నన్నెవరూ ఆపలేరు: సీఎం కేసీఆర్‌ | Cm Kcr Intresing Comments On Water Dam Project In Sircilla | Sakshi
Sakshi News home page

KCR: నన్నెవరూ ఆపలేరు

Published Mon, Jul 5 2021 3:05 AM | Last Updated on Mon, Jul 5 2021 9:27 AM

Cm Kcr Intresing Comments On Water Dam Project In Sircilla - Sakshi

సాక్షి, సిరిసిల్ల: ‘కేసీఆర్‌ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు.. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు నేను అనుకున్నవన్నీ జరిగాయి. లక్ష్యశుద్ధి.. చిత్తశుద్ధి.. వాక్‌శుద్ధి ఉంటే.. ఏదైనా కచ్చితంగా అయి తీరుతుంది’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్‌ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌తో కలసి రాజన్నసిరిసిల్ల జిల్లా నూతన కలెక్టరేట్‌ సముదాయం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్‌ డ్రైవింగ్‌ స్కూల్, నర్సింగ్‌ కాలేజీ, వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఆదివారం ప్రారంభించారు. కలెక్టరేట్‌లో కేసీఆర్‌ సుదీర్ఘంగా (గంటసేపు) మాట్లాడారు. తెలంగాణ వచ్చాక ఏడేళ్లలో ఏం సాధించామో అందరి కళ్లముందే కనిపిస్తోందని తెలిపారు. రాజకీయాల్లో కిరికిరిగాళ్లు ఎప్పుడూ ఉంటారని, సన్నాసులు ఎప్పుడూ సన్నాసులేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక పాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, కొత్త కలెక్టరేట్‌ నమూనాలను ఆర్కిటెక్చర్‌ ఉషారెడ్డి, ఇంజినీర్‌ గణపతిరెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు.

 

రైతుల ఇళ్లలో బంగారు వాసాలు కావాలే 
గోదావరి జలాలను రివర్స్‌ పంపింగ్‌ ద్వారా మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెడితే అది అయితదా.. పోతదా.. అని అనుమానపడ్డారని, ఏం జరిగిందో కళ్లముందే ఉందని కేసీఆర్‌ అన్నారు. మల్టీ స్టేజీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌  ప్రాజెక్టు అని తాను చెబితే కొందరు అపవాదులు వేశారని తెలిపారు. ఈ  విషయంలో ప్రధాని మోదీతోనే పంచాయితీ పెట్టుకున్నానని పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు వరకే 40 లక్షల ఎకరాలు పారుతోందని స్పష్టం చేశారు. ఎంతో శ్రమించి కాళేశ్వరం కడితే.. కరెంట్‌ ఖర్చు రూ.10వేల కోట్లు అంటూ.. కొందరు మాట్లాడుతున్నారని, రైతుల బాగుకోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. రైతుల ఇళ్లలో బంగారువాసాలు కావాలన్నారు.  

చెంబుతో నీళ్లు ముంచుకోవచ్చు... 
ఆరేళ్లలో ఎంతో అద్భుతం జరిగిందని, వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్, సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, ఇంకా మధ్యలో చిన్నచిన్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌  ప్రాజెక్టులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ ఇప్పుడు రిజర్వాయర్‌గా మారిందని, 365 రోజులు చెంబుతో నీళ్లు ముంచుకోవచ్చన్నారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ ప్రాజెక్టులతో 180 కిలోమీటర్లు గోదావరి సజీవ జలదృశ్యం ఆవిష్కృతమైందని స్పష్టం చేశారు. గతంలో వర్షాలు పడితే.. చెరువులు తెగిపోయేవని, ప్రస్తుత ప్రభుత్వం చెరువులను బాగు చేయడంతో అధిక వర్షాలు పడినా చెరువులు మంచిగా ఉన్నాయన్నారు. 

బతుకమ్మ చీరలపైనా రాజకీయం.. 
ఒకప్పుడు సిరిసిల్లలో ఆత్మహత్యలు వద్దు.. అనే నినాదాలు గోడలపై కనిపించాయని, అవి తనను ఎంతో కలిచివేశాయన్నారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు బతుకమ్మ చీరల తయారీ ఇస్తే.. దాన్ని కూడా రాజకీయం చేయడం దారుణమన్నారు. సిరిసిల్లలో పద్మశాలి భవన్‌ కు రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  

పల్లె, పట్టణ ప్రగతిని బాగా చేయండి
‘మీకు దండం పెడతా.. పల్లె ప్రగతి.. పట్టణ ప్రగతిని పకడ్బందీగా చేయండి’ అంటూ సీఎం కోరారు. ఆక్సిజన్‌  కొనుక్కునే దుస్థితి ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవాలన్నారు. హరితహారం ఉజ్వలమైన కార్యక్రమం అని.. అందరూ భాగస్వాములు కావాలని కోరారు. భవిష్యత్‌లో మన పిల్లలకు ఇచ్చే సంపద ప్రకృతి మాత్రమేనని, పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ ఏడాది లాక్‌డౌన్‌  కారణంగా ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నారు. అయినా ఒక్కో పనిని చేసుకుంటూ పోతున్నామని, దుబారా లేకుండా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతోందన్నారు.   ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్‌  అరుణ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, రఘోత్తమరెడ్డి, భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్‌ చైర్మన్‌  కొండూరి రవీందర్‌రావు, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పాల్గొన్నారు.   

నర్సింగ్‌ విద్యార్థుల స్టై ఫండ్‌ పెంపు..
మొదటి సంవత్సవం వారికి ప్రస్తుతం రూ.1500 స్టైఫండ్‌ ఇస్తున్నారు.. దాన్ని రూ.5 వేలకు పెంచుతున్నం. రెండో సంవత్సరం వారికి ఇచ్చే రూ.1600 స్థానంలో రూ.6వేలు, మూడో సంవత్సరం వారికి ఇచ్చే రూ.1900 స్థానంలో రూ.7వేలు ఇస్తం. 

గర్వంగా చెబుతున్నా... 
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతీ గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఉంది. ప్రతీ ఊరిలోనూ వైకుంఠధామాలు ఉన్నాయని నేను గర్వంగా చెబుతున్నా. 

రూ.10వేల కోట్లు... 
రూ.10వేల కోట్లతో హెల్త్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తున్నం. రెండో విడత గొర్రెల పంపిణీని రూ.4వేల కోట్లతో చేపడతం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement