సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ఆయా రాష్ట్రాలతోగల సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమతంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్రంలో వైరస్ కట్టడికి మరిన్ని పరీక్షలు, ట్రేసింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. హోం ఐసోలేషన్ కిట్లు అందిస్తామన్నారు. గాంధీ ఆస్పత్రితోపాటు టిమ్స్, నిమ్స్‌లలోనూ మళ్లీ పటిష్ట ఏర్పాట్లు చేస్తామన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతానికి కేసులు భారీగా పెరిగిన దాఖలాలు లేనందున ప్రస్తుతానికి కర్ఫ్యూపై ఎలాంటి ఆలోచన లేదన్నారు. అయినప్పటికీ కరోనా ఉన్నంతకాలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈటల సూచించారు.
ఓపెన్ మార్కెట్లో టీకా విడుదల మేలు...
కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌కు ధర నిర్ణయించి బహిరంగ మార్కెట్లో ఉంచితే మంచిదని మంత్రి ఈటల అభిప్రాయపడ్డారు. అలా మార్కెట్లోకి అనుమతిస్తే ఆ మేరకు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 11 లక్షలకుపైగా టీకా డోస్‌లు వచ్చాయన్నారు. బోధనాసుపత్రుల్లో మందులు, శస్త్రచికిత్సలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గత రెండేళ్లుగా నాణ్యమైన, బ్రాండెడ్ మందులను కొనుగోలు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి బడ్జెట్ కూడా ఈసారి పెంచుతామన్నారు. గడువు తీరిన మందులను తిరిగి కంపెనీలకు వెనక్కు ఇస్తున్నామన్నారు. తాను త్వరలో వ్యాక్సిన్ తీసుకుంటానని ఆయన తెలిపారు. అనంతరం రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రి ఈటల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
కేసులు పెరుగుతున్నాయి: శ్రీనివాసరావు
మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా కారణంగా ఆ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న నిజామాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో వైరస్ కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల్లో ఇప్పటికీ చాలా మంది కరోనా జాగ్రత్తలను పాటించడంలేదని, మాస్క్‌లు ధరించకుండా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ఒక అంతిమయాత్రకు 50 మంది వెళితే, అందులో 35 మందికి కరోనా సోకిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీంతో రాబోయే రోజుల్లో పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. కరోనా టీకా తీసుకున్న వారు మద్యం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. వైరస్‌లో కొత్త వేరియంట్లు వస్తున్నాయన్నారు. కొన్నాళ్లు వైరస్ స్తబ్దుగా ఉండి తర్వాత కొత్త రూపంలో అది విజృంభిస్తుందన్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు.
50 ఏళ్లు పైబడిన వారికి టీకా...
వచ్చే నెల మొదటి వారంలో 50 ఏళ్లు పైబడినవారికి, ఆలోపు వయసున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా టీకా వేస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కోవిన్ యాప్–2 అందుబాటులోకి వస్తుందన్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా 50 ఏళ్లు పైబడినవారి వివరాలను నమోదు చేస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను వివిధ పద్ధతుల ద్వారా సేకరిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment