Power Finance Corporation
-
పీఎఫ్సీ సీఎండీగా పర్మిందర్ చోప్రా బాధ్యతలు
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఎన్బీఎఫ్సీ, ప్రభుత్వరంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) చైర్మన్, ఎండీగా (సీఎండీ) పర్మిందర్ చోప్రా బాధ్యతలు స్వీకరించారు. సంస్థకు తొలి పూర్తి స్థాయి మహిళా చైర్మన్ అని పీఎఫ్సీ తెలిపింది. జూన్ 1 నుంచి పీఎఫ్సీ సీఎండీగా అదనపు బాధ్యతలను ఆమె నిర్వహిస్తుండగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ బాధ్యతల్లోకి వచ్చారు. అంతక్రితం వరకు పీఎఫ్సీ డైరెక్టర్ (ఫైనాన్స్)గా పనిచేశారు. డైరెక్టర్ (ఫైనాన్స్)గా పర్మిందర్ చోప్రా ఎన్పీఏలను కనిష్టానికి తగ్గించి, సంస్థ లాభదాయకతను పెంచడంలో, మహారత్న హోదా పొందడంలో కీలకంగా పనిచేశారు. విద్యుత్, ఫైనాన్షియల్ రంగాల్లో 35 ఏళ్ల అనుభవం ఉంది. -
మచిలీపట్నం పోర్టుకు రుణం మంజూరు
-
ఏపీ: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి మరో ముందడుగు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడింది. ఇటీవలే మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. తాజాగా మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రూ. 3, 940 కోట్లు మంజూరు అయ్యింది. దీంతో పోర్టు వ్యయానికి అవసరమయ్యే వంద శాతం రుణం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసినట్లయ్యింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి మంజూరు ఉత్తర్వులు పంపింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. దీంతో అతి త్వరలోనే మచిలీపట్నం పోర్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. -
లాభాల్లో ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022–23) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌గా జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4% వృద్ధితో రూ. 5,229 కోట్లను అధిగమించింది. ఇది ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 5,023 కోట్లు ఆర్జించింది. ఆదాయం రూ. 19,283 కోట్ల నుంచి రూ. 19,344 కోట్లకు బలపడింది. షేరుకి రూ. 3 చొప్పున రెండో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.17% నుంచి 4.38%కి, నికర ఎన్పీఏలు 1.72% నుంచి 1.27%కి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో పీఎఫ్సీ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం క్షీణించి రూ. 117 వద్ద ముగిసింది. -
రుణ ఆంక్షలపై తగ్గిన కేంద్రం!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాజెక్టులు, పథకాలకు రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఏప్రిల్ నుంచి వివిధ సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) సంస్థలు రుణాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా సదరు రుణాల పునరుద్ధరణపై ఈ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఆర్ఈసీ నుంచి రూ.992.25 కోట్ల రుణం విడుదలైంది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ)కు కూడా రుణాలను పునరుద్ధరించడానికి ఆర్ఈసీ, పీఎఫ్సీలు ముందుకు వచ్చాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీకరిస్తున్న రుణాలతో.. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను సమర్పించిన తర్వాత.. తాజా రుణాలు విడుదల కానున్నాయని అధికారులు వెల్లడించారు. పీఎఫ్సీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.340 కోట్ల రుణం విడుదలైనట్టు వార్తలు వచ్చినా అధికారులు ధ్రువీకరించలేదు. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జరిగిన యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు సంబంధించి రూ.992.25 కోట్ల రుణాన్ని ఆర్ఈసీ రెండు రోజుల కింద విడుదల చేయగా.. జెన్కో వెంటనే నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్కు బిల్లుల బకాయిలను చెల్లించిందని అధికార వర్గాలు తెలిపాయి. రుణాల పునరుద్ధరణ జరగడంతో యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరిలోగా పూర్తి చేయగలమని జెన్కో చెబుతోంది. బడ్జెట్ రుణాల్లో చేరుస్తామంటూ ఆపేసి.. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితికి మించి అప్పులు చేశారంటూ, కొత్త రుణాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కొద్దినెలల కింద ఆంక్షలు విధించింది. కార్పొరేషన్ల పేరిట తీసుకుంటున్న రుణాలను కూడా రాష్ట్ర బడ్జెట్ రుణాల కింద లెక్కగడతామని పేర్కొంది. ఈ క్రమంలో విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకోసం ఆర్ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రావాల్సిన రుణాలు నిలిచిపోయాయి. జెన్కో/కాళేశ్వరం కార్పొరేషన్లతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి.. ఆర్ఈసీ/పీఎఫ్‌సీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటేనే మిగులు రుణాలు విడుదల చేస్తామని కేంద్రం ఆంక్షలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో.. కేంద్రం పెట్టిన ఆంక్షలకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. రుణాల కోసం జెన్కో/కాళేశ్వరం కార్పొరేషన్‌తో ఆర్ఈసీ/పీఎఫ్‌సీల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ వెంటనే రుణాలను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి లేఖలు రాశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం.. కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రుణాల పునరుద్ధరణపై చర్చలు జరిపింది. రాష్ట్రంపై ఆర్థిక ఆంక్షలు విధించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ బహిరంగంగా ఆరోపణలు సైతం చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం మెట్టుదిగి రుణాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒప్పందాల మేరకు కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఆర్ఈసీ నుంచి రూ.1,200 కోట్లు, పీఎఫ్సీ నుంచి రూ.2,000 కోట్ల రుణాలు రావాల్సి ఉంది. దీనితో కాళేశ్వరం మూడో టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల పనులు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
‘సీతమ్మ’కు రూ.3,426 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన నిర్మించనున్న సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,426.25 కోట్ల రుణం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్ర జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాలు తీసుకునేలా ఆమోదించింది. గతంలోనే ఈ ప్రాజెక్టు రుణాలకు ఓకే చెప్పిన ప్రభుత్వం.. తాజాగా సవరణ ఉత్తర్వులు జారీచేసింది. 37 టీఎంసీల నిల్వ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.3,481 కోట్లతో గతేడాది పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ ప్రాజెక్టు టెండర్లను ఎల్అండ్టీ సంస్థ దక్కించుకోగా పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం నుంచి ఎలాంటి అనుమతులు అవసరమున్నా.. తీసుకోవాలని.. ఒకవేళ అనుమతిలేని కారణంగా పనులు నిలిపివేస్తే.. రుణాన్ని బేషరతుగా వెన క్కి తీసుకుంటామని పీఎఫ్సీ తన పేర్కొంది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో సీతమ్మసాగర్‌ను అనుమతి లేని ప్రాజెక్టుగా తెలిపింది. ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని అందులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పీఎఫ్సీ ఈ నిబంధనలను పెట్టింది. -
దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాలి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : అన్ని రంగాలకు అన్ని వేళలా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడం లక్ష్యంగా దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరముందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతమున్న స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం కూడా ఉపయోగించుకోవడం లేదని, ఇంకా చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు అమలవుతున్నా యని, ఈ పరిస్థితి పోవాల్సిన అవసరముందన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పవర్ ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) సీఎండీ రాజీవ్‌శర్మ ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితిపై చర్చ జరిగింది. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. రాష్ట్ర ప్రగతికి ఆనాడు విద్యుత్ సమస్యే తీవ్ర అవరోధంగా నిలి చింది. విద్యుత్ సమస్యను పరిష్కరించనిదే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదని భావించాం. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడానికి సమగ్ర వ్యూహం అనుసరించాం. ఆరు నెలల్లో విద్యుత్ కోతలు ఎత్తేశాం. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. తెలంగాణలో పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి. దీనివల్ల ఉపాధి పెరిగింది. రాష్ట్ర ఆదాయం పెరిగింది. లో వోల్టేజీ లేకుండా ఉండేందుకు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఉండేందుకు పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరిచాం. ప్రస్తుతం 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను వాడుకోవడానికి అనుగుణమైన వ్యవస్థ సిద్ధమైంది’’అని ముఖ్యమంత్రి వివరించారు. పీఎఫ్సీ సహకారం ఎంతో ఉపయోగపడింది.. తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర విద్యుత్ సంబంధ వ్యవస్థలను తీర్చిదిద్దడానికి పీఎఫ్సీ అందించిన ఆర్థిక సహకారం ఎంతో దోహదపడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించినందుకు పీఎఫ్సీ చైర్మన్ రాజీవ్‌శర్మకు ముఖ్యమంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించుకొని మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా తెలంగాణ అడుగులు వేయడానికి పీఎఫ్సీ అందించిన సహకారం ఎంతో దోహదపడిందన్నారు. రాజీవ్ శర్మ దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించి మొమెంటోలు అందించారు. పీఎఫ్సీ సీఎండీ రాజీవ్‌శర్మ సత్కరిస్తున్న సీఎం కేసీర్, చిత్రంలో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పీఎఫ్సీకి గౌరవం, గర్వం: రాజీవ్ శర్మ తెలంగాణలో దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రికార్డు సమయంలో అటు పవర్ ప్లాంట్లు, ఇటు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని పీఎఫ్సీ సీఎండీ రాజీవ్‌శర్మ ప్రశంసించారు. పవర్ ప్లాంట్లయినా, నీటిపారుదల ప్రాజెక్టులయినా ఇంత తొందరగా పూర్తి కావడం తానెక్కడా చూడలేదన్నారు. అనుమతులు పొందడం, నిధులను సమీకరించడం, భూసేకరణ, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాల వంటి ప్రక్రియల వల్ల ప్రాజెక్టుల నిర్మాణం సాధారణంగా ఆలస్యం అవుతుందన్నారు. కానీ తెలంగాణలో మాత్రం శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు తాము అందించిన ఆర్థిక సహకారం నూటికి నూరు పాళ్లు సద్వినియోగం కావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ భాగస్వామి కావడం తమకెంతో గౌరవంగా, గర్వంగా ఉందని రాజీవ్‌శర్మ అన్నారు. ‘‘మూడున్నరేళ్ల కింద హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ మాకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు. ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో స్క్రీన్‌పై చూపించారు. అది విన్న నేను ఆశ్చర్యపోయా. ఇది సాధ్యమేనా అనుకున్నా. కానీ నిన్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి బ్యారేజీలు, పంప్‌హౌస్‌లను కళ్లారా చూశా. గోదావరి నీటిని పంపింగ్ చేసే విధానం నిజంగా అద్భుతం. మూడున్నరేళ్ల కింద కేసీఆర్ నాకు ఏం చెప్పారో, అది కళ్ల ముందు కనిపించింది. ఇలాంటి ప్రాజెక్టును ఇంత త్వరగా నిర్మించడం మాటలు చెప్పినంత తేలిక కాదు. కేసీఆర్ కృషి ఫలించింది. కల నెరవేరింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి యావత్ దేశం చెప్పుకుంటోంది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విజయగాథను ప్రదర్శిస్తున్నారు’’అని రాజీవ్‌శర్మ అభినందించారు. ట్రాన్స్‌కో సీఎండీపై ప్రశంసల వర్షం... రాష్ట్రంలో విద్యుత్ రంగం సాధించిన విజయాల వెనుక జెన్కో–ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కృషి ఎంతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్, పీఎఫ్సీ సీఎండీ రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్.కె. జోషి ప్రశంసించారు. విద్యుత్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ప్రభాకర్‌రావు తమకు ఆదర్శమని, ఆయన నాయకత్వంలో తెలంగాణలో విద్యుత్ రంగం ఎంతో ప్రగతి సాధించిందని రాజీవ్‌శర్మ కొనియాడారు. పవర్ ప్లాంట్లు శరవేగంగా నిర్మితమవుతున్నాయని, ప్లాంట్లలో విద్యుదుత్పత్తి (పీఎల్ఎఫ్) పెరిగిందని, ఆయనపై పెట్టిన బాధ్యతను ప్రభాకర్‌రావు పూర్తిగా నెరవేర్చారని కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో 50 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రభాకర్‌రావు విద్యుత్ రంగంలో భీష్మాచార్యుడు అని ఎస్.కె. జోషి కొనియాడారు. విద్యుత్ రంగంపై పూర్తి అవగాహన కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని ప్రభాకర్‌రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యుత్ సంక్షోభ పరిష్కారం ఘనత అంతా ముఖ్యమంత్రిదేనన్నారు. -
పీఎఫ్సీ లాభం రూ.2,075 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ, పవర్ ఫైనాన్స్ కంపెనీ నికర లాభం 70 శాతం ఎగసింది. గత క్యూ3లో రూ.1,217 కోట్లుగా ఉన్న నికర లాభం (స్డాండోలోన్) ఈ క్యూ3లో రూ. 2,076 కోట్లకు పెరిగిందని పవర్ ఫైనాన్స్ కంపెనీ తెలిపింది. ఆదాయం అధికంగా రావడంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,248 కోట్ల నుంచి రూ.7,364 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ పరిమితిని రూ.97,000 కోట్లకు పెంచుకోవడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పేర్కొంది. దీంట్లో భాగంగా దీర్ఘకాల రూపీ రుణాలు రూ.67,000 కోట్లు, దీర్ఘకాలిక విదేశీ కరెన్సీ రుణాలు రూ.10,000 కోట్లు, కమర్షియల్ పేపర్ రుణాలు రూ.13,000 కోట్లు, స్వల్ప కాలిక రుణాలు రూ.7,000 కోట్ల మేర ఉన్నాయని వివరించింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.4,804 కోట్ల నికర లాభం వచ్చిందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.3,565 కోట్ల నికర లాభం ఆర్జించామని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో పీఎఫ్సీ షేర్ 1.3 శాతం నష్టంతో రూ.99.75 వద్ద ముగిసింది. -
‘ఈస్ట్‌కోస్ట్’ దివాలా ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్ : పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు దాదాపు రూ.2,323 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైనందుకు ఈస్ట్‌కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), హైదరాబాద్ అనుమతినిచ్చింది. దివాలా పరిష్కారదారు (ఐఆర్పీ)గా దేవేంద్రప్రసాద్‌ను నియమించింది. ఆస్తుల విక్రయం, బదలాయింపు, తాకట్టు చేయరాదని సంస్థను ఆదేశించింది. ‘‘దివాలా ప్రక్రియ ప్రారంభమైనట్టు బహిరంగ ప్రకటన ఇవ్వండి. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) సైట్లో ఉంచడంతో పాటు మీడియా ద్వారా బహిరంగ ప్రకటనలివ్వండి. రుణదాతలతో కమిటీ వేసి కంపెనీ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోండి’’అని ఐఆర్‌పీని ఆదేశించింది. ఆయనకు సహకరించాలని ఈస్ట్‌కోస్ట్ ప్రమోటర్లు, అధికారులను ఆదేశించింది. ఎన్సీఎల్టీ సభ్యుడు బిక్కి రవీంద్రబాబు మూడు రోజుల క్రితం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకరపల్లిలో 1,320 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రం ఏర్పాటుకు ఎస్బీఐ, పీఎఫ్‌సీల నుంచి ఈస్ట్‌కోస్ట్ ఎనర్జీ భారీగా రుణం తీసుకుంది. ఎస్బీఐకి రూ.952 కోట్లు, పీఎఫ్సీకి గత డిసెంబర్ 31 నాటికి రూ.1,371 కోట్ల బకాయి ఉంది. ఏళ్లు గడుస్తున్నా రుణం ఇంకా పూర్తిగా చెల్లించలేదని ఎస్బీఐ తరఫు న్యాయవాది వి.కె.సాజిత్ చెప్పారు. బకాయిల చెల్లింపునకు సిద్ధంగా ఉన్నామని, కొంత గడువు కావాలని ఈస్ట్‌కోస్ట్ తరఫు న్యాయవాదులు కోరగా ట్రిబ్యునల్ సభ్యుడు తోసిపుచ్చారు. -
నీటి ప్రాజెక్టులకు నిధులిస్తాం: పీఎఫ్సీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థలు చేపడుతున్న పవర్ ప్లాంట్లు, ఇతర నిర్మాణాలకు ఆర్థిక చేయూత అందించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (పీఎఫ్సీ).. నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు సైతం నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. పీఎఫ్సీ చైర్మన్ రాజీవ్ శర్మ బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలసి తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ సౌధలో జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ డి.ప్రభాకర్ రావుతో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై చర్చించారు. 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న మణుగూరు ప్లాంటు నిర్మాణం పూర్తయిందని, వచ్చే నెల చివరి నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభాకర్ రావు చెప్పారు. 1,080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి ప్లాంటులోని రెండు యూనిట్లను ఈ ఏడాది డిసెంబర్ చివరికి, మిగతా రెండు యూనిట్లను వచ్చే ఏడాది జూన్‌కు ప్రారంభిస్తామని వెల్లడించారు. 4,000 మెగావాట్ల యాదా ద్రి పవర్ ప్లాంటు నిర్మాణం వేగంగా జరగుతున్నదని చెప్పారు. 3,000కు పైగా మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తిని తెలంగాణ సాధించిందని వెల్లడించారు. 10వేల మైలురాయిని దాటిన విద్యుత్ డిమాండ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 10వేల మైలురాయిని దాటింది. బుధవారం ఉద యం 10,100 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. దీన్ని పీఎఫ్సీ చైర్మన్, ఇతర అధికారులు గుర్తించారు. ఇంత డిమాండ్ ఏర్పడినా ఎక్కడా కోత లేకుండా విద్యుత్ సరఫరా చేయడం అభినందనీయమని ప్రభాకర్ రావు అన్నారు. -
పీఎఫ్సీ... వడ్డీ ఆదాయం జోష్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.1,713 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1 నికర లాభం(రూ.1,576 కోట్లు)తో పోల్చితే 9 శాతం వృద్ధి సాధించామని పవర్ ఫైనాన్స్ కార్పొ తెలిపింది. అధిక వడీ ఆదాయం కారణంగా ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని పేర్కొంది. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.7,106 కోట్లకు పెరిగిందని వివరించింది. గత క్యూ1లో రూ.6,709 కోట్లుగా ఉన్న వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో రూ.7,072 కోట్లకు పెరిగిందని పేర్కొంది. -
ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ రూ.30,000 కోట్లే..!
న్యూఢిల్లీ : పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఏడాది రూ.30,000 కోట్లుకు మించి ప్రభుత్వానికి ఆదాయం రాకపోవచ్చని డిజిన్వెస్ట్‌మెంట్ (డీఓడీ) శాఖ ఆర్థికమంత్రిత్వశాఖకు నివేదించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.69,500 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి మార్కెట్ ఒడిదుడుకుల పరిస్థితులే కారణమని వివరించింది. మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా భారీ లక్ష్య సాధన వ్యూహం తగిన ఫలితాలను ఇవ్వదని తెలిపింది. ఇటీవలి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఘనవిజయం సాధించి, ఖజానాకి రూ.1,600 కోట్లు జమ అయినప్పటికీ డీఓడీ తాజా అంచనాలు ఆసక్తిగా మారాయి. ఆర్ఈసీ నుంచి కేంద్రం రూ.1,550 కోట్లు సమీకరించింది. -
నేడు పీఎఫ్‌సీలో 5% వాటా విక్రయం
షేరు కనీస ధర రూ. 254గా నిర్ణయం.. న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ)లో కేంద్రం నేడు(సోమవారం) 5% వాటాను విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా చేపట్టనున్న ఈ వాటా అమ్మకంలో ఒక్కో షేరుకి కనీస ధర(ఫ్లోర్ ప్రైస్)ను రూ.254గా ఖరారు చేశారు. ఎక్స్ఛేం జీలకు వెల్లడించిన సమాచారంలో పీఎఫ్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. శుక్రవారం నాటి ముగింపు ధర రూ.259.55(బీఎస్ఈలో)తో పోలిస్తే ఫ్లోర్ ప్రైస్ 2.14 శాతం తక్కువ కింద లెక్క. కాగా, ప్రస్తుతం పీఎఫ్‌సీలో ప్రభుత్వానికి 72.8 శాతం వాటా ఉంది. 5 శాతం వాటా అమ్మకం ద్వారా రూ.1,600 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వస్తాయని అంచనా. -
రేపే పీఎఫ్‌సీలో వాటాల విక్రయం
షేరు ధర రూ. 254 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)లో 5 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో జూలై 27న (సోమవారం) కేంద్రం విక్రయించనుంది. ఇందుకోసం షేరు కనీస ధరను మార్కెట్ రేటుతో పోలిస్తే 2 శాతం డిస్కౌంటుతో రూ. 254గా నిర్ణయించింది. ఫ్లోర్ ప్రైస్ ప్రకారం పీఎఫ్‌సీలో 6.60 కోట్ల షేర్ల విక్రయం ద్వారా కేంద్రానికి రూ. 1,600 కోట్లు రాగలవని అంచనా. సంస్థలో కేంద్రానికి ప్రస్తుతం 72.80 శాతం వాటాలు ఉన్నాయి. డిజిన్వెస్ట్‌మెంట్ తర్వాత వాటాలు 67.80 శాతానికి తగ్గుతాయి. రెండు ట్రేడింగ్ పనిదినాలు కాకుండా రెండు బ్యాంకింగ్ పని దినాలకు ముందు వాటాల విక్రయ యోచనలు వెల్లడించే వీలు కల్పిస్తూ ఓఎఫ్ఎస్ నిబంధనలు మార్చిన తర్వాత షేర్ల విక్రయం జరుపుతున్న తొలి కంపెనీ పీఎఫ్‌సీనే. -
పీఎఫ్సీ, ఎన్టీపీసీలకు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కార్పొరేట్ అవార్డు
ప్రముఖ ఆర్థిక విశ్లేషణా సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) ప్రతిష్టాత్మక కార్పొరేట్ అవార్డులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)లు అందుకున్నాయి. గురువారం రాత్రి న్యూఢిల్లీలో డీఅండ్‌బీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ ‘ఇండియా టాప్ పీఎస్‌యూ అవార్డు-2015’ను పీఎఫ్సీ తరఫున ఫైనాన్స్ డెరైక్టర్ ఆర్ నాగరాజన్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డీ రవి సంయుక్తంగా అందుకున్నారు. ఐడీబీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రాజేందర్ మోహన్ మల్లా అవార్డును ప్రదానం చేశారు. అలాగే ఎన్టీపీసీకి లభించిన ఇండియా టాప్ పీఎస్‌యూ-2015 అవార్డును ఐడీబీఐ ఆర్ఎం మల్లా, డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియూ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.గంగూలీ చేతుల మీదుగా ఎన్టీపీసీ డెరైక్టర్(ఆపరేషన్స్) కేకే.శర్మ అవార్డును అందుకున్నారు. -
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 145 టార్గెట్ ధర: రూ. 225 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. మార్క్ టు మార్కెట్ కేటాయింపులు తక్కువగా ఉండడం, ఇతర కారణాల వల్ల కంపెనీ నికర లాభం 37 శాతం వృద్ధితో రూ.1,530 కోట్లకు పెరిగింది. విద్యుదుత్పత్తి సెగ్మెంట్ రుణ మంజూరీ రూ.24,600 కోట్లకు, రుణ పంపిణి రూ.12,300 కోట్లకు పెరిగాయి. ప్రైవేట్ రంగానికి రుణ మంజూరీ రూ.3,500 కోట్లకు, పంపిణి రూ.2,100 కోట్లకు చేరాయి. మొత్తం మీద సంస్థ మొత్తం రుణ మంజూరీ రూ.1.72 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం రుణాల్లో స్థూల మొండి బకాయిలు 0.65%కాగా, నికర మొండి బకాయిలు 0.52%. రెండేళ్లలో కంపెనీ రుణ వృద్ధి 17%గా ఉంటుందని భావిస్తున్నాం. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) ఆరోగ్యకరంగా(20%) ఉండడం వంటి కారణాల వల్ల ప్రస్తుత ధర ఆకర్షణీయంగా ఉందని చెప్పవచ్చు. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఇటీవల విద్యుత్ చార్జీలను తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.