Rural Electrification Corporation
-
రుణ ఆంక్షలపై తగ్గిన కేంద్రం!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాజెక్టులు, పథకాలకు రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఏప్రిల్ నుంచి వివిధ సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) సంస్థలు రుణాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా సదరు రుణాల పునరుద్ధరణపై ఈ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఆర్ఈసీ నుంచి రూ.992.25 కోట్ల రుణం విడుదలైంది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ)కు కూడా రుణాలను పునరుద్ధరించడానికి ఆర్ఈసీ, పీఎఫ్సీలు ముందుకు వచ్చాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీకరిస్తున్న రుణాలతో.. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను సమర్పించిన తర్వాత.. తాజా రుణాలు విడుదల కానున్నాయని అధికారులు వెల్లడించారు. పీఎఫ్సీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.340 కోట్ల రుణం విడుదలైనట్టు వార్తలు వచ్చినా అధికారులు ధ్రువీకరించలేదు. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జరిగిన యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు సంబంధించి రూ.992.25 కోట్ల రుణాన్ని ఆర్ఈసీ రెండు రోజుల కింద విడుదల చేయగా.. జెన్కో వెంటనే నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్కు బిల్లుల బకాయిలను చెల్లించిందని అధికార వర్గాలు తెలిపాయి. రుణాల పునరుద్ధరణ జరగడంతో యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరిలోగా పూర్తి చేయగలమని జెన్కో చెబుతోంది. బడ్జెట్ రుణాల్లో చేరుస్తామంటూ ఆపేసి.. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితికి మించి అప్పులు చేశారంటూ, కొత్త రుణాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కొద్దినెలల కింద ఆంక్షలు విధించింది. కార్పొరేషన్ల పేరిట తీసుకుంటున్న రుణాలను కూడా రాష్ట్ర బడ్జెట్ రుణాల కింద లెక్కగడతామని పేర్కొంది. ఈ క్రమంలో విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకోసం ఆర్ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రావాల్సిన రుణాలు నిలిచిపోయాయి. జెన్కో/కాళేశ్వరం కార్పొరేషన్లతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి.. ఆర్ఈసీ/పీఎఫ్‌సీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటేనే మిగులు రుణాలు విడుదల చేస్తామని కేంద్రం ఆంక్షలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో.. కేంద్రం పెట్టిన ఆంక్షలకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. రుణాల కోసం జెన్కో/కాళేశ్వరం కార్పొరేషన్‌తో ఆర్ఈసీ/పీఎఫ్‌సీల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ వెంటనే రుణాలను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి లేఖలు రాశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం.. కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రుణాల పునరుద్ధరణపై చర్చలు జరిపింది. రాష్ట్రంపై ఆర్థిక ఆంక్షలు విధించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ బహిరంగంగా ఆరోపణలు సైతం చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం మెట్టుదిగి రుణాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒప్పందాల మేరకు కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఆర్ఈసీ నుంచి రూ.1,200 కోట్లు, పీఎఫ్సీ నుంచి రూ.2,000 కోట్ల రుణాలు రావాల్సి ఉంది. దీనితో కాళేశ్వరం మూడో టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల పనులు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
ఏపీలో డిస్కంల పనితీరు భేష్
సాక్షి, అమరావతి: ఏపీలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మంచి పనితీరు కనబరుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసించారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) సీఎండీ సంజయ్ మల్హోత్రా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఆర్ఎస్ థిల్లాన్ బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. అనంతరం సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. కేంద్రం ఆర్డీఎస్ఎస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించిందన్నారు. దీనిపై సీఎంతో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. వెంటనే తెలంగాణ విద్యుత్ బకాయిలు ఇప్పించండి.. తెలంగాణ చెల్లించాల్సిన రూ.6,283.88 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే ఇప్పించాలని కేంద్ర అధికారులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం బలవంతం చేయడం వల్లే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశామని గుర్తు చేసింది. ఆర్ఈసీ సీఎండీ సంజయ్ మల్హోత్రా, పీఎఫ్సీ సీఎండీ ఆర్ఎస్ థిల్లాన్ బుధవారం సీఎస్ సమీర్‌శర్మ, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులు పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ‘మీకు చెల్లించాల్సిన బకాయి కంటే తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలే ఎక్కువ. ముందు వాటిని ఇప్పించండి’ అని కోరారు. ఏపీ జెన్కో చెల్లించాల్సిన బకాయిలపై వడ్డీలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆర్థిక పరంగా ఏపీకి రావాల్సిన వాటిని వెంటనే వచ్చేలా సహకరించాలని కోరారు. -
ఆర్ఈసీ ఆఫర్ ధర రూ. 315
నేడు ఆఫర్ ఫర్ సేల్ న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)లో 5 శాతం వాటాలు విక్రయిస్తున్న కేంద్ర ప్రభుత్వం షేరు ధరను రూ. 315గా నిర్ణయించింది. బీఎస్ఈలో మంగళవారం క్లోజింగ్ ధర రూ. 321.65తో పోలిస్తే ఇది 2.07 శాతం తక్కువ. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ప్రభుత్వం 4.93 కోట్ల షేర్లను నేడు (ఈ నెల 8న) విక్రయిస్తోంది. తద్వారా రూ. 1,552 కోట్లు సమీకరించనుంది. ఆఫర్లో 20 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు, 25 శాతం షేర్లను మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలకు కేటాయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 2 లక్షల దాకా విలువ చేసే షేర్ల కోసం బిడ్ చేయొచ్చు. వారికి ఇష్యూ ధరతో పోలిస్తే 5 శాతం డిస్కౌంటుకు షేర్లు లభిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 41,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకోగా.. ఈ ప్రక్రియలో అన్నింటికన్నా ముందుగా మార్కెట్‌కు వస్తున్నది ఆర్ఈసీనే. -
రేపు ఆర్ఈసీలో వాటాల విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)లో 5 శాతం వాటాల విక్రయాన్ని కేంద్రం ఏప్రిల్ 8న చేపట్టనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో 4.93 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ. 1,600 కోట్లు సమీకరించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి డిజిన్వెస్ట్‌మెంట్ కానుంది. సోమవారం బీఎస్ఈలో ఆర్ఈసీ షేర్లు 0.52 శాతం క్షీణించి రూ. 335.60 వద్ద ముగిశాయి. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే ఓఎఫ్ఎస్ షేరు రేటును ప్రభుత్వం మరింత తక్కువగా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ఆఫర్లో 20 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. ఇష్యూ ధరతో పోలిస్తే వారికి 5 శాతం డిస్కౌంటు లభిస్తుంది. -
ఉద్యోగాలు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విజిలెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విజిలెన్స్ ఆఫీసర్: 2 అర్హతలు: ద్వితీయ శ్రేణిలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం. సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: సెప్టెంబరు 20 నాటికి 38 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబరు 10 వెబ్సైట్: www.powergridindia.com ఏపీ ఈస్టర్న్ పవర్ విశాఖపట్నంలోని ఏపీ ఈస్టర్న్ పవర్, జనరల్ మేనేజర్ (ఐటీ) పోస్టు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: బీఈ/ బీటెక్ లేదా ఎంసీఏ ఉండాలి. సంబంధిత రంగంలో పదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 40 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 9 వెబ్సైట్: www.apeasternpower.com రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ న్యూఢిల్లీలోని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీర్: 31 అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్‌తో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. మేనేజర్ (రాజభాష): 1 అర్హతలు: ప్రథమ శ్రేణిలో హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఉతీర్ణులై ఉండాలి. డిగ్రీలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. 12 ఏళ్ల అనుభవం అవసరం. వయసు: 40 ఏళ్లకు మించకూడదు. అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్/ హిందీ ట్రాన్స్‌లేటర్: 1 అర్హతలు: ప్రథమ శ్రేణిలో హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు డిగ్రీలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ఆఫీసర్ (సీసీ/ పీఆర్): 1 అర్హతలు: ఎంబీఏ/ పీజీ లేదా కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో రెండేళ్ల డిప్లొమా ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. చివరి తేది: సెప్టెంబరు 15 వెబ్సైట్: www.epostbag.com