సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో ఏపీలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు అత్యుత్తమమని కేంద్రానికి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) ప్రకటించింది. డిస్కంల పనితీరును అంచనా వేసి, వినియోగదారులకు తమ డిస్కం అందిస్తున్న సేవల నాణ్యత గురించి తెలియజేసేందుకు ఆర్‌ఈసీ అధ్యయనం చేపట్టింది. ‘కన్స్యూమర్ సర్విస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్ 2022–23’ పేరుతో ఆ నివేదికను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఢిల్లీలో విడుదల చేశారు.
ఈ నివేదిక ప్రకారం.. ఏపీలో 1.92 కోట్ల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు డిస్కంలకు ఏ–గ్రేడ్ లభించింది. దేశంలోని 62 డిస్కంలను పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం చేసినట్లు ఆర్‌ఈసీ పేర్కొంది. అధ్యయనంలో భాగంగా డిస్కంలను జనరల్, అర్బన్, ప్రత్యేక వర్గంగా విభజించారు. వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి, వారు చెప్పిన దాని ప్రకారం స్కోర్ ఇచ్చారు.
ఆ స్కోర్ ఆధారంగా ‘ఏ+, ఏ, బి+, బి, సి+, సి, డి+, డి’ అంటూ 7 విభాగాల్లో వినియోగదారుల సేవా రేటింగ్‌లను కేటాయించారు. ఈ 3వ ఎడిషన్‌లో కేవలం 4 డిస్కంలు మాత్రమే ‘ఏ+’ గ్రేడ్ సాధించాయి. ‘ఏ’ గ్రేడ్‌లో ఏపీతోపాటు 8 రాష్ట్రాల డిస్కంలకు స్థానం లభించింది.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే..
‘రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అందిస్తున్న ప్రోత్సాహం కారణంగానే వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ దేశంలో అత్యుత్తమంగా నిలవగలుగుతున్నాం. ప్రభుత్వ ఆర్థక సాయంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి పరుచుకుంటున్నాం. మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నాం. వాటి ద్వారా విద్యుత్ సరఫరాలో నాణ్యతను పెంచుకుని నష్టాలు తగ్గించుకుంటున్నాం’. –కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్
ఆదర్శంగా నిలుస్తున్నాం
‘డిస్కంలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుంటోంది. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ అందించడంలో రాజీపడకుండా దేశంలో మరెక్కడా లేనంతగా రైతులకు విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. దీనికి రా>నున్న 30 ఏళ్ల వరకూ ఎలాంటి అవాంతరాలు రాకుండా సెకీతో 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.’ – ఐ.పృథ్వీతేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్
Comments
Please login to add a commentAdd a comment