సరిహద్దుల్లో కాల్పుల మోత | Pakistan continues small arms, artillery fire along LoC | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో కాల్పుల మోత

May 11 2025 6:06 AM | Updated on May 11 2025 6:06 AM

Pakistan continues small arms, artillery fire along LoC

కశ్మీర్‌ నుంచి గుజరాత్‌ దాకా 

జమ్మూకశ్మీర్‌లో ఆరుగురి మృతి  

న్యూఢిల్లీ/జమ్మూ/శ్రీనగర్‌: సరిహద్దుల వెంబడి పాక్‌ సైన్యం కాల్పులు శనివారం వరుసగా పదహారో రోజు కూడా కొనసాగాయి. దాంతో పశ్చిమ సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఆపరేషన్‌ బున్యాన్‌ ఉల్‌ మర్సూస్‌ (పడగొట్టలేని దృఢమైన గోడ) పేరిట శుక్రవారం అర్ధరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్‌ మొదలుకుని గుజరాత్‌ దాకా సైన్యం భారీ కాల్పులకు పాల్పడింది. సైనిక స్థావరాలతో పాటు సాధారణ జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. 

పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, హోషియార్‌పూర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, తార్న్‌తరన్, హరియాణాలోని సిర్సాలో కాల్పులు, పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. పాక్‌ కాల్పులను సైన్యం దీటుగా తిప్పికొట్టింది. మన ప్రతిదాడుల భయంతో శనివారం తెల్లవారుజాము 3.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పాక్‌ తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. 

ప్రభుత్వాధికారి సహా ఆరుగురి మృతి  
పాక్‌ కాల్పుల్లో జమ్మూలో ఆరుగురు మరణించారు. 8 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 20 మంది గాయపడ్డారు. మృతుల్లో రాజౌరీ జిల్లా అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్‌ రాజ్‌కుమార్‌ థాపా, ఓ సైనికాధికారితో పాటు రెండేళ్ల బాలిక ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాక్‌ సైన్యం సామాన్యులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటమే గాక డ్రోన్లు ప్రయోగించిందని పేర్కొన్నారు. 

జమ్మూ సహా పలు పట్టణాలు, గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. సైరన్లు నిరంతరాయంగా మోగుతుండడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం ఉదయం 5 గంటలకు భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాజ్‌కుమార్‌ థాపా అధికారిక నివాసంపై కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. థాపా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దాంతో స్థానికంగా విషాదం అలుముకుంది. థాపా శుక్రవారం సైతం విధుల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రితో కలిసి జిల్లావ్యాప్తంగా పర్యటించారు. 

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. పాక్‌ దాడుల్లో రాజౌరీ టౌన్‌లో ఐషా నూర్‌ (2), మొహమ్మద్‌ షోహిబ్‌(35) మృతిచెందారు. పూంఛ్‌ జిల్లాలో రషీదా బీ(55) ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయాలపాలయ్యారు. జమ్మూ జిల్లా ఆర్‌.ఎస్‌.పురా సెక్టార్‌లో అశోక్‌ కుమార్‌ అనే పౌరుడు విగతజీవిగా మారాడు. పూంఛ్‌లోని కృష్ణఘాటీ సెక్టార్‌లో బాంబు పేలుడులో హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్‌ అమరుడయ్యాడు. జమ్మూ శివార్లలోని ఖేరీ కేరాన్‌ గ్రామంలో జకీర్‌ హుస్సేన్‌ (45) మరణించాడు. 

శ్రీనగర్‌లో భారీ పేలుళ్లు  
శ్రీనగర్‌ శనివారం పేలుళ్లతో దద్దరిల్లింది. ఉదయం 11.45 గంటల వేళ ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు శక్తిమంతమైన పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా నగరంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అంతకుముందు నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. శ్రీనగర్‌లోని ఓల్డ్‌ ఎయిర్‌ఫీల్డ్‌ వైపు దూసుకొచి్చన ఓ డ్రోన్‌ను సైన్యం కూల్చివేసింది. 

సీఎం ఒమర్‌ సంతాపం 
రాజ్‌కుమార్‌ థాపా మరణం పట్ల జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు. అంకితభావం కలిగిన సీనియర్‌ అధికారిని కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. జమ్మూలో దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒమర్‌ పర్యటించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రజలకు స్థైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

హిమాచల్‌లో డ్రోన్, క్షిపణుల శకలాలు 
హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఉనా జిల్లాలోని బెహాద్‌ గ్రామంలో శనివారం క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. కాంగ్రా జిల్లా నూర్పూర్‌లో రెండుచోట్ల డ్రోన్, మిస్సైల్‌ విడిభాగాలను గుర్తించారు. అవి సైన్యం కూల్చివేసిన పాక్‌ డ్రోన్లు, క్షిపణుల విడిభాగాలని అంచనా వేస్తున్నారు.  శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అక్కడ భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.  

సైనిక పోస్టులు, ఉగ్ర లాంచ్‌ప్యాడ్‌లు ధ్వంసం 
జమ్మూ సమీపంలో పాకిస్తాన్‌ భూభాగంలో సైనిక  పోస్టులతో ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ‘‘భారత్‌పై డ్రోన్‌ దాడులకు ఈ లాంచ్‌ప్యాడ్‌లనే వాడారు. ఇవి పాక్‌లోని సియాల్‌కోట్‌ జిల్లా లూనీలో ఉన్నాయి’’ అని బీఎస్‌ఎఫ్‌ వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్‌ భూభాగం నుంచి జరిగిన కాల్పులకు గట్టిగా బదులిచ్చామని వెల్లడించింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బీఎస్‌ఎఫ్‌ పోస్టులే లక్ష్యంగా పాక్‌ సైన్యం దాడులకు దిగింది. దాంతో పాక్‌ రేంజర్ల క్యాంపులపై బీఎస్‌ఎఫ్‌ విరుచుకుపడింది.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు
కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా 
జమ్మూ: పాకిస్తాన్‌ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సరిహద్దు ప్రాంతాల్లోని వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ప్రకటించారు. బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, జమ్మూ సెక్టార్లపై నాలుగు రోజుల పాటు జరిగిన కాల్పుల్లో జిల్లా అదనపు అభివృద్ధి కమిషనర్‌ సహా 19 మంది చనిపోయారు. ‘పాక్‌ వైపు నుంచి జరిగిన కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర వేదన కలిగించింది. మా ప్రజలకు కలిగిన నష్టాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటాం. ఆప్తులను కోల్పోయిన వారి వేదనను తగ్గించలేకపోవచ్చు గానీ ఆ కుటుంబాలకు మా వంతు మద్దతుగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తాం’అని సీఎం ఒమర్‌ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement