రైతుకు నీరందించడమే ముఖ్యం | KCR Comments On Irrigation Water to Farmers | Sakshi
Sakshi News home page

రైతుకు నీరందించడమే ముఖ్యం

Published Sat, Jan 19 2019 2:54 AM | Last Updated on Sat, Jan 19 2019 2:54 AM

KCR Comments On Irrigation Water to Farmers - Sakshi

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై అధికారులతో సమీక్ష జరుపుతున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు సాగునీరు అందించడానికన్నా మించిన ప్రాధాన్యత మరొకటి లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరగాలని, నిధుల కొరత లేదని చెప్పారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రూ.2.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి వెంట వెంటనే బిల్లులు చెల్లించనున్నట్లు వెల్లడించారు. తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంతో పాటు, పెద్దవాగు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి సమగ్ర వ్యూహం రూపొందించుకుని నిర్మాణాలు ప్రారంభించాలని చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.  

నిధుల విడుదలకు సిద్ధం.. 
రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు రూ.77,777 కోట్ల వ్యయమైందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘భూ సేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి, ఆర్‌ఆర్‌ ప్యాకేజీల కోసం మరో రూ.22 వేల కోట్లు ఖర్చు చేశాం. మొత్తంగా ఇప్పటివరకు రూ.99,643 కోట్లు ఖర్చయింది. ఈ ఏడాది మార్చి నాటికి మరో రూ.7 వేల కోట్లకు పైగా వ్యయం కానుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం వరకు వ్యయం రూ.1.07 లక్షల కోట్లకు చేరనుంది. గోదావరి, కృష్ణా బేసిన్లలోని ప్రాజెక్టులతో పాటు, మిషన్‌ కాకతీయ పనుల కోసం మరో రూ.1.17 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. రాబోయే ఐదేళ్లలో ఈ నిధులు ఖర్చు చేసి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించడం ప్రభుత్వ లక్ష్యం. అధికారులు, ఇంజనీర్లు, వర్క్‌ ఏజెన్సీలు కృషి చేయాలి. నిర్మాణాల కోసం నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం..’అని స్పష్టంచేశారు.  

ఆదిలాబాద్‌ జిల్లా చరిత్రను మార్చాలి 
సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులు ఓ జోక్‌గా మారాయని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ‘ఎన్నికలప్పుడు ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఓట్లు అడుక్కోవడమే తప్పా ప్రాజెక్టులు కట్టి నీళ్లివ్వలేదు. అత్యధిక వర్షపాతం, పుష్కలమైన నీటి లభ్యత కలిగిన ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర మార్చాలి. తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి దాని ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలి. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నియోజక వర్గంలో 56,900 ఎకరాలకు, ఆసిఫాబాద్‌లో 38,830 ఎకరాలకు, చెన్నూరులో 31,500 ఎకరాలకు, బెల్లంపల్లి నియోజక వర్గంలో 72,770 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి, 20 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి సీడబ్ల్యూసీ అంగీకారం తెలిపింది. దీనిద్వారా ఆదిలాబాద్‌ జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వడానికి సమగ్ర వ్యూహం రూపొందించాలి. అలాగే అక్కడే పారే పెద్దవాగుకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. చాలా నియోజకవర్గాల గుండా వెళ్తుంది. ఈ పెద్దవాగు నీటిని వినియోగించుకోవడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి. పెన్‌గంగ ప్రాజెక్టుపై నిర్మిస్తున్న చనఖా–కొరటా ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి. కుఫ్టి రిజర్వాయర్‌ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు.  

రాష్ట్ర వాటాను వినియోగించుకోవాలి 
కాళేశ్వరం, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా గోదావరి బేసిన్‌లో రాష్ట్రం వాటాను పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ‘ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించాను. నీటి పారుదల శాఖ అధికారులు, రిటైర్డ్‌ ఇంజనీర్లు కూడా ఈ ప్రాజెక్టు పనులను సందర్శించారు. మొత్తం గోదావరి బేసిన్‌లో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చేయాల్సిన పనులపై పూర్తి అవగాహన వచ్చింది. ఈ అవగాహనతో ఈ నెలాఖరులోగా కార్యాచరణ ఖరారు చేయాలి. ఫిబ్రవరిలో స్వయంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తాను. అదే నెలలో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంపై కార్యాచరణ రూపొందిస్తాం. వర్షాకాలం వరకు వేగంగా పనులు చేసుకునే అవకాశముంది.  వెంటనే కార్యరంగంలోకి దిగాలి..’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.  

తొలుత నీటిని చెరువులకు మళ్లించాలి 
ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని మొదట చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటు మిడ్‌ మానేరు నుంచి ఎస్పారెస్పీ వరకు, ఇటు మల్లన్నసాగర్‌ వరకు నీరు అందుతుందన్నారు. అలా వచ్చిన నీటిని మొదట చెరువులకు తరలించేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.కాల్వలపై తూములు నిర్మించి, చెరువులను నింపాలని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, సీఈలు హరిరామ్, శంకర్, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈలు విష్ణుప్రసాద్, వేణు, ఈఈ రామకృష్ణలు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement