జేపీ సిమెంట్ గుజరాత్ యూనిట్ అల్ట్రాటెక్ పరం
జేపీ సిమెంట్ గుజరాత్ యూనిట్ అల్ట్రాటెక్ పరం
Published Thu, Sep 12 2013 3:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
న్యూఢిల్లీ: సిమెంట్ దిగ్గజాలు జేపీ, అల్ట్రాటెక్‌ల మధ్య ఏడాదికిపైగా జరిగిన చర్చలు ఎట్టకేలకు ఫలవంతం అయ్యాయి. ఫలితంగా జేపీ సిమెంట్ కార్పొరేషన్‌కు గుజరాత్‌లోగల సిమెంట్ ప్లాంట్ అల్ట్రాటెక్ సొంతం కానుంది. ఇందుకు జేపీ సిమెంట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ తెలిపింది. డీల్ విలువ రూ. 3,800 కోట్లుగా వెల్లడించింది. డీల్‌లో భాగంగా సేవాగ్రామ్‌లో గల సిమెంట్ యూనిట్‌తోపాటు, వాంక్‌బోరీలోగల గ్రైండింగ్ యూనిట్ కూడా తమ సొంతం కానున్నట్లు పేర్కొంది.
రెండు ప్లాంట్లు సంయుక్తంగా ఏడాదికి 4.8 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటితోపాటు 57.5 మెగా వాట్ల బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్, 90ఏళ్లకు సరిపడే సున్నపురాయి నిల్వలు సైతం అల్ట్రాటెక్ సొంతంకానున్నాయి. తాజా కొనుగోలుతో అల్ట్రాటెక్ సిమెంట్ సామర్థ్యం 59 మిలియన్ టన్నులకు చేరనుంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లతో కలిపి 2015కల్లా సిమెంట్ తయారీ సామర్థ్యం 70 మిలియన్లకు పెరగనున్నట్లు కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పారు. గుజరాత్ యూనిట్ కొనుగోలుకి ఈక్విటీ ద్వారా రూ. 150 కోట్లు, రుణాల ద్వారా రూ. 2,000 కోట్లను,
అంతర్గత వనరుల ద్వారా మరో 1,650 కోట్లను సమకూర్చుకోనున్నట్లు బిర్లా వివరించారు. సిమెంట్ యూనిట్ విక్రయం ద్వారా లభించనున్న నిధులను రుణాల చెల్లింపునకు వినియోగించనున్నట్లు జేపీ గ్రూప్ వెల్లడించింది. జేపీ సిమెంట్ వాటాదారులకు రూ. 150 కోట్ల విలువైన అల్ట్రాటెక్ షేర్లను జారీ చేయనున్నట్లు బిర్లా తెలిపారు. కాగా, జేపీ సిమెంట్ రూ. 350 కోట్లమేర నష్టాలను నమోదు చేసుకుంది. డీల్ నేపథ్యంలో బీఎస్‌ఈలో అల్ట్రాటెక్ షేరు 1.6% పుంజుకుని రూ. 1,733కు చేరగా, జేపీ అసోసియేట్స్ 6.2% ఎగసి రూ. 43.40 వద్ద ముగిసింది.
Advertisement
Advertisement