sk joshi
-
కాళేశ్వరం నిర్ణయం కేసీఆర్, హరీశ్రావులదే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణం విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నది నాటి సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావులేనని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ అధ్యక్షతన వ్యాప్కోస్, సీఈ–సీడీఓ, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2016 మే 2న మేడిగడ్డ వద్ద భూమిపూజ చేసి బరాజ్‌ల నిర్మాణాన్ని కేసీఆర్ ప్రారంభించారని వివరించారు. అదే రోజు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినట్టు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఆయన పాల్గొన్నారు.సీఎం నిర్ణయాన్ని సాధారణంగా వ్యతిరేకించరు బరాజ్‌ల నిర్మాణంపై విధానపర నిర్ణయం ఎవరిది? అని కమిషన్ ప్రశ్నించగా, నాటి సీఎం నేతృత్వంలో మంత్రివర్గం, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అని తొలుత బదులిచ్చారు. నిర్ణయం మంత్రివర్గందా? సీఎందా? ప్రభుత్వం అంటే ఎవరు? అని కమిషన్ గుచి్చగుచ్చి ప్రశ్నించగా, నిర్ణయం సీఎందేనని, మంత్రివర్గం బలపరిచిందని తెలిపారు. మంత్రివర్గ భేటీలో ఎవరైనా మంత్రి అసమ్మతి వ్యక్తం చేయలేదా? అని ప్రశ్నించగా, అలాంటి విషయం తన దృష్టికి రాలేదన్నారు. సీఎం నిర్ణయంపై అసమ్మతి తెలిపితే మరుసటి రోజే మంత్రి పదవి కోల్పోవాల్సి వస్తుందనే భావనతో ఎవరూ అలా చేయరన్నారు. ‘మహా’ అభ్యంతరాలు, నీటి లభ్యత లేదనడంతోనే.. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌కి మహారాష్ట్ర అభ్యంతరాలు, వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రతిబంధకాలుగా మారడం, తగిన నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) లేఖ రాయడంతో బరాజ్‌ను మేడిగడ్డకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎస్కే జోషి వివరణ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి కచి్చతమైన కారణాలు చెప్పలేనని, డిజైన్లకు అనుగుణంగా నిర్మాణం జరగకపోవడం, నాణ్యతా లోపాలు, నిర్వహణ/పర్యవేక్షణ లోపాలు వంటి అనేక కారణాలు ఉండవచ్చని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం ఒకే ఒక పరిపాలనపర అనుమతి జారీ చేయలేదని, సుమారు 200కి పైగా అనుమతులు జారీ చేశారని తెలిపారు. సబ్ కాంట్రాక్టర్లపై సమాచారం లేదు మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఇతర సంస్థలకు (సబ్ కాంట్రాక్టర్లకు) ఏమైనా పనులు అప్పగించిందా? వేరే సంస్థలు నిర్మించడంతోనే 7వ బ్లాక్ కుంగిందా? అని కమిషన్ ప్రశ్నించగా, దీనిపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని జోషి, క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరైన నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌లు వేర్వేరుగా బదులిచ్చారు. అప్పట్లో బరాజ్‌లలో లోపాలు కనబడలేదు: రజత్‌కుమార్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్ కుంగిందని రజత్‌కుమార్ చెప్పారు. నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికే మేడిగడ్డ వంటి బరాజ్‌లను నిర్మిస్తారని, నిల్వల కోసం నాగార్జునసాగర్ వంటి జలాశయాలు నిర్మిస్తారని చెప్పారు. ఓ స్థాయి వరకే బరాజ్‌లలో నిల్వలను కొనసాగించి, మిగిలిన ప్రవాహాన్ని విడుదల చేయాల్సిన బాధ్యత ప్రాజెక్టు సీఈదేనని అన్నారు. ప్రభుత్వం రుణాలు తీసుకోక తప్పదు డిఫెక్ట్ లయబిలిటీ కాలంలోనే బరాజ్‌లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయకుండా నిర్మాణ సంస్థలకు డిపాజిట్లను ఎలా చెల్లిస్తారు? అని కమిషన్ ప్రశ్నించగా, 2020 ఫిబ్రవరిలో తాను శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పనులు పూర్తయ్యాయని రజత్‌కుమార్ వివరణ ఇచ్చారు. అప్పట్లో బరాజ్‌లలో ఎలాంటి లోపాలు కనబడలేదన్నారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించడం సాధ్యం కాదని, రుణాలు తీసుకోక తప్పదని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ చైర్మన్ సీబీ కామేశ్వర్ రావు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. బరాజ్‌ల వైఫల్యాలపై తన నివేదికలో పేర్కొన్న అంశాలన్ని వాస్తవాలేనంటూ వాంగ్మూలం ఇచ్చారు. కాగా గురువారం మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. -
అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్‌కు ప్రాధాన్యత: ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న పట్టణీకరణ ప్రభావంతోపాటు వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్‌కు ప్రాధాన్యత ఏర్పడిందని మాజీ సీఎస్ ఎస్కే జోషి అన్నారు. మంగళవారం తన పదవీ విరమణకు ముందు అర్బన్ పార్కులపై అటవీ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్కే జోషి మాట్లాడుతూ.. పట్టణాల్లో జనసాంద్రత పెరుగుతున్నందున, మరింత పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్ అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం కీలకమన్నారు. రాష్ట్రంలోని మొత్తం 129 రిజర్వ్ ఫారెస్ట్ క్లస్టర్లలో 70 క్లస్టర్లను కన్జర్వేషన్ బ్లాక్‌లుగా ఉంచుతామని.. నగరాలు పెరిగే కొద్దీ వాటిని అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 193 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లలో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నామని, రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లున్న మున్సిపల్ పట్టణాల్లో అర్బన్ పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పీసీసీఎఫ్ ఆర్.శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న సోమేశ్ కుమార్.. రేపటి నుంచి (జనవరి 1) సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శైలేంద్ర కుమార్ జోషి పదవీకాలం నేటితో ముగియనుంది. నేడు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం జోషి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగనున్నారు. అలాగే నీటిపారుదల వ్యవహారాల సలహాదారుడిగా వ్యవహరించనున్నారు. ఇక బీహార్‌కు చెందిన సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయన 2023 డిసెంబర్ 31 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా సోమేశ్ విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
కొత్త సీఎస్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్ర కుమార్ జోషి ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన పదవీకాలం మరో వారం రోజులే మిగిలి ఉండటంతో కొత్త సీఎస్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీ, సమర్థత, స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త సీఎస్ ఎంపికపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకోనున్నారు. సీఎస్ పదవి రేసులో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వీరిద్దరిలో ఒకరిని సీఎస్‌గా నియమించే అవకాశాలున్నాయని సచివాలయ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్లు చాలా మందే.. సీనియారిటీపరంగా సీఎస్ రేసులో తెలంగాణ కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ అధికారులు బీపీ ఆచార్య, బినయ్‌కుమార్, 1984 బ్యాచ్ అధికారి అజయ్ మిశ్రా, 1985 బ్యాచ్ అధికారిణి పుష్పా సుబ్రమణ్యం, 1986 బ్యాచ్ అధికారులు సురేశ్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారి, 1987 బ్యాచ్ అధికారులు రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, 1988 బ్యాచ్ అధికారులు శాలిని మిశ్రా, ఆధర్ సిన్హా, 1989 బ్యాచ్ అధికారులు సోమేశ్‌కుమార్, శాంతి కుమారి ఉన్నారు. వీరిలో బీపీ ఆచార్య, సురేశ్ చందా, రాజేశ్వర్ తివారి సమర్థులైన అధికారులుగా పేరున్నా, ప్రభుత్వంతో ఉన్న సంబంధాల రీత్య సీఎస్ రేసులో వీరి పేర్లు వినిపించడం లేదు. బినయ్‌కుమార్, పుష్పాసుబ్రమణ్యం, హీరాలాల్ సమారియా, రాజీవ్ రంజన్, వసుధ మిశ్రాలు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇక మిగిలిన వారిలో అజయ్‌మిశ్రా, సోమేశ్‌కుమార్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే అజయ్ మిశ్రా 2020 జూన్‌లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయనకు సీఎస్‌గా అవకాశం కల్పిస్తే ఆరు నెలలు ఆ పదవిలో కొనసాగుతారు. సోమేశ్‌కుమార్ 2023 డిసెంబర్ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయనకు అవకాశం కల్పిస్తే నాలుగేళ్ల పాటు సీఎస్ పదవిలో కొనసాగనున్నారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు సీఎస్‌గా ఒకే అధికారిని కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తే సోమేశ్‌కుమార్‌కు సీఎస్ పదవి వరించే అవకాశాలున్నాయి. అజయ్ మిశ్రా రిటైరైన తర్వాత సోమేశ్కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
రాష్ట్రపతి శీతాకాల విడిదికి యాక్షన్‌ప్లాన్
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిదికి రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటనకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సోమవారం బీఆర్కే భవన్లో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఈ నెల 20న మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని 22 వరకు రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని చెప్పారు. 23న తిరువనంతపురం వెళ్లి, 26న హైదరాబాద్ చేరుకుంటారన్నారు. 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోంలో పాల్గొని, 28న మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తారని వివరించారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. -
జనగణన 45 రోజులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ జనాభా గణన–2021 లో భాగంగా వచ్చే ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 45 రోజులు రాష్ట్రంలో తొలి విడత జనాభా లెక్కల సేకరణ నిర్వహించనున్నామని సీఎస్ ఎస్కే జోషి వెల్లడించారు. 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు రెండో విడత నిర్వహిస్తామని చెప్పారు. 71,136 మంది ఎన్యూమరేటర్లు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. జనాభా గణన–2021 కార్యక్రమం ఏర్పాట్లపై సోమవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో సమీక్ష నిర్వహించారు. 65 మంది మాస్టర్ ట్రైనర్లకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో తొలి విడత శిక్షణ ముగిసిందని, రెండో విడత సోమవారం నుంచి 7 వరకు జరుగుతుందని చెప్పారు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా గృహాల జాబితాల తయారీ, జనగణనతో పాటు జాతీయ జనాభా రిజిస్ట్రర్‌ను నవీకరిస్తారని వెల్లడించారు. వ్యక్తుల వివరాలతో పాటు సాంఘిక, సాంస్కృతిక, భౌగోళిక, ఆర్థికపర వివరాలను సేకరిస్తారని చెప్పారు. ఎన్యూమరేటర్లు తమ మొబైల్ ఫోన్ యాప్‌తో పాటు కాగితపు దరఖాస్తులను నింపడం ద్వారా జనాభా వివరాలను సేకరిస్తారన్నారు. జనాభా గణన వ్యవహారాల డైరెక్టర్ కె.ఇలంబర్తి ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు. -
2020 సెలవులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: 2020కి సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 28 సాధారణ సెలవుల్లో 5 సెలవులు ఆదివారం/రెండో శనివారం వస్తున్నాయి. ప్రధాన పండుగలైన దసరా (విజయదశమి), మొహర్రం, గణతంత్ర దినోత్సవం, బాబూ జగ్జీవన్‌రాం జయంతి ఆదివారం రానుండటంతోపాటు దీపావళి రెండో శనివారం రానుంది. మిగిలిన 23 సాధారణ సెలవుల్లో 6 సెలవులు శనివారాల్లో వస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు మరుసటిరోజు ఆదివారం సెలవు రోజు కలసి రానుంది. అదే విధంగా మరో 5 సాధారణ సెలవులు శుక్రవారం వస్తున్నాయి. మరో 4 సాధారణ సెలవులు సోమవా రం వస్తుండటంతో అంతకుముందు రోజు ఆదివారం సెలవు కలసి రానుంది. జనవరి 1న కొత్త ఏడాది సందర్భంగా సెలవు ప్రకటించినందున ఫిబ్రవరి 8న రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రభుత్వం వెల్లడించింది. తమ మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ఐచ్ఛిక సెలవుల్లో ఏవైనా 5 సెలవులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. నోట్: 1) మార్చి 9న హజ్రత్ అలీ జయంతి నేపథ్యంలో ఇవ్వాల్సిన ఐచ్ఛిక సెలవును అదేరోజు హోళి రావడంతో సాధారణ సెలవుగా ప్రకటించారు. 2) అక్టోబర్ 24న మహర్నవమి నేపథ్యంలో ఇవ్వాల్సిన ఐచ్ఛిక సెలవును దుర్గాష్టమి అదేరోజు రావడంతో సాధారణ సెలవుగా ప్రకటించారు. 3) నవంబర్ 14న నరక చతుర్థి సందర్భంగా ఇవ్వాల్సిన ఐచ్ఛిక సెలవును దీపావళి అదేరోజు రావడంతో సాధారణ సెలవుగా ప్రకటించారు. -
దివ్యాంగ అథ్లెట్లను ప్రోత్సహించాలి
బొల్లారం: దివ్యాంగ అథ్లెట్లు క్రీడల్లో రాణించేందుకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (సీఎస్) ఎస్కే జోషి అన్నారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారా అథ్లెట్ల కోసం రసూల్‌పురాలోని మెహతా అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ ఆకాడమీ, రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పారా అథ్లెట్ల కోసం అత్యాధునిక పునరావాస, శిక్షణ కేంద్రాన్ని మెహతా ఫౌండేషన్ వారు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా పారా అథ్లెట్లకు సహకరించా లని కోరారు. అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్థలం ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం సినీ నటి మంచు లక్ష్మి మాట్లా డుతూ అంగవైకల్యం ఉన్న వారి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వారికి కౌన్సెలింగ్ ఇచ్చి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ దిశగా ప్రయత్నం చేస్తున్న మెహతా ఫౌండేషన్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వికలాంగులకు క్రీడల్లో మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతోనే దీన్ని ఏర్పాటు చేశామని ఫౌండేషన్ ప్రతినిధి ఆదిత్య మెహతా అన్నారు. పారా సైక్లింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, స్విమ్మింగ్, ఆర్చరీ, షూటింగ్, స్కేటింగ్, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ విభాగాల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారులు కె.కె శర్మ, ఆదిత్య మిశ్రా, అంజనీ సిన్హా, దినకర్ బాబు, ఎమ్.ఆర్ నాయక్, తరుషి, దుర్గాప్రసాద్, శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర..!
సాక్షి, హైదరాబాద్: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆర్థిక సంక్షోభం ఊబిలోకి నెట్టి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు యూనియన్ ప్రయత్నిస్తుందని, అందుకు విపక్షాలతో చేతులు కలిపి కుట్రకు పాల్పడుతోందని టీఎస్ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ ఆరోపించారు. ఒక పక్క యాజమాన్యంతో చర్చలు జరుగుతుండగానే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్లాయని, తిరిగి విధుల్లో చేరేందుకు వారంతా ముందుకు వచ్చిన విధుల్లోకి చేర్చుకునేలా నిర్ణయం తీసుకోవడం కూడా కష్టమేనని హైకోర్టుకు తేల్చి చెప్పారు. ఈ మేరకు టీఎస్‌ఆరీ్టసీ ఇన్చార్జి ఎండీ హోదాలో శనివారం ఆయన హైకోర్టులో స్పెషల్ అడిషినల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీసీ సిబ్బంది కోసం కాకుండా ప్రతిపక్ష రాజకీయపారీ్టల కోసం ఆర్టీసీ యూనియన్ అడుగులు వేస్తోందన్నారు. ఆర్టీసీ ఉనికినే దెబ్బతీస్తుంటే యాజమాన్యం చేతులు కట్టుకుని కూర్చోబోదని చెప్పారు. యూనియన్‌లో కొందరి తప్పిదాల వల్ల ప్రజలు, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ సంస్థ ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు. యూనియన్ మొండిగా వ్యవహరించిందని, బెదిరింపులకు దిగే క్రమంలోనే దసరాకు ముందు సమ్మెలోకి దిగారని చెప్పారు. ఆర్టీసీ కారి్మకులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం ఆరు వారాలు లేదా 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని, కన్సిలియేషన్ జరుగుతుంటే సమ్మెలోకి వెళ్లడం అదే చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం సమ్మె చట్ట వ్యతి రేకం అవుతుందన్నారు. చట్ట వ్యతిరేకంగా సమ్మెలోకి వెళితే నెల రోజులపాటు జైలు శిక్షతోపాటు జరిమానాలను విధించేందుకు వీలుందన్నారు. డిమాండ్లను పరిష్కరించే పరిస్థితి లేదు.. యూనియన్ డిమాండ్లను పరిష్కరించే పరిస్థితుల్లో ఆర్టీసీ కార్పొరేషన్ లేదన్నారు. అగ్గి రాజేసి చలి కాచుకునే ధిక్కార ధోరణి/ క్రమశిక్షణారాహిత్యాలను ఉపేక్షించబోమని గట్టిగా నొక్కి చెప్పారు. సమ్మె పాశుపతాస్త్రం లాంటిదని, అయినదానికీ కానిదానికీ దానిని ప్రయోగించకూడదని, సమ్మె హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుగా లేదన్నారు. ప్రజా సరీ్వసుల్లోని సిబ్బంది సమ్మె చేస్తామని నోటీసు ఇవ్వడమే చట్ట విరుద్ధమని, 40 రోజుల సమ్మె వల్ల ఆర్టీసీ పరిస్థితే కాకుండా వ్యాపార, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో మొండిగా వ్యవహరించిన యూనియన్ ఆ డిమాం డ్‌ను ప్రస్తుతానికి పక్కకు పెట్టిందన్నారు. యూనియన్ మొండి వైఖరిని అనుసరించిందనడానికి ఇదే పెద్ద నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్లీ విలీనం డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ప్రభుత్వా న్ని అస్థిరపరిచే అవకాశాలు లేకపోలేదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. యూనియన్ సమ్మె వల్ల ఉన్న నిల్వ నిధులు కాస్తా ఖర్చు అవుతున్నాయని, నష్టాల నుంచి భారీ నష్టాల ఊబిలోకి వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు. పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నష్టాల్లో ఉన్నప్పటికీ ఆర్టీసీ సిబ్బందికి 44% జీతాల పెంపు, 16% మధ్యంతర భృతి ఇచ్చామని చెప్పారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు సత్వరమే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బస్సు రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు: సీఎస్ ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్ పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి హైకోర్టుకు తెలియజేశారు. క్యాబినెట్ నిర్ణయ ప్రక్రియ పూర్తి కాలేదని, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడేలోగా ఆ నిర్ణయంలో మార్పుచేర్పులకు ఆస్కారం ఉంటుందన్నారు. జీవో వచ్చాకే క్యాబినెట్ నిర్ణయానికి పూర్తి సార్థకత వస్తుందన్నారు. ఈలోగా క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదని రాజ్యాంగంలోని 166(1) అధికరణం స్పష్టం చేస్తోందన్నారు. రవాణా చట్టం కూడా అదే స్పష్టం చేస్తోందన్నారు. బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాబినెట్ తీర్మానం నోట్‌ఫైల్స్‌లో భాగమని, సచివాలయం బయట ఉన్న వాళ్లకు ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. క్యాబినెట్ నిర్ణయం తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్ వెలువరించాలని, ఆ తర్వాత జీవో జారీ చేస్తేనే క్యాబినెట్ అమల్లోకి వస్తుందని, అప్పటి వరకూ ఆ నిర్ణయాన్ని సవాల్ చేయడం చెల్లదని, పిల్‌ను డిస్మిస్ చేయాలని ఆయన హైకోర్టును కోరారు. -
ఆర్టీసీ సమ్మె: ఔదార్యమేదీ?
ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలను అమలు చేస్తోందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే ఓట్లేసి తిరిగి గెలిపిస్తున్నారు, వారి విశ్వాసాన్ని ఏ రకంగానూ వమ్ము చేయడానికి వీల్లేదు... కార్మికులు కూడా ఓ మెట్టు దిగి రావడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. శక్తివంతమైన రాజ్యాల ఎదుగుదలను, అవి కుప్పకూలిపోవడాన్ని తెలంగాణ చూసింది. ప్రజలపట్ల చూపాల్సింది అధికారం కాదు, ఔదార్యం. సాక్షి, హైదరాబాద్: ‘దేశం మొత్తం అబ్బురపడేలా ఈ రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయి. సాగునీరు సహా పలు ప్రాజెక్టుల కోసం రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రైతుల కోసం కేంద్రం రూ. 2 వేలు ఇస్తుంటే ఇక్కడ మరింత ఔదార్యంతో రూ. 4 వేలు ఇస్తున్నారు. విద్యుత్ రంగంలో ఎంతో పురోగతి సాధించారు. ఒకే ఒక్క భారీ ప్రాజెక్టుతో 80 శాతం నీటి అవసరాలను తీరుస్తున్నారు. ఒకే నియోజకవర్గానికి అభి వృద్ధి నిమిత్తం రూ. 100 కోట్లు కేటాయిం చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. అటు వంటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో ఔదార్యం చూపడం లేదు. సమస్య పరిష్కారానికి అవసరమైన రూ. 47 కోట్లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. రాజు తండ్రిలాంటి వాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలను కాపా డాలి. అధికారం ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని అంత తక్కువ వాడాలి. మా వద్దా కోర్టు ధిక్కారణ అధికారం ఉంది. మా ముందు అధికారులు దాఖలు చేసిన అఫి డవిట్లన్నీ కోర్టు ధిక్కార పరిధిలోకి వచ్చేవే. మేం ఇప్పుడు ఆలోచిస్తోంది 48 వేల మంది ఉద్యోగుల గురించి కాదు. 3 కోట్ల మంది ప్రజల గురించి. ఈ ప్రభుత్వానికి రూ. 47 కోట్లు పెద్ద కష్టమేమీ కాదు. ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికులతో చర్చలు జరపండి. వారితో సంప్రదింపులు జరిపి ఓ నిర్ణయానికి రండి’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మలతోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు మా అనుమతి తీసుకోలేదు: కేంద్రం ఈ సందర్భంగా కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నామవరపు రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదన్నారు. తమ దృష్టిలో టీఎస్ఆర్టీసీకి ఎటువంటి గుర్తింపు లేదన్నారు. ఆర్టీసీ విభజనకు కేంద్రం అనుమతి తప్పనిసరన్నారు. కేంద్రం అనుమతి ఇచ్చిన తరువాతే విభజన సాధ్యమవుతుందని వివరించారు. తమకున్న వాటా ఏపీఎస్ఆర్టీసీలోనే ఉందని వివరించారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్–3 కింద టీఎస్ఆర్టీసీ ఆవిర్భవించిందన్నారు. కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందే... ఈ వాదనతో ధర్మాసనం విబేధిస్తూ ఆర్టీసీ విభజనకు కేంద్రం ఆమోదం తప్పనిసరని స్పష్టం చేసింది. సెక్షన్–3 కింద టీఎస్ఆర్టీసీ ఏర్పాటైనప్పుడు ఆస్తి, అప్పుల విభజన గురించి ఎందుకు మాట్లాడతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టీసీకి ప్రత్యేక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టం ప్రకారమే నడుచుకోవాలే తప్ప ఇతర చట్టాల ప్రకారం కాదని తేల్చిచెప్పింది. ఆర్టీసీ చట్టం ప్రకారం విభజనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరని, ఇతర చట్టాలను సాకుగా చూపుతూ అనుమతి తీసుకోకుండా తప్పించుకోజాలరని స్పష్టం చేసింది. టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించింది. వాస్తవానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం అనుమతి తీసుకోవడం తప్పనిసరని తెలిపింది. సమస్య పరిష్కారానికి అవసరమైన రూ. 47 కోట్లు విడుదల చేయాలని చెబుతుంటే ఇరు వైపుల నుంచి స్పందన రావడం లేదని, ప్రభుత్వ వైఖరి వల్ల రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతున్నాయని వ్యాఖ్యానించింది. సామాన్య ప్రజల ఇబ్బందులు ఎవరికీ పట్టడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. అంత మొండి పట్టుదల ఎందుకు? రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి ధర్మాసనం ప్రస్తావిస్తూ రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రూ. 47 కోట్ల విషయంలో ఎందుకు మొండి పట్టుదల ప్రదర్శిస్తోందో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ రాష్ట్రం రూ. 30 వేల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని చెప్పగా అన్ని వేల కోట్ల అప్పులో రూ. 47 కోట్లు ఎంత? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలను అమలు చేస్తోందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే ఓట్లేసి తిరిగి గెలిపిస్తున్నారని, వారి విశ్వాసాన్ని ఏ రకంగానూ వమ్ము చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కార్మికులు కూడా ఓ మెట్టు దిగి రావడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని పేర్కొంది. ప్రభుత్వం ముందుకు రావడం లేదు... దీనికి కార్మిక సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ గడువు పెట్టి మరీ బేషరతుగా విధుల్లో చేరాలంటూ కార్మికులకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కార్మిక సంఘాలతో చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఈ సమయంలో జోషి జోక్యం చేసుకుంటూ మూడుసార్లు కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించామని, ముఖ్యమంత్రి కూడా కార్మికులకు విజ్ఞప్తి చేశారన్నారు. ముఖ్యమంత్రిది బెదిరింపులా ఉంది... దీనికి ధర్మాసనం స్పందిస్తూ ముఖ్యమంత్రిది విజ్ఞప్తి.. హామీ కాదని, అది బెదిరింపులా ఉందని తేల్చిచెప్పింది. ప్రభుత్వంపై ఉన్న గౌరవంతో మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీపై ఔదార్యం చూపాలని సూచించింది. బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు చిత్ర కళల పోటీల్లో బహుమతులు ఇవ్వాలని తాము నిర్ణయించామని, అయితే బస్సుల సమ్మె వల్ల పిల్లలను తీసుకురావడం సాధ్యం కాదని జిల్లా జడ్జీలు చెప్పారని ధర్మాసనం గుర్తుచేసింది. సమ్మె వల్ల పిల్లలను ప్రోత్సహించేందుకు సైతం అవకాశం లేకుండా పోతోందని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. శక్తివంతమైన రాజ్యాల ఎదుగుదలను, అవి కుప్పకూలిపోవడాన్ని తెలంగాణ చూసిందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రజలపట్ల చూపాల్సింది అధికారం కాదని, ఔదార్యమని స్పష్టం చేసింది. ‘మాది పేద కుటుంబం. మా అమ్మ 13 మందిని పెంచింది. మా అన్నదమ్ములతోపాటు మరో 10 మందిని కూడా పెంచింది. పిల్లలందరికీ అన్నం సరిపోదని తెలిసీ అన్నం వండేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసి, అన్నాన్ని పిల్లలకు పెట్టి మా అమ్మ గంజి తాగి బతికింది. అదీ తల్లి మనసు’ అని సీజే చెప్పారు. ప్రజలకు రాజే తండ్రని, అటువంటి రాజు ప్రజలపట్ల ఔదార్యం చూపాల్సిన అవసరం ఉందన్నారు. గజిబిజి లెక్కలతో తెలివి ప్రదర్శిస్తున్నారు... న్యాయస్థానాలైనా.. ప్రభుత్వాలైనా ఉన్నది ప్రజల కోసమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారులు, గజిబిజి లెక్కలతో చాలా తెలివి ప్రదర్శిస్తూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించింది. లెక్కలతో తాము ఎప్పుడు నివేదిక కోరినా అంతకుముందు ఇచ్చిన నివేదికకూ, తాజా నివేదికకూ ఏమాత్రం పొంతన ఉండటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ విచారణకు వారికి తోచిన లెక్కలు చెబుతున్నారని మండిపడింది. తప్పుడు లెక్కలతో న్యాయస్థానాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రిని తప్పుదోవ పట్టించిన అధికారులను తామెలా విశ్వసించగలమని ప్రశ్నించింది. ప్రమాణపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేసి అందులో అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మండిపడింది. ఇలా చేయడం కోర్టు ధిక్కారం కిందకు రాదా? అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని ప్రశ్నించింది. కోర్టు లేవనెత్తిన అంశాలకు అధికారులు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారని జోషి చెప్పగా ఆ అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్లు చదివే ఈ మాట చెబుతున్నారా? అంటూ జోషిని ధర్మాసనం నిలదీసింది. గతంలో వేసిన అఫిడవిట్‌కు, ఇప్పుడు వేసిన అఫిడవిట్‌కు ఏమాత్రం పొంతన లేదని గుర్తుచేసింది. ఇలాంటి అధికారులను ఎలా నమ్మగలమని ప్రశ్నించింది. క్షమాపణ వల్ల ప్రయోజనం ఉండదు... ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, తక్కువ సమయంలో కౌంటర్ దాఖలు చేయాల్సిన పరిస్థితి వల్ల తప్పులు దొర్లాయని, ఇందుకు క్షమించాలని కోరగా క్షమాపణ వల్ల ప్రయోజనం ఉండదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కోర్టు ఓ నిర్ణయానికి వచ్చి శిక్ష విధించాక ఆ సాక్షి వచ్చి తన వాంగ్మూలం తప్పని చెబితే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించింది. వాస్తవాలను పరిశీలించేందుకు కాగ్ నివేదికలు ఇంటర్నెట్లో సులభంగా అందుబాటులో ఉన్నాయని గుర్తుచేసింది. ఆర్టీసీకి చెల్లించిందని రూ. 3,903 కోట్లని ఓసారి, రూ. 3,400 కోట్లని మరోసారి అధికారులు చెబుతున్నారని, వీటిలో ఏది వాస్తవమో అర్థం కాని పరిస్థితి నెలకొందని విమర్శించింది. అలాగే ఆర్టీసీకి రుణం ఇచ్చామని ఓసారి, గ్రాంటు అని మరోసారి చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. జీవోల్లో రుణంగా చెప్పి ఇప్పుడు వాటిని గ్రాంటుగా పేర్కొనడంలో అర్థం ఏమిటని నిలదీసింది. జీహెచ్ఎంసీ బకాయిల విషయంలోనూ అస్పష్టత ఉందని ధర్మాసనం విమర్శించింది. ఒకసారేమో జీహెచ్ఎంసీ డబ్బు ఇచ్చిందని, మరోసారి అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదని ఎలా పడితే అలా చెబుతున్నారని ఆక్షేపించింది. ముఖ్యమంత్రిని, మంత్రిని తప్పుదోవ పట్టించే అధికారులను ఆ పోస్టుల్లో కొనసాగించడం సబబు కాదని అభిప్రాయపడింది. డబ్బు తీసుకొని బకాయి ఉందంటే ఎలా? 2019–20లో రూ. 565 కోట్లు రీయింబర్స్మెంట్ ఇచ్చి అందులో రూ. 540 కోట్లను మోటారు వాహన పన్ను కింద ప్రభుత్వం మినహాయించుకుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయని ధర్మాసనం తెలిపింది. అలాంటప్పుడు తీసేసుకున్న మోటారు వాహన పన్నును ఆర్టీసీ బకాయి ఉందని ప్రభుత్వం ఎలా చెబుతుందని నిలదీసింది. ఎవరు చెప్పేది నిజమో.. ఎవరిది అబద్ధమో దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ సీఎం చెప్పినా కార్మికులు వినడం లేదని, కేవలం 300 మందే విధుల్లో చేరానన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రూ. 47 కోట్లు ఇచ్చి ఉంటే నాలుగు డిమాండ్లు పరిష్కారమై ఉండేవని, తద్వారా సమస్య పరిష్కారానికి సుహృద్భావ వాతావరణం నెలకొని ఉండేదని అభిప్రాయపడింది. రూ. 47 కోట్లు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని మేం భావిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఓసారి ఎక్కువ ఇచ్చామని, మరోసారి ఇవ్వాల్సింది ఏమీ లేదని చెబుతోందని తెలిపింది. ఇలా మాట్లాడుతుంటే సమస్య ఎప్పుడు పరిష్కారం కావాలని ప్రశ్నించింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. మరోవైపు 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఆర్టీసీ సమ్మె:ఇలాంటి అధికారులను చూడలేదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్లపై గురువారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ శర్మ, రామకృష్ణారావులపై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. తమ 15 ఏళ్ల చరిత్రలో ఇంత అబద్ధాలు చెప్పే అధికారులను చూడలేదని అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీ యజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్య చేయాలని తాము ప్రయత్నిస్తుంటే అందుకు ఇరువర్గాలు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని తెలిపింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని మండిపడింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఏపీఎస్ఆర్టీసీ విభజన పూర్తి కాలేదు : కేంద్రం ఆర్టీసీ సమ్మెపై కేంద్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. కేంద్రానికి ఏపీఎస్ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందని తెలిపింది. ఆ వాటా టీఎస్ఆర్టీసీకి ఆటోమేటిక్‌గా బదిలీ కాదని వాదించింది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీలో 33 శాతం వాటా అనేది తలెత్తదని వివరణ ఇచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని.. విభజన చేస్తే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. విభజనకు కేంద్రం అనుమతి ఇచ్చిందనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అలా అయితే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ విభజన జరిగిందా.. లేక కొత్తగా ఏర్పడిందా అని కేంద్రం అనుమానం వ్యక్తం చేసింది. అది ఎలా సాధ్యం నిలదీసిన హైకోర్టు కేంద్రం వాదనపై స్పందించిన ఎస్కే జోషి.. ఆర్టీసీ ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యుల్ 9 కిందకు వస్తుందని కోర్టుకు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేసినట్టు ఏజీ, ఆర్టీసీ ఎండీ కోర్టుకు వివరించారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పారు. అయితే వారి వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు.. ఓ వైపు విభజన పెండింగ్‌లో ఉందని, మరోవైపు కొత్త ఆర్టీసీ ఏర్పాటు చేశామని అంటున్నారని.. అది ఎలా సాధ్యమని నిలదీసింది. ఏపీఎస్ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలు కేంద్రం అనుమతి కోరాలి కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వానికి సమస్య పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా అని సూటిగా ప్రశ్నించింది. నీటి పారుదల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి.. ఆర్టీసీకి రూ. 49 కోట్లు చెల్లించడాని ఇబ్బంది ఎందుకని మండిపడింది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని సూచించింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోవాలని ఆదేశించింది. క్షమాపణ సమాధానం కాదు.. : హైకోర్టు అంతకు ముందు విచారణ సందర్భంగా కోర్టుకు సమర్పించిన నివేదికలపై సీఎస్‌ను వివరణ ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఆర్థికశాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. ఐఏఎస్ అధికారులు అసమగ్ర నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. అయితే రికార్డులు పరిశీలించాకే నివేదిక ఇస్తున్నట్టు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా సూటిగా ప్రశ్నించింది. సమయాభావం వల్ల రికార్డుల ఆధారగా నివేదిక రూపొందించామని.. మన్నించాలని హైకోర్టును కోరారు. అయితే క్షమాపణలు కోరడం సమాధానంని.. వాస్తవాలు చెప్పాలని న్యాయస్థానం పేర్కొంది. హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణపద్దుల కింద కేటాయించిన నిధులు అప్పులు కాదని గ్రాంట్ అని తెలివిగా చెబుతున్నారన్న హైకోర్టు.. ఇప్పటివరకు ఏ బడ్జెట్లో అలా చూడలేదని తెలిపింది. ఆర్టీసీ ఎండీ చెబుతున్న లెక్కలు వేరుగా ఉన్నాయని.. వాటిని మేం పరిగణలోకి తీసుకోవాలా అని ప్రశ్నించింది. అయితే దీనికి సమాధానమిచ్చిన రామకృష్ణారావు.. 2014 జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 2019 వరకు ఉన్న మొత్తం లెక్కలను తాజా నివేదికలో పొందుపరిచినట్టు వివరణ ఇచ్చారు. కాగ్ నివేదిక అనుగుణంగా తయారు చేసిన పూర్తి వివరాలతో హైకోర్టుకు అందజేసినట్టు తెలిపారు. సునీల్ శర్మపై హైకోర్టు ఆగ్రహం.. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ ఎండీ నివేదిక మంత్రులని తప్పుదోవ పట్టించేలా ఉందని అభిప్రాయపడింది. మంత్రిమండలికి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని.. సీఎంని సైతం తప్పుడు లెక్కలతో స్టేట్మెంట్ ఇప్పించారని మండిపడింది. మంత్రిని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్టు ఆర్టీసీ ఎండీ నివేదికలో స్వయంగా అంగీకరించడం ఆశ్చర్యంగా ఉందని అభిప్రాయపడింది. మీ బాస్‌ను తప్పుదోవ పట్టించిన మీరు.. మాకు నిజాలు చెబుతారని ఎలా నమ్మాలి అని ప్రశ్నించింది. -
‘హైదరాబాద్‌లో ఉండడానికి కారణమిదే’
సాక్షి, హైదరాబాద్: ‘ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ 401తో తీవ్ర ప్రమాదకరంగా ఉంది. హైదరాబాద్‌లో సూచీ 39తో మంచి నాణ్యతను కలిగి ఉంది. ఢిల్లీతో పోల్చితే హైదరాబాద్‌లో ఉండడానికే నేను ఇష్టపడడానికి మరో కారణమిదే’ అని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ‘అయితే, కేంద్రం నుంచి వచ్చిన డిప్యుటేషన్ ఆఫర్‌ను మీరు తిరస్కరించినట్లు నేను భావించవచ్చా?’అని రీట్వీట్ చేస్తూ ఆదివారం సరదాగా వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీ నుంచి మరో గంటలో నేను ఇంటికి (హైదరాబాద్) వచ్చేందుకు విమానం ఎక్కబోతున్నాను. తిరిగి వచ్చాక నా ఆనందానికి ఇదే కారణం (ఢిల్లీలోని కాలుష్యం) కాబోతోంది’అని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బ్రిటిష్ రాయబారి ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా మరో రీట్వీట్ చేశారు. కాలుష్యం విషయాన్ని పక్కనబెడితే రోడ్ల విషయంలో హైదరాబాద్ అధ్వానంగా తయారైందని, ఢిల్లీ స్థాయిలో నగరంలోని రోడ్లను అభివృద్ధిపరచాలని పలువురు నెటిజన్లు రాష్ట్ర అధికారులకు సూచించారు. Yet another reason why I love being in #Hyderabad vis-a-vis #Delhi (Am being mean 😷) pic.twitter.com/lCwdR4kL01 — Arvind Kumar (@arvindkumar_ias) November 1, 2019 -
తెలంగాణ ఐఏఎస్‌లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
-
తెలంగాణ ఐఏఎస్‌లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో హైకోర్టు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ గురించి వివరణ ఇచ్చే క్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేందర్ కుమార్ జోషి సహా మున్సిపల్ శాఖ కార్యదర్శి గురువారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో వారి వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివారణ చర్యలు తీసుకుంటున్నట్లయితే జనవరిలో 85గా ఉన్న డెంగీ కేసులు.. అక్టోబర్ నాటికి 3,800కి ఎలా పెరిగాయని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మూసీ నదిని ఆనుకుని ఉన్న హైకోర్టులోనే దోమలున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దోమల నివారణకై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇందులో భాగంగా దోమల నివారణకు 1000 మిషన్లు కొనుగోలు చేయాలని.. వీటికోసం ప్రభుత్వం వెంటనే నిధులను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై ప్రతి గురువారం కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించాలని తెలిపింది. ఒకవేళ డెంగీ వ్యాధి నివారణలో ప్రభుత్వం గనుక విఫలమైతే.. డెంగీ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. మూసీ నదిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సీఎస్, అధికారులకు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ మొదటి వారానికి వాయిదా వేసినట్లు పేర్కొంది. మీరు ఈ దేశ పౌరులు కాదా? డెంగీపై వివరణ ఇస్తున్న సందర్భంగా తెలంగాణ ఐఏఎస్‌లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఐఏఎస్‌లను చేస్తే.. మీరు సామాన్య ప్రజలకు ఏం సేవ చేస్తున్నారని మండిపడింది. ఈ సందర్భంగా తెలంగాణ ఐఏఎస్‌లు ఈ దేశ పౌరులు కాదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే ఐఏఎస్‌లపై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పౌరులు ఎవరైనా మరణిస్తే అందుకు వారే బాధ్యత వహించాలని పేర్కొంది. అలా మరణించిన కుటుంబానికి ఐఏఎస్‌లు తమ సొంత అకౌంట్ నుంచి రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సీఎస్ జోషి , ఐఏఎస్‌లు అరవింద్ కుమార్, లోకేష్ కుమార్ , శాంత కుమారి, యోగితా రాణా సైలెంట్‌గా ఉండిపోయినట్లు సమాచారం. చదవండి: డెంగీకి బలవుతున్నా పట్టించుకోరా? -
నిర్ణీత సమయంలోగా విభజన పూర్తి
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజ నకు సంబంధించిన పలు అంశాలపై దాదాపు ఏడాది తరువాత కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి. పోలీసు అధికారుల ప్రమోషన్లు, షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి దీనికి హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా చర్చలకు నేతృత్వం వహించారు. పెండింగ్‌లో ఉన్న పోలీసు అధికారుల సీనియార్టీ అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఎస్సైలు, ఇన్స్పెక్టర్ల ప్రమోషన్లు జోన్ల ప్రకారం చేపడతారని, డీఎస్పీ స్థాయికి వెళ్తేనే కామన్ ప్రమోషన్ల కిందకు వస్తుందని, ఫ్రీజోన్‌లో ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని, కేటాయింపుల ప్రకారం ప్రమోషన్లు ఇస్తామ న్న తెలంగాణ ప్రభుత్వ వాదనను కేంద్ర హోం శాఖ అంగీకరించలేదు. ఫ్రీజోన్ అనేది కొత్తగా వచ్చింది కాదని హోంశాఖ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీనియార్టీని నిర్ధారించాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనతో హోంశాఖ ఏకీభవించింది. ఆ మేరకు సీనియార్టీ నిర్ధారించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జాబితాపై ఏపీ స్పందన కోరిన కేంద్రం 9వ షెడ్యూల్లోని ఆస్తుల విభజనపై కూడా సమా వేశంలో చర్చ జరిగింది. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల విభజన జరగాలని ఏపీ మొదటి నుంచి పట్టుబడుతోంది. ఈ విషయంలో ఇద్దరు సీఎస్ల వాదనలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి విన్నారు. ఇదే సమయంలో 68 సంస్థలకు సంబంధించి విభ జనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక జాబితాను సమర్పించింది. ఈ జాబితాపై ఆంధ్రప్రదేశ్ స్పందన తెలియచేయాలని హోంశాఖ కార్యదర్శి కోరారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి కావాలి.. సింగరేణి కాలరీస్‌కి సంబంధించి విభజన చట్టంలోనే లోపాలున్నాయని ఏపీ ప్రభుత్వం హోంశాఖ దృష్టికి తెచ్చింది. షెడ్యూల్ 9 ప్రకారం సింగరేణి సంస్థను విభజించాలని, ఆస్తుల నిష్పత్తి ప్రాతిపదికన తెలంగాణకు బదలాయించాలని ఉందని తెలిపింది. చట్టప్రకారం ఏం చేయాలో పరిశీలించి తగిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. షెడ్యూల్ 9, 10కి సంబంధించి ఆస్తుల విభజన నిర్ణీత వ్యవధిలోగా జరగాలని హోంశాఖ అధికారులు ఇరు రాష్ట్రాలకు స్పష్టం చేశారు. బకాయిల చెల్లింపుపై సుముఖం తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రం ఆవిర్భవించిన ఏడాది తర్వాత పౌర సరఫరాల శాఖను ఏర్పాటు చేసుకుంది. ఈ కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే గ్యారెంటీలు, అప్పులు చెల్లించింది. ఈ నేపథ్యంలో దీని విలువ ఎంతో నిర్ధారించి ఆమేరకు ఏపీకి ఇవ్వాలని హోం శాఖ సూచించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇది రూ.1,700 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ బకాయిల విషయం లో కూడా భేదాభిప్రాయాలు లేవని ఇరు రాష్ట్రాలు హోంశాఖకు స్పష్టం చేశాయి. రూ.కోట్లలో ఉన్న బకాయిలు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. 10వ షెడ్యూల్‌కు సంబంధించి శిక్షణ సంస్థల విభజన విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కేంద్ర హోం శాఖ వివరణ ఉందని ఏపీ ప్రభుత్వం నివేదించింది. దీనిపై న్యాయ సలహా తీసుకుని మళ్లీ అభిప్రాయం తెలియజేస్తామంది. -
యాంత్రీకరణలో...వాహ్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం వ్యవసాయ యాంత్రీకరణలో దూసుకుపోతోంది.ఒకవైపు సాగు నీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. వ్యవసాయ యంత్రాలు, పంట కోత యంత్రాలు, నిర్మాణ పరికరాల్లో వృద్ధి ఎంతో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్కే జోషి ఆదివారం ట్వీట్ చేశారు. ఆ ప్రకారం రాష్ట్రంలో ట్రాక్టర్లు, పంట కోత యంత్రాలు, ట్రాలీలు, నిర్మాణరంగంలో ఉపయోగించే వివిధ రకాల వాహన పరికరాలన్నీ కలిపి 1.22 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్లు మొత్తం 2.87 లక్షలున్నాయని, అందులో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు అదనంగా 1.36 లక్షల ట్రాక్టర్లు ఇచ్చారు. అంటే 90.39% ట్రాక్టర్లు తెలంగాణ వచ్చాకే ఇచ్చినట్లు అర్థం అవుతోంది. ఇక పంట కోత యంత్రాలు మొత్తం రాష్ట్రంలో 26,856 ఉంటే, అందులో తెలంగాణ వచ్చాకే 12,736 ఇచ్చారు. అంటే 92.48% కొత్త రాష్ట్రంలోనే ఇచ్చారని స్పష్టమవుతోంది. మొత్తంగా వ్యవసాయ యంత్రాలు, ట్రాలీలు, నిర్మాణరంగంలో ఉపయోగించే వాహన పరికరాల వృద్ది తెలంగాణ వచ్చాక 71.4%ఉండటం విశేషం. -
‘కేసీఆర్, కేటీఆర్ అసమర్థులని ఆ ర్యాంకులే చెప్తున్నాయి’
సాక్షి, న్యూఢిల్లీ : కేసీఆర్, కేటీఆర్ అసమర్థులని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర పాలనలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. వివిధ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇచ్చిన ర్యాంకులే దీనికి నిదర్శనమన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘20 శాఖల పనితీరుని సమీక్షించిన తెలంగాణ సీఎస్ సాగునీటి శాఖకు 8వ ర్యాంక్, విద్యుత్ శాఖకు 11వ ర్యాంక్, ఐటీ శాఖకు 18వ ర్యాంక్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ శాఖల పనితీరు ఎంత దారుణంగా ఉందో ఈ ర్యాంకులే చెప్తున్నాయి. మొదటి మూడు ర్యాంకుల్లో కేసీఆర్, కేటీఆర్‌కు సంబంధించిన శాఖలు లేవు. విద్యుత్ శాఖ రూ.34 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. సాగునీటి రంగం అభివృద్ధిలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. కేటీఆర్ ఇన్నాళ్లు అవార్డులు, రివార్డులు కొనుక్కొని పబ్బం గడుపుతున్నారు. ఆ శాఖలో జరిగిన అవినీతి బయటపడుతుందనే విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నియమించడం లేదు. గతంలో ఆర్ధిక శాఖ మంత్రిగా ఈటల నామమాత్రంగానే ఉన్నారు. అన్నీ కేసీఆరే చూసుకున్నారు. వేలకోట్ల రూపాయలు అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజల మీద భారం వేస్తున్నారు. కోటి ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పి కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు. ఇప్పటివరకు కాళేశ్వరం పూర్తి కాలేదు. శాఖల నిర్వహణలో విఫలం చెందిన కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’అన్నారు. -
శిశు సంక్షేమం టాప్..
సాక్షి, హైదరాబాద్: ప్రోగ్రెస్ రిపోర్టు స్కూల్ విద్యార్థులకే కాదు ప్రభుత్వ శాఖలకూ వచ్చేశాయ్. హాజరుశాతం, మార్కుల ఆధారంగా బడిపిల్లలకు ఖరారు చేసే ర్యాంకులను శాఖలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిభ, పనితీరు, వార్షిక నివేదికల మదింపు ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. 2018–19లో కనబరిచిన ప్రగతి.. 2019–20 ఆర్థిక సంవత్సరం కార్యాచరణ ప్రణాళికను పరిగణనలోకి తీసుకోవడంతో మహిళా, శిశుసంక్షేమ శాఖకు తొలి ర్యాంకును లభించింది. ఇక పనితీరులో బీసీ సంక్షేమ శాఖ వెనుకబడింది. కార్మికశాఖ రెండోస్థానంలో నిలవగా.. మూడో ర్యాంకును వ్యవసాయ, సహకార శాఖ కైవసం చేసుకుంది. నాణ్యతాప్రమాణాలు, పౌరసేవలు, శాఖల పనితీరును పరిగణనలోకి తీసుకున్న సర్కారు.. ఆయా శాఖలు అందజేసిన నివేదికలను సమీక్షించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖ, గృహ నిర్మాణం, రెవెన్యూ, వాణిజ్య, ఎక్సైజ్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు సారథ్యం వహించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ర్యాంకుల వడపోత ప్రక్రియ జరిగింది. సగటున 2 నుంచి 4 శాఖల పనితీరును మదింపు చేసిన ఈ అధికారులు.. మార్కులను ఖరారు చేశారు. సచివాలయంలోని 34 విభాగాలకుగానూ 20 శాఖలు వార్షిక నివేదికలు సమర్పించగా.. ఇందులో మహిళా, శిశుసంక్షేమం (9.84 మార్కులు), కార్మిక, ఉపాధి (9.42), వ్యవసాయ, సహకార (8.44), వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం (8.12), పశుసంవర్థకశాఖ (8.10)లు టాప్–5లో నిలిచినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రకటించారు. కాగా, బీసీ సంక్షేమశాఖ అట్టడుగున నిలవగా.. జీఏడీ విభాగానికి 19వ ర్యాంకు రావడం గమనార్హం. -
తాత్కాలిక సచివాలయానికి సీఎస్
సాక్షి, హైదరాబాద్: సచివాలయం తరలింపు నేపథ్యంలో బీఆర్ కేఆర్ భవన్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి మంగళవారం విధులకు హాజరయ్యారు. ఆయనతో పాటు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా తదితరులు తమకు కేటాయించిన చాంబర్ నుంచి విధులు నిర్వర్తించారు. తాత్కాలిక సచివాలయం ఏర్పాటు పనులతో పాటు తన చాంబర్లో కొనసాగుతున్న పనులను సీఎస్ పరిశీలించారు. పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు సాగేలా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. కాగా, మంగళవారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచి విధులు నిర్వర్తించాలనే సీఎం ఆదేశాల నేపథ్యంలో.. పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఫైళ్లకు సంబంధించిన మూటలతో బీఆర్కేఆర్ భవన్‌కు తరలిరావడం కనిపించింది. జపాన్ బృందంతో జయేశ్ భేటీ తాత్కాలిక సచివాలయంలో ఏర్పాటైన తన కార్యాలయాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ప్రారంభించారు. తన చాంబర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం.. జపాన్‌కు చెందిన డెన్షో కంపెనీ ప్రతినిధులతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జపాన్‌లోని ఒసాకా కేంద్రంగా పనిచేస్తున్న డెన్షోకు షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌లోనూ అనుబంధ కంపెనీలు ఉన్నాయి. బేరింగ్ ఉత్పత్తులను వివిధ దేశాలకు సరఫరా చేసే డెన్షో ప్రతినిధులతో పెట్టుబడులకు సంబంధించిన చర్చలు జరగలేదని, సాధారణ భేటీ మాత్రమేనని జయేశ్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
పవర్ పక్కా లోకల్
సాక్షి, హైదరాబాద్ : కొత్త పంచాయతీరాజ్ చట్టం వెలుగులో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు ఇప్పటి మాదిరిగా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవని, అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలవడానికి ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఇస్తామని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి గ్రీన్ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ‘‘గ్రామాలు బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. పట్టుబట్టి పనిచేస్తే గ్రామాల్లో తప్పక మార్పు వస్తుందనే నమ్మకం నాకుంది. పల్లెల రూపురేఖలు మార్చడం కోసం ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యతలు స్పష్టంగా నిర్వచించాం. ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయాలని నిర్ణయించింది. సహాయ మంత్రి హోదాగల జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉండటం సమంజసం కాదు. ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీపీలు, జెడ్పీటీసీలదీ ఇదే కథ. భవిష్యత్తులో ఇలా జరగడానికి వీల్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు పాలనలో పూర్తిగా భాగస్వాములు కావాలి. విద్య, వైద్యం, పచ్చదనం, పారిశుద్ధ్యం.. ఇలా ఏ విషయంలో ఎవరి పాత్ర ఎంత అనేది నిర్ధారిస్తాం. గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? మండల పరిషత్‌లు ఏం చేయాలి? జిల్లా పరిషత్‌లు ఏం చేయాలి? అనే విషయాలపై పూర్తి స్పష్టత ఇస్తాం. త్వరలోనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా వస్తాయి. దానికి సమానంగా రాష్ట్ర వాటా కేటాయిస్తాం. ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేస్తాం. విధులను స్పష్టంగా పేర్కొన్న తర్వాత, నిధులు విడుదల చేశాకే గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తాం’’అని సీఎం కేసీఆర్ చెప్పారు. విస్తృత చర్చలు, అధ్యయనం తర్వాత తుది రూపం.. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఏ విధులు నిర్వర్తించాలి? ఏయే అంశాల్లో వారి బాధ్యతలు ఎంతవరకుంటాయి? ఎలాంటి అధికారాలుంటాయి? తదితర విషయాలపై సమగ్ర చర్చ, పూర్తి స్థాయి అధ్యయనం జరపాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ విభాగంలో పని చేసిన అనుభవంగల నాయకులు, అధికారులు, నిపుణులతో విస్తృతంగా చర్చించి ముసాయిదా రూపొందించాలని సూచించారు. ముసా యిదాపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తామని, తర్వాత మంత్రివర్గ ఆమోదం అనంతరం అసెంబ్లీలోనూ విస్తృతంగా చర్చిస్తామని వెల్లడించారు. ఆయా సందర్భాల్లో వచ్చిన సూచనలు, సలహాలను కూడా పరిగణనలోకి తీసు కొని ప్రభుత్వం విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తై మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాక గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. ఖాళీలన్నీ భర్తీ చేయాలి... పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సీఈవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈవోపీఆర్డీ పోస్టులను ఇకపై మండల పంచాయతీ అధికారులుగా పరిగణిస్తామని చెప్పారు. గ్రామ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డిప్యూటీ సీఈవోలు, డీపీఓలు, సీఈవోలు.. ఇలా అన్ని విభాగాల్లో అవసరమైన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు నేరుగా నియామకాలు జరపాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపురెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, గట్టు రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తై మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాక గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. -
పాలమూరు ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించేదిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు పరిధిలో ఉన్న ప్రధాన అడ్డంకులను దాటుతూనే, సమృద్ధిగా నిధులను అందుబాటులో ఉంచేలా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) నుంచి రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్ పనుల పూర్తికి వీలుగా ఈ రుణాలు తీసుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి పాలమూరు–రంగారెడ్డి పనులను రూ.32,500 కోట్లతో చేపట్టగా ఇందులో ఇప్పటివరకు 20 శాతం పనులే పూర్తయ్యాయి. నిధుల కొరత కారణంగా ఏడాదిగా ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఇది వరదజలాలపై ఆధారపడిన ప్రాజెక్టు కావడంతో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలకు బ్యాంకులు నేరుగా రుణాలిచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్ పనులకు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకోవాలని సర్కారు గతంలో నిర్ణయించింది. ఈ పనులకు రూ.17 వేల కోట్లు అవసరం ఉండగా రూ.10 వేల కోట్లు రుణాలిచ్చేందుకు పీఎఫ్సీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం రుణం తీసుకునేలా ఉత్తర్వులు వెలువడగా, త్వరలోనే దీనికి సంబంధించి పీఎఫ్‌సీతో ఒప్పందాలు జరగనున్నాయి. రూ.41,500 కోట్లకు కాళేశ్వరం రుణాలు! దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ) ప్రాజెక్టుల కోసం ‘తెలంగాణ రాష్ట్ర వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్(టీఎస్‌డబ్ల్యూఐసీ)’పేరుతో ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్ ద్వారా రూ.2,638 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ కార్పొరేషన్‌కు ఆంధ్రాబ్యాంకు కన్సార్షియం రూ.17 వేల కోట్ల మేర రుణం ఇచ్చింది. వీటిల్లో ఎక్కువగా సీతారామ, దేవాదుల పనులకే నిధులు వెచ్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ– 12 పనుల పూర్తికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) నుంచి రూ.1,500 కోట్లు రుణం తీసుకునేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే ఇప్పటివరకు వివిధ రుణ సంస్థల నుంచి రూ.40 వేల కోట్లకుపైగా సేకరించగా, అందులోంచే ప్రాజెక్టు నిర్మాణపనులకు రూ.32 వేలకోట్లను ఖర్చు చేశారు. ప్రస్తుత కాళేశ్వరం రుణాలు రూ.41,500 కోట్లకు చేరనున్నాయి. -
60 రోజుల ప్రణాళికతో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా త్వరలోనే అన్ని గ్రామ పంచాయతీల్లో ‘60 రోజుల కార్యాచరణ ప్రణాళిక’అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పల్లెల సమగ్రాభివృద్ధితోపాటు పూర్తిస్థాయిలో పచ్చదనం, పరిశుభ్రతను సాధించేందుకు వివిధ అంశాలపై స్పష్టతనిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రామాల అభివృద్ధికి తోడ్పడేందుకు వీలుగా నూతన పంచాయతీరాజ్ చట్టంలో నిర్దేశించిన వివిధ విషయాలపై మరింత స్పష్టతనిస్తూ మార్గదర్శకాలు జారీచేశారు. 60రోజుల కార్యాచరణ అమలులో భాగంగా పవర్ వీక్, హరితహారం నిర్వహించాలని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత ఏర్పడే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం అమలుచేస్తున్న ఈ కార్యాచరణలో అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. గ్రామ వికాసం, పూర్తిస్థాయిలో అభ్యున్నతి కోసం ప్రభుత్వం సమగ్రవిధానం తీసుకువస్తోందని ఆయన తెలిపారు. 60 రోజుల గ్రామ వికాసంలో పంచాయతీరాజ్ శాఖది చాలా క్రియాశీలకమైన పాత్రన్న ముఖ్యమంత్రి ఈ శాఖను సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్టు స్పష్టంచేశారు. దీని కార్యాచరణ ప్రణాళికను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎప్పటి నుంచి దీన్ని అమలు చేయాలన్న దానిపై రెండు మూడ్రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 60రోజుల తర్వాత ముఖ్య అధికారుల నేతృత్వంలోని 100 ఫ్లయింగ్ స్క్వాడ్లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ఆకస్మిక తనిఖీలు చేపడతాయన్నారు. ఏ గ్రామంలో అయితే 60రోజుల కార్యాచరణలో నిర్దేశించిన పనులు చేపట్టలేదో అక్కడ సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. పీఆర్, పరిషత్ పోస్టులు భర్తీ పంచాయతీరాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల్లోని పోస్టులను భర్తీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. గ్రామాభివృద్ధిలో పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఏమేమి పనులు చేయాలో స్పష్టంగా నిర్వచించుకుని ఎవరి విధులు వారే నిర్వహించాలన్నారు. శనివారం ప్రగతిభవన్‌లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీపీవోలు, ఈవోపీఆర్డీలు, సర్పంచ్ల సంఘం ప్రతినిధులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, పాలమూరు, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల డీపీవోలు, రిటైర్ట్ డీపీవో లింబగిరి స్వామి, ఈవోపీఆర్డీలు సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన యాదవ్, ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు ప్రణీత్ చందర్, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి బాచిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిక్కచ్చిగా వ్యవహరిస్తాం ‘స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా గ్రామాల పరిస్థితి ఇంకా మారలేదు. వివిధ రూపాల్లో వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పడి ఉన్నాయి. ఎవరికి వారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను బాగుచేసుకునే పద్ధతి రావడం లేదు. ఈ పరిస్థితిలో గుణాత్మక మార్పు రావాలి. అందుకోసమే కొత్త పీఆర్ చట్టం తెచ్చాం. అధికారులు, ప్రజా ప్రతినిధులపై కచ్చితమైన బాధ్యతలు పెట్టాం. ఎవరేం పని చేయాలో నిర్దేశించాం. అవసరమైన అధికారాలిచ్చాం. కావాల్సిన నిధులను బడ్జెట్లోనే కేటాయించాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా ఈ చట్టం ప్రభుత్వానికి కల్పించింది. కొత్త చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసే విషయంలో ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. ఎవరినీ ఉపేక్షించదు. గుణాత్మక మార్పుకోసం ఏంచేయాలో అది చేస్తాం’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈవోపీఆర్డీ పేరు ఎంపీవోగా మార్పు ‘అన్ని జిల్లాలకు జిల్లా పంచాయతీ అధికారులను (డీపీవో)లను నియమించాలి. రెవెన్యూ డివిజన్ ఓ డీఎల్పీవోను, మండలానికో ఎంపీవోను నియమించాలి. ఖాళీగా ఉన్న ఎంపీడీవో, సీఈవో పోస్టులను భర్తీ చేయాలి. వీటిని భర్తీ చేయడానికి వీలుగా పంచాయతీ అధికారులకు పదోన్నతులివ్వాలి. శాఖాపరంగానే కొత్త నియామకాలు చేపట్టాలి. ప్రక్రియ అంతా చాలా వేగంగా జరగాలి’అని సీఎం ఆదేశించారు. ఈ కార్యాచరణలో చేపట్టాల్సిన పనులు.. గ్రామంలో పారిశుధ్య పనులను పక్కాగా నిర్వహించాలి. మురికి కాల్వలన్నీ శుభ్రం చేయాలి. గ్రామ పరిధిలోని పాఠశాల, పీహెచ్సీ, అంగన్వాడీ కేంద్రంతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థల్లో పారిశుధ్యం గ్రామ పంచాయతీల బాధ్యత. కూలిపోయిన ఇండ్లు, పాడైపోయిన పశువుల కొట్టాల శిథిలాలను పూర్తిగా తొలగించాలి. ఉపయోగించని, పాడుపడిన బావులను, నీటి బొందలను పూర్తిగా పూడ్చేయాలి. ఇందుకోసం ఉపాధిహామీ నిధులతో మొరం నింపాలి. గ్రామంలో ఎప్పటికప్పుడు దోమల మందు పిచికారి చేయాలి. వైకుంఠధామం (శ్మశాన వాటిక) నిర్మాణం కోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. గ్రామ డంపింగ్ యార్డు కోసం స్థలం సేకరించాలి. విలేజ్ కమ్యూనిటీ హాల్, గోదాము నిర్మాణానికి స్థలాలు సేకరించాలి. గ్రామానికి కావాల్సిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలి. పంచాయతీలు నిర్వహించాల్సిన బాధ్యతలు గ్రామంలో 100% పన్నులు వసూలు చేయాలి. వారపు సంత (అంగడి)లో సౌకర్యాలు కల్పిం చాలి. వివాహ రిజిస్ట్రేషన్ నిర్వహించాలి. ఎవరు పెళ్లి చేసుకున్నా వెంటనే రికార్డు చేయాలి. జనన, మరణ రికార్డులు రాయాలి. పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు, కులం వివరాలతో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి. విద్యుత్ సంస్థలకు తప్పకుండా బిల్లులు చెల్లించాలి. పంచాయతీ నిధు లతో ఉపాధి హామీ నిధులు అనుసంధానం అయ్యే విధానం రూపొందించాలి. ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలతో సంప్రదించి, సీఎస్ఆర్ నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగించే విధానం అవలంబించాలి. గ్రామస్తులను శ్రమదానానికి ప్రోత్సహించి, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలి. ‘పవర్’వీక్ లో చేయాల్సిన పనులు 60 రోజుల కార్యాచరణలో భాగంగా 7రోజుల పాటు పూర్తిగా విద్యుత్ సంబంధమైన సమస్యలను పరిష్కరించాలి. ఆ గ్రామంలో వీధిలైట్ల కోసం ఎంత కరెంటు వాడుతున్నారో కచ్చితమైన నిర్ధారణకు రావాలి. మీటర్లు పెట్టాలి. వీధిలైట్ల కోసం థర్డ్ లైను వేయాలి. విధిగా ఎల్ఈడీ బల్బులు అమర్చాలి. గ్రామంలో వంగిపోయిన స్తంభాలు, వేలాడే వైర్లు సరిచేయాలి. హరితహారంలో చేయాల్సిన పనులు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే విలేజ్ నర్సరీ ఏర్పాటు చేయాలి. మండల అటవీశాఖాధికారి సాంకేతిక సహకారం తీసుకోవాలి. ఉపాధిహామీ నిధులు వినియోగించాలి. గ్రామంలో విరివిగా మొక్కలు నాటాలి. వాటికి నీళ్లు పోసి, రక్షించాలి. పెట్టిన మొక్కలన్నీ చెట్లుగా ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలి. గ్రామస్తులకు కావాల్సిన రకం మొక్కలను సరఫరా చేయాలి. చింతచెట్లను పెద్ద సంఖ్యలో పెంచాలి. -
మొక్కల్ని బతికించండి
సాక్షి,హైదరాబాద్: హరితహారంలో భాగంగా తెలంగాణలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కల్ని నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి సూచించారు. నగరానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీశాఖ అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తోందన్నారు. నగరంలోని గుర్రంగూడ వద్ద ఆరోగ్య సంజీవని వనం పేరిట ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును అటవీ శాఖ, రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో కలసి సీఎస్ ఎస్కే జోషి దంపతులు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్బన్ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈ పార్కులో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను కూడా ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఐదో విడత హరితహారంపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ అభివృద్ధి్ద కార్పొరేషన్ ఎం.డి. రఘువీర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. హరీశ్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చేసేందుకు పనేం లేదని...
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ ఆకునూరి మురళి స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసి శనివారం ఆయన వీఆర్ఎస్ దరఖాస్తును అందజేశారు. చేసేందుకు పని లేదనే కారణంతోనే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నానని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రాజ్యాభిలేఖన, పరిశోధన సంస్థ (స్టేట్ ఆర్కివ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) డైరెక్టర్‌గా ఏడాదిన్నరగా కొనసాగుతు న్నారు. ప్రాధాన్యతలేని పోస్టు కేటాయించారని గత కొంతకాలంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. పదవీ విరమణకు 10 నెలల ముందే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవడం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2006 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో సెర్ప్ సీఈఓగా, భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా చేసిన సమయంలో స్థానిక అటవీ ప్రాంతంలోని గిరిజనుల్లో క్షయ వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అడవి పంది, గొడ్డు మాంసం తినాలని ప్రోత్సహించే క్రమంలో ఆయన బ్రాహ్మణ సామాజికవర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత కొంత కాలానికి ప్రభుత్వం ఆయనను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ పదవి నుంచి స్టేట్ ఆర్కివ్స్కు బదిలీ చేసింది. పోస్టింగ్‌ల కేటాయింపుల్లో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల అధికారులకు అన్యాయం జరుగుతోందని, అధిక శాతం అధికారులు ప్రాధాన్యతలేని పోస్టుల్లో మగ్గిపోవాల్సి వస్తోందని కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దళితవర్గానికి చెందిన ఆయన కొంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఐఏఎస్‌లతో కలిసి శాసనసభ ఎన్నికలకు ముందు సీఎస్ ఎస్కే జోషిని కలిసి పోస్టింగ్‌ల విషయంలో తమ అసంతృప్తిని తెలియజేశారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం తనకు కారును సైతం కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేసేవారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డిజైనింగ్‌లో తీవ్ర లోపాలున్నాయని పేర్కొంటూ ఇటీవల∙ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశమయ్యాయి. -
40% ఉంటే కొలువులు
సాక్షి, హైదరాబాద్: వికలాంగుల కోటా ఉద్యోగాల నియామక నిబంధనలను ప్రభుత్వం సవరించింది. వికలాంగ కోటాకు అర్హత కోసం కనీసం 40 శాతం వైకల్యాన్ని ప్రామాణికం (బెంచ్‌మార్క్ డిసెబిలిటీ)గా నిర్దేశించింది. వికలాంగ కోటాకు అర్హుల జాబితాలో కొత్తగా తక్కువ దృష్టి (లో విజన్), వినికిడి కష్టం (హార్డ్ హియరింగ్), కండరల వ్యాధి (మస్క్యులర్ డిస్ట్రొఫి), నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటీ, మానసిక రోగాలతో బాధపడే వ్యక్తులను చేర్చింది. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లను వర్తింపజేసేందుకు అమలు చేసే రోస్టర్ పాయింట్ల పట్టికలో ఇప్పటికే వికలాంగుల కోసం 6వ, 31వ, 56వ పాయింట్లు కేటాయించగా తాజాగా 82వ పాయింట్‌ను ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటీ, మానసిక రోగం, చెవిటి–అంధత్వంతో బాధపడే వారి కోసం కేటాయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996కు కీలక సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైకల్యం ఉన్నా అర్హులే... కొత్త నిబంధనల ప్రకారం 40 శాతానికి తగ్గకుండా నిర్దేశిత వైకల్యం కలిగి ఉంటే వికలాంగ కోటాలో ఉద్యోగార్హతకు ప్రామాణిక వైకల్యం (బెంచ్‌మార్క్ డిజేబిలిటీ)గా పరిగణిస్తారు. వైకల్యం లెక్కింపునకు నిబంధనలు ఉన్నా, లేకపోయినా అర్హులే కానున్నారు. అంటే లెక్కించదిగిన వైకల్యం గలవారితోపాటు లెక్కించలేని వైకల్యంగల వారూ అర్హులు కానున్నారు. ఓపెన్ కాంపిటీషన్ పద్ధతిలో భర్తీ చేసే ప్రతి 50 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలను వికలాంగుల కోసం రిజర్వు చేయాలన్న పాత నిబందనను ప్రభుత్వం తొలగించింది. ఓపెన్ కాంపిటీషన్ పద్ధతిలో భర్తీ చేసే ప్రతి 50 ఉద్యోగాల్లో 4 ఉద్యోగాలను ప్రామాణిక వైకల్యంగల వారికి రిజర్వు చేయాలనే కొత్త నిబంధనను దాని స్థానంలో పొందుపరిచింది. కేటగిరీల మార్పిడి ఇలా.. ఏదైనా నిర్దేశిత కేటగిరీ వికలాంగులకు రిజర్వ్ అయిన పోస్టుల భర్తీకి సంబంధిత కేటగిరీలో అర్హులైన వికలాంగులు లేకపోతే అనుసరించా ల్సిన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. - ఒక నియామక సంవత్సరంలో ప్రామాణిక వైకల్యంగల అర్హుడైన వ్యక్తి అందుబాటులో లేకపోవడం/ఇతర కారణాలతో ఏదైనా పోస్టు భర్తీకానప్పుడు, ఆ పోస్టును తదుపరి నియామక సంవత్సరంలో భర్తీ చేసేందుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. తదుపరి నియామక సంవత్సరంలోనూ ప్రామాణిక వైకల్యంగల అర్హుడు లభించనిపక్షంలో, ఐదు వికలాంగ కేటగిరీల్లో అంతర్గత మార్పులు జరపడం ద్వారా ఆ పోస్టును భర్తీ చేయాలి. మూడో నియామక సంవత్సరం లో ఏ కేటగిరీ వికలాంగుడూ అందుబాటులో లేనిపక్షంలో ఆ ఏడాది సకలాంగుడితో పోస్టును భర్తీ చేయవచ్చు. - ఏదైనా శాఖలో పోస్టుల స్వభావ రీత్యా ఏదైనా కేటగిరీ వికలాంగుడికి ఉద్యోగం కల్పించే అవకాశం లేకపోతే స్త్రీ, శిశు సంక్షేమశాఖ జీవో నం.10 ప్రకారం ఐదు వికలాంగ కేటగిరీల్లో అంతర్గత మార్పులు జరపడం ద్వారా ఆ పోస్టును భర్తీ చేయాలి. - రోస్టర్ పాయింట్ ప్రకారం మహిళా వికలాంగులకు కేటాయించిన పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థులు అందుబాటులో లేకపోతే మరో నియామక సంవత్సరం వరకు వేచి చూడకుండా ఆ పోస్టును అదే వికలాంగ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులతో భర్తీ చేయాలి. అదే కేటగిరీ పురుష అభ్యర్థులు సైతం అందుబాటులో లేకపోతే ఆ పోస్టును తదుపరి నియామక సంవత్సరంలో భర్తీ చేసేందుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. తదుపరి నియామక సంవత్సరంలో తొలుత సంబంధిత కేటగిరీ మహిళ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈసారి కూడా మహిళా అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో అదే కేటగిరీ పురుష అభ్యర్థులతో భర్తీ చేయాలి. రెండో నియామక సంవత్సరంలోనూ సంబంధిత కేటగిరీ మహిళ, పురుష అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో పోస్టును రోస్టర్ పాయిం ట్లలోని తదుపరి వికలాంగ కేటగిరీ వారితో భర్తీ చేయాలి. అయినా అర్హులైన అభ్యర్థులు లేకుంటే రోస్టర్ పాయింట్‌లోని ఆ తర్వాతి వికలాంగ కేటగిరీ వారికి కేటాయించాలి. - ఏ వైకలాంగ కేటగిరీ అభ్యర్థులు కూడా అందుబాటులో పక్షంలో మాత్రమే సకాలంగులతో పోస్టులు భర్తీ చేసుకోవాలి. - ఏదైనా కేటగిరీ వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని, రిజర్వేషన్ల కోటా తగ్గించాలని, పని స్వభావం రీత్యా వికలాంగ కేటగిరీల్లో అంతర్గత మార్పిళ్లు జరపాల్సి ఉందని ప్రభుత్వశాఖలు భావిస్తే స్త్రీ, శిశు సంక్షేమశాఖ జీవో నం. 10 ప్రకారం వికలాంగ రిజర్వేషన్ల అమలు నుంచి సదరు శాఖకు పాక్షిక లేదా పూర్తిగా మినహాయింపు కల్పించాలని ఇంటర్ డిపార్ట్మెంట్ కమిటీని కోరవచ్చు. కొత్త రోస్టర్ పాయింట్లు ఇలా... - రోస్టర్ పాయింట్ల చక్రంలో 6వ, 31వ, 56వ స్థానాలను వరుసగా అంధత్వం/అథమ దృష్టి సామర్థ్యం (మహిళలు)... చెవిటి/వినికిడి కష్టం (ఓపెన్)... లోకోమోటార్ డిసెబిలిటీ, సెరెబ్రల్ పాల్సీ, నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, జన్యుపరంగా కండరాల బలహీనత (ఓపెన్) గల వ్యక్తులకు కేటాయించాలి. - 100 రోస్టర్ పాయింట్ల తర్వాత రెండో, మూడో, నాలుగో చక్రంలో ఈ కింది పాయింట్లు చేరుతాయి.. - 106, 206, 306 – అంధత్వం, తక్కువ దృష్టి సామర్థ్యం (ఓపెన్) - 131, 231, 331 – చెవిటి, వినికిడి కష్టం (131–విమెన్, 231–ఓపెన్, 331–ఓపెన్) - 156, 256, 356 – లోకోమోటార్ డిసెబిలిటి, సెరెబ్రల్ పాల్సీ, నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, జన్యుపరంగా కండరాల బలహీనత (156–ఓపెన్, 256–విమెన్, 356–ఓపెన్) - 182, 282, 382 – ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటి, మానసిక రోగులు, చెవిటి+అంధతోపాటు అంధులు, తక్కువ దృష్టి సామర్థ్యం, చెవిటి/వినికిడి కష్టం, లోకోమోటార్ డిసెబిలిటి, సెరెబ్రల్ పాల్సీ, నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, జన్యుపరంగా కండరాల బలహీనత, ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటి, మానసిక రోగాల్లో ఒకటికి మించి రోగాలుగల వారు.(182–ఓపెన్, 282–ఓపెన్, 382–విమెన్)