REC
-
దేశంలో టాప్–10లో ఏపీ డిస్కంలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడిస్తున్నాయి. తాజాగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) ప్రకటించిన టాప్ 62 డిస్కంల జాబితాలో ఏపీ డిస్కంలు జాతీయ స్థాయిలో టాప్ 10లో నిలిచి ‘ఏ’ గ్రేడ్ సాధించాయని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డిస్కంల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, కె.సంతోషరావులు తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు తగ్గట్టు రోజువారీ విద్యుత్ సరఫరాలో ఎలాంటి కోతల్లేకుండా అందిస్తూ ఏపీ రికార్డులు సృష్టిస్తోంది. దేశ సగటు విద్యుత్ సరఫరాను మించి రాష్ట్రంలో విద్యుత్‌ను అందిస్తోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన వినియోగదారుల సేవా రేటింగ్ 2022–23 నివేదిక ప్రకారం.. జాతీయ సగటు విద్యుత్ సరఫరా పట్టణ ప్రాంతాల్లో 23.59 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 21.26 గంటలుగా ఉంది. కానీ మన రాష్ట్రంలో పట్టణాల్లో 23.85 గంటలు, గ్రామాల్లో 23.49 గంటల పాటు సరఫరా అందిస్తున్నారు. జాతీయ సగటు అంతరాయ సూచికతో పోల్చితే మన డిస్కంలలో సగానికంటే తక్కువగా ఫీడర్ అంతరాయాలు నమోదవుతున్నాయి. సేవలకు దక్కిన గుర్తింపు ఏడాదిలో ఈ జాతీయ సగటు అంతరాయ సూచిక 200.15 కాగా, ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఏపీఎస్పీడీసీఎల్)లో 42, ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఏపీఈపీడీసీఎల్)లో 79.68, ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీసీపీడీసీఎల్)లో 103.86 చొప్పున పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఫీడర్‌కు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అలాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీ) వైఫల్యం రేటు 2.01 శాతం మాత్రమే ఉంది. దీని జాతీయ సగటు 5.81 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంతే కాకుండా 2017–18లో డిస్కంల పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉంటే అవి 2022–23లో 5.31 శాతానికి తగ్గాయి. కొత్త సర్వీసులకు వంద శాతం మీటరింగ్ పూర్తి చేయడంతో పాటు రిపేర్ వచ్చిన వాటి స్థానంలో త్వరితగతిన కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మాన్యువల్ జోక్యం లేకుండా ఇన్ఫ్రారెడ్(ఐఆర్) పోర్ట్ ద్వారా విద్యుత్ బిల్లులు రీడింగ్ తీస్తున్నారు. అలాగే వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు బిల్లింగ్ హెచ్చరికలు పంపిస్తూ ఆలస్య చెల్లింపుల జరిమానాలు పడకుండా వారిని అప్రమత్తం చేయడం వంటి చర్యలను కేంద్రం తన అధ్యయనంలో పరిగణనలోకి తీసుకుంది. ఆపరేషన్, విశ్వసనీయత, రెవెన్యూ కనెక్షన్లలో చేసిన కృషి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి తీసుకున్న చర్యలు, మీటరింగ్, బిల్లింగ్, తప్పులను సరిదిద్దడం, ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ఈ క్రమంలో సాధించిన విజయాల ఆధారంగా జాతీయ స్థాయిలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏపీ డిస్కంలకు టాప్ టెన్‌లో స్థానం కల్పించింది. -
మన డిస్కంలు ‘ఏ’ గ్రేడ్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో ఏపీలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు అత్యుత్తమమని కేంద్రానికి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రకటించింది. డిస్కంల పనితీరును అంచనా వేసి, వినియోగదారులకు తమ డిస్కం అందిస్తున్న సేవల నాణ్యత గురించి తెలియజేసేందుకు ఆర్ఈసీ అధ్యయనం చేపట్టింది. ‘కన్స్యూమర్ సర్విస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్ 2022–23’ పేరుతో ఆ నివేదికను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఢిల్లీలో విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. ఏపీలో 1.92 కోట్ల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు డిస్కంలకు ఏ–గ్రేడ్ లభించింది. దేశంలోని 62 డిస్కంలను పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం చేసినట్లు ఆర్ఈసీ పేర్కొంది. అధ్యయనంలో భాగంగా డిస్కంలను జనరల్, అర్బన్, ప్రత్యేక వర్గంగా విభజించారు. వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి, వారు చెప్పిన దాని ప్రకారం స్కోర్ ఇచ్చారు. ఆ స్కోర్ ఆధారంగా ‘ఏ+, ఏ, బి+, బి, సి+, సి, డి+, డి’ అంటూ 7 విభాగాల్లో వినియోగదారుల సేవా రేటింగ్లను కేటాయించారు. ఈ 3వ ఎడిషన్‌లో కేవలం 4 డిస్కంలు మాత్రమే ‘ఏ+’ గ్రేడ్ సాధించాయి. ‘ఏ’ గ్రేడ్‌లో ఏపీతోపాటు 8 రాష్ట్రాల డిస్కంలకు స్థానం లభించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. ‘రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అందిస్తున్న ప్రోత్సాహం కారణంగానే వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ దేశంలో అత్యుత్తమంగా నిలవగలుగుతున్నాం. ప్రభుత్వ ఆర్థక సాయంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి పరుచుకుంటున్నాం. మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నాం. వాటి ద్వారా విద్యుత్ సరఫరాలో నాణ్యతను పెంచుకుని నష్టాలు తగ్గించుకుంటున్నాం’. –కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ ఆదర్శంగా నిలుస్తున్నాం ‘డిస్కంలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుంటోంది. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ అందించడంలో రాజీపడకుండా దేశంలో మరెక్కడా లేనంతగా రైతులకు విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. దీనికి రా>నున్న 30 ఏళ్ల వరకూ ఎలాంటి అవాంతరాలు రాకుండా సెకీతో 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.’ – ఐ.పృథ్వీతేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
‘పాలమూరు– రంగారెడ్డి’కి రూ.13,500 కోట్ల రుణాలు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.13,500 కోట్ల అదనపు రుణం ఇవ్వడానికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)లు సూత్రప్రాయంగా అంగీకరించాయి. చెరో రూ.6,750 కోట్ల చొప్పున రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. అయితే, పర్యావరణ అనుమతుల్లేని కారణంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలుపుదల చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన స్టేతోపాటు ఇతర న్యాయ వివాదాలు తొలగిన తర్వాతే రుణాలు ఇస్తామని నిబంధన పెట్టాయి. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, అనుమతులు లభించిన తర్వాత స్టే తొలగిపోనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని చేపట్టినందుకు రూ.920.85 కోట్ల జరిమానా విధిస్తూ గత నెలలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ ఇంకా విచారణకు రావాల్సి ఉంది. స్టేతో ఆగిన రూ.3వేల కోట్ల రుణం కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల రుణాలను పీఎఫ్సీ నుంచి సమీకరించేందుకు గతంలో ఒప్పందం జరగగా, ఇప్పటివరకు రూ.7 వేల కోట్లను పీఎఫ్సీ విడుదల చేసింది. ప్రాజెక్టు పనులపై ఎన్జీటీ విధించిన స్టే తొలగిన తర్వాతే మిగిలిన రూ.3వేల కోట్లను విడుదల చేస్తామని పీఎఫ్సీ పేర్కొంటోంది. రోజుకు ఒక టీఎంసీ తరలింపు న్యాయవివాదాలతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు నిలిచిపోయినా, అప్పటికే రోజుకు ఒక టీఎంసీ సామర్థ్యంతో కృష్ణా జలాల తరలింపునకు వీలుగా పనులు జరిగినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివరిలోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 67 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్లను నిర్మిస్తుండగా, తొలి నాలుగు రిజర్వాయర్లయిన నార్లపూర్, ఏదుల, వట్టేం, కరివేనలకు శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లను ఎత్తిపోసేందుకు వీలుగా పంపులు, మోటార్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. చివరి రెండు రిజర్వాయర్లు అయిన ఉదండపూర్, లక్ష్మీదేవిపల్లిలకు నీళ్లను పంపింగ్ చేసే పంపులు, మోటార్లతోపాటు సొరంగం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఉదండపూర్ జలాశయం నుంచి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లను పంపింగ్ చేసేందుకు మధ్యలో 14 కి.మీ. సొరంగాన్ని నిర్మించాల్సి ఉంది. సొరంగానికి ప్రత్యామ్నాయంగా ఉదండపూర్ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లను ఎత్తిపోయాలన్న ప్రతిపాదనలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
మరింత లాభం, చైనా కంపెనీపై ముఖేష్ అంబానీ కన్ను
ముంబై: సోలార్ ప్యానెల్స్ తయారీ సంస్థ ఆర్ఈసీ గ్రూప్‌ను దక్కించుకోవడంపై దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) దృష్టి పెట్టింది. చైనా నేషనల్ కెమికల్ కార్పొరేషన్ (కెమ్‌చైనా) నుంచి కంపెనీని కొనుగోలు చేయాలని ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఈ డీల్ విలువ సుమారు 1–1.2 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా. దీని కోసం దాదాపు 500–600 మిలియన్ డాలర్లను రుణ రూపంలో సమకూర్చుకునేందుకు అంతర్జాతీయ బ్యాంకులతో రిలయన్స్ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చదవండి : కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే! త్వరలోనే ఈ డీల్ గురించి ప్రకటన చేయొచ్చని వివరించాయి. నార్వే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆర్ఈసీ గ్రూప్ .. యూరప్‌లోనే అతి పెద్ద సోలార్ ప్యానెల్స్ తయారీ సంస్థ. సింగపూర్‌లో రిజిస్టర్ అయ్యింది. ఫొటోవోల్టెయిక్ (పీవీ) అప్లికేషన్లకు అవసరమైన సిలికాన్ మెటీరియల్, మల్టీ–క్రిస్టలైన్ వేఫర్లు, గృహాలు .. పరిశ్రమలు .. సోలార్ పార్కుల్లో ఉపయోగించే మాడ్యూల్స్‌ను తయారు చేస్తుంది. పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తి రంగంలో కార్యకలాపాలు విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ఆర్ఈసీ కొనుగోలు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అధునాతన టెక్నాలజీతో పాటు అంతర్జాతీయంగా తయారీ సామర్థ్యాలు కూడా కంపెనీకి అందుబాటులోకి వస్తాయని వివరించాయి. సౌర విద్యుత్ పరిశ్రమ ఎక్కువగా చైనాపై ఆధారపడాల్సి వస్తున్న పరిస్థితుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆర్ఈసీని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం భారత్‌కి ఏటా 3 గిగావాట్ల సోలార్ సెల్స్, 15 గిగావాట్ల మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నాయి. 90 శాతం ఉత్పత్తులను చైనా, చైనీస్ కంపెనీల నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. 2019–20లో భారత్ 2.5 బిలియన్ డాలర్ల విలువ చేసే సోలార్ వేఫర్లు, సెల్స్, మాడ్యూల్స్, ఇన్వర్టర్లను దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
హెచ్‌యూఆర్‌ఎల్‌లో ఉద్యోగాలు.. ఏడాదికి 3 లక్షల జీతం
ఐఓసీఎల్, ఎన్టీపీసీ, సీఐఎల్, ఎఫ్‌సీఐఎల్, హెచ్ఎఫ్సీఎల్ సంస్థల అనుబంధ సంస్థ అయిన హిందూస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్(హెచ్యూఆర్ఎల్).. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 513 ► పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్, అకౌంట్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్, క్వాలిటీ అసిస్టెంట్. ► విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, స్టోర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఏ/బీఎస్సీ/బీకాం/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: ఫ్రెషర్స్‌కి ఏడాదికి రూ.3 లక్షలు, అనుభవం ఆధారంగా గరిష్టంగా ఏడాదికి రూ.5.8 లక్షలు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021 ► వెబ్సైట్: www.hurl.net.in ఆర్ఈసీ పవర్ డెవలప్మెంట్లో 29 ఎగ్జిక్యూటివ్ పోస్టులు భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఆర్ఈసీ పవర్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో నిర్ణీత కాల ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 29 ► పోస్టుల వివరాలు: సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్. ► విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ మెటీరియల్ ఇన్స్పెక్షన్, సివిల్, ఎఫ్ అండ్ ఏ, కాంట్రాక్ట్–ప్రొక్యూర్మెంట్. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో బీఈ/బీటెక్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 35ఏళ్ల నుంచి 48ఏళ్ల మధ్య ఉండాలి. ► జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.62,000 నుంచి 1,35,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దర ఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.08.2021 ► వెబ్సైట్: www.recpdcl.in -
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆర్ఈసీ ఆమోదం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2016–17 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా సవరించేందుకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ(ఆర్ఈసీ) ఆమోదం తెలిపింది. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్ఈసీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. ఆర్ఈసీ ఇచ్చే నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర మంత్రిమండలికి(కేబినెట్) పంపనుంది. ఆ నివేదికపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం లాంఛనమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులపై నిపుణుల కమిటీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలతో దర్యాప్తు చేయించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేసింది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించింది. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసి.. నిధులు విడుదల చేస్తే పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేస్తామని ప్రధానికి సీఎం వైఎస్ జగన్ పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులు సజావుగా సాగుతున్నాయని హల్దార్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలవరంలో సవరించిన అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఖరారు చేసిన ఆర్ఈసీ.. ఆమోదముద్ర వేసింది. కేంద్రం ఇంకా ఇవ్వాల్సింది రూ.29,957.97 కోట్లు - పోలవరం ప్రాజెక్టు పనులకు 2014 ఏప్రిల్ 1 వరకూ రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే పూర్తి చేసి ఇవ్వాలి. - పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో 2014 ఏప్రిల్ 1 తర్వాత ప్రాజెక్టుకు నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం మెలిక పెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల 2014 ఏప్రిల్ 1 దాకా చేసిన వ్యయం రూ.5,135.87 కోట్లు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు... వెరసి రూ.9,260.51 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే నష్టపోవాల్సి వచ్చింది. - ఆర్ఈసీ ఆమోదించిన వ్యయం ప్రకారం జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు. అంటే.. ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయం రూ.43,601.1 కోట్లు. ఏప్రిల్ 1, 2014 నుంచి ఇప్పటిదాకా రూ.8,507.26 కోట్లు విడుదల చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే పోలవరానికి కేంద్రం ఇంకా రూ.29,957.97 కోట్లను విడుదల చేయాలి. -
తుది అంకానికి ఆమోదం
సాక్షి, అమరావతి: పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల ఆమోద ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. గురువారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ జాయింట్ కమిషనర్, ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్‌గుప్తా నేతృత్వంలో సమావేశమైన రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ (ఆర్ఈసీ)సవరించిన అంచనాలను ఆమోదించింది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ కింద చెల్లించే పరిహారాన్ని ఎలా లెక్కగట్టారో ఈనెల 31న వివరణ ఇస్తే నవంబర్ 1న లేదా 2న కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపుతామని స్పష్టం చేసింది. ఈ నివేదికపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేస్తే పోలవరానికి సవరించిన అంచనాల ప్రకారం నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లతో పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఇప్పటికే ఆమోదించింది. సీడబ్ల్యూసీ టీఏసీ నివేదికపై కేంద్ర జల్‌శక్తి శాఖ జాయింట్ కమిషనర్ జగ్‌మోహన్‌గుప్తా నేతృత్వంలో పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో ఆర్కే జైన్, సీడబ్ల్యూసీ పీఏవో విభాగం డైరెక్టర్ అతుల్‌జైన్, కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్ అమర్దీప్సింగ్ చౌదరి, కేంద్ర ఆర్థిక శాఖ ప్రాజెక్టు కాస్ట్ ఎనాలసిస్ విభాగం డైరెక్టర్ ఉపేంద్రసింగ్‌లు సభ్యులుగా ఏర్పాటైన ఆర్ఈసీ గురువారం సమావేశమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనుల అంచనాలకు ఆమోదం.. పోలవరం పనుల సవరించిన అంచనా వ్యయం రూ.22,380.63 కోట్లు. ఇందులో హెడ్‌వర్క్స్ వ్యయం రూ.9734.34 కోట్లు కాగా ఎడమ కాలువ వ్యయం రూ.4202.69 కోట్లు, కుడి కాలువ వ్యయం రూ.4318.96 కోట్లు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4124.64 కోట్లు ఉంది. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై సీడబ్ల్యూసీ టీఏసీ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం లభించింది. పోలవరం భూసేకరణ, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ సవరించిన అంచనా వ్యయం రూ.33,168.24 కోట్లు. ఇందులో హెడ్ వర్క్స్‌లో ముంపునకు గురయ్యే భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ వ్యయం రూ.29,270.52 కోట్లు కాగా ఎడమ కాలువ భూసేకరణ వ్యయం రూ.2002.55 కోట్లు. కుడి కాలువ భూసేకరణ వ్యయం రూ.1895.17 కోట్లు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనకు సంబంధించి పోలవరం ముంపు మండలాల్లో కొన్ని చోట్ల భూసేకరణ అవార్డులను కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్ అమర్‌దీసింగ్ ప్రస్తావిస్తూ 2014కి ముందు ఎకరానికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తే తర్వాత సగటున రూ.11.52 లక్షల చొప్పున పరిహారం చెల్లించారని దీన్ని ఎలా లెక్క గట్టారని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చాక భూమి మార్కెట్ విలువ ఎకరం రూ.3.50 లక్షలు అయిందని, దీనికి రెండున్నర రెట్లు ‘సొలీషియం’ కలిపితే రూ.11.52 లక్షలు అవుతుందని, కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలు వీటిని లెక్క కట్టాయని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ వెంకటేశ్వరరావులు వివరించారు. (‘సొలీషియం’ అంటే భూమి కోల్పోవటం వల్ల జీవనోపాధులపై పడే ప్రభావం ఆధారంగా చెల్లించే పరిహారం) నిర్వాసితులకు ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణానికి తక్కువ ఖర్చు అవుతుందని, కానీ పోలవరం నిర్వాసితులకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని.. పునరావాస కల్పన మొత్తాన్ని ఎలా లెక్క కట్టారని అమర్దీప్ సింగ్, ఉపేంద్రసింగ్‌లు ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పందిస్తూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ముంపు గ్రామాల్లో నిర్వాసితులు కోల్పోయిన ఇళ్లలో ఒక్కో ఇంటికి సగటున రూ.మూడు లక్షలు, ఇళ్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇంటి నిర్మాణానికి రూ.3.15 లక్షలు, నిర్వాసిత కుటుంబాలకు రూ.6.86 లక్షల చొప్పున పరిహారం, పునరావాస కాలనీల్లో 24 రకాల మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.ఏడు లక్షల చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. సవరించిన అంచనాల మేరకు నిధులిస్తే 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. నిధుల మంజూరులో జాప్యం జరిగితే ఆ ప్రభావం పనులపై పడి అంచనా వ్యయం పెరిగేందుకు దారి తీస్తుందన్నారు. ఆయన వివరణతో ఆర్ఈసీ సభ్యులు ఏకీభవించారు. ఇదే తుది సమావేశం.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలకు సంబంధించి ఇదే తుది సమావేశమని ఆర్ఈసీ చైర్మన్ జగన్మోహన్గుప్తా స్పష్టం చేశారు. భూసేకరణ పరిహారం, నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీకి వ్యయాన్ని ఎలా లెక్క కట్టారనే వివరాలతో అధికారులను ఈనెల 31న ఢిల్లీకి పంపాలని అమర్దీప్సింగ్ సూచించారు. ఆ తర్వాత సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపుతామన్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి అమర్దీప్ సింగ్, ఉపేంద్ర సింగ్‌లు వివరించనున్నారు. వారిద్దరూ ఆర్ఈసీలో సభ్యులు. ఈ నేపథ్యంలో ఆర్ఈసీ నివేదిక ఆధారంగా పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర లాంఛనమేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరానికి కేంద్ర ఆర్థిక శాఖ నాబార్డు ద్వారా నిధులను విడుదల చేస్తుంది. వారంలో ఆర్ఈసీ నివేదిక.. ‘పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై ఆర్ఈసీ సమగ్రంగా చర్చించింది. ప్రాజెక్టు పనుల వ్యయానికి సంబంధించి ఆమోదం తెలిపింది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయాన్ని ఎలా లెక్క కట్టారనే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్ అమర్దీప్ సింగ్ వివరణ కోరారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం మార్కెట్ విలువకు రెండున్నర రెట్లు సొలీషియం కలిపి పరిహారాన్ని ఇవ్వాల్సి ఉంటుందని.. ఆ లెక్క ప్రకారమే సగటున రూ.11.52 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తున్నామని వివరించాం. ఇదే చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీని అమలు చేస్తున్నామని తెలిపాం. సహాయ పునరావాస ప్యాకేజీ విభాగం అధికారులను 31న ఢిల్లీ పంపాలని అమర్దీప్సింగ్ సూచించారు. నవంబర్ 1న లేదా 2న కేంద్ర ఆర్థిక శాఖకు ఆర్ఈసీ నివేదిక పంపుతుంది. దాని ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటుంది. పోలవరాన్ని 2021కి పూర్తి చేయాలంటే సవరించిన అంచనాల మేరకు నిధులు ఇవ్వాలని కోరాం’ – ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర జలవనరుల శాఖ 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం లెక్కింపు ‘భూసేకరణ చట్టం 2013 ప్రకారమే భూసేకరణ పరిహారం, సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయాన్ని లెక్కించాం. ఇదే అంశాన్ని ఆర్ఈసీకి వివరించాం. అమర్దీప్ సింగ్ ప్రస్తావించిన అంశాలపై వివరణ ఇచ్చేందుకు ఈనెల 31న సహాయ పునరావాస ప్యాకేజీ విభాగం అధికారులను ఢిల్లీ పంపుతాం. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖకు ఆర్ఈసీ నివేదిక పంపుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ ఏవైనా సందేహాలను వ్యక్తం చేస్తే అమర్దీప్సింగ్, ఉపేంద్రసింగ్‌లే నివృత్తి చేస్తారు’ – ఎం.వెంకటేశ్వరరావు, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
కేంద్రానికి ఆర్ఈసీ 1,143 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఈసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.11 (110 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. డివిడెండ్ చెల్లింపుల్లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,143 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది. ఈ మొత్తానికి సమానమైన ఆర్టీజీఎస్ క్రెడిట్ అడ్వైస్‌ను ఆర్ఈసీ ప్రభుత్వానికి అందజేసింది. రూ.96,357 కోట్ల రుణాలు: ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి కొత్త ప్రాజెక్ట్‌ల కోసం రూ.96,357 కోట్లు మంజూరు చేశామని, వీటిల్లో రూ.52,269 కోట్లు పంపిణీ చేశామని ఆర్ఈసీ వివరించింది. ఈ తొమ్మిది నెలల కాలంలో స్థూల లాభం 32 శాతం వృద్ధితో రూ.6,466 కోట్లకు, నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.4,508 కోట్లకు పెరిగిందని పేర్కొంది. -
ఆర్ఈసీలో వాటా విక్రయానికి ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరిన్ని సంస్థల విలీనాలకు తెరతీస్తూ ఆర్ఈసీలో వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకా రం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)కు మొత్తం 52.63% వాటాలను విక్రయించనుంది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ డీల్ ద్వారా ఖజానాకు సుమారు రూ.15,000 కోట్లు దఖలు పడనున్నాయి. వాస్తవానికి ఆర్‌ఈసీకే పీఎఫ్‌సీలో వాటాలను విక్రయించాలని ముందుగా భావించినప్పటికీ... విద్యుత్ శాఖ జోక్యంతో ప్రతిపాదన మారింది. సెప్టెంబర్ ఆఖరు నాటికి కేంద్రానికి ఆర్ఈసీలో 57.99 శాతం, పీఎఫ్‌సీలో 65.64 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, ఈటీఎఫ్ ద్వారా కొన్ని వాటాలను విక్రయించడంతో ఆర్ఈసీలో కేంద్రం హోల్డింగ్ 52.63 శాతానికి తగ్గింది. మరోవైపు, 2022 నాటికి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను రెట్టింపు స్థాయిలో 60 బిలియన్ డాలర్లకు పెంచుకునే లక్ష్యంలో భాగంగా కొత్త వ్యవసాయ ఎగుమతి విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. టీ, కాఫీ, బియ్యం వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను పెంచుకోవడానికి, అంతర్జాతీయ అగ్రి–ట్రేడ్‌లో మరింత వాటా దక్కించుకునేందుకు ఇది దోహదపడగలదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. మౌలిక సదుపాయాల ఆధునీకరణ, ఉత్పత్తులకు ప్రమాణాలు నెలకొల్పడం, నిబంధనలను క్రమబద్ధీకరించడం, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి సారించడం వంటి అంశాలకు ఈ విధానం కింద ప్రాధాన్యం లభించనున్నట్లు ఆయన వివరించారు. -
ఆర్ఈసీ ఆఫర్ ధర రూ. 315
నేడు ఆఫర్ ఫర్ సేల్ న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)లో 5 శాతం వాటాలు విక్రయిస్తున్న కేంద్ర ప్రభుత్వం షేరు ధరను రూ. 315గా నిర్ణయించింది. బీఎస్ఈలో మంగళవారం క్లోజింగ్ ధర రూ. 321.65తో పోలిస్తే ఇది 2.07 శాతం తక్కువ. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ప్రభుత్వం 4.93 కోట్ల షేర్లను నేడు (ఈ నెల 8న) విక్రయిస్తోంది. తద్వారా రూ. 1,552 కోట్లు సమీకరించనుంది. ఆఫర్లో 20 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు, 25 శాతం షేర్లను మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలకు కేటాయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 2 లక్షల దాకా విలువ చేసే షేర్ల కోసం బిడ్ చేయొచ్చు. వారికి ఇష్యూ ధరతో పోలిస్తే 5 శాతం డిస్కౌంటుకు షేర్లు లభిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 41,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకోగా.. ఈ ప్రక్రియలో అన్నింటికన్నా ముందుగా మార్కెట్‌కు వస్తున్నది ఆర్ఈసీనే. -
రేపు ఆర్ఈసీలో వాటాల విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)లో 5 శాతం వాటాల విక్రయాన్ని కేంద్రం ఏప్రిల్ 8న చేపట్టనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో 4.93 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ. 1,600 కోట్లు సమీకరించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి డిజిన్వెస్ట్‌మెంట్ కానుంది. సోమవారం బీఎస్ఈలో ఆర్ఈసీ షేర్లు 0.52 శాతం క్షీణించి రూ. 335.60 వద్ద ముగిశాయి. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే ఓఎఫ్ఎస్ షేరు రేటును ప్రభుత్వం మరింత తక్కువగా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ఆఫర్లో 20 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. ఇష్యూ ధరతో పోలిస్తే వారికి 5 శాతం డిస్కౌంటు లభిస్తుంది. -
2014-19 ఆర్థిక సంవత్సరాలకు ఈఆర్సీ ఆదేశాలు
వ్యతిరేకిస్తున్న విద్యుత్‌రంగ నిపుణులు సాక్షి, హైదరాబాద్: సంప్రదాయేతర ఇంధన (ఎన్సీఈ) వనరుల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌కు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ధర ఖరారు చేసింది. ఈ మేరకు ఈఆర్సీ చైర్మన్ భాస్కర్, సభ్యులు రాజగోపాల్ రెడ్డి, అశోకాచారిలు శనివారం ఆదేశాలు జారీ చేశారు. బగాసీ, బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాల ద్వారా ఉత్పత్తి చేసే సంప్రదాయేతర ఇంధన వనరులకు ఈఆర్సీ వేరియబుల్ టారిఫ్ (అస్థిర చార్జీలు)ను నిర్ణయించింది. 2014-15 నుంచి 2018-2019 ఆర్థిక సంవత్సరం వరకు అంటే రానున్న ఐదేళ్ల కాలానికి ధరలను ఖరారు చేసింది. బగాసీ అంటే చెరుకు పిప్పి ద్వారా విద్యుత్‌ను తయారుచేసే ప్లాంట్లకు యూనిట్‌కు రూ.2.73 నుంచి రూ.3.44 వరకు చెల్లించాలని నిర్ణయించింది. పారిశ్రామిక వ్యర్థాలతో పాటు బయోమాస్ (ఊక) ద్వారా ఉత్పత్తి చేసే యూనిట్ విద్యుత్‌కు రూ.4.28 నుంచి రూ.5.40 వరకు ధర నిర్ణయించింది. అరుుతే ఈఆర్సీ ఆదేశాలపై విద్యుత్‌రంగ నిపుణులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ హడావుడి నిర్ణయాలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ఈఆర్సీ ఆరు నెలల పాటే కొనసాగనుండగా రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఈఆర్సీలు ఏర్పాటుకానున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రైవేటు ప్లాం ట్లకు మేలు చేకూరేలా ఆదేశాలు జారీ చేయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అస్థిర చార్జీల వివరాలు (రూ.లలో) ఆర్థిక సంవత్సరం బగాసీ బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాలు 2014-15 2.73 4.28 2015-16 2.89 4.54 2016-17 3.06 4.81 2017-18 3.25 5.10 2018-19 3.44 5.40