
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో రైతుబంధు పథకం అమలవుతోంది. ఇప్పటికే ఖరీఫ్, రబీలకు రెండు విడతలుగా సొమ్ము విడుదల చేశాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని (పీఎంకేఎస్‌ఎన్‌వై–పీఎం కిసాన్) ప్రవేశపెట్టింది. దాని ఉద్దేశం కూడా ఇదే. పైగా కేంద్రం కంటే తెలంగాణలోనే అధికంగా పెట్టుబడి సాయం చేస్తున్నాం. కేంద్ర లక్ష్యం ప్రకారం తెలంగాణలో 90% మంది ఐదెకరాలలోపు సన్న, చిన్నకారు రైతులకు రైతుబంధు సొమ్ము అందింది. ఈ నేపథ్యంలో కేం ద్రం తన పథకం కింద తెలంగాణకు రావాల్సిన సొమ్ము వాటాను రైతుబంధులో కలపాలి’అని కోరే ఆలోచన ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
రైతుబంధు పథకం తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనూ అమలవట్లేదు. దీన్ని ఆధారం చేసుకొనే కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తాజా బడ్జెట్‌లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున కేంద్రం మళ్లీ వేరుగా రైతులకు సొమ్ము ఇవ్వడంలో అర్థంలేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అలా చేస్తే ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోం దన్న తప్పుడు సంకేతాలు ఇతర వర్గాల ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని చెబుతున్నాయి. అందువల్ల రాష్ట్రం లో ఐదెకరాలలోపు రైతుల సంఖ్యకు అనుగుణంగా కేంద్రం పెట్టుబడి సొమ్మును తమ ఖాతాలో వేస్తే సం బంధిత రైతులందరికీ రైతుబంధు కింద అందజేస్తామని, ఆ మేరకు యుటిలైజేషన్ సర్టిఫికేట్ (యూసీ) కూడా సమర్పిస్తామని పేర్కొంటున్నాయి.
నేడు హైదరాబాద్‌కుకేంద్ర అధికారి...
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషితో చర్చించేందుకు కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా మంగళవారం హైదరాబాద్ రానున్నారు. సీఎస్‌తో సమావేశానికి వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, ఐటీశాఖలకు చెందిన ఉన్నతాధికారులూ హాజరుకానున్నారు. తెలంగాణలో రైతుబంధు పథకాన్ని ఎలా అమలు చేశారన్న సమాచారంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఎలా అమలు చేయవచ్చన్న అంశంపై ఆమె చర్చించే అవకాశమున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో ఇప్పటికే రైతుబంధును విజయవంతంగా అమలు చేస్తున్నందున ఇక్కడి అనుభవాలను కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు ఆమెకు వివరించే అవకాశముంది. మరోవైపు తెలంగాణలో కేంద్ర పెట్టుబడి పథకాన్ని వేరుగా అమలు చేయడం కాకుండా రైతుబంధులో విలీన అంశాన్ని కూడా రాష్ట్ర అధికారులు చర్చించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం.
కేంద్రం నిధులు ఇస్తున్నందున అవసరమైతే ఈ పథకాన్ని ‘రైతుబంధు– పీఎంకేఎస్‌ఎన్‌వై’గా (పీఎం కిసాన్) మార్చడానికి కూడా అభ్యంతరం లేదన్న ప్రతిపాదనను కూడా ముందుకు తేవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర పథకాన్ని రాష్ట్రంలో ఎలా అమలు చేయాలో నిర్ణయిస్తామని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో గత ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి తెలంగాణ ప్రభుత్వం రైతులకు రూ. 10 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం చేయడం తెలిసిందే. అందులో 90 శాతం సన్నచిన్నకారు రైతులకే అందింది. ఈ నేపథ్యంలో కేంద్రం సాయం చేస్తే రూ. 2,800 కోట్లకుపైగా తెలంగాణ ప్రభుత్వానికి కలిసొచ్చే అవకాశముందని అంటున్నారు. అయితే తెలంగాణ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరిస్తుందా లేదా అన్న అంశంపై వ్యవసాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తే అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా ఇస్తామని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment