
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిధిలో నీటి ప్రవాహ లెక్కలు పక్కాగా ఉండేందుకు ఉద్దేశించిన టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. జూన్‌తో కొత్త వాటర్‌ఇయర్‌కు గడువు దగ్గరపడుతున్నా ఇంతవరకు టెలిమెట్రీల ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదరలేదు. తొలి దశ టెలిమెట్రీ ఏర్పాటు ప్రాంతాలపై కొంత స్పష్టత వచ్చినా, రెండో దశపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రెండోదశకు గతేడాది 29 ప్రాంతాలతో జాబితాను రూపొందించారు. ఇందులో 14 పాయింట్లపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికొచ్చాయి. మిగిలిన 15 పాయింట్లపై ఏపీ అభ్యంతరాలు తెలపగా గుర్తించిన అన్ని ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.
వర్షాలకు ముందు ఏర్పాటు చేసేనా?: శ్రీశైలం కుడి కాల్వల కింద బనకచర్ల పరిధిలో మూడుచోట్ల టెలిమెట్రీల అవసరం లేదని గతంలో బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయపడింది. బేసిన్ పరిధిలో ఏపీ చేపట్టిన గురు రాఘవేంద్ర ఆఫ్‌టేక్, గాలేరు–నగరి, వైకుంఠపురం పం పింగ్ స్టేషన్ ఆఫ్‌టేక్ ఎత్తిపోతల పరిధిలో 100 క్యూసెక్కు లకు మించి నీటి వినియోగమున్నందునా అక్కడా టెలిమెట్రీల ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరుతోంది. దీనిపై ఏపీ వైఖరి స్పష్టం చేయలేదు. మరో 21 పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మొత్తం 36 టెలిమెట్రీలను జూన్ వర్షాలకు ముందే ఏర్పాటు చేయాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసినా అది ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment