ఆర్‌ఈసీ ఆఫర్ ధర రూ. 315
నేడు ఆఫర్ ఫర్ సేల్
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ)లో 5 శాతం వాటాలు విక్రయిస్తున్న కేంద్ర ప్రభుత్వం షేరు ధరను రూ. 315గా నిర్ణయించింది. బీఎస్‌ఈలో మంగళవారం క్లోజింగ్ ధర రూ. 321.65తో పోలిస్తే ఇది 2.07 శాతం తక్కువ. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా ప్రభుత్వం 4.93 కోట్ల షేర్లను నేడు (ఈ నెల 8న) విక్రయిస్తోంది. తద్వారా రూ. 1,552 కోట్లు సమీకరించనుంది. ఆఫర్‌లో 20 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు, 25 శాతం షేర్లను మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలకు కేటాయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 2 లక్షల దాకా విలువ చేసే షేర్ల కోసం బిడ్ చేయొచ్చు. వారికి ఇష్యూ ధరతో పోలిస్తే 5 శాతం డిస్కౌంటుకు షేర్లు లభిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 41,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకోగా.. ఈ ప్రక్రియలో అన్నింటికన్నా ముందుగా మార్కెట్‌కు వస్తున్నది ఆర్‌ఈసీనే.