అజయ్ మిశ్రా, సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్ర కుమార్ జోషి ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన పదవీకాలం మరో వారం రోజులే మిగిలి ఉండటంతో కొత్త సీఎస్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీ, సమర్థత, స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త సీఎస్ ఎంపికపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకోనున్నారు. సీఎస్ పదవి రేసులో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వీరిద్దరిలో ఒకరిని సీఎస్‌గా నియమించే అవకాశాలున్నాయని సచివాలయ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
సీనియర్లు చాలా మందే..
సీనియారిటీపరంగా సీఎస్ రేసులో తెలంగాణ కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ అధికారులు బీపీ ఆచార్య, బినయ్‌కుమార్, 1984 బ్యాచ్ అధికారి అజయ్ మిశ్రా, 1985 బ్యాచ్ అధికారిణి పుష్పా సుబ్రమణ్యం, 1986 బ్యాచ్ అధికారులు సురేశ్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారి, 1987 బ్యాచ్ అధికారులు రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, 1988 బ్యాచ్ అధికారులు శాలిని మిశ్రా, ఆధర్ సిన్హా, 1989 బ్యాచ్ అధికారులు సోమేశ్‌కుమార్, శాంతి కుమారి ఉన్నారు. వీరిలో బీపీ ఆచార్య, సురేశ్ చందా, రాజేశ్వర్ తివారి సమర్థులైన అధికారులుగా పేరున్నా, ప్రభుత్వంతో ఉన్న సంబంధాల రీత్య సీఎస్ రేసులో వీరి పేర్లు వినిపించడం లేదు.
బినయ్‌కుమార్, పుష్పాసుబ్రమణ్యం, హీరాలాల్ సమారియా, రాజీవ్ రంజన్, వసుధ మిశ్రాలు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇక మిగిలిన వారిలో అజయ్‌మిశ్రా, సోమేశ్‌కుమార్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే అజయ్ మిశ్రా 2020 జూన్‌లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయనకు సీఎస్‌గా అవకాశం కల్పిస్తే ఆరు నెలలు ఆ పదవిలో కొనసాగుతారు. సోమేశ్‌కుమార్ 2023 డిసెంబర్ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయనకు అవకాశం కల్పిస్తే నాలుగేళ్ల పాటు సీఎస్ పదవిలో కొనసాగనున్నారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు సీఎస్‌గా ఒకే అధికారిని కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తే సోమేశ్‌కుమార్‌కు సీఎస్ పదవి వరించే అవకాశాలున్నాయి. అజయ్ మిశ్రా రిటైరైన తర్వాత సోమేశ్‌కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment