Border areas
-
సరిహద్దులు సురక్షితం.. కానీ కొంత సున్నితం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాదీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్–చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ప్రస్తుతం సాధారణంగా, స్థిరంగానే ఉన్నప్పటికీ, కొంత సున్నితమైనవేనని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. సరిహద్దుల్లో ఎప్పుడు ఎలాంటి సవాలు ఎదురైనా గట్టిగా తిప్పికొట్టడానికి మన సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉన్నతస్థాయి సన్నద్ధతను పాటిస్తున్నాయని వెల్లడించారు. తగినన్ని సైనిక రిజర్వ్ దళాలు సరిహద్దుల్లో మోహరించాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో భద్రతాపరమైన వైఫల్యాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. సైనిక దినోత్సవం నేపథ్యంలో జనరల్ మనోజ్ పాండే గురువారం మీడియాతో మాట్లాడారు. సరిహద్దు వివాదం సహా ఇతర అంశాలకు పరిష్కారం కనుగొనడానికి భారత్, చైనా మధ్య సైనిక, దౌత్యవర్గాల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇక భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాట్లను కట్టడి చేస్తున్నామని తెలిపారు. జమ్మూకశీ్మర్‌లో హింసాకాండ తగ్గుముఖం పట్టిందని, రాజౌరీ–పూంచ్ సెక్టార్లో మాత్రం హింసాత్మక సంఘటనలు కొంతమేరకు పెరిగాయని వివరించారు. సరిహద్దుకు అవతలివైపు ఉగ్రవాద సంస్థలు చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. జమ్మూకశీ్మర్‌లో కాల్పుల విరమణ కొనసాగుతోందన్నారు. సరిహద్దు అవతలి వైపు నుంచి భారత్‌లోకి ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇండియా–మయన్మార్ సరిహద్దులో.. రెండు దేశాల నడుమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనే దిశగా భూటాన్–చైనా మధ్య కొనసాగుతున్న చర్చలపై జనరల్ మనోజ్ పాండే స్పందించారు. ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నామని చెప్పా రు. భూటాన్‌తో భారత్‌కు బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇక ఇండియా–మయన్మార్ సరిహద్దులో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని అంగీకరించారు. అక్కడి పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. -
చొరబాట్లు ఆగాలంటే మోదీకే ఓటేయండి
ఝంఝార్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి అధికారం ఇవ్వకుంటే బిహార్‌లోని సరిహద్దులకు సమీపంలోని ప్రాంతాలు అక్రమ చొరబాటుదార్లతో నిండిపోతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. బిహార్‌లో ఝంఝార్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బిహార్‌లోని ఈ ప్రాంతం నేపాల్, బంగ్లాదేశ్‌ల సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుతోపాటు వచ్చే ఏడాది జనవరికల్లా అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేయనున్న ప్రధాని మోదీపై ఆయన ప్రశంసలు కురిపించారు. లాలూ– నితీశ్ ద్వయం మళ్లీ అధికారంలోకి వచ్చినా, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టలేకపోయినా ఈ ప్రాంతం మొత్తం అక్రమ చొరబాటుదార్లతో కిక్కిరిసి పోవడం ఖాయమన్నారు. ఫలితంగా బిహార్‌ను అనేక సమస్యలు చుట్టుముడతాయని ఆయన హెచ్చరించారు. చొరబాటుదార్లతో ఈ ప్రాంతం నిండిపోవాలని మీరు అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే 2024 లోనూ బిహార్‌లోని మొత్తం 40 సీట్లను బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యూపీఏ బదులు..ఇండియా ఎందుకంటే.. యూపీఏ హయాంలో 12 లక్షల కోట్ల కుంభకోణంతో సంబంధాలున్నాయి కాబట్టే అప్పటి పార్టీలన్నీ కలిసి ఈసారి ఇండియా అనే కొత్త పేరు పెట్టుకున్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆ కూటమి నేతలు సనాతన ధర్మాన్ని చులకన చేసి మాట్లాడటాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రధాని పీఠంపై ఆశలు పెట్టుకున్న నితీశ్ కుమార్ గతంలో లాలూ ప్రసాద్ పాల్పడిన కుంభకోణాలను చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారని ఆరోపించారు. అయితే, ప్రధాని పదవి ఖాళీగా లేదన్న విషయం నితీశ్ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. లాలూతో నితీశ్ పొత్తు నీళ్లు, చమురు కలయిక చందంగా ఉంటుందన్నారు. నీళ్లతో చమురు కలియకపోగా నీళ్లన్నిటినీ కలుషితం చేస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రధాని కావడమెలాగని నితీశ్ ఆలోచిస్తుండగా లాలూ మాత్రం తన కొడుకు, డిప్యూటీ సీఎం తేజస్వీని సీఎంగా చూడాలని ప్రణాళికలు వేస్తున్నారని చెప్పారు. సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కలిసి ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు తగ్గించడం వంటి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నా రని ఆరోపించారు. రాష్ట్రంలోని సంకీర్ణ కూటమిలోని కాంగ్రెస్ కూడా ఇదే వైఖరితో ఉందన్నారు. కృష్ణాష్టమి, రక్షాబంధన్ సందర్భంగా సెలవులను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చిన బిహార్ ప్రజలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు సమ్మె చేయడంతో ఏడాదిలో అవసరమైనన్ని రోజులు తరగతులు నిర్వహించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త క్యాలెండర్‌ను విద్యాశాఖ ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
సరిహద్దుల్లో మారణాయుధాల కలకలం
న్యూఢిల్లీ/జలంధర్: భారత్–పాక్ సరిహద్దుల్లోని పంజాబ్‌లో మంగళవారం సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) మారణాయుధాలను స్వాదీనం చేసుకుంది. ఫిరోజ్‌పూర్ సెక్టార్లో సోమవారం ఉదయం 7 గంటల సమయంలో తనిఖీల సందర్భంగా మూడు ఏకే–47 రైఫిళ్లు, రెండు ఎం–3 సబ్ మెషీన్ గన్లు, రెండు పిస్టళ్లతోపాటు మొత్తం 10 మేగజీన్లున్న ప్యాకెట్లు ఒక పొలంలో పడి ఉండగా గుర్తించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. వీటిని పాకిస్తాన్ నుంచి తెచ్చారని భావిస్తోంది. మారణాయుధాలను సకాలంలో గుర్తించి సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో పడకుండా నివారించగలిగామని పేర్కొంది. ఇదీ చదవండి: పాకిస్తాన్లోకి బ్రహ్మోస్ క్షిపణులు మిస్‌ఫైర్.. ముగ్గురు వాయుసేన అధికారులపై వేటు -
ఉక్రెయిన్: పరిస్థితి విషమించొచ్చు.. వెనక్కి వచ్చేయండి
ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి గత కొద్దిరోజులుగా యుద్ధమేఘాలు అలుముకున్న సంగతి తెలిసిందే. ఒకవైపు రష్యా.. మరోవైపు అమెరికా,నాటో సంయుక్త దళాల పోటాపోటీ మోహరింపుతో యుద్ధవాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌లో ఉంటున్న ఇతర దేశ పౌరులకు హెచ్చరికలు, అప్రమత్తంగా ఉండాలనే సూచనలు జారీ అవుతున్నాయి. ఇక.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ సరిహద్దు పరిస్థితులపై ‘తగ్గేదేలే..’ అంటూనే ఒక్కసారిగా స్వరం మార్చారు. రష్యా దాడుల్ని సమర్థవంతంగా వెనక్కి తిప్పికొడతామని, అవసరమైతే అనుబంధ ప్రాజెక్టులను నిలిపివేస్తామని ప్రకటించిన 24 గంటలు గడవక ముందే.. వెనక్కి తగ్గారు. గురువారం ఉక్రెయిన్‌లో ఉంటున్న అమెరికా పౌరులను వెనక్కి వచ్చేయాలంటూ పిలుపు ఇచ్చారు. ఉక్రెయిన్ను తక్షణమే వీడాలని ఆయన ఓ ఇంటర్వ్యూలో అమెరికన్లను కోరారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాలలో ఒకటైన(రష్యాను ఉద్దేశిస్తూ..) దానితో మేం డీల్ చేయబోతున్నాం. ఇది చాలా భిన్నమైన పరిస్థితి. ఏ క్షణమైనా పరిస్థితులు క్రేజీగా మారవచ్చు. వెంటనే వెనక్కి వచ్చేయండి’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో అమెరికా పౌరులను ఉద్దేశించి బైడెన్ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్ సహా పలు దేశాలు ఉక్రెయిన్‌లో ఉంటున్న తమ తమ పౌరుల కోసం జాగ్రత్తలు చెప్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దులో చదువుకుంటున్న విద్యార్థులను అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాయి. పరిస్థితులను చల్లార్చేందుకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నించినప్పటికీ.. అమెరికా, రష్యా బలగాలు పోటాపోటీ మోహరింపుతో యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు అమెరికా, నాటో దళాలపై నమ్మకం లేని ఉక్రెయిన్.. పౌరులకు యుద్ధ శిక్షణ ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. సంబంధిత వార్త: యుద్ధాన్ని మేం ఆరంభించం! అలాగని.. చూస్తూ ఊరుకోం -
ప్రధానితో మమత భేటీ
న్యూఢిల్లీ: సరిహద్దు రాష్ట్రాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎస్) అధికార పరిధి పెంపును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బుధవారం ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ఆమె ఈ విషయం ప్రస్తావించారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్లుగా ఉన్న బీఎస్ఎఫ్ పరిధిని 50 కి.మీ.లకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బీఎస్ఎఫ్కు మరిన్ని అధికారాలు కట్టబెడితే రాష్ట్ర పరిధిలో ఉన్న శాంతిభద్రతల విషయంలో ఘర్షణలకు దారితీయవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. అకారణంగా దేశ సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించేందుకు యత్నించడం సరికాదని ప్రధానిని కోరినట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలో కోల్‌కతాలో జరగనున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు ఆమె వెల్లడించారు. త్రిపురలో బీజేపీ శ్రేణులు టీఎంసీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నట్లు అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు చెప్పారు. సోనియాను కలవాలని నిబంధనేం లేదు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమయ్యారా అని మీడియా ప్రశ్నించగా ఆమె సుదీర్ఘ సమాధానమిచ్చారు. ‘ఈసారి ఢిల్లీ టూర్లో కేవలం ప్రధాని మోదీ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నా. పంజాబ్ ఎన్నికలపై పార్టీల నేతలంగా బిజీగా ఉన్నారు. పనికే మొదటి ప్రాధాన్యం. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ సోనియాను ఎందుకు కలవాలి? అదేమీ రాజ్యాంగ నిబంధన కాదు’ అని చెప్పారు. -
చైనా చట్టం... దేని కోసం?
వారం రోజుల క్రితం... గత శనివారం చైనా చేసిన కొత్త చట్టం అది. ఈ ఏడాది మార్చిలో ప్రతిపాదించి, ఏడు నెలల్లో ఆమోదమే పొందిన ఆ సరిహద్దు చట్టం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీజింగ్ ‘సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రత సమున్నతం. వాటిని ఉల్లంఘించడానికి వీల్లేదు’ అని 62 క్లాజులతో కూడిన ఈ 7 అధ్యాయాల కొత్త ‘భూ సరిహద్దు చట్టం’ పేర్కొంటోంది. భారత్ కోసమే ఈ చట్టం చేసినట్టు పైకి కనిపించకపోయినా, దీని పర్యవసానాలపై అనేక అనుమానాలు రేగుతున్నాయి. అక్టోబర్ 23న చైనా జాతీయ చట్టసభ ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ అంగీకరించిన ఈ చట్టానికి, ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అదే రోజు ఆమోదముద్ర వేశారు. ఆ చట్టం పూర్తిగా ‘ఏకపక్ష చర్య’ అనీ, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సరిహద్దుల నిర్వహణలో ఉన్న ద్వైపాక్షిక ఏర్పాట్లపై ఇది దుష్ప్రభావం చూపుతుందనీ భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా మాత్రం ‘ఇప్పుడున్న సరిహద్దు ఒప్పందాల అమలులో ఈ చట్టం ప్రభావమేమీ ఉండదు’ అంటూ కొట్టిపారేస్తోంది. ఇప్పటికే 17 నెలలుగా రెండు దేశాల సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభన నెలకొంది. కొత్త చట్టం పరిష్కారానికి మరిన్ని అడ్డంకులు సృష్టిస్తుందన్నది పెద్ద భయం. భారత్‌తో సరిహద్దు వివాదాల పరిష్కారంలో చైనా ఇటీవల అనుసరిస్తున్న మొండి వైఖరి ఈ భయాలకు మరింత ఆజ్యం పోస్తోంది. భారత్ సహా మొత్తం 14 దేశాలతో... 22,457 కి.మీ. మేర చైనాకు భూ సరిహద్దు ఉంది. ఆ దేశానికి మంగోలియా, రష్యాల తర్వాత మూడో సుదీర్ఘమైన సరిహద్దు భారత్‌తోనే నెలకొంది. ఆ రెండు దేశాలతో చైనాకు సరిహద్దు సమస్యలేమీ లేవు. భారత్ తర్వాత చైనాకు భూ సరిహద్దు తగాదాలున్నది 477 కి.మీ. మేర హద్దులు పంచుకుంటున్న భూటాన్‌తోనే. సరిహద్దు చర్చలను వేగిరం చేయడానికి భూటాన్ ఈ నెలలోనే చైనాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అదీ మనకు కొంత దెబ్బే. ఇక, మిగిలిందల్లా మనమే. ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్ఏసీ) వెంట 3,488 కిలోమీటర్ల పొడవునా చైనాతో భారత్‌కు సరిహద్దు వివాదం ఉంది. తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది మే 5 నాటి ఘటనలు, వెంటనే జూన్ 15న గాల్వన్ లోయ పరిణామాలతో పీటముడి బిగిసింది. భారత భూభాగంపై చైనా తిష్ఠ వేసింది. పరిష్కారానికి సైనిక, దౌత్యస్థాయి చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఏదీ తేలకుండానే చైనా కొత్త చట్టం తెచ్చింది. భారత, చైనాల సరిహద్దు సమస్య సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో ఇప్పటికి 20 విడతలుగా చర్చలు జరిగాయి. తుది పరిష్కారం మాటెలా ఉన్నా, ముందుగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి కొనసాగించడం అవసరమని ఇరుపక్షాలూ అంగీకరించాయి. కానీ, ఇప్పుడీ చట్టం కింద చైనా తప్పుకు తిరుగుతుంది. వివాదాస్పద ప్రాంతాలను సైతం ఈ చట్టం కింద చైనా తన భూభాగమనే అంటుంది. ఆ మాట మనం అంగీకరించం. 1963 నాటి ఒప్పందం కింద అక్సాయ్‌చిన్ ప్రాంతంలోని షక్స్గమ్ లోయను సైతం చైనాకు పాక్ అప్పగించింది. కానీ, అది చట్ట విరుద్దమనీ, అక్సాయ్‌చిన్ సహా జమ్మూ కశ్మీర్ మొత్తం మనదేననీ భారత్ ప్రకటించింది. ఇప్పుడు అదీ చిక్కు. హోమ్ శాఖ, రక్షణ శాఖల్లో సరిహద్దుల నిర్వహణ బాధ్యత ఎవరిదనే స్పష్టత మన దగ్గర కొరవడుతుంటే, చైనా ఈ కొత్త చట్టంతో తమ హద్దుల బాధ్యత పూర్తిగా ఆర్మీ మీద పెడుతుంది. దీంతో, చర్చలు క్లిష్టమైపోతాయి. వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇక చైనా సైనిక ఉపసంహరణ కష్టమే. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే ఈ సరికొత్త ‘చైనా భూ సరిహద్దు చట్టం’ ఆ దేశ యుద్ధోన్మాదానికీ, ఆక్రమణవాదానికీ సంకేతమని విశ్లేషకుల విమర్శ. ఆ మాటకొస్తే, ఎల్ఏసీ వెంట అన్ని సెక్టార్ల ప్రాంతాల్లోనూ చైనా 2016 నుంచి పటిష్ఠమైన సరిహద్దు రక్షణ గ్రామాలను నిర్మిస్తోంది. ఈ ఏడాది జూలైలో అరుణాచల్ ప్రదేశ్‌కు దగ్గరలో టిబెట్‌లో కట్టిన ఓ గ్రామాన్ని షీ జిన్‌పింగ్ స్వయంగా సందర్శించారు. అసలీ పౌర ఆవాసాల నిర్మాణం, పౌరుల ఉనికి చైనా భారీ వ్యూహం. ఈ సరిహద్దు గ్రామాలను పౌర, సైనిక అవసరాలు రెంటికీ చైనా వాడుకో నుంది. ఈ గ్రామాలు ఆర్మీకి గస్తీ స్థానాలుగా ఉపకరిస్తాయి. మరోపక్క దెమ్చోక్ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి ‘కొత్త పౌరులు’ ఎల్ఏసీ వెంట భారత భూభాగంలో గుడారాలు వేసుకున్నారు. చైనా జనాభా ఇలా మన ప్రాంతాల్లోకి ఎగబాకితే కష్టమే. భవిష్యత్తులో సరిహద్దుల గురించి భారత్ చర్చిం చడం మొదలుపెడితే, ‘ఆ ప్రాంతం మాదే. మా జనాభా అక్కడున్నార’ని చైనా వాదించే ప్రమాదం ఉంది. అంటే, సరిహద్దు వెంట వివాదాస్పద భూభాగాల్లో శాశ్వత వసతి సౌకర్యాలు, నియంత్రణ వ్యవస్థలు నిర్మించి, ఆ భూభాగాలు తమవేనంటూ చైనా చట్టబద్ధం చేయనుందన్న మాట. భారత్, భూటాన్‌ల విషయంలో సరిహద్దుల వెంట చట్టబద్ధంగా బలగాలను చైనా వాడే వీలు కల్పిస్తోందీ చట్టం. అలా ఈ చట్టంతో ఇన్నాళ్ళ భారత, చైనా సరిహద్దు చర్చల వ్యవస్థకు దాదాపు తెరపడినట్టే. చైనా మరింత చొచ్చుకురాకుండా అడ్డుకోవడానికి ఎల్ఏసీ వెంట దీర్ఘకాలం పాటు, భారీయెత్తున సైనిక బలగాలను భారత్ మోహరించాల్సి వస్తుంది. ఇది మరింత శ్రమ, ఖర్చు. అలాగే, సరిహద్దు సమస్యలతో ద్వైపాక్షిక సంబంధాలను ముడిపెడుతున్న భారత్ వాదనను ఈ కొత్త చట్టంతో చైనా తోసిపుచ్చినట్టయింది. ఇప్పుడిక జగమొండి చైనాతో తాత్కాలిక ఒప్పందం కుదుర్చు కొనే ఆచరణాత్మక వ్యూహాలను భారత్ ఆలోచించక తప్పదు! -
పోలీసుల మోహరింపు, తనిఖీలు.. హిడ్మా కోసమేనా..?
మహాముత్తారం: సమాచార వ్యవస్థ విసృతంగా వ్యాపించిన నేపథ్యంలో మావోయిస్టులను టార్గెట్ చేయడం పోలీసులకు సులువుగా మారింది. మావోయిస్టుల్లో అత్యంత ముఖ్యడు గెరిల్లా పోరాటంతోపాటు ఆకస్మిక దాడుల్లో వ్యూహరచన చేసే హిడ్మా కోసం పోలీసులు ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల అగ్రనేత ఆర్కే మృతిచెందడం అంత్యక్రియలను తెలంగాణ సరిహద్దులో నిర్వహించినట్లు పోలీసులు ధ్రువీకరించుకున్నారు. హిడ్మా సైతం అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఏఓబీ అటవీ ప్రాంతంలో సరైన వైద్య పరీక్షలు లేకపోవడం తెలంగాణ వైపు వచ్చారనే సమాచారం పోలీసులకు అందినట్లు తెలిసింది. దీంతో తెలంగాణ గోదావరి సరిహద్దు ప్రాంతాలపై నిఘా కొనసాగిస్తున్నారు. అటవీప్రాంతంలో డ్రోన్ కెమెరా సహాయంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మహాముత్తారం పోలీసులు మంగళవారం మండలంలోని నిమ్మగూడెం, పెగడపల్లి, బోర్లగూడెం, కనుకునూర్, రెడ్డిపల్లి ప్రధాన రహాదారుల్లో వాహనాలను తనిఖీ చేపట్టారు. అనంతరం తండాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చివెళ్తున్నారా అనే సమాచారాన్ని నిత్యం సేకరిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో అకస్మాత్తుగా పోలీసులు మోహరించడం ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ అటవీ గ్రామాల వాసులు భయంభయంగా గడుపుతున్నారు. -
దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి
చండీగఢ్: పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) పరిధిని సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల దాకా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ఈ పరిధి కేవలం 15 కిలోమీటర్లుగా ఉంది. దీన్ని కేంద్రం తాజాగా 50 కిలోమీటర్లకు పెంచింది. తద్వారా ఈ పరిధిలో నివసించే ఎవరినైనా విచారించే, అరెస్టు చేసే, సోదాలు చేపట్టే అధికారం బీఎస్ఎఫ్కు ఉంటుంది. ఈ నిర్ణయాన్ని దేశ సమాఖ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడిగా పంజాబ్ సీఎంæ చన్నీ అభివర్ణించారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి బీఎస్ఎఫ్ పరిధిని పెంచడం సమంజసం కాదని తేల్చిచెప్పారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. -
కొరకరాని కొయ్యగా పంజ్‌షీర్.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు?
కాబూల్: అఫ్గానిస్తాన్ నుంచి అమెరికాతోపాటు నాటో దళాలు పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయి. విదేశాలకు వెళ్లడానికి ఇప్పటిదాకా ఒకే ఒక్క ఆధారంగా నిలిచిన కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలు లేక నిశ్శబ్దం తాండవిస్తోంది. దీంతో అఫ్గాన్ ప్రజలు దేశ సరిహద్దులకు పరుగులు తీస్తున్నారు. ఎలాగైనా మరో దేశానికి వలస వెళ్లి తలదాచుకోవాలని ఆరాట పడుతున్నారు. ఇందుకోసం సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అఫ్గాన్ సరిహద్దులు జనంతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్, ఇరాన్, ఇతర మధ్య ఆసియా దేశాల సరిహద్దు ప్రాంతాల్లో వేలాది మంది ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. అఫ్గాన్–పాకిస్తాన్ మధ్య కీలక సరిహద్దు తోర్ఖామ్. ప్రస్తుతం ఇక్కడ అఫ్గాన్ భూభాగంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడారని, గేటు తెరిచే సమయం కోసం వారంతా వేచి చూస్తున్నారని పాకిస్తాన్ అధికారి ఒకరు చెప్పారు. ఇక అఫ్గాన్–ఇరాన్ నడుమ సరిహద్దు అయిన ఇస్లామ్ ఖాలా బోర్డర్ పోస్టులో వేలాది మంది పడిగాపులు కాస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అఫ్గాన్ ప్రజల పట్ల ఇరాన్ భద్రతా సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నారని, సరిహద్దును దాటే విషయంలో గతంలో పోలిస్తే ప్రస్తుతం కొంత వెలుసుబాటు కల్పిస్తున్నారని ఇరాన్లో అడుగుపెట్టిన అఫ్గాన్ వాసి ఒకరు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఎప్పుడు? అఫ్గాన్ తాలిబన్ల వశం కావడంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి అక్కడి పరిపాలనపై పడింది. తాలిబన్లు ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తాలిబన్లు 1996లో అఫ్గాన్ రాజధాని కాబూల్‌ను ఆక్రమించినప్పుడు గంటల వ్యవధిలోనే లీడర్షిప్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈసారి మాత్రం తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అఫ్గాన్‌లో ఏకాభిప్రాయంతోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని తాను అంచనా వేస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చెప్పారు. అఫ్గాన్‌లో ప్రస్తుతం అధికారికంగా ప్రభుత్వమేదీ లేదు. నూతన సర్కారు ఏర్పాటుపై నిర్ణయం దాదాపు ఖరారయ్యిందని, అతి త్వరలో ప్రకటిస్తామని తాలిబన్లు తెలిపారు. తాలిబన్ సీనియర్ నేత ముల్లా హెబతుల్లా అఖూంజాదా కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని, ఆయన కింద ప్రధానమంత్రి లేదా అధ్యక్షుడు దేశాన్ని ముందుకు నడిపిస్తారని తాలిబన్ కల్చరల్ కమిషన్ సభ్యుడు అనాముల్లా సమాంఘనీ తెలియజేశారు. పంజ్‌షీర్ తిరుగుబాటుదారులతో చర్చలు విఫలం కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్‌పై తాలిబన్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నయానో భయానో ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు, పంజ్‌షీర్ తిరుగుబాటుదారుల మధ్య బుధవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. పంజ్‌షీర్ లోయలో అహ్మద్ మసూద్ నాయకత్వంలో తిరుగుబాటుదారులు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న సంగతి తెలి సిందే. ఇస్లామిక్ ఎమిరేట్‌లో చేరాలంటూ తాలిబన్ నాయకుడు ముల్లా అమీర్‌ఖాన్ ముతాఖీ బుధవారం పంజ్ షీర్ ప్రజలకు ఒక ఆడియో సందేశంలో పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత తాలిబన్లు, పంజ్‌షీర్ తిరుగుబాటుదారుల మధ్య భీకర ఘర్షణ జరిగినట్లు తెలి సింది. ఈ ఘర్షణలో 15 మంది తాలిబన్లు హతమయ్యారని, 200 మంది గాయపడ్డారని, 55 మంది తమకు లొంగిపోయారని తిరుగుబాటుదారుల ప్రతినిధి ఫహీం దష్తీ బుధవారం ప్రకటించారు. ఖతార్ నుంచి సాంకేతిక బృందం రాక కాబూల్ ఎయిర్‌పోర్టు నిర్వహణ తాలిబన్లకు పెద్ద సంకటంగా మారింది. ఎయిర్‌పోర్టును నిర్వహించే సామర్థ్యం వారికి లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే తమ మిత్ర దేశం ఖతార్ సాయాన్ని కోరుతున్నారు. తాలిబన్ల విజ్ఞప్తి మేరకు ఖతార్ ప్రభుత్వం బుధవారం ఒక సాంకేతిక బృందాన్ని ప్రత్యేక విమానంలో కాబూల్‌కు పంపించింది. ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు, విమానాల రాకపోకలపై ఈ బృందం తగిన సాయం అందించనుంది. కశ్మీర్‌కు విముక్తి లభించాలి: అల్–ఖాయిదా అఫ్గాన్‌ను మళ్లీ చేజిక్కించుకున్న తాలిబన్లకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్–ఖాయిదా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇస్లాం శత్రువుల కబంధ హస్తాల నుంచి కశ్మీర్, సోమాలియా, యెమెన్‌తోపాటు మిగతా ఇస్లామిక్ భూభాగాలకు విముక్తి లభించాలి. ఓ.. అల్లా! ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఖైదీలకు స్వేచ్ఛను ప్రసాదించు’’ అని తన ప్రకటనలో ప్రార్థించింది. -
మహారాష్ట్ర సరిహద్దుల్లో నిఘా
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ఆయా రాష్ట్రాలతోగల సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమతంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్రంలో వైరస్ కట్టడికి మరిన్ని పరీక్షలు, ట్రేసింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. హోం ఐసోలేషన్ కిట్లు అందిస్తామన్నారు. గాంధీ ఆస్పత్రితోపాటు టిమ్స్, నిమ్స్‌లలోనూ మళ్లీ పటిష్ట ఏర్పాట్లు చేస్తామన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతానికి కేసులు భారీగా పెరిగిన దాఖలాలు లేనందున ప్రస్తుతానికి కర్ఫ్యూపై ఎలాంటి ఆలోచన లేదన్నారు. అయినప్పటికీ కరోనా ఉన్నంతకాలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈటల సూచించారు. ఓపెన్ మార్కెట్లో టీకా విడుదల మేలు... కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌కు ధర నిర్ణయించి బహిరంగ మార్కెట్లో ఉంచితే మంచిదని మంత్రి ఈటల అభిప్రాయపడ్డారు. అలా మార్కెట్లోకి అనుమతిస్తే ఆ మేరకు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 11 లక్షలకుపైగా టీకా డోస్‌లు వచ్చాయన్నారు. బోధనాసుపత్రుల్లో మందులు, శస్త్రచికిత్సలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గత రెండేళ్లుగా నాణ్యమైన, బ్రాండెడ్ మందులను కొనుగోలు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి బడ్జెట్ కూడా ఈసారి పెంచుతామన్నారు. గడువు తీరిన మందులను తిరిగి కంపెనీలకు వెనక్కు ఇస్తున్నామన్నారు. తాను త్వరలో వ్యాక్సిన్ తీసుకుంటానని ఆయన తెలిపారు. అనంతరం రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రి ఈటల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేసులు పెరుగుతున్నాయి: శ్రీనివాసరావు మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా కారణంగా ఆ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న నిజామాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో వైరస్ కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల్లో ఇప్పటికీ చాలా మంది కరోనా జాగ్రత్తలను పాటించడంలేదని, మాస్క్‌లు ధరించకుండా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఒక అంతిమయాత్రకు 50 మంది వెళితే, అందులో 35 మందికి కరోనా సోకిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీంతో రాబోయే రోజుల్లో పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. కరోనా టీకా తీసుకున్న వారు మద్యం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. వైరస్‌లో కొత్త వేరియంట్లు వస్తున్నాయన్నారు. కొన్నాళ్లు వైరస్ స్తబ్దుగా ఉండి తర్వాత కొత్త రూపంలో అది విజృంభిస్తుందన్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. 50 ఏళ్లు పైబడిన వారికి టీకా... వచ్చే నెల మొదటి వారంలో 50 ఏళ్లు పైబడినవారికి, ఆలోపు వయసున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా టీకా వేస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కోవిన్ యాప్–2 అందుబాటులోకి వస్తుందన్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా 50 ఏళ్లు పైబడినవారి వివరాలను నమోదు చేస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను వివిధ పద్ధతుల ద్వారా సేకరిస్తున్నామన్నారు. -
వేటకెళ్తూ దారితప్పి.. బంగ్లాదేశ్ జలాల్లోకి
సాక్షి, విజయనగరం/పూసపాటిరేగ: జిల్లాలోని మత్స్యకార గ్రామాలు మరోసారి ఉలిక్కిపడ్డాయి. వేటకు వెళ్లిన తమవారు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి వెళ్లి అక్కడ బందీలయ్యారనే వార్త విని ఇక్కడి వారి కుటుంబాలు తల్లడిల్లాయి. గత అనుభవాల దృష్ట్యా తమ వారు ఎప్పుడొస్తారో తెలి యక వారంతా అల్లాడిపోయా రు. కనీసం తమ వారితో అధికారులు ఫోన్లో మాట్లాడించినా... బాగుండని బోరున విలపించారు. కానీ అదృష్టవశాత్తూ వా రు సురక్షితంగానే ఉన్నారని తెలియగానే వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఆ దేశ కోస్టుగార్డులు వెనక్కిపంపించారన్న సమాచారంతో తిప్పలవలస, పతివాడ బర్రిపేట, చింతపల్లి గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రపంచం మొత్తానికి కీడు చేస్తున్న కరోనా వీరికి మాత్రం ఒకరకంగా మేలు చేసిందనే చెప్పాలి. బందీలుగా చిక్కింది ఇలా... పూసపాటిరేగ మండలం తిప్పలవలస, పతివాడబర్రిపేట, చింతపల్లికి చెందిన ఎడుగురు మత్స్యకారులు మరో ఐదు గురు మత్స్యకారులతో కలిసి విశాఖ హార్బర్ నుంచి నవంబర్ 7వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. నిబంధనలపై అవగాహన లేక మన దేశ సరిహద్దు దాటి బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి పొరపాటున ప్రవేశించారు. నవంబర్ 29 తెల్లవారు జామున 3 గంటల సమయంలో బంగ్లాదేశ్ రక్షక దళాలు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వారిలో పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క దానయ్య, రాయితి లక్ష్మయ్య, నక్క బోడోడు, పతివాడబర్రిపేటకు చెందిన గరికిన ఎల్లయ్య, గరికిన శ్రీను, మైలపల్లి కొర్లయ్య, చింతపల్లికి చెందిన చొక్కా శ్రీను ఉన్నారు. బోటులో మత్స్యకారుల పక్కనే మన దేశ సముద్ర జలాల్లో వేట చేస్తున్న మత్స్యకారుల ద్వారా బోటు యజమాని వాసుపల్లి ప్రసాదుకు అక్కడి నుంచి సమాచారం పంపించారు. సోమవారం ఉదయానికి మత్స్యకారుల స్వగ్రామాలకు విషయం తెలియచేయడంతో వారి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు. అదృష్ట వశాత్తూ గంటల వ్యవధిలోనే మత్స్యకారులను కరోనా భయంతో బంగ్లాదేశ్‌లో విడిచిపెట్టారు. జీపీఆర్ఎస్, వలలు తీసుకొని సరిహద్దు లు ఎందుకు దాటారని బంగ్లాదేశ్ కోస్టుగార్డులు ఆ గ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేశారు. మత్స్య కారులు సురక్షితంగా వస్తున్నారని మ త్స్యశాఖ జిల్లా ఉప సంచాలకులు నిర్మలా కుమారి ధ్రు వీకరించారు. చిక్కితే జైలుకే పొట్టకూటి కోసం వలస పోతున్న మత్స్యకారులు సముద్రంలో దారి తెలీక పొరపాటున పరాయి దేశ జలాల్లోకి వెళ్లి అక్కడి రక్షఖ దళాలకు బందీలుగా చి క్కుతున్నారు. జిల్లాలోని తీరప్రాంత మండలాలకు చెందిన వేలాది మంది కడలి బిడ్డలు విశాఖపట్నం, కర్ణాటక పోర్టులకు వెళ్లి, అక్కడి నుంచి సముద్రంలో వేటకు వెళుతుంటారు. దారి తప్పి విదేశీలకు బందీలు గా మారి ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గిపోతున్నారు. 2018 నవంబర్ 28వ తేదీన అరేబియా మహాసముద్రంలో వేటాడుతూ పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారంటూ అక్కడి అధికారులు ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులను అరెస్టు చేశారు. దాదాపు 13 నెలల తర్వాత వీరు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విడుదలయ్యారు. ఆ తరువాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారుల సంక్షేమానికి అనేక వరాలనిచ్చా రు. వేట విరామ సయంలో ఇచ్చే సాయాన్ని రూ. 6 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. డీజిల్ రాయితీలను కూడా పెంచారు. అయితే ఈసారి చిక్కిన వారిని ఒకరకంగా కరోనా కాపాడిందంటున్నారు. ఇక రాడేమోనని భయపడ్డాం నా కొడుకు నక్కా దానయ్య బందీగా చిక్కాడని కబురు తెలియగానే గుండెలు గుభేల్ మన్నాయి. ఎందుకంటే గతంలో బందీలుగా చిక్కిన మా బంధువులు సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోయారు. మా బాబు పరిస్థితీ అంతేనా అని భయపడ్డాం. ఇంతలోనే అక్కడివాళ్లు విడిచిపెట్టారని సమాచారం వచ్చింది. దేవుడే మావోడ్ని కాపాడాడు. – నక్కా లక్ష్మీ, నక్కా దానయ్యతల్లి, తిప్పలవలస. ఆశలు వదులుకున్నాను... నా కొడుకు నక్క బోడోడు బంగ్లాదేశ్ మత్స్యకారులకు చిక్కా డని తెలియగానే నాకు దిక్కు ఎవరని బోరున ఏడ్చాను. దాదాపుగా ఆశలొదిలేసుకున్నాను. అంతలోనే అక్కడి అధికారులు మావోల్ని ఒదిలీసేరని తెలిసింది. నిజంగా దేవుడు మాపక్కనున్నాడు. అందుకు మావోడు వచ్చేత్తన్నాడు. వాడిని తనివితీరా సూసుకోవాలనుంది. – నక్క అప్పన్న, నక్క బోడోడు తండ్రి తిప్పలవలస మా అల్లుడికి మరో జన్మే మా అల్లుడు రాయితి లక్ష్మయ్య బంగ్లాదేశ్ కోస్టుగార్డులకు చిక్కి రోజు వ్యవధిలోనే తిరిగి ఇక్కడికి బయలుదేరినట్లు తెలిసింది. కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. బంగ్లాదేశ్ అధికారులకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించడంతో తిరిగి స్వగ్రామాలుకు పంపించారు. – మైలపల్లి అప్పయ్యమ్మ, రాయితి లక్ష్మయ్య అత్త, తిప్పలవలస. -
సరిహద్దులపై నిఘాకు ఉపగ్రహాలు!
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ఇప్పట్లో సమసే అవకాశం లేకపోవడంతో భారత్ దీర్ఘకాలిక పోరుకు సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు సరిహద్దులపై నిత్యం నిఘా ఉంచేందుకు ఉపగ్రహాల సాయం తీసుకోవాలని నిర్ణయించడమే కాకుండా.. మొట్టమొదటిసారి చైనా దురాక్రమణకు పాల్పడిందని భారత్ అంగీకరిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదాన్ని అతిక్రమణగా అభివర్ణించిన ఓ నివేదిక కొద్ది సమయంలోనే రక్షణ శాఖ వెబ్సైట్ నుంచి అదృశ్యమవడం గమనార్హం. భారత్, చైనాల మధ్య సరిహద్దు సుమారు నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది. హద్దుల వెంబడి రోజంతా నిఘా పెట్టేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రత సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు కేవలం సరిహద్దులపై నిఘాకు ఉపయోగిస్తారు. చైనా ఇటీవల జిన్జియాంగ్ ప్రాంతంలో మిలటరీ విన్యాసాల పేరుతో సుమారు 40 వేల మంది సైనికులు, ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని అతితక్కువ కాలంలో తరలించగలిగింది. ఆ తరువాతే చైనా సైనికులు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత్ భూభాగంలోకి చొరబడ్డారు. ఈ చొరబాట్లు కాస్తా లేహ్ ప్రాంతంలోని భారత్ సైనిక బలగాలను విస్మయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో ఏ చిన్న కదలికనైనా గుర్తించి అప్రమత్తం చేసేందుకు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అత్యధిక రెజల్యూషన్ ఉన్న సెన్సర్లు, కెమెరాలతో వ్యక్తుల కదలికలను గుర్తించవచ్చునని వీరు భావిస్తున్నారు. వెనక్కు తగ్గేందుకు ససేమిరా... గల్వాన్ ప్రాంతంలో ఫింగర్స్‌గా పిలిచే శిఖరాలను ఆక్రమించిన చైనా వెనక్కు తగ్గేందుకు ససేమిరా అంటోంది. పాంగాంగ్ సో సరస్సు వద్ద కూడా భారత దళాలు వెనక్కు తగ్గితేనే తాము వెళతామని భీష్మించుకుంది. అంతేకాకుండా ఫింగర్ –5పై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తున్నట్లు సమాచారం. భారత్ సరిహద్దుల వెంబడి మరింత మంది సైనికులను మోహరిస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌లోనూ వాస్తవాధీన రేఖ వెంబడి సైనికులను మోహరిస్తున్నట్లు సమాచారం. మే నెలలో ఈ దాడిని మొదలుపెట్టిన చైనా అక్కడి నుంచి వెనుదిరిగేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో దీన్ని అతిక్రమణగానే చూడాలని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారిక దస్తావేజు స్పష్టం చేసింది. అయితే రక్షణ శాఖ వెబ్సైట్లో ఈ దస్తావేజు కనిపించిన కొద్ది సమయానికి మాయమైపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చైనాపై విరుచుకుపడ్డ భారత్ తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కుకు చైనాకు లేదని భారత్ గురువారం స్పష్టం చేసింది. కశ్మీర్ అంశాన్ని భద్రత మండలిలో లేవనెత్తేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని నిరసించడమే కాకుండా.. ఇతరుల జోక్యం సరికాదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో బుధవారం కశ్మీర్ అంశంపై చర్చ జరగాలని పాకిస్తాన్ ప్రతిపాదించగా చైనా దానిని మద్దతు ఇచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దయి బుధవారానికి ఏడాదైన విషయం తెలిసిందే. చైనా ప్రయత్నాలు ఫలించలేదు. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ అంశాలను చైనా భద్రతా మండలిలలో ప్రస్తావించే ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో మాదిరిగానే దేశ అంతర్గత వ్యవహారాలపై చైనా జోక్యం చేసుకునే ప్రయత్నాలు విఫలమయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
రోడ్లు,వంతెన నిర్మాణంపై రాజ్‌నాథ్‌సింగ్ సమీక్ష
-
‘ఆ ఉద్యోగులకు భారీగా వేతన పెంపు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం, మౌలిక ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు భారీగా వేతన పెంపు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది కనీస వేతనాన్ని 100 నుంచి 170 శాతానికి ప్రభుత్వం పెంచింది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న లడఖ్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులకు అత్యధిక వేతన పెంపును వర్తింపచేశారు. పెరిగిన వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని జాతీయ హైవేలు మౌలిక రంగ అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్హెచ్ఐడీసీఎల్) వెల్లడించింది. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పనిచేసే సిబ్బందికి రిస్క్ అలవెన్స్‌ను 100 నుంచి 170 శాతానికి పెంచినట్టు ఆ సంస్థ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి సాంకేతికేతర సిబ్బంది వేతనం నెలకు ప్రస్తుతమున్న 16,770 రూపాయల నుంచి 41,440 రూపాయలకు పెరిగింది. ఇక ఢిల్లీలో ఇదే పోస్టులో పనిచేసే వ్యక్తి వేతనం 28,000 రూపాయలు కావడం గమనార్హం. లడఖ్ ప్రాంతంలో పనిచేసే అకౌంటెంట్ వేతనం తాజా పెంపుతో 47,360 రూపాయలకు పెరిగింది. లడఖ్ ప్రాంతంలో పనిచేసే సివిల్ ఇంజనీర్ వేతనం గతంలో 30,000 రూపాయలు కాగా ఇప్పుడది రెట్టింపై 60,000 రూపాలకు చేరింది. సీనియర్ మేనేజర్ వేతనం 55,000 రూపాయల నుంచి 1,23,600కు పెరిగింది. వేతన ప్రయోజనాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు రూ పది లక్షల ప్రమాద బీమాను పొందుతారు. వారికి టీఏ, డీఏ, పీఎఫ్ వంటి సదుపాయాలనూ వర్తింపచేస్తారు. చదవండి : ఈ నెల పూర్తి వేతనం -
చైనా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..
న్యూఢిల్లీ: చైనా, భారత్ మధ్య సరిహద్దుల్లో గాల్వన్ నదీలోయ సమీపంలో చైనా చేసిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చైనా భారీ సంఖ్యలో బుల్డోజర్లను తీసుకువచ్చి ఏకంగా గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఒక జాతీయ మీడియా సంస్థ బయటపెట్టింది. భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతానికి అర కిలో మీటరు దూరంలోని ఈశాన్య లద్దాఖ్‌లో గాల్వన్ ప్రాంతంలో బుల్డోజర్లతో నదీ ప్రవాహాన్ని తగ్గించేందుకు, మళ్లించేందుకు చైనా యత్నించింది. (చైనా, భారత్ వ్యూహాలు ఏమిటి?) 5 కి.మీ. పైగా క్యూ కట్టిన చైనా వాహనాలు ఘర్షణలు జరిగిన ప్రాంతంలో చైనా తమ భూభాగం వైపు బుల్డోజర్లు, లారీలు, మిలటరీ రవాణా వాహనాలు 5 కి.మీ.ల పొడవునా నిలిపింది. కొందరు భారత్ సైనికులు గాల్వన్ నదిలో పడి కొట్టుకుపోవడం, పర్వతం నుంచి కింద పడడం వంటివి ఫొటోల ద్వారా వెలుగులోకి వచ్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా రెండు ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంది. అక్కడ్నుంచే పక్కాగా కుట్ర పన్ని మరీ ఇనుప రాడ్లతో భారతీయ సైనికులపై దాడి చేసినట్టు వెల్లడైంది. (భారత్‌పై మరోసారి విషం కక్కిన చైనా) రష్యా, చైనాలతో భారత్ త్రైపాక్షిక చర్చలు భారత్, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల త్రైపాక్షిక వర్చువల్ చర్చలు 23న జరుగుతాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి జై శంకర్ పాల్గొననుండగా, చైనా, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్ యి, సెర్గీ లావ్రోవ్ ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ చెప్పారు. కరోనా, ప్రపంచ భద్రత, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. త్రైపాక్షిక అవగాహన ప్రకారం.. భారత్, చైనా బలగాల ఘర్షణలు ద్వైపాక్షిక అంశం అయినందున ఇది చర్చకు వచ్చే అవకాశం లేదన్నారు. -
గ్రేటర్ దిగ్బంధం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌ను చుట్టుముట్టి దిగ్బంధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నగరం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, బయట నుంచి ఎవరూ లోపలికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం చురుకైన పోలీసు, వైద్యారోగ్య, ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని, వైరస్‌ను తుదముట్టించాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్డౌన్ అమలు, సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు కర్నూలుకు, గుంటూరుకు సరిహద్దులో గల గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. కనుక అధికారులు హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు జరిపి అవసరమైతే చికిత్స చేయించాలి. ఎవరికి పాజిటివ్‌గా తేలినా అతను కలిసిన వారందరినీ క్వారంటైన్ చేయాలి. హైదరాబాద్‌లోని వారు బయటకు పోకుండా, బయటివారు హైదరాబాద్ లోనికి రాకుండా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలి’ అని ఆదేశించారు. చదవండి: తెలంగాణలోనూ సరి బేసి విధానం! సరిహద్దు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండండి ‘ఏపీలోని కర్నూలు పట్టణం, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. వాటికి సరిహద్దుల్లో తెలంగాణ గ్రామాలున్నాయి. ఈ సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలి. అటువారెవరు ఇటు రాకుండా, ఇటువారెవరు అటు పోకుండా నియంత్రించాలి. వైరస్ ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందిందే. కనుక ప్రజల రాకపోకలను ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్ వ్యాప్తిని అంత బాగా అరికట్టవచ్చు’అని సీఎం చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, ముఖ్య కార్యదర్శులు ఎస్ నర్సింగ్‌రావు, రామకృష్ణారావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. చదవండి: తెలంగాణలో మద్యం జాతర -
