power plants
-
రాష్ట్రంలో మరిన్ని పీఎస్పీ ప్లాంట్లకు అవకాశం.. అసలు అవేంటో తెలుసా..
తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ విద్యుత్(పీఎస్పీ) ప్లాంట్లు నిర్మించేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ మేరకు తెహ్రీ జలవిద్యుత్ అభివృద్ధి సంస్థ(టీహెచ్‌డీసీ) సర్వే అందుకు సంబంధించిన అంశాలను వెల్లడించింది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం..మొత్తం 9 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న పీఎస్పీలను నిర్మించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అవకాశమిస్తే ప్లాంట్ల నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక అందజేస్తామని టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఈ సంస్థ అధికారులు ఇటీవల హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) అధికారులతో చర్చించినట్లు తెలిసింది. శ్రీశైలం డ్యాం దిగువన 1200 మెగావాట్లు, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ఆధారంగా 900 మెగావాట్లు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల వద్ద మరో 2 వేల మెగావాట్లు, రాష్ట్రంలోని ఇతర జలాశయాల వద్ద మిగిలిన ప్లాంట్లను నిర్మించవచ్చని ప్రాథమిక సర్వేలో తెలిపింది. తెలంగాణలో ఈ ప్లాంట్లు నిర్మించేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. జెన్కోకు శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద నిర్మాణానికి మంచి అవకాశాలున్నాయని తెహ్రీ సంస్థ తెలిపింది. నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. పీఎస్పీ అంటే.. పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ అనేది ఒక రకమైన జల విద్యుత్ శక్తి నిల్వ ప్రాజెక్టు. దీనిని వేర్వేరు ఎత్తులలో ఉన్న రెండు నీటి రిజర్వాయర్లపై నిర్మిస్తారు. ఈ ప్లాంట్లు సంప్రదాయ జల విద్యుత్ ప్లాంట్లలానే పనిచేస్తాయి. వీటికి అదనంగా అదే నీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే సామర్థ్యం ఉంటుంది. అంతేకాదు పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లలో పగటిపూట చార్జింగ్ సౌర ఫలకల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్ నుంచి దిగువ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడం వల్ల టర్బైన్ కిందకి కదిలి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒక సారి నిర్మించిన ప్రాజెక్టు ఎనభై ఏళ్ల వరకూ పనిచేస్తుంది. 1890 కాలంలో ఇటలీ, స్విట్జర్లాండ్‌లో మొదలైన పీఎస్పీ సాంకేతికత 1930లో యునైటెడ్ స్టేట్స్లో అడుగుపెట్టింది. ఇప్పుడిది ప్రపంచమంతా విస్తరించింది. తాజాగా మన దేశంలో పీఎస్పీల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అవతరించింది. ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం.. వర్క్‌ఫ్రం హాస్పిటల్! ఏపీలో ఇలా.. దేశం మొత్తం మీద 2030–31 నాటికి 18.8 గిగావాట్ల సామర్థ్యం ఉన్న పీఎస్పీల అవసరం ఉందని కేంద్ర ఇంధన శాఖ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎగువ సీలేరులో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీ నిర్మాణానికి కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) అనుమతి కూడా ఇచ్చింది. ప్రైవేటు రంగంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్ కో గ్రూప్ 1,680 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మిస్తోంది. -
రుణ ఆంక్షలపై తగ్గిన కేంద్రం!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాజెక్టులు, పథకాలకు రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఏప్రిల్ నుంచి వివిధ సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) సంస్థలు రుణాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా సదరు రుణాల పునరుద్ధరణపై ఈ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఆర్ఈసీ నుంచి రూ.992.25 కోట్ల రుణం విడుదలైంది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ)కు కూడా రుణాలను పునరుద్ధరించడానికి ఆర్ఈసీ, పీఎఫ్సీలు ముందుకు వచ్చాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీకరిస్తున్న రుణాలతో.. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను సమర్పించిన తర్వాత.. తాజా రుణాలు విడుదల కానున్నాయని అధికారులు వెల్లడించారు. పీఎఫ్సీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.340 కోట్ల రుణం విడుదలైనట్టు వార్తలు వచ్చినా అధికారులు ధ్రువీకరించలేదు. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జరిగిన యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు సంబంధించి రూ.992.25 కోట్ల రుణాన్ని ఆర్ఈసీ రెండు రోజుల కింద విడుదల చేయగా.. జెన్కో వెంటనే నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్కు బిల్లుల బకాయిలను చెల్లించిందని అధికార వర్గాలు తెలిపాయి. రుణాల పునరుద్ధరణ జరగడంతో యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరిలోగా పూర్తి చేయగలమని జెన్కో చెబుతోంది. బడ్జెట్ రుణాల్లో చేరుస్తామంటూ ఆపేసి.. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితికి మించి అప్పులు చేశారంటూ, కొత్త రుణాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కొద్దినెలల కింద ఆంక్షలు విధించింది. కార్పొరేషన్ల పేరిట తీసుకుంటున్న రుణాలను కూడా రాష్ట్ర బడ్జెట్ రుణాల కింద లెక్కగడతామని పేర్కొంది. ఈ క్రమంలో విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకోసం ఆర్ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రావాల్సిన రుణాలు నిలిచిపోయాయి. జెన్కో/కాళేశ్వరం కార్పొరేషన్లతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి.. ఆర్ఈసీ/పీఎఫ్‌సీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటేనే మిగులు రుణాలు విడుదల చేస్తామని కేంద్రం ఆంక్షలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో.. కేంద్రం పెట్టిన ఆంక్షలకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. రుణాల కోసం జెన్కో/కాళేశ్వరం కార్పొరేషన్‌తో ఆర్ఈసీ/పీఎఫ్‌సీల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ వెంటనే రుణాలను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి లేఖలు రాశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం.. కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రుణాల పునరుద్ధరణపై చర్చలు జరిపింది. రాష్ట్రంపై ఆర్థిక ఆంక్షలు విధించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ బహిరంగంగా ఆరోపణలు సైతం చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం మెట్టుదిగి రుణాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒప్పందాల మేరకు కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఆర్ఈసీ నుంచి రూ.1,200 కోట్లు, పీఎఫ్సీ నుంచి రూ.2,000 కోట్ల రుణాలు రావాల్సి ఉంది. దీనితో కాళేశ్వరం మూడో టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల పనులు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
సింగరేణికి సోలార్ ఎక్సలెన్స్ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణలో ఉత్తమ ఫలితాలు సాధించి నందుకు సింగరేణి బొగ్గుగనుల సంస్థకు జాతీయ స్థాయిలో సోలార్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఏషియన్ పసిఫిక్, ఆఫ్రికన్ దేశా ల్లో సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు అవార్డులను అందించే సోలార్ క్వార్టర్ అనే సంస్థ శుక్రవారం ఢిల్లీలో పురస్కారాన్ని జీఎం సూర్యనారాయణ రాజుకు అందజేసింది. -
కరెంట్ ‘కట్‘కట!
సాక్షి, హైదరాబాద్: బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు విద్యుత్ డిమాండ్, సరఫరాలను పరిశీలిస్తే.. మొత్తంగా నెలకొన్న లోటులో 11.2 శాతం మేర గత ఏడెనిమిది రోజుల్లోనే నమోదవడం గమనార్హం. అంతర్జాతీయంగా, దేశీయంగా బొగ్గు కొరత తీరి.. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి పునరుద్ధరించే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో.. జాతీయస్థాయిలో గ్రిడ్ నిర్వహణను నియంత్రించే ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పొసోకో)’రోజువారీ నివేదికలను విశ్లేషిస్తే.. గత వారం, పదిరోజులుగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లోనూ కొంతమేర విద్యుత్ కోతలు విధిస్తున్నారు. బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 8–7 గంటలకు మించి విద్యుత్ సరఫరా ఉండడం లేదని జాతీయ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. పొసోకో నివేదికల మేరకు.. జార్ఖండ్‌లో ఏకంగా 18–24 శాతం వరకు విద్యుత్ కొరత ఏర్పడగా, రాజస్థాన్‌లో 11 శాతం, బిహార్‌లో 6శాతం వరకు రోజువారీ విద్యుత్ కొరత తలెత్తుతోంది. దక్షిణాదిన కేరళలో విద్యుత్ కొరత ఎక్కువగా ఉండగా.. కర్ణాటకలో స్వల్పంగా కొరత కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్ తొలివారంలో దేశవ్యాప్తంగా నమోదైన విద్యుత్ లోటుతో పోల్చితే.. ఈసారి విద్యుత్ లోటు 21 రెట్లు ఎక్కువగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వారం రోజులుగా దేశంలో రోజూ సగటున 3,880 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ డిమాండ్ ఉండగా.. 80–110 ఎంయూ వరకు కొరత నమోదవుతోంది. 115 ప్లాంట్లలో 6 రోజులకే నిల్వలు.. ‘సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)’తాజా నివేదిక ప్రకారం.. దేశంలో 1,65,066 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో.. సగటున కేవలం 4 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయి. సాధారణంగా థర్మల్ ప్లాంట్లలో కనీసం 15 నుంచి 30 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ 115 ప్లాంట్లలో 0–6 రోజులకు సరిపడానే నిల్వలు ఉన్నాయి. 16,430 మెగావాట్ల సామర్థ్యమున్న 17 ప్లాంట్లలో సోమవారం నాటికి బొగ్గునిల్వలు ఖాళీకావడంతో.. వాటిలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అంతేగాకుండా చాలా థర్మల్ ప్లాంట్లు బొగ్గు కొరత కారణంగా సామర్థ్యం కన్నా తక్కువగా విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. దీనితో విద్యుత్‌కు డిమాండ్ బాగా పెరిగింది. బొగ్గుకు కొరత మొదలై.. ధరలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే చైనా వంటి దేశాలు సరిపడా బొగ్గు లేక విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చైనాలో పరిశ్రమలు మూతపడుతున్నాయి. మన దేశంలోనూ కొద్దిరోజులుగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడిన థర్మల్ ప్లాంట్లకు ఆర్థిక భారం పడింది. దేశీయంగా కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు సరఫరాను పెంచి సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కాగా ఏపీలోనూ బొగ్గు కొరత ఉందని, వెంటనే సరఫరా పెంచాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. -
తెలంగాణ విద్యుత్ సంస్థలకు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (ఆర్ఈసీ)ల నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రుణాల చెల్లింపులను గత నెల నుంచి కేంద్ర విద్యుత్ శాఖ అర్ధంతరంగా నిలుపుదల చేసింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపకపోవడం, బిల్లులోని నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగిం చకపోవడం, గత నాలుగేళ్లుగా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) సమర్పించకపోవడం తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ప్రతినెలా విడుదల కావాల్సిన రుణాలతోపాటు ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద డిస్కంలను ఆదుకోవ డానికి కేంద్రం ప్రకటించిన రుణాలు, ప్రతి నెలా విద్యుత్ కొనుగోళ్ల కోసం తీసుకునే స్వల్పకాలిక రుణాలు కలిపి గత నెల నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రావాల్సిన మొత్తం రూ. 12,600 కోట్ల రుణాలను కేంద్రం నిలుపుదల చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. హస్తిన వెళ్లినా లభించని ఊరట... కేంద్రం నిలుపుదల చేసిన రుణాలను తిరిగి విడుదల చేయించుకోవడానికి తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి గత గురువారం ఢిల్లీ వెళ్లి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె. సింగ్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన అందుబాటులోకి లేకపోవడంతో కేంద్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను కలసి తిరిగి వచ్చి నట్లు అధికార వర్గాల సమాచారం. కేంద్రం నిర్ధేశిం చిన లక్ష్యాల్లో భాగంగా విద్యుత్ బిల్లుకు మద్దతు తెలపాల్సిందేనని, వ్యవసాయ బోరుబావులకు మోటార్లు బిగించాలని, డిస్కంలకు నష్టాలు రాకుండా ఏటా విద్యుత్ బిల్లులు పెంచాలనే షరతులను అంగీకరిస్తేనే రుణాలను విడుదల చేస్తామని కేంద్ర అధికారులు సీఎండీలకు స్పష్టం చేసినట్లు సమాచారం. షరతుల విషయంలో కేంద్రం పట్టుదలతో ఉండటంతో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విద్యుత్ సంస్థల సీఎండీలకు ఊరట లభించలేదు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి నిధులు కటకట... రాష్ట్రంలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి, 1,080 మెగావాట్ల సామర్థ్యంగల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు గత నెల నుంచి ఆర్ఈసీ, పీఎఫ్‌సీల నుంచి నెలవారీగా విడుదల కావాల్సిన రుణాలు నిలిచిపోయాయి. ప్రతి నెలా సగటున రూ. 500 కోట్ల విలువైన పనులు యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా జరుగుతుండగా వాటికి సంబంధించిన బిల్లులను సమర్పిస్తే ఆర్ఈసీ, పీఎఫ్సీలు ఆ మేరకు రుణ మొత్తాన్ని గత నాలుగేళ్లుగా విడుదల చేస్తున్నాయి. తాజాగా ఈ రుణాలు నిలిచిపోవడంతో బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో తెలంగాణ విద్యుతుత్పత్తి సంస్థ (జెన్కో) చిక్కుకుపోయింది. ఇప్పటికే జరిగిన పనులకు సంభందించిన బిల్లులను చెల్లించకపోతే బీహెచ్ఈఎల్ సంస్థ యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులను నిలిపివేసే అవకాశం ఉందని ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. డిస్కంలకు నిధుల కటకట... డిస్కంలు రూ. 12 వేల కోట్లకుపైగా విద్యుత్ కొనుగోళ్ల బిల్లులను విద్యుత్పత్తి సంస్థలకు బకాయి ఉన్నాయి. కేంద్రం గతేడాది రాష్ట్ర డిస్కంలకు ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద రూ. 12,600 కోట్ల రుణాలను మంజూరు చేసింది. వాటిని డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించి బకాయిలు తీర్చుకోవాల్సి ఉంది. ఈ రుణాలు మంజూరైనా తొలి రెండు విడతల కింద ఇప్పటివరకు చెలించాల్సిన రూ. 6 వేల కోట్ల రుణాలను కేంద్రం నిలిపివేసిందని అధికారులు పేర్కొంటున్నారు. ఆర్థికంగా తీవ్ర సమస్యల్లో ఉన్న డిస్కంలకు కేంద్రం నిర్ణయం మరింత సంక్షోభంలో నెట్టనుందని అధికారులు అంటున్నారు. విద్యుత్ కొనేందుకు డిస్కంల వద్ద డబ్బులు లేవని, మరోవైపు బకాయిల కోసం విద్యుదుత్పత్తి సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయని ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సీఎంకు పరిస్థితి వివరించనున్న సీఎండీలు.. కేంద్రం అనూహ్య నిర్ణయం నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను సీఎం కేసీఆర్‌కు విద్యుత్ సంస్థల సీఎండీలు వివరించనున్నారు. ఈ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలకు సంబంధించినది కావడంతో సీఎం స్థాయిలో జోక్యం చేసుకుంటే తప్ప రుణాల చెల్లింపును కేంద్రం పునరుద్ధరించే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. -
సీలేరు శిఖరానికి మరో వెలుగు కిరీటం
తూర్పు కనుమల్లో ఊపిరి పోసుకుని.. కొండాకోనల్లో పరవళ్లు తొక్కుతూ.. పచ్చని అడవుల్ని పలకరిస్తున్న అపార జలవాహిని వెదజల్లే విద్యుత్ కాంతుల కేంద్రం సీలేరు. ఇంధన వనరుల్లో అత్యంత చౌకగా లభించే జలవిద్యుత్ కేంద్రంగా ఇది పేరుగాంచింది. మరిన్ని వెలుగులు పంచేలా మరో రెండు యూనిట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆగస్టు 19న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రూ.510 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు. సీలేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్ల ద్వారా 120 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయగా సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. డొంకరాయిలో ఒక యూనిట్ 25 మెగావాట్లు, మోతుగూడెంలో నాలుగు యూనిట్ల ద్వారా 460 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు. అదే ప్రదేశంలో మరో రెండు యూనిట్లు నిర్మించి అదనంగా 230 మెగావాట్ల విద్యుదుత్పత్తిని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. యూనిట్ల నిర్మాణం ఇలా.. మోతుగూడెం (పొల్లూరు) జల విద్యుత్ కేంద్రం నుంచి మరో 230 మెగావాట్ల విత్యుదుత్పత్తికి జెన్కో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పొల్లూరులో నాలుగు యూనిట్ల ద్వారా 460 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. మరో రెండు యూనిట్లు పూర్తయితే 230 యూనిట్ల విద్యుదుత్పత్తిని గ్రిడ్‌కు అందించవచ్చనే ఉద్దేశంతో 1975లో పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం మొదటి దశలో నాలుగు యూనిట్ల నిర్మాణం జరిగింది. భవిష్యత్తులో రెండు యూనిట్లు నిర్మించేందుకు వీలుగా పెన్‌స్టాక్‌లు అమర్చడంతోపాటు జనరేటర్ ఏర్పాటుకు ఖాళీ ప్రదేశాన్ని కూడా అప్పటి నిపుణులు డిజైన్ చేసి ఉంచారు. అప్పటి ఇంజనీర్ల సమయస్ఫూర్తితో మరో రెండు యూనిట్ల నిర్మాణానికి అవకాశం ఉండేలా చేయడంతో అదనపు విద్యుదుత్పత్తికి అవకాశం ఏర్పడింది. రెండో దశ నిర్మాణం పూర్తయితే రబీలో విద్యుదుత్పత్తి చేసి అనంతరం నీటిని గోదావరికి విడుదల చేయవచ్చని, డొంకరాయి నుంచి వృథా కాకుండా