రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌లోని ఓ వీధిలో పేరుకుపోయిన చెత్త
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ కార్మికుల సమ్మెతో పల్లెలు దయనీయంగా మారాయి. తాగునీరు సరఫరా, పారిశుధ్య నిర్వహణ లేక గ్రామీణ ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాకాలం కావడంతో మురుగు నీరు, వరద నీరు కలవడంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్విభజన చేసింది. కొత్తగా 4,383 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి. దీంతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సంఖ్య 12,751కు పెరిగింది. పంచాయతీల పరిధి గతం కన్నా తక్కువైంది. ఇలాంటి పరిస్థితుల్లో వసతులు, పారిశుధ్య సేవలు మెరుగుపడాల్సింది పోయి పంచాయతీ కార్మికుల సమ్మెతో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. జూలై 23న పంచాయతీ కార్మికుల సమ్మె మొదలైంది. 29 రోజులుగా సమ్మె జరుగుతోంది. సమ్మె మొదలైనప్పటి నుంచి గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. కొన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారులు చొరవ తీసుకుని పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. ఎక్కువ గ్రామాల్లో మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎక్కువ శాతం గ్రామాల్లో చెత్త పేరుకుపోయి రోడ్ల వెంట నడిచే పరిస్థితి ఉండట్లేదు. డ్రైనేజీల మురుగునీరు రోడ్లపై పొంగిపొర్లుతోంది. మురుగునీరు, చెత్త పేరుకుపోవడం, వర్షాలు కురుస్తుండటంతో దోమల తీవ్రత పెరిగింది. తాగునీటి సరఫరాలో కీలకమైన మోటార్లు కాలిపోవడం, రిపేర్లు వస్తే బాగు చేయించే పరిస్థితి లేకపోవడంతో ఇతర నీటి వనరుల నుంచి ప్రజలు మంచినీరు తెచ్చుకుంటున్నారు. వర్షాకాలంలోనూ మంచినీటి కోసం కష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
పాలన లేక..
గ్రామపంచాయతీల్లోని పాలకవర్గాల పదవీకాలం ఆగస్టు 1తో ముగిసింది. బీసీ గణన వివరాల్లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నెల ముందే ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ సేవల్లో కీలకపాత్ర పోషించే పారిశుధ్య కార్మికులు, పంచాయతీ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్లు, ఎలక్ట్రీషియన్లు, వాటర్‌మెన్, కామాటీలు, ఇతర కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం గత నెల 23 నుంచి సమ్మె చేస్తున్నారు. ఆగస్టు 1 వరకు కార్మికుల సమ్మె ప్రభావం పెద్దగా పడలేదు. ప్రత్యేక అధికారుల పాలన మొదలైన రెండు మూడు రోజుల నుంచే గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. పాలకవర్గాల గడువు ముగియడంతో మండలం పరిధిలోని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. వీరంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి రెగ్యులర్ శాఖ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మిగిలిన సమయాల్లోనే గ్రామపంచాయతీలను పట్టించుకుంటున్నారు. వారి దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించే పనులను పంచాయతీ సిబ్బందికి అప్పగించేవారు. ఇప్పుడు కార్మికులు సమ్మె చేస్తుండటంతో గ్రామాల్లో పరిస్థితులు దారుణంగామారుతున్నాయి.
డిమాండ్లు ఇవే..
- గ్రామపంచాయతీ ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు పెంచాలి.
- కర్ణాటకలో మాదిరిగా వేతన చెల్లింపునకు ప్రభుత్వం గ్రాంటు ఇవ్వాలి.
- 112, 212 ప్రభుత్వ ఉత్తర్వులను సవరించి అర్హులందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి.
- బిల్‌కలెక్టర్లతో పాటు అర్హులైన ఉద్యోగ, కార్మికులందరికీ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోషన్లు కల్పించాలి.
- పీఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్ సౌకర్యాలు వర్తింపజేసి అమలు చేయాలి.
- జనశ్రీబీమా స్థానంలో రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని అమలు చేయాలి.
- కార్మికులు, ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియలకు చెల్లించే మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.20 వేలకు పెంచాలి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు; సీఎస్ ఎస్‌కే జోషి
పంచాయతీ కార్మికుల విధుల గైర్హాజరుపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు విధులకు హాజరుకాని సిబ్బంది స్థానంలో గురువారం నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 33,534 మంది సిబ్బంది ఉన్నారని, వీరిలో 19,852 మంది విధులకు హాజరుకావట్లేదని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment