తుది అంకానికి ఆమోదం | Polavaram Amendment Estimated Cost Proposals Approved By REC | Sakshi
Sakshi News home page

తుది అంకానికి ఆమోదం

Published Fri, Oct 25 2019 3:18 AM | Last Updated on Fri, Oct 25 2019 6:50 AM

Polavaram Amendment Estimated Cost Proposals Approved By REC - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల ఆమోద ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. గురువారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ జాయింట్‌ కమిషనర్, ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్‌గుప్తా నేతృత్వంలో సమావేశమైన రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ (ఆర్‌ఈసీ)సవరించిన అంచనాలను ఆమోదించింది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ కింద చెల్లించే పరిహారాన్ని ఎలా లెక్కగట్టారో ఈనెల 31న వివరణ ఇస్తే నవంబర్‌ 1న లేదా 2న కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపుతామని స్పష్టం చేసింది. ఈ నివేదికపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేస్తే పోలవరానికి సవరించిన అంచనాల ప్రకారం నిధులను కేంద్రం విడుదల చేస్తుంది.

2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లతో పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఇప్పటికే ఆమోదించింది. సీడబ్ల్యూసీ టీఏసీ నివేదికపై కేంద్ర జల్‌శక్తి శాఖ జాయింట్‌ కమిషనర్‌ జగ్‌మోహన్‌గుప్తా నేతృత్వంలో పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో ఆర్కే జైన్, సీడబ్ల్యూసీ పీఏవో విభాగం డైరెక్టర్‌ అతుల్‌జైన్, కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్‌ అమర్‌దీప్‌సింగ్‌ చౌదరి, కేంద్ర ఆర్థిక శాఖ ప్రాజెక్టు కాస్ట్‌ ఎనాలసిస్‌ విభాగం డైరెక్టర్‌ ఉపేంద్రసింగ్‌లు సభ్యులుగా ఏర్పాటైన  ఆర్‌ఈసీ గురువారం సమావేశమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పనుల అంచనాలకు ఆమోదం..

  • పోలవరం పనుల సవరించిన అంచనా వ్యయం రూ.22,380.63 కోట్లు. ఇందులో హెడ్‌వర్క్స్‌ వ్యయం రూ.9734.34 కోట్లు కాగా ఎడమ కాలువ వ్యయం రూ.4202.69 కోట్లు, కుడి కాలువ వ్యయం రూ.4318.96 కోట్లు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4124.64 కోట్లు ఉంది. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై సీడబ్ల్యూసీ టీఏసీ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం లభించింది.
  • పోలవరం భూసేకరణ, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ సవరించిన అంచనా వ్యయం రూ.33,168.24 కోట్లు. ఇందులో హెడ్‌ వర్క్స్‌లో ముంపునకు గురయ్యే భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ వ్యయం రూ.29,270.52 కోట్లు కాగా ఎడమ కాలువ భూసేకరణ వ్యయం రూ.2002.55 కోట్లు. కుడి కాలువ భూసేకరణ వ్యయం రూ.1895.17 కోట్లు.
  • సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనకు సంబంధించి పోలవరం ముంపు మండలాల్లో కొన్ని చోట్ల భూసేకరణ అవార్డులను కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్‌ అమర్‌దీసింగ్‌ ప్రస్తావిస్తూ 2014కి ముందు ఎకరానికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తే తర్వాత సగటున రూ.11.52 లక్షల చొప్పున పరిహారం చెల్లించారని దీన్ని ఎలా లెక్క గట్టారని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చాక భూమి మార్కెట్‌ విలువ ఎకరం రూ.3.50 లక్షలు అయిందని, దీనికి రెండున్నర రెట్లు ‘సొలీషియం’ కలిపితే రూ.11.52 లక్షలు అవుతుందని, కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీలు వీటిని లెక్క కట్టాయని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావులు వివరించారు. (‘సొలీషియం’ అంటే భూమి కోల్పోవటం వల్ల జీవనోపాధులపై పడే ప్రభావం ఆధారంగా చెల్లించే పరిహారం)
  • నిర్వాసితులకు ఇందిరా ఆవాస్‌ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణానికి తక్కువ ఖర్చు అవుతుందని, కానీ పోలవరం నిర్వాసితులకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని.. పునరావాస కల్పన మొత్తాన్ని ఎలా లెక్క కట్టారని అమర్‌దీప్‌ సింగ్, ఉపేంద్రసింగ్‌లు ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పందిస్తూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ముంపు గ్రామాల్లో నిర్వాసితులు కోల్పోయిన ఇళ్లలో ఒక్కో ఇంటికి సగటున రూ.మూడు లక్షలు, ఇళ్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇంటి నిర్మాణానికి రూ.3.15 లక్షలు, నిర్వాసిత కుటుంబాలకు రూ.6.86 లక్షల చొప్పున పరిహారం, పునరావాస కాలనీల్లో 24 రకాల మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.ఏడు లక్షల చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు.
  • సవరించిన అంచనాల మేరకు నిధులిస్తే 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆదిత్యనాథ్‌ దాస్‌ తెలిపారు. నిధుల మంజూరులో జాప్యం జరిగితే ఆ ప్రభావం పనులపై పడి అంచనా వ్యయం పెరిగేందుకు దారి తీస్తుందన్నారు. ఆయన వివరణతో ఆర్‌ఈసీ సభ్యులు ఏకీభవించారు. 

ఇదే తుది సమావేశం..
సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలకు సంబంధించి ఇదే తుది సమావేశమని ఆర్‌ఈసీ చైర్మన్‌ జగన్‌మోహన్‌గుప్తా స్పష్టం చేశారు. భూసేకరణ పరిహారం, నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీకి వ్యయాన్ని ఎలా లెక్క కట్టారనే  వివరాలతో అధికారులను ఈనెల 31న ఢిల్లీకి పంపాలని అమర్‌దీప్‌సింగ్‌ సూచించారు. ఆ తర్వాత సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపుతామన్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి అమర్‌దీప్‌ సింగ్, ఉపేంద్ర సింగ్‌లు వివరించనున్నారు. వారిద్దరూ ఆర్‌ఈసీలో సభ్యులు. ఈ నేపథ్యంలో ఆర్‌ఈసీ నివేదిక ఆధారంగా పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర లాంఛనమేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి మండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరానికి కేంద్ర ఆర్థిక శాఖ నాబార్డు ద్వారా నిధులను విడుదల చేస్తుంది.

వారంలో ఆర్‌ఈసీ నివేదిక..
‘పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై ఆర్‌ఈసీ సమగ్రంగా చర్చించింది. ప్రాజెక్టు పనుల వ్యయానికి సంబంధించి ఆమోదం తెలిపింది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయాన్ని ఎలా లెక్క కట్టారనే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్‌ అమర్‌దీప్‌ సింగ్‌ వివరణ కోరారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం మార్కెట్‌ విలువకు రెండున్నర రెట్లు సొలీషియం కలిపి పరిహారాన్ని ఇవ్వాల్సి ఉంటుందని.. ఆ లెక్క ప్రకారమే సగటున రూ.11.52 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తున్నామని వివరించాం. ఇదే చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీని అమలు చేస్తున్నామని తెలిపాం. సహాయ పునరావాస ప్యాకేజీ విభాగం అధికారులను 31న ఢిల్లీ పంపాలని అమర్‌దీప్‌సింగ్‌ సూచించారు. నవంబర్‌ 1న లేదా 2న కేంద్ర ఆర్థిక శాఖకు ఆర్‌ఈసీ నివేదిక పంపుతుంది. దాని ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటుంది. పోలవరాన్ని 2021కి పూర్తి చేయాలంటే సవరించిన అంచనాల మేరకు నిధులు ఇవ్వాలని కోరాం’   
– ఆదిత్యనాథ్‌ దాస్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర జలవనరుల శాఖ

2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం లెక్కింపు
‘భూసేకరణ చట్టం 2013 ప్రకారమే భూసేకరణ పరిహారం, సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయాన్ని లెక్కించాం. ఇదే అంశాన్ని ఆర్‌ఈసీకి వివరించాం. అమర్‌దీప్‌ సింగ్‌ ప్రస్తావించిన అంశాలపై వివరణ ఇచ్చేందుకు ఈనెల 31న సహాయ పునరావాస ప్యాకేజీ విభాగం అధికారులను ఢిల్లీ పంపుతాం. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖకు ఆర్‌ఈసీ నివేదిక పంపుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ ఏవైనా సందేహాలను వ్యక్తం చేస్తే అమర్‌దీప్‌సింగ్, ఉపేంద్రసింగ్‌లే నివృత్తి చేస్తారు’ 
– ఎం.వెంకటేశ్వరరావు, ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్, జలవనరుల శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement