
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ, పవర్ ఫైనాన్స్ కంపెనీ నికర లాభం 70 శాతం ఎగసింది. గత క్యూ3లో రూ.1,217 కోట్లుగా ఉన్న నికర లాభం (స్డాండోలోన్) ఈ క్యూ3లో రూ. 2,076 కోట్లకు పెరిగిందని పవర్ ఫైనాన్స్ కంపెనీ తెలిపింది. ఆదాయం అధికంగా రావడంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,248 కోట్ల నుంచి రూ.7,364 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ పరిమితిని రూ.97,000 కోట్లకు పెంచుకోవడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పేర్కొంది.
దీంట్లో భాగంగా దీర్ఘకాల రూపీ రుణాలు రూ.67,000 కోట్లు, దీర్ఘకాలిక విదేశీ కరెన్సీ రుణాలు రూ.10,000 కోట్లు, కమర్షియల్ పేపర్ రుణాలు రూ.13,000 కోట్లు, స్వల్ప కాలిక రుణాలు రూ.7,000 కోట్ల మేర ఉన్నాయని వివరించింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.4,804 కోట్ల నికర లాభం వచ్చిందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.3,565 కోట్ల నికర లాభం ఆర్జించామని తెలిపింది.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో పీఎఫ్‌సీ షేర్ 1.3 శాతం నష్టంతో రూ.99.75 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment