పవర్‌ పక్కా లోకల్‌ | KCR Hold Review Meeting On Panchayati Raj Department | Sakshi
Sakshi News home page

పవర్‌ పక్కా లోకల్‌

Published Sun, Aug 11 2019 1:50 AM | Last Updated on Sun, Aug 11 2019 9:37 AM

KCR Hold Review Meeting On Panchayati Raj  Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త పంచాయతీరాజ్‌ చట్టం వెలుగులో పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు ఇప్పటి మాదిరిగా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవని, అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలవడానికి ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఇస్తామని వెల్లడించారు.

గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి గ్రీన్‌ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్‌ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ‘‘గ్రామాలు బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. పట్టుబట్టి పనిచేస్తే గ్రామాల్లో తప్పక మార్పు వస్తుందనే నమ్మకం నాకుంది. పల్లెల రూపురేఖలు మార్చడం కోసం ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చింది. ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యతలు స్పష్టంగా నిర్వచించాం. ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయాలని నిర్ణయించింది. సహాయ మంత్రి హోదాగల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కూడా ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉండటం సమంజసం కాదు.

ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీపీలు, జెడ్పీటీసీలదీ ఇదే కథ. భవిష్యత్తులో ఇలా జరగడానికి వీల్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు పాలనలో పూర్తిగా భాగస్వాములు కావాలి. విద్య, వైద్యం, పచ్చదనం, పారిశుద్ధ్యం.. ఇలా ఏ విషయంలో ఎవరి పాత్ర ఎంత అనేది నిర్ధారిస్తాం. గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? మండల పరిషత్‌లు ఏం చేయాలి? జిల్లా పరిషత్‌లు ఏం చేయాలి? అనే విషయాలపై పూర్తి స్పష్టత ఇస్తాం. త్వరలోనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా వస్తాయి. దానికి సమానంగా రాష్ట్ర వాటా కేటాయిస్తాం. ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేస్తాం. విధులను స్పష్టంగా పేర్కొన్న తర్వాత, నిధులు విడుదల చేశాకే గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తాం’’అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

విస్తృత చర్చలు, అధ్యయనం తర్వాత తుది రూపం..
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఏ విధులు నిర్వర్తించాలి? ఏయే అంశాల్లో వారి బాధ్యతలు ఎంతవరకుంటాయి? ఎలాంటి అధికారాలుంటాయి? తదితర విషయాలపై సమగ్ర చర్చ, పూర్తి స్థాయి అధ్యయనం జరపాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. పంచాయతీరాజ్‌ విభాగంలో పని చేసిన అనుభవంగల నాయకులు, అధికారులు, నిపుణులతో విస్తృతంగా చర్చించి ముసాయిదా రూపొందించాలని సూచించారు. ముసా యిదాపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తామని, తర్వాత మంత్రివర్గ ఆమోదం అనంతరం అసెంబ్లీలోనూ విస్తృతంగా చర్చిస్తామని వెల్లడించారు. ఆయా సందర్భాల్లో వచ్చిన సూచనలు, సలహాలను కూడా పరిగణనలోకి తీసు కొని ప్రభుత్వం విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తై మున్సిపల్‌ ఎన్నికలు కూడా ముగిశాక గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు.

ఖాళీలన్నీ భర్తీ చేయాలి...
పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్‌ సీఈవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈవోపీఆర్డీ పోస్టులను ఇకపై మండల పంచాయతీ అధికారులుగా పరిగణిస్తామని చెప్పారు. గ్రామ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, డివిజనల్‌ పంచాయతీ అధికారులు, డిప్యూటీ సీఈవోలు, డీపీఓలు, సీఈవోలు.. ఇలా అన్ని విభాగాల్లో అవసరమైన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు.

పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు నేరుగా నియామకాలు జరపాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ ఎస్‌.కె.జోషి, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ నీతూ ప్రసాద్, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపురెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, గట్టు రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తై మున్సిపల్‌ ఎన్నికలు కూడా ముగిశాక గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

శనివారం ప్రగతి భవన్‌లో మున్సిపల్‌ ఎన్నికలపై మంత్రులు, అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement