సాక్షి, అమరావతి: ఏపీలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మంచి పనితీరు కనబరుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసించారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్‌ఈసీ) సీఎండీ సంజయ్ మల్హోత్రా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఆర్‌ఎస్ థిల్లాన్ బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. అనంతరం సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. కేంద్రం ఆర్డీఎస్‌ఎస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించిందన్నారు. దీనిపై సీఎంతో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు.
వెంటనే తెలంగాణ విద్యుత్ బకాయిలు ఇప్పించండి..
తెలంగాణ చెల్లించాల్సిన రూ.6,283.88 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే ఇప్పించాలని కేంద్ర అధికారులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం బలవంతం చేయడం వల్లే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశామని గుర్తు చేసింది. ఆర్‌ఈసీ సీఎండీ సంజయ్ మల్హోత్రా, పీఎఫ్‌సీ సీఎండీ ఆర్‌ఎస్ థిల్లాన్ బుధవారం సీఎస్ సమీర్‌శర్మ, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులు పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ‘మీకు చెల్లించాల్సిన బకాయి కంటే తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలే ఎక్కువ. ముందు వాటిని ఇప్పించండి’ అని కోరారు. ఏపీ జెన్‌కో చెల్లించాల్సిన బకాయిలపై వడ్డీలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆర్థిక పరంగా ఏపీకి రావాల్సిన వాటిని వెంటనే వచ్చేలా సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment