ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్న నీటి వనరుల వినియోగంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఎస్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వ్యవసాయానికి సాగునీరు అందించడానికి చిన్ననీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొనేలా వ్యూహం రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్‌లో ఎస్టీ ప్రాంతాల్లో చిన్ననీటి వనరుల ఉపయోగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఎస్టీలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల ద్వారా నీరందే భూములకు కాకుండా, మిగిలిన భూములకు చిన్ననీటి వనరులైన చెరువులు, వాగుల ద్వారా నీరందించాలని సూచించారు. ఈ ప్రాంతాలు ఎక్కువగా కొండలు గుట్టల్లో ఉంటాయని.. అందుకోసం పైపుల ద్వారా సాగునీరందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. పోడు భూముల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని.. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎంత సాగుభూమి ఉందనే అంశంపై స్పష్టత వస్తుందన్నారు.
ఆ భూములకు పూర్తిస్థాయిలో సాగునీరందించి ఎస్టీ రైతులు మంచి పంటలు పండించుకునే విధంగా సాగునీటి ప్రణాళిక ఉండాలన్నారు. రాష్ట్రంలో 46,500 చెరువులున్నాయి. ఇందులో 12,154 గొలుసుకట్టులున్నాయి. 16,771 చెరువులు విడిగా ఉన్నాయి. మిషన్ కాకతీయలో నీటి నిల్వ సామర్థ్యం పరంగా చూస్తే 90% చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఈ చెరువులకు ఈ వర్షాకాలం నుంచే ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించాలి. వర్షం ద్వారా వచ్చే నీళ్లు, పడువాటు నీళ్లు చెరువులకు చేరే విధంగా ఫీడర్ ఛానళ్లు, అలుగు కాలువలు ఈ ఎండాకాలంలోనే పూర్థిస్థాయిలో సిద్ధం చేయాలి’అని సీఎం ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాలపై ఎక్కువ దృష్టి
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో చాలా ఏజెన్సీ ప్రాంతాలు, ఎస్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షపాతం కూడా అధికంగానే ఉంది. వాగులు, వంకలు చాలా ఉన్నాయి. వీటిపై ఎక్కడికక్కడ చెక్ డ్యాములు నిర్మించాలి. దీనికోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. ఈ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల ద్వారా ఎంతవరకు నీరందించవచ్చో గుర్తించాలి. మిగతా ప్రాంతాలకు చిన్ననీటి వనరుల ద్వారానే నీరివ్వాలి’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల సలహాలు, సూచనల మేరకు చిన్ననీటి వనరుల వినియోగం ద్వారా గరిష్ట భూ–వినియోగం అంశంపై పలు నిర్ణయాలు తీసుకున్నారు.
బూర్గంపాడు సమీపంలో జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు 1500 హెచ్‌పీ మోటార్లను ఉపయోగించి ఆ ప్రాంతానికి నీరివ్వాలని జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావును కోరారు. ఆదిలాబాద్‌లో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల స్వరూపం, వాటివల్ల సాగయ్యే భూమి వంటి అంశాలను అధ్యయనం చేయాలన్నారు. పినపాక నియోజకవర్గంలో వట్టివాగు, లాతూరు గండిలను వినియోగించుకొనే మార్గాలను చూడాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీలు మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment