4,000 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 10-15 రోజుల్లోగా డీల్ కుదరవచ్చునని వెల్లడించాయి. అయితే ఈ విషయంపై స్పందించేందుకు రెండు కంపెనీల వర్గాలు నిరాకరించాయి. జేపీ గ్రూప్ రియల్టీ, సిమెంట్, ఆతిథ్య రంగాలలో కార్యకలాపాలను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీ ఏడాదికి 33.5 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాని కలిగి ఉంది. అజైల్‌లో పూర్తి వాటా విక్రయించిన హెచ్‌బీఎల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అనుబంధ కంపెనీ అయిన అజైల్ ఎలక్ట్రిక్ సబ్ అసెంబ్లీ ప్రైవేట్ లిమిటెడ్‌లో తమకున్న మొత్తం వాటాను హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ విక్రయించింది. హెచ్బీఎల్తోపాటు ఇతర షేర్హోల్డర్లకు చెందిన వాటాలు, ఫ్రెష్ సబ్స్క్రిప్షన్ ద్వారా అజైల్ ఎలక్ట్రిక్‌ను బ్లాక్‌స్టోన్ గ్రూప్ కైవసం చేసుకుంది. మొత్తంగా బ్లాక్‌స్టోన్ రూ.400 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. వాటా అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని వ్యాపార విస్తరణకు హెచ్‌బీఎల్ వినియోగించనుంది. అజైల్ ఎలక్ట్రిక్ వాహన విడిభాగాల తయారీలో ఉంది. ఏటా 4 కోట్ల విడిభాగాలు తయారీ సామర్థ్యం ఈ కంపెనీ సొంతం.