
సాక్షి, హైదరాబాద్ : నియంత్రిత సాగు విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రగతి భవన్‌లో వివిధ రకాల పంటల కొనుగోళ్లు సహా ఇతర సాగు అంశాలపై సమీక్ష జరిగిన సీఎం.. పంటల నియంత్రణ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రైతులు ఏ పంట వేయాలో ఇకపై వాళ్లదే నిర్ణయమని పేర్కొన్నారు. పంటల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు ఉండవన్నారు. పంట కొనుగోలు ద్వారా మొత్తం రూ.7,500 కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయం చట్టాకు అనుగుణంగా రైతులు పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా నియంత్రిత సాగు విధానం రాష్ట్రంలో తొలినుంచీ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలతో సహా.. రైతుల సంఘాల నేతలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రేపటి నుంచి రైతుబంధు
అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు నగదు పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రేపటి (సోమవారం) నుంచి నగదు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 61.49 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తించనుంది. ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.7,515 కోట్లు పంట సాయం అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment