సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాజెక్టులు, పథకాలకు రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఏప్రిల్ నుంచి వివిధ సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ) సంస్థలు రుణాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా సదరు రుణాల పునరుద్ధరణపై ఈ సంస్థలు సానుకూలంగా స్పందించాయి.
నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఆర్‌ఈసీ నుంచి రూ.992.25 కోట్ల రుణం విడుదలైంది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ)కు కూడా రుణాలను పునరుద్ధరించడానికి ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీలు ముందుకు వచ్చాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీకరిస్తున్న రుణాలతో.. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులు జరుగుతున్నాయి.
ఈ ప్రాజెక్టుల్లో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను సమర్పించిన తర్వాత.. తాజా రుణాలు విడుదల కానున్నాయని అధికారులు వెల్లడించారు. పీఎఫ్‌సీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.340 కోట్ల రుణం విడుదలైనట్టు వార్తలు వచ్చినా అధికారులు ధ్రువీకరించలేదు. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జరిగిన యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు సంబంధించి రూ.992.25 కోట్ల రుణాన్ని ఆర్‌ఈసీ రెండు రోజుల కింద విడుదల చేయగా.. జెన్‌కో వెంటనే నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు బిల్లుల బకాయిలను చెల్లించిందని అధికార వర్గాలు తెలిపాయి. రుణాల పునరుద్ధరణ జరగడంతో యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరిలోగా పూర్తి చేయగలమని జెన్‌కో చెబుతోంది.
బడ్జెట్ రుణాల్లో చేరుస్తామంటూ ఆపేసి..
ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితికి మించి అప్పులు చేశారంటూ, కొత్త రుణాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కొద్దినెలల కింద ఆంక్షలు విధించింది. కార్పొరేషన్ల పేరిట తీసుకుంటున్న రుణాలను కూడా రాష్ట్ర బడ్జెట్ రుణాల కింద లెక్కగడతామని పేర్కొంది. ఈ క్రమంలో విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకోసం ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రావాల్సిన రుణాలు నిలిచిపోయాయి. జెన్‌కో/కాళేశ్వరం కార్పొరేషన్లతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి.. ఆర్‌ఈసీ/పీఎఫ్‌సీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటేనే మిగులు రుణాలు విడుదల చేస్తామని కేంద్రం ఆంక్షలు పెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో..
కేంద్రం పెట్టిన ఆంక్షలకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. రుణాల కోసం జెన్‌కో/కాళేశ్వరం కార్పొరేషన్‌తో ఆర్‌ఈసీ/పీఎఫ్‌సీల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ వెంటనే రుణాలను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి లేఖలు రాశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం.. కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రుణాల పునరుద్ధరణపై చర్చలు జరిపింది.
రాష్ట్రంపై ఆర్థిక ఆంక్షలు విధించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ బహిరంగంగా ఆరోపణలు సైతం చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం మెట్టుదిగి రుణాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒప్పందాల మేరకు కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఆర్‌ఈసీ నుంచి రూ.1,200 కోట్లు, పీఎఫ్‌సీ నుంచి రూ.2,000 కోట్ల రుణాలు రావాల్సి ఉంది. దీనితో కాళేశ్వరం మూడో టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల పనులు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment