Telemetry system
-
ఇరు రాష్ట్రాల మధ్య టెలిమెట్రీ టెన్షన్ !
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిధిలో నీటి ప్రవాహ లెక్కలు పక్కాగా ఉండేందుకు ఉద్దేశించిన టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. జూన్‌తో కొత్త వాటర్ఇయర్కు గడువు దగ్గరపడుతున్నా ఇంతవరకు టెలిమెట్రీల ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదరలేదు. తొలి దశ టెలిమెట్రీ ఏర్పాటు ప్రాంతాలపై కొంత స్పష్టత వచ్చినా, రెండో దశపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రెండోదశకు గతేడాది 29 ప్రాంతాలతో జాబితాను రూపొందించారు. ఇందులో 14 పాయింట్లపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికొచ్చాయి. మిగిలిన 15 పాయింట్లపై ఏపీ అభ్యంతరాలు తెలపగా గుర్తించిన అన్ని ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. వర్షాలకు ముందు ఏర్పాటు చేసేనా?: శ్రీశైలం కుడి కాల్వల కింద బనకచర్ల పరిధిలో మూడుచోట్ల టెలిమెట్రీల అవసరం లేదని గతంలో బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయపడింది. బేసిన్ పరిధిలో ఏపీ చేపట్టిన గురు రాఘవేంద్ర ఆఫ్టేక్, గాలేరు–నగరి, వైకుంఠపురం పం పింగ్ స్టేషన్ ఆఫ్టేక్ ఎత్తిపోతల పరిధిలో 100 క్యూసెక్కు లకు మించి నీటి వినియోగమున్నందునా అక్కడా టెలిమెట్రీల ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరుతోంది. దీనిపై ఏపీ వైఖరి స్పష్టం చేయలేదు. మరో 21 పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మొత్తం 36 టెలిమెట్రీలను జూన్ వర్షాలకు ముందే ఏర్పాటు చేయాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసినా అది ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. -
కేంద్ర అధికారి పర్యవేక్షణలో టెలిమెట్రీ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగ లెక్కలు పక్కాగా ఉండేందుకు వీలుగా వాటర్ ఇయర్ ఆరంభానికి ముందే కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఎస్ ఎస్కే జోషి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర జల వనరుల శాఖ సెక్రటరీ ఉపేంద్ర ప్రసాద్ సింగ్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు ద్వారా చేస్తున్న వినియోగం లెక్కల్లో చూపించిన దానికన్నా ఎక్కువ ఉంటోందని తెలిపారు. టెలిమెట్రీ వ్యవస్థ లేక సరైన వినియోగ లెక్కలు తేలడం లేదని, ఈ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ వివాదం వస్తోందని ఆయన దృష్టికి తెచ్చారు. ఈ వివాదాలు సద్దుమణగాలంటే జూన్‌లో వాటర్ ఇయర్ ఆరంభం అయ్యే లోగానే వీటిని ఏర్పాటు చేయాలని కోరారు. నిజానికి 2016 జూన్‌లో కేంద్రం వద్ద జరిగిన సమావేశంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలో రెండు నెలల వ్యవధిలోనే టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అది కార్యరూపం దాల్చలేదని తెలిపారు. దీనిపై రాష్ట్ర నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు సైతం కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. నారాయణఫూర్ నుంచి రెండు టీఎంసీలివ్వండి జూరాల కింది తాగునీటి అవసరాల నిమిత్తం నారాయణపూర్ నుంచి రెండు టీఎంసీల నీటిని విడుదల చేయాలంటూ కర్ణాటక జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాకేశ్‌సింగ్‌కు జోషి మరో లేఖ రాశారు. నీటి విడుదల కోసం అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో ఆయన కోరారు. -
టెలీమెట్రీలపై కదలిక!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఏర్పాటు చేస్తున్న టెలీమెట్రీలపై ఎట్టకేలకు కృష్ణాబోర్డులో కదలిక వచ్చింది. టెలీమెట్రీ వ్యవస్థను కార్యాచరణలోకి తీసుకురావడంలో జాప్యంపై తెలంగాణ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వాటిని అమల్లోకి తెచ్చే దిశగా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏర్పాటుచేసిన టెలీమెట్రీ ప్రాంతాల్లో వాటి పనితీరును పరిశీలించేందుకు ప్రత్యేక సాంకేతిక నిపుణులతో అధ్యయనం చేయిస్తోంది. బుధవారం సోమర్ కంపెనీకి చెందిన నిపుణులు, బోర్డు సభ్యులు పోతిరెడ్డిపాడు ప్రాంతంలో పర్యటించి టెలీమెట్రీల పనితీరును పరిశీలించారు. వాస్తవానికి మొదటి విడతలో 18 చోట్ల టెలీమెట్రీల ఏర్పాటు ఈ ఏడాది మే నాటికే పూర్తయినా కార్యరూపంలోకి రాలేదు. దీంతో ప్రాజెక్టుల వద్ద నీటి వినియోగం ఇంకా మాన్యువల్‌గానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పోతిరెడ్డిపాడు కింది వినియోగంపై అనేక ఆరోపణలొచ్చాయి. దీనికి తోడు ఇక్కడ ఏర్పాటు చేసిన టెలీమెట్రీని ట్యాంపరింగ్ చేసి లెక్కలు తారుమారు చేశారని గత బోర్డు సమావేశంలో తెలంగాణ ఫిర్యాదు చేసింది. అయితే టెలీమెట్రీలు అధికారికంగా అమల్లోకి రానందున ట్యాంపరింగ్ అవకాశం లేదని బోర్డు వివరణ ఇచ్చింది. అయినా కూడా కేంద్ర జల వనరుల శాఖకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. దీనిపై టెలీమెట్రీ వ్యవస్థలో అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులతో పరిశీలన మొదలు పెట్టింది. శుక్రవారం వీరు పోతిరెడ్డిపాడు కింద పర్యటించి ప్రవాహ లెక్కలను పరిశీలించారు. శనివారం శ్రీశైలం, అనంతరం నాగార్జునసాగర్, జూరాల పరిధిలో పర్యటించనున్నారు. గోదావరిపై త్రిసభ్య కమిటీ.. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో సైతం టెలీమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ప్రాంతాలను నిర్ధారించేందుకు గోదావరి బోర్డు కమిటీ ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు ఇద్దరు, బోర్డు నుంచి ఒకరు సభ్యులుగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. -
19న కృష్ణా బోర్డు సమావేశం
రెండు రాష్ట్రాలకు బోర్డు లేఖలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల తాగునీటి అవసరాలు, నీటి విడుదల, ప్రాజెక్టుల పరిధిలో టెలీమెట్రీ విధానం వంటి అంశాలను చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 19న సమావేశం కానుంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ గురువారం లేఖలు రాశారు. గత నెల 21, 22న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రాష్ట్రాల అవసరాలు, నీటి విడుదలపై ఈ సమావేశంలో చర్చించాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుండగా, తమ డెల్టా అవసరాల కోసం మూడు, నాలుగు టీఎంసీలు అవసరం ఉందని ఏపీ కోరుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీకి దిగువన 503.9 అడుగుల వద్ద 121.55 టీఎంసీల నీరుంది. ఇందులో ఒక టీఎంసీకి మించి వాడుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి నీటి విడుదల అనివార్యం. ప్రస్తుతం శ్రీశైలంలో 788.4 అడుగుల వద్ద 23.72 టీఎంసీల నీరుంది. ఇందులో 10 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. ఆ నీటిని తమ అవసరాలకు విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలు సమావేశంలో కోరవచ్చు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో చుక్క కూడా తేడా రాకుండా నాగార్జునసాగర్, శ్రీశైలం సహా ప్రధాన ప్రాజెక్టుల వద్ద టెలీమెట్రీ విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద ్ధమైంది. సాగర్, శ్రీశైలం సహా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, కల్వకుర్తి, ఏఎంఆర్పీ సహా మొత్తంగా 14 పాయింట్లలో రిజర్వాయర్ల లెవల్, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో ప్రవాహాలను గణించేందుకు వీలుగా టెలీమెట్రీ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. దీనిపై సమావేశంలో చర్చించనున్నారు. -
పక్కాగా కృష్ణానీటి ప్రవాహ లెక్క!
- సాగర్, శ్రీశైలం సహా 14 చోట్ల టెలీమెట్రీ విధానం అమలు - ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం, విడుదలకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉండేలా కృష్ణా నదీ యాజ మాన్య బోర్డు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో చుక్క నీటికి కూడా తేడాలు రాకుండా నాగార్జునసాగర్, శ్రీశైలం సహా ప్రధాన ప్రాజెక్టుల వద్ద టెలీమెట్రీ విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు బుధవారం లేఖలు రాసింది. సాగర్, శ్రీశైలం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, కల్వకుర్తి, సాగర్ కుడి, ఎడమ కాల్వ లు, ఏఎంఆర్పీ ప్రాజెక్టుల్లో మొత్తంగా 14 పాయింట్లలో రిజర్వాయర్ల లెవల్, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోను గణించేందుకు టెలీ మెట్రీ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. వీటి నిర్వహణ బాధ్యతలను చూసేందుకు 15 మంది అధికారులను కేటాయించాలని కోరింది. ఇరు రాష్ట్రాలు సమ్మతిస్తే ఈ ఏడాది నుంచే నీటి ప్రవాహ లెక్కలను పక్కాగా తేలుస్తామని వెల్లడించింది. వరద అంచనాకై రంగంలోకి ‘ఇస్రో’ నాగార్జునసాగర్ వద్ద కృష్ణానదీ ప్రవాహాలపై అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఇస్రో) రంగంలోకి దిగింది. సాగర్ వద్ద గతంలో నమోదైన వరద వివరాలను తమకు ఇవ్వాలని, దాని ఆధారంగా వరద సంభావ్యతలను ముందుగా గుర్తించి అప్రమత్తం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని ఇస్రో అధికారి ఒకరు నీటిపారుదల శాఖకు లేఖ రాశారు.