సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగ లెక్కలు పక్కాగా ఉండేందుకు వీలుగా వాటర్ ఇయర్ ఆరంభానికి ముందే కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఎస్ ఎస్‌కే జోషి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర జల వనరుల శాఖ సెక్రటరీ ఉపేంద్ర ప్రసాద్ సింగ్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు ద్వారా చేస్తున్న వినియోగం లెక్కల్లో చూపించిన దానికన్నా ఎక్కువ ఉంటోందని తెలిపారు.
టెలిమెట్రీ వ్యవస్థ లేక సరైన వినియోగ లెక్కలు తేలడం లేదని, ఈ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ వివాదం వస్తోందని ఆయన దృష్టికి తెచ్చారు. ఈ వివాదాలు సద్దుమణగాలంటే జూన్‌లో వాటర్ ఇయర్ ఆరంభం అయ్యే లోగానే వీటిని ఏర్పాటు చేయాలని కోరారు.
నిజానికి 2016 జూన్‌లో కేంద్రం వద్ద జరిగిన సమావేశంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలో రెండు నెలల వ్యవధిలోనే టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అది కార్యరూపం దాల్చలేదని తెలిపారు. దీనిపై రాష్ట్ర నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు సైతం కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.
నారాయణఫూర్ నుంచి రెండు టీఎంసీలివ్వండి
జూరాల కింది తాగునీటి అవసరాల నిమిత్తం నారాయణపూర్ నుంచి రెండు టీఎంసీల నీటిని విడుదల చేయాలంటూ కర్ణాటక జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాకేశ్‌సింగ్‌కు జోషి మరో లేఖ రాశారు. నీటి విడుదల కోసం అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment