సాక్షి, హైదరాబాద్ : అన్ని రంగాలకు అన్ని వేళలా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడం లక్ష్యంగా దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరముందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతమున్న స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం కూడా ఉపయోగించుకోవడం లేదని, ఇంకా చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు అమలవుతున్నా యని, ఈ పరిస్థితి పోవాల్సిన అవసరముందన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పవర్ ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) సీఎండీ రాజీవ్‌శర్మ ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితిపై చర్చ జరిగింది. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. రాష్ట్ర ప్రగతికి ఆనాడు విద్యుత్ సమస్యే తీవ్ర అవరోధంగా నిలి చింది. విద్యుత్ సమస్యను పరిష్కరించనిదే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదని భావించాం. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడానికి సమగ్ర వ్యూహం అనుసరించాం. ఆరు నెలల్లో విద్యుత్ కోతలు ఎత్తేశాం. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. తెలంగాణలో పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి. దీనివల్ల ఉపాధి పెరిగింది. రాష్ట్ర ఆదాయం పెరిగింది. లో వోల్టేజీ లేకుండా ఉండేందుకు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా ఉండేందుకు పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరిచాం. ప్రస్తుతం 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను వాడుకోవడానికి అనుగుణమైన వ్యవస్థ సిద్ధమైంది’’అని ముఖ్యమంత్రి వివరించారు.
పీఎఫ్‌సీ సహకారం ఎంతో ఉపయోగపడింది..
తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర విద్యుత్ సంబంధ వ్యవస్థలను తీర్చిదిద్దడానికి పీఎఫ్‌సీ అందించిన ఆర్థిక సహకారం ఎంతో దోహదపడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించినందుకు పీఎఫ్‌సీ చైర్మన్ రాజీవ్‌శర్మకు ముఖ్యమంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించుకొని మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా తెలంగాణ అడుగులు వేయడానికి పీఎఫ్‌సీ అందించిన సహకారం ఎంతో దోహదపడిందన్నారు. రాజీవ్ శర్మ దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించి మొమెంటోలు అందించారు.
పీఎఫ్‌సీ సీఎండీ రాజీవ్‌శర్మ సత్కరిస్తున్న సీఎం కేసీర్, చిత్రంలో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
పీఎఫ్‌సీకి గౌరవం, గర్వం: రాజీవ్ శర్మ
తెలంగాణలో దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రికార్డు సమయంలో అటు పవర్ ప్లాంట్లు, ఇటు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని పీఎఫ్‌సీ సీఎండీ రాజీవ్‌శర్మ ప్రశంసించారు. పవర్ ప్లాంట్లయినా, నీటిపారుదల ప్రాజెక్టులయినా ఇంత తొందరగా పూర్తి కావడం తానెక్కడా చూడలేదన్నారు. అనుమతులు పొందడం, నిధులను సమీకరించడం, భూసేకరణ, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాల వంటి ప్రక్రియల వల్ల ప్రాజెక్టుల నిర్మాణం సాధారణంగా ఆలస్యం అవుతుందన్నారు. కానీ తెలంగాణలో మాత్రం శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు తాము అందించిన ఆర్థిక సహకారం నూటికి నూరు పాళ్లు సద్వినియోగం కావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ భాగస్వామి కావడం తమకెంతో గౌరవంగా, గర్వంగా ఉందని రాజీవ్‌శర్మ అన్నారు. ‘‘మూడున్నరేళ్ల కింద హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ మాకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు. ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో స్క్రీన్‌పై చూపించారు. అది విన్న నేను ఆశ్చర్యపోయా. ఇది సాధ్యమేనా అనుకున్నా. కానీ నిన్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి బ్యారేజీలు, పంప్‌హౌస్‌లను కళ్లారా చూశా. గోదావరి నీటిని పంపింగ్ చేసే విధానం నిజంగా అద్భుతం. మూడున్నరేళ్ల కింద కేసీఆర్ నాకు ఏం చెప్పారో, అది కళ్ల ముందు కనిపించింది. ఇలాంటి ప్రాజెక్టును ఇంత త్వరగా నిర్మించడం మాటలు చెప్పినంత తేలిక కాదు. కేసీఆర్ కృషి ఫలించింది. కల నెరవేరింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి యావత్ దేశం చెప్పుకుంటోంది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విజయగాథను ప్రదర్శిస్తున్నారు’’అని రాజీవ్‌శర్మ అభినందించారు.
ట్రాన్స్‌కో సీఎండీపై ప్రశంసల వర్షం...
రాష్ట్రంలో విద్యుత్ రంగం సాధించిన విజయాల వెనుక జెన్‌కో–ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కృషి ఎంతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్, పీఎఫ్‌సీ సీఎండీ రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్.కె. జోషి ప్రశంసించారు. విద్యుత్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ప్రభాకర్‌రావు తమకు ఆదర్శమని, ఆయన నాయకత్వంలో తెలంగాణలో విద్యుత్ రంగం ఎంతో ప్రగతి సాధించిందని రాజీవ్‌శర్మ కొనియాడారు. పవర్ ప్లాంట్లు శరవేగంగా నిర్మితమవుతున్నాయని, ప్లాంట్లలో విద్యుదుత్పత్తి (పీఎల్‌ఎఫ్) పెరిగిందని, ఆయనపై పెట్టిన బాధ్యతను ప్రభాకర్‌రావు పూర్తిగా నెరవేర్చారని కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో 50 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రభాకర్‌రావు విద్యుత్ రంగంలో భీష్మాచార్యుడు అని ఎస్.కె. జోషి కొనియాడారు. విద్యుత్ రంగంపై పూర్తి అవగాహన కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని ప్రభాకర్‌రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యుత్ సంక్షోభ పరిష్కారం ఘనత అంతా ముఖ్యమంత్రిదేనన్నారు.
అన్ని రంగాలు వెలగాలి
Published Mon, Aug 19 2019 1:21 AM | Last Updated on Mon, Aug 19 2019 8:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment