తమ్మిడిహెట్టి ఎత్తు తగ్గించి చారిత్రక ఒప్పందం అంటారా?
♦ ప్రభుత్వానికి రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ సూటి ప్రశ్న
♦ మహారాష్ట్ర-తెలంగాణ నీటి ఒప్పందం, చర్చలు, దశ దిశపై రౌండ్‌టేబుల్ భేటీ
♦ పాత డిజైన్ మేరకే నిర్మించాలని అఖిలపక్ష నేతల డిమాండ్
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తొలి డిజైన్లో ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం, దాన్ని చారిత్రక ఒప్పందంగా అభివర్ణించడం హాస్యాస్పదంగా ఉందని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని వదులుకుని ఎత్తిపోతలవైపు ప్రభుత్వం మొగ్గు చూపడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘‘మహారాష్ట్ర-తెలంగాణ నీటి ఒప్పందం, చర్చలు, దశ దిశ, తమ్మిడిహెట్టి 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించాలి’’ అన్న అంశంపై అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలు పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఎత్తు తగ్గించి చరిత్రాత్మక ఒప్పందమని ఎలా చెపుతున్నారో అర్థం కావడంలేదని, నిర్ణయం తీసుకునే ముందు ప్రజా చర్చలు, మేధావుల సలహాలు తీసుకోవాలని అన్నారు. మహారాష్ట్రకు ఏం కావాలో అది ఇచ్చి తమ్మిడిహెట్టి 152 మీటర్లకు ఎత్తు పెంచుకునేలా ఒప్పించాలని కోరారు. తమ్మిడిహెట్టి ఎత్తు 152 మీటర్లకు పెంచే వరకు పార్టీలు జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్ల తెలంగాణ రైతులకు గుండెకాయ వంటిదని, దాని డిజైన్ మార్పు చారిత్రక తప్పిదమని అన్నారు.
మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇది దీర్ఘకాలిక సమస్య అని, దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఇంజనీర్ల కమిటీ అభిప్రాయాలు కూడా తీసుకోకుండా ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలు తీసుకోవడం సరి కాదన్నారు. మాజీ ఎమ్మెల్సీ సీతారాములు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల లాభం కోసమే డిజైన్ మార్పు అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. కోటి ఎకరాలకు నీరందిస్తానని సీఎం ప్రకటనలు చేస్తున్నారని, 148 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే కోటి ఎకరాలకు నీరు ఎలా అందిస్తారో ప్రజలకు వివరించాలన్నారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు ప్రజల నిర్ణయాలు ఎంతో కీలకమని, అందువల్ల పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి, టీడీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డి, ప్రాణహిత పరిరక్షణ వేదిక ప్రతినిధి ప్రతాప్, లోక్‌సత్తా పార్టీ ప్రతినిధి మన్నారం నాగరాజు పాల్గొన్నారు.