
మూస పాలనకు మంగళం
ప్రజలకు మేలైన సేవలు అందించడమే లక్ష్యంగా పరిపాలనా విభాగాలు ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
►ఒక్కో జిల్లాకు ఒక్కో పనితీరు.. సరికొత్త పాలనకు సీఎం దిశానిర్దేశం
► అన్నిచోట్లా పాలన ఒకే మాదిరి ఉండాల్సిన అవసరం లేదు
► ప్రభుత్వ శాఖల సరళీకరణ జరగాలి
► అన్ని కార్యాలయాలు.. అన్ని జిల్లాల్లో అక్కర్లేదు..
► అవసరాన్ని బట్టి ఆఫీసులు ఉండాలి
► ప్రతి శాఖలో వెంటనే జిల్లా విభాగాధిపతులను నియమించాలి
► పనిభారం ఎక్కువుండే శాఖల్లో ఉద్యోగులను నియమిస్తాం
► ఇకపై ఎమ్మార్వోను తహసీల్దార్ అని, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను గిర్దావర్ అని అనాలి
► ఎక్కువ జిల్లాలున్న రాష్ట్రాల్లో అధ్యయనానికి వెళ్లాల్సిందిగా సీనియర్ అధికారులకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మేలైన సేవలు అందించడమే లక్ష్యంగా పరిపాలనా విభాగాలు ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతీ జిల్లాలో ఒకే విధమైన పరిపాలనా విభాగం, సమాన సంఖ్యలో ఉద్యోగులు ఉండాలన్న కచ్చితమైన నిబంధన ఏమీ లేదన్నారు. ప్రస్తుతం ఒకే స్వభావమున్న పనులు చేసే అధికారులు వేర్వేరు విభాగాల కింద ఉన్నారని, దీంతో సమన్వయ లోపంతో కార్యక్రమాల అమలుపై ప్రభావం పడుతోందన్నారు. ఈ గందరగోళాన్ని నివారించేందుకు ప్రభుత్వ శాఖల్లో సరళీకరణ జరగాలని సూచించారు.
రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్ శాఖలకు ప్రతీ జిల్లాలో పని ఉంటుందని, కానీ అటవీ శాఖ, మున్సిపల్, మైనారిటీ, ఎస్టీ సంక్షేమం, హార్టికల్చర్, పరిశ్రమల శాఖలకు అన్ని జిల్లాల్లో ఒకే తీరు పనిభారం ఉండదని సీఎం పేర్కొన్నారు. గురువారమిక్కడ హెచ్‌ఆర్‌డీలో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్ష జరిపారు. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వివిధ శాఖల కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. ప్రతీ శాఖలో జిల్లా విభాగాధిపతుల నియామకం వెంటనే చేపట్టాలని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. సీనియారిటీ ప్రాతిపదికన జిల్లా అధికారుల నియామకం జరపాలన్నారు.
ప్రతీ శాఖ డీపీసీ నిర్వహించి పదోన్నతులు ఇవ్వాలని పేర్కొన్నారు. పనిభారం ఎక్కువగా ఉన్న శాఖల్లో అవసరమైన ఉద్యోగులను నియమిస్తామని, అందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. పరిపాలనా విభాగాల విస్తరణ జరుగుతున్నందున ఆయా విభాగాల ఇన్‌చార్జిలకు అధికారాలు, విధుల బదలాయింపు జరగాలని ఆదేశించారు.
అధ్యయనానికి అధికారుల బృందం
ఎక్కువ జిల్లాలున్న రాష్ట్రాల్లో పరిపాలనా విభాగాలపై అధ్యయనం చేసేందుకు వెళ్లాలని సీనియర్ అధికారులకు సీఎం సూచించారు. ఉత్తరప్రదేశ్‌కు ఎస్‌కే జోషీ, మధ్యప్రదేశ్‌కు సోమేశ్‌కుమార్, ఛత్తీస్‌గఢ్‌కు మీనా, హర్యానాకు నవీన్ మిట్టల్, ఒడిశాకు బీపీ ఆచార్య, తమిళనాడుకు అజయ్ మిశ్రా, బిహార్‌కు ఎస్పీ సింగ్ వెళ్లి అధ్యయనం చేయాలని ఆదేశించారు. ‘‘జిల్లాల పునర్వ్యవస్థీకరణను అవకాశంగా తీసుకుని ప్రజ లకు మెరుగైన సేవలందించడానికి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చో అధికారులు సూచనలు చేయాలి’’ అని సీఎం పేర్కొన్నారు.
ఈ ఆఫీసులు అక్కర్లేదు: ‘‘గిరిజనులు లేని జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ అధికారి.. అడవులు లేని చోట అటవీ అధికారి అవసరమా? కాలుష్య నియంత్రణ బోర్డు, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ ఆఫీస్, జీవిత బీమా జిల్లా అధికారి, డీడీ చక్కెర, జైళ్ల శాఖ జిల్లా అధికారి, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, సైనిక్ వెల్ఫేర్ అధికారి తదితర కార్యాలయాలు ప్రతీచోట ఉండాల్సిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి కార్యాలయాలుండాలి’’ అని సీఎం వివరించారు. ‘‘హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమల శాఖకు పని ఎక్కువ ఉంటుంది. గ్రామీణ జిల్లాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు బాగుపడాలి. అడవులు ఎక్కువగా ఉన్న భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల వంటి జిల్లాల్లో ఆ శాఖ కార్యకలాపాలు ఎక్కువ చేయాలి.
ఉద్యానవనాలు ఎక్కువగా ఉండే చోట హార్టికల్చర్ శాఖ మెరుగవ్వాలి. అవసరమైతే ఆయా శాఖల్లో కొత్తగా ఉద్యోగాలు సృష్టించాలి. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రాధాన్యం విస్తరించాలి. మండల స్థాయిలో కూడా ప్రణాళికలు తయారు కావాలి. మిషన్ కాకతీయలో చెరువులు బాగుపడినందున మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయాలి. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో మున్సిపాలిటీల సంఖ్య ఆధారంగానే పబ్లిక్ హెల్త్ విభాగం విస్తరించాలి’’ అని చెప్పారు. ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎస్‌ఏ, పాఠశాల విద్య, వివిధ విభాగాలను పర్యవేక్షించే బాధ్యత ఒకే జిల్లా విద్యాధికారి పరిధిలోకి తేవాలని సీఎం సూచించారు.
‘‘కుటుంబ సంక్షేమం, లెప్రసీ, ఎయిడ్స్, ఇమ్యునైజేషన్, ట్రైనింగ్, మలేరియా తదితర విభాగాలన్నింటినీ డీఎంహెచ్‌వో పరిధికి తేవాలి. వైల్డ్ లైప్, ఫారెస్ట్, సోషల్ ఫారెస్ట్ విభాగాలు ఒకే అటవీ అధికారి పర్యవేక్షణ కింద ఉండాలి. మైనర్, మీడియం ఇరిగేషన్‌లకు ఒకే అధికారి ఉండాలి. అన్ని శాఖల పునరేకీకరణ జరగాలి’’ అని వివరించారు. ‘‘కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఇంకా అవినీతి ఉంది. ముఖ్యంగా రెవెన్యూ శాఖ బాగా మారాలి. రెవెన్యూ శాఖలో సిటిజన్ చార్టర్ అమలు చేయాలి. ప్రజలకు పారదర్శకమైన అవినీతి రహితమైన పాలన అందాలి’’ అని ఆదేశించారు.
అన్నింటా ‘జిల్లా అధికారి’ పేరు: ‘‘కొన్నిచోట్ల ఒక్కో అధికారిని ఒక్కో పేరుతో పిలుస్తున్నారు. జిల్లాస్థాయి అధికారిని వారి కేడర్‌తో సంబంధం లేకుండా ‘జిల్లా అధికారి’ అనే హోదా కల్పించాలి. మండల రెవెన్యూ అధికారిని తహసీల్దార్ అనే పిలవాలి. డిప్యూటీ ఎమ్మార్వోను నాయబ్ తహసీల్దార్ అని, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను గిర్దావర్ అని పిలవాలి’’ అని సీఎం చెప్పారు. ఉద్యోగులను వారి వృత్తి స్వభావాన్ని బట్టి ఏ బాధ్యతలకు, ఏ ప్రాంతానికైనా బదిలీ చేసే వెసులుబాటు ప్రభుత్వానికుండేలా నిబంధనలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.
సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, మిషన్ భగీరథ పనులు చేపట్టేందుకు చాలా మంది ఉద్యోగులను నియమిస్తున్నామని, పని పూర్తయిన తర్వాత వారిని మరో పనికి ఉపయోగించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. పని లేకుంటే ఆ విభాగాలను కొనసాగించవద్దని, వారిని పని ఎక్కువగా ఉన్న మరో చోట వాడుకోవాలని సూచించారు.