సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2016–17 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా సవరించేందుకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ(ఆర్‌ఈసీ) ఆమోదం తెలిపింది. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్‌ఈసీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. ఆర్‌ఈసీ ఇచ్చే నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర మంత్రిమండలికి(కేబినెట్) పంపనుంది. ఆ నివేదికపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం లాంఛనమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులపై నిపుణుల కమిటీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలతో దర్యాప్తు చేయించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేసింది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించింది. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసి.. నిధులు విడుదల చేస్తే పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేస్తామని ప్రధానికి సీఎం వైఎస్ జగన్ పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులు సజావుగా సాగుతున్నాయని హల్దార్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలవరంలో సవరించిన అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఖరారు చేసిన ఆర్‌ఈసీ.. ఆమోదముద్ర వేసింది.
కేంద్రం ఇంకా ఇవ్వాల్సింది రూ.29,957.97 కోట్లు
- పోలవరం ప్రాజెక్టు పనులకు 2014 ఏప్రిల్ 1 వరకూ రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే పూర్తి చేసి ఇవ్వాలి.
- పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో 2014 ఏప్రిల్ 1 తర్వాత ప్రాజెక్టుకు నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం మెలిక పెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల 2014 ఏప్రిల్ 1 దాకా చేసిన వ్యయం రూ.5,135.87 కోట్లు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు... వెరసి రూ.9,260.51 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే నష్టపోవాల్సి వచ్చింది.
- ఆర్‌ఈసీ ఆమోదించిన వ్యయం ప్రకారం జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు. అంటే.. ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయం రూ.43,601.1 కోట్లు. ఏప్రిల్ 1, 2014 నుంచి ఇప్పటిదాకా రూ.8,507.26 కోట్లు విడుదల చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే పోలవరానికి కేంద్రం ఇంకా రూ.29,957.97 కోట్లను విడుదల చేయాలి.
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆర్‌ఈసీ ఆమోదం
Published Sat, Mar 7 2020 3:59 AM | Last Updated on Sat, Mar 7 2020 4:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment