Maharashtra and Telangana
-
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ఆదిలాబాద్: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే బ్యాంక్ ఉద్యోగులు వీకెండ్లో సరదాగా గడిపేందుకు మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి హిల్‌స్టేషన్‌లోని చిక్కల్ధార ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆదివా రం తెల్లవారుజామున కారులో పయనమయ్యారు. మరికొద్ది క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకోనుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో 200 అడుగుల లోతులో పడడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో డ్రైవర్‌తో పాటు మరో ఏడుగురు ప్రయాణిస్తుండగా నలుగురు తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డారు. స్నేహితుల మృతదేహాలను చూసి వారు బోరున విలపించారు. స్థానికులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అమరావతి, పరత్వాడ ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలకు చిక్కల్‌ధర ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనతో ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం అర్లి(టి) గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, తోటి ఉద్యోగులు, అధికారులు సంఘటన స్థలానికి పయనం అయ్యారు. మరణంలోనూ వీడని స్నేహబంధం.. భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామానికి చెందిన షేక్ సల్మాన్, బొల్లి వైభవ్ కొన్నేళ్లుగా ప్రాణస్నేహితులుగా ఉంటున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన పొలాల అమావాస్య వేడుకల్లో సైతం ఇద్దరు కలిసి బసవన్నలను ఊరేగించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం పాలవడం గమనార్హం. బ్యాంకు ఉద్యోగాలతో స్నేహితులుగా మారి.. వేర్వేరు జిల్లాల్లో పుట్టి పెరిగిన వీరంతా ఉద్యోగరీత్యా ఆదిలాబాద్ జిల్లాలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏర్పడిన స్నేహంతో సరదా కోసం చేసిన వీకెండ్ ట్రిప్ విషాదాన్ని మిగిల్చింది. జిల్లాలోని వివిధ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖల్లో ఉద్యోగం చేస్తున్న యువకులకు ఆర్లి(టి) గ్రామానికి చెందిన షేక్ సల్మాన్‌తో స్నేహం ఏర్పడింది. సల్మాన్ సొంతంగా వాహనాన్ని నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. కాగా అర్లి(టి), భీంపూర్‌తో పాటు వివిధ బ్యాంక్ శాఖలకు అప్పుడప్పుడు జిల్లా బ్యాంకు నుంచి నగదు రవాణా కోసం ఈయన వాహనాన్ని బ్యాంకు ఉద్యోగులు అద్దెకు తీసుకునేవారు. ఈ క్రమంలో ఏర్పడిన స్నేహంతో వీరంతా కలిసి వీకెండ్ కోసం వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. మృతులు వీరే.. ఆదిలాబాద్ జిల్లాలోని దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులతో పాటు అర్లి(టి)కి చెందిన మరో ఇద్దరు మహారాష్ట్రలోని చిక్కల్‌ధర ఆహ్లాదకర ప్రాంతా న్ని సందర్శించేందుకు ఆదివారం తెల్లవారుజామున బయల్దేరి వెళ్లారు. కారు అదుపు తప్పి చిక్కల్‌ధర లోయలో పడిపోయింది. ఈ ఘటనలో భీంపూర్ మండలం అర్లి(టి) సర్పంచ్ గొల్లి రమ – లస్మన్నల కుమారుడు వైభవ్ యాదవ్ (28), అదే గ్రామానికి చెందిన షేక్‌చాంద్ – రుక్సానా దంపతులకు మారుడు, కారు డ్రైవర్ షేక్ సల్మాన్ (31), నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొర్టికల్కు చెందిన అద్దంకి శివకృష్ణ (31), అదే జిల్లాలోని తిప్పర్తి మండలం మల్లెపల్లివారి గూడెంకు చెందిన కోటేశ్వర్రావు (27) అనే నలుగురు మృత్యు ఒడిలోకి చేరారు. కాగా ఖమ్మం జిల్లా పొన్నెకల్కు చెందిన శ్యామ్‌రాజ్, నల్గొండలోని మిర్యాలగూడకు చెందిన యోగేష్యాదవ్, అదే జిల్లాలోని కేటపల్లి మండలం చీకటిగూడెంకు చెందిన హరీష్, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సుమన్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కాగా మృతి చెందిన శివకృష్ణ తాంసి మండలంలోని కప్పర్ల టీజీబీ శాఖలో క్యాషియర్‌గా, కోటేశ్వర్రావు భీంపూర్ మండల కేంద్రంలోని టీజీబీ శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. అలాగే అర్లి(టి)కి చెందిన వైభవ్ కాటన్ కమీషన్ ఏజెంట్, సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు కుమారుడి మృతిని తట్టుకోలేక కుప్పకూలిపోయారు. వారు రోధించిన తీరు పలువురిని కలిచివేసింది. రాత్రి వరకు కూడా మృతదేహాలు ఇంటికి చేరుకోలేదు. ఇదిలా ఉండగా గాయపడ్డ వారిలో శ్యామ్‌రాజ్ రెడ్డి అర్లి(టి)లో క్యాషియర్‌గా, సుమన్ జైనథ్ మండలం పెండల్ వాడలో క్యాషియర్‌గా, యోగేష్ యాదవ్, హరీష్‌లు బేల మండల కేంద్రంలో ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు జిల్లాకేంద్రంలో అద్దెకు ఉంటూ నిత్యం విధులకు హాజరవుతున్నారు. కష్టపడి కొలువు సాధించి కుటుంబాలకు అండగా ఉంటున్న తరుణంలో అనుకోని రీతిలో ఇద్దరు మృతిచెందడం వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. అలాగే షేక్ సల్మాన్ వాహనాన్ని కొనుగోలు చేసి తన కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. ఈ తరుణంలో కుటుంబ దిక్కు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
బీఆర్ఎస్కు అధికారం ఇస్తే మహారాష్ట్రలో ప్రతి ఇంటికి నీళ్లు
-
మహారాష్ట్ర సరిహద్దుల్లో నిఘా
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ఆయా రాష్ట్రాలతోగల సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమతంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్రంలో వైరస్ కట్టడికి మరిన్ని పరీక్షలు, ట్రేసింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. హోం ఐసోలేషన్ కిట్లు అందిస్తామన్నారు. గాంధీ ఆస్పత్రితోపాటు టిమ్స్, నిమ్స్‌లలోనూ మళ్లీ పటిష్ట ఏర్పాట్లు చేస్తామన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతానికి కేసులు భారీగా పెరిగిన దాఖలాలు లేనందున ప్రస్తుతానికి కర్ఫ్యూపై ఎలాంటి ఆలోచన లేదన్నారు. అయినప్పటికీ కరోనా ఉన్నంతకాలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈటల సూచించారు. ఓపెన్ మార్కెట్లో టీకా విడుదల మేలు... కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌కు ధర నిర్ణయించి బహిరంగ మార్కెట్లో ఉంచితే మంచిదని మంత్రి ఈటల అభిప్రాయపడ్డారు. అలా మార్కెట్లోకి అనుమతిస్తే ఆ మేరకు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 11 లక్షలకుపైగా టీకా డోస్‌లు వచ్చాయన్నారు. బోధనాసుపత్రుల్లో మందులు, శస్త్రచికిత్సలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గత రెండేళ్లుగా నాణ్యమైన, బ్రాండెడ్ మందులను కొనుగోలు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి బడ్జెట్ కూడా ఈసారి పెంచుతామన్నారు. గడువు తీరిన మందులను తిరిగి కంపెనీలకు వెనక్కు ఇస్తున్నామన్నారు. తాను త్వరలో వ్యాక్సిన్ తీసుకుంటానని ఆయన తెలిపారు. అనంతరం రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రి ఈటల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేసులు పెరుగుతున్నాయి: శ్రీనివాసరావు మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా కారణంగా ఆ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న నిజామాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో వైరస్ కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల్లో ఇప్పటికీ చాలా మంది కరోనా జాగ్రత్తలను పాటించడంలేదని, మాస్క్‌లు ధరించకుండా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఒక అంతిమయాత్రకు 50 మంది వెళితే, అందులో 35 మందికి కరోనా సోకిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీంతో రాబోయే రోజుల్లో పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. కరోనా టీకా తీసుకున్న వారు మద్యం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. వైరస్‌లో కొత్త వేరియంట్లు వస్తున్నాయన్నారు. కొన్నాళ్లు వైరస్ స్తబ్దుగా ఉండి తర్వాత కొత్త రూపంలో అది విజృంభిస్తుందన్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. 50 ఏళ్లు పైబడిన వారికి టీకా... వచ్చే నెల మొదటి వారంలో 50 ఏళ్లు పైబడినవారికి, ఆలోపు వయసున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా టీకా వేస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కోవిన్ యాప్–2 అందుబాటులోకి వస్తుందన్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా 50 ఏళ్లు పైబడినవారి వివరాలను నమోదు చేస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను వివిధ పద్ధతుల ద్వారా సేకరిస్తున్నామన్నారు. -
తమ్మిడిహెట్టి ఎత్తు తగ్గించి చారిత్రక ఒప్పందం అంటారా?
♦ ప్రభుత్వానికి రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ సూటి ప్రశ్న ♦ మహారాష్ట్ర-తెలంగాణ నీటి ఒప్పందం, చర్చలు, దశ దిశపై రౌండ్‌టేబుల్ భేటీ ♦ పాత డిజైన్ మేరకే నిర్మించాలని అఖిలపక్ష నేతల డిమాండ్ హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తొలి డిజైన్‌లో ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం, దాన్ని చారిత్రక ఒప్పందంగా అభివర్ణించడం హాస్యాస్పదంగా ఉందని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని వదులుకుని ఎత్తిపోతలవైపు ప్రభుత్వం మొగ్గు చూపడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘‘మహారాష్ట్ర-తెలంగాణ నీటి ఒప్పందం, చర్చలు, దశ దిశ, తమ్మిడిహెట్టి 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించాలి’’ అన్న అంశంపై అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలు పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఎత్తు తగ్గించి చరిత్రాత్మక ఒప్పందమని ఎలా చెపుతున్నారో అర్థం కావడంలేదని, నిర్ణయం తీసుకునే ముందు ప్రజా చర్చలు, మేధావుల సలహాలు తీసుకోవాలని అన్నారు. మహారాష్ట్రకు ఏం కావాలో అది ఇచ్చి తమ్మిడిహెట్టి 152 మీటర్లకు ఎత్తు పెంచుకునేలా ఒప్పించాలని కోరారు. తమ్మిడిహెట్టి ఎత్తు 152 మీటర్లకు పెంచే వరకు పార్టీలు జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్ల తెలంగాణ రైతులకు గుండెకాయ వంటిదని, దాని డిజైన్ మార్పు చారిత్రక తప్పిదమని అన్నారు. మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇది దీర్ఘకాలిక సమస్య అని, దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఇంజనీర్ల కమిటీ అభిప్రాయాలు కూడా తీసుకోకుండా ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలు తీసుకోవడం సరి కాదన్నారు. మాజీ ఎమ్మెల్సీ సీతారాములు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల లాభం కోసమే డిజైన్ మార్పు అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. కోటి ఎకరాలకు నీరందిస్తానని సీఎం ప్రకటనలు చేస్తున్నారని, 148 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే కోటి ఎకరాలకు నీరు ఎలా అందిస్తారో ప్రజలకు వివరించాలన్నారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు ప్రజల నిర్ణయాలు ఎంతో కీలకమని, అందువల్ల పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి, టీడీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డి, ప్రాణహిత పరిరక్షణ వేదిక ప్రతినిధి ప్రతాప్, లోక్‌సత్తా పార్టీ ప్రతినిధి మన్నారం నాగరాజు పాల్గొన్నారు.