దేశ భద్రత కోసం మొత్తం సరిహద్దు రీమ్యాప్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ సరిహద్దులను రీ మ్యాప్ చేయడానికి కేంద్ర హోం శాఖ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలనుంచి మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ చొరబాటుదారులు, ఉగ్రవాదులు ప్రవేశిస్తున్న నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌షా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాక, ఆయా సరిహద్దులలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జాయింట్ యాక్షన్ దళాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ పెరుగుతున్న నేపథ్యంలో హోం మంత్రి అమిత్‌షా అక్టోబరులో పారా మిలిటరీ దళాల డీజీ, ఐబీ చీఫ్, రా, సీబీఐ అధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారని తెలుస్తోంది. హోంశాఖ వర్గాల సమాచారం ప్రకారం.. సరిహద్దు వెంబడి బైక్ మీద లేదా అవసరమైతే కాలినడకన వెళ్లి బలమైన కంచెను ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. సరిహద్దు రాష్ట్రాల భాగస్వామ్యంతో ఐబీ, సీబీఐ, కస్టమ్స్ అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నిరోధించే చర్యకు ప్రభుత్వం ఉపక్రమించింది. మరోవైపు పంజాబ్‌లోకి పాక్ పెద్దెత్తున మాదకద్రవ్యాలు అక్రమంగా సరఫరా చేస్తుంది. ఐఎస్ఐ ప్రేరేపిత ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని స్థానికంగా రెచ్చగొడుతోంది. అంతేకాక, ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఆ దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, జీహాదీ ఉగ్రవాదం, భయంకర ఆర్థిక ఇబ్బందుల దృష్యా సరిహద్దుల్లోనూ, దేశంలోనూ తీవ్ర అలజడి సృష్టించే అవకాశాలున్నట్టు నిఘా వర్గాలు సమాచారమందించాయి. ఈ నేపథ్యంలో సీబీఐ, రా, ఎన్ఏఐ, ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజం, పంజాబ్ పోలీసులతో స్పెషల్ కౌంటర్ గ్రూపును ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో గతంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో అక్కడ ఎస్పీజీ కమాండో యూనిట్‌ను నెలకొల్పాలని అమిత్‌షా భావిస్తున్నారు. పాకిస్తాన్‌లోని నరోవర్ జిల్లాలో సరిహద్దు వెంబడి ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల క్యాంపును గుర్తించామని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కూడా దీనికి కారణం అయ్యింది. ఉగ్రదాడులను ఎస్పీజీ బలగాలు సమర్థంగా ఎదుర్కొంటాయి. -
సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్
కాటారం(మంథని) వరంగల్ : రాష్ట్ర సరిహద్దులోని గోదావరితీర అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్, మావోయిస్టుల హత్యలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి తీరప్రాంతమైన మహదేవపూర్ నుంచి ఏటూరునాగారం వరకు కూంబింగ్ చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా కుకడాంజోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుమీయాబెడా అడవుల్లో సీఆర్ఫీఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా కామాండర్తోపాటు నలుగురు మావోయిస్టులు మరణించారు. ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులు గోదావరి దాటి తెలంగాణలో తలదాచుకునే అవకాశాలు ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కాంకేర్ జిల్లా బందె పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాడంవెల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. చత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర మధ్య ప్రవహిస్తున్న ఇంద్రావతి నది దాటి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా తాడగూడ రోడ్డు వద్ద సోనువదా, సోమ్జీవదాను మావోయిస్టులు గొంతుకోసి చంపారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కలిసే మహదేవపూర్ అడవుల్లోకి మావోయిస్టులు చొరబడి తలదాచుకునే అవకాశాలున్నట్లు నిఘావర్గాలు హెచ్చరించడంతో జిల్లా ఎస్పీ భాస్కరన్, మహదేవపూర్ సబ్ డివిజన్ పోలీసులను అప్రమత్తం చేశారు. డీఎస్పీ కేఆర్కే.ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. సరిహద్దుల్లోని గడ్చిరోలి, బీజాపూర్, నారాయణపూర్, సుక్మా, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల పోలీసులతో ఎప్పటికప్పుడు మావోయిస్టుల సంచారంపై సమాచారాన్ని తెలుసుకుంటూ గాలింపు చర్యలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు, కన్నెపల్లి పంప్‌హౌస్, గ్రావిటీ కెనాల్ పనుల వద్ద మహదేవపూర్ సీఐ రంజిత్‌కుమార్, కాటారం సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా అటవీ గ్రామాల్లో పోలీసుల గాలింపు చేపట్టడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అడవిబిడ్డలు ఆందోళన చెందుతున్నారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఎన్‌హెచ్–163 పై పేలుడు పదార్థాలున్నట్లు అనుమానం ఏటూరునాగారం(ములుగు) : ఏజెన్సీలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం ప్రధాన రహదారులు, హైదరాబాద్ టు ఛత్తీస్‌గఢ్ 163–జాతీయ రహదారికి ఇరువైపులా బాంబ్ స్క్వాడ్ బృందం సోమవారం తనిఖీలు చేపట్టింది. చత్తీస్‌గఢ్ వెళ్లే జాతీయ రహదారి ఏటూరునాగారం తాళ్లగడ్డ నుంచి ముల్లకట్ట బ్రిడ్జి వరకు ఉన్న 13 కిలోమీటర్ల మేర మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేశారు. మావోయిస్టులు మందుపాతరలు పెట్టారనే అనుమానంతో ట్రాక్టర్ బ్లేడ్ బండి ద్వారా ఫ్లవ్ వేసి పరిశీలించారు. తుపాకులగూడెం వెళ్లే రోడ్లను సైతం పోలీసులు పరిశీలించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీల్లో సీఐ సత్యనారాయణ, ఎస్సై సాంబమూర్తి, బాంబ్ స్క్వాడ్ బృందం పాల్గొన్నారు. -
సరిహద్దులో పెట్రోల్‌కు డిమాండ్
ఏపీలో వ్యాట్ విధించడంతో కర్ణాటకకు వస్తున్న వాహనాలు బళ్లారి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విధించడం కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల పెట్రోల్ బంకుల యజమానులకు వరంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గిపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగినంతగా తగ్గించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యాట్ రూపంలో ఆంధ్రాలో మరింత భారాన్ని రుద్దడంతో ఈ రెండు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీగా వ్యత్యాసం ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక సరిహద్దుకు పెట్రోలు, డీజిల్ కోసం భారీగా వాహనాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాట్ ప్రభావంతో పెట్రోల్ లీటరుకు రూ.4 పెరిగింది. గత పరిస్థితులకు భిన్నం ఆంధ్రప్రదేశ్‌లో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ లేదు. దీంతో ధరలు కర్ణాటక కంటే ఆంధ్రప్రదేశ్‌లో లీటరుకు నాలుగు రూపాయలు తక్కువ ఉండేది. దీంతో పదేళ్లపాటు ప్రతి నిత్యం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని పెట్రోల్ బంకులకు కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్లేవి. ప్రస్తుతం ప్రతి లీటరుకు నాలుగు రూపాయలు ఎక్కువగా ఉండడంతో ఏపీలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారు క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్లుతున్నారు. రైతులు ట్రాక్టర్లలో వచ్చి పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లుతున్నారు.