చేయొచ్చని అధికారుల అంచనా. గాలికొదిలేసిన గత ప్రభుత్వాలు సీలేరు విద్యుత్ కాంప్లెక్సులో విద్యుదుత్పత్తిని పెంచేందుకు వెసులుబాటు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. దీంతో ఏటా గోదావరి డెల్టా పంట భూములకు 40 టీఎంసీల వరకు నీటిని విద్యుదుత్పత్తి చేయకుండా నేరుగా గోదావరిలోకి వదలాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక కొత్త యూనిట్ల అంశానికి కదలిక వచ్చింది. సీలేరు కాంప్లెక్సులో పొల్లూరు వద్ద రెండు యూనిట్లను నిర్మించి 230 మెగావాట్ల విద్యుదుత్పత్తిని పెంచుతూ గోదావరిలోకి వృథాగా నీరు వెళ్లకుండా చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం సీఎం జగన్మోహన్రెడ్డి రూ.510 కోట్లను కేటాయించారు. ఈ పనులకు డిసెంబర్లో టెండర్లు వేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈ పనులు ప్రారంభమైతే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. దేశంలోనే గుర్తింపు సీలేరు విద్యుత్ కాంప్లెక్సు ప్రతి ఏటా లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి చేస్తోంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రికార్డులు సొంతం చేసుకుని దేశంలో గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి విద్యుత్ కేంద్రంలో మరో రెండు యూనిట్ల నిర్మాణం చేపట్టడం చాలా ఆనందించాల్సిన విషయం. – గౌరీపతి, చీఫ్ ఇంజనీర్, మోతుగూడెం యూనిట్ల నిర్మాణంతో ఉపాధి సీలేరు విద్యుత్ కాంప్లెక్సులో మరో రెండు యూనిట్ల నిర్మాణంతో ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు వరంగా మారనుంది. రెండు యూనిట్ల నిర్మాణంతో వలస వెళ్లకుండా గ్రామంలోనే పనులు చేసుకోవచ్చు. – ఆదినారాయణ, పొల్లూరు గ్రామం -
‘శాశ్వత ఉచిత విద్యుత్’లో మరో కీలక అడుగు
సాక్షి, అమరావతి : పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించే ‘వైఎస్సార్ ఉచిత విద్యుత్’ పథకాన్ని మరో 30 ఏళ్లు సమర్ధవంతంగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ పథకం కోసమే ప్రత్యేకంగా చేపట్టిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టింది. తొలిదశలో.. అనంతపురం, వైఎస్సార్ కడప, ప్రకాశం, కర్నూల్ జిల్లాల్లో 6,050 మెగావాట్లకు టెండర్లు పిలుస్తున్నట్లు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్ష (జ్యూడీషియల్ ప్రివ్యూ)కు పంపింది. (కృష్ణాపై రెండు బ్యారేజీలకు గ్రీన్ సిగ్నల్) ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ పర్యవేక్షణలో జరిగే టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండేలా జ్యూడీషియల్ ప్రీవ్యూ అధికారిక వెబ్సైట్ ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. జ్యూడీషియల్ ప్రివ్యూ.ఏపీ.జీవోవీ.ఇన్’లో పొందుపర్చింది. వీటిని పరిశీలించి ప్రజలు, కాంట్రాక్టు సంస్థలు, నిపుణులు అవసరమైన సలహాలు, సూచనలు ఈనెల 25లోగా ‘ఏపీజ్యూడీషియల్‌ప్రీవ్యూ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ లేదా ‘జడ్జి–జేపీపీ ఎట్ ది రేట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్‌కు పంపవచ్చని ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. పీఎంయు డాట్ ఏపీజీఈసీఎల్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్’కు కూడా సూచనలు పంపవచ్చని తెలిపింది. జ్యూడీషియల్ ప్రివ్యూ తర్వాతే పనులకు సంబంధించిన టెండర్లు పిలుస్తారని పేర్కొంది. (కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా) -
ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భారీ నీటి జలాశయాలపై తేలియాడే (ఫ్లోటింగ్) సో లార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం చేట్టాలని యోచిస్తున్నామని సింగరేణి సంస్థ చైర్మ న్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. సింగరేణి ప్రాంతాల్లోనే కాక రాష్ట్రంలోని ఇతర భారీ జలాశయాల్లో కనీసం 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలా ర్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ (టీఎ స్ఆర్ఈడీ) శాఖ సహాయంతో అధ్యయనం చేసినట్లు చెప్పారు. ఇందుకు సం బంధించిన నివేదికను టీఎస్‌ఆర్‌ఈడీ అధికారులు సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో శ్రీధర్‌కు పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా వివరించారు. ఈ ప్లాంట్ నిర్మాణంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని, నిబంధనలకు లోబడి నిర్మిం చేలా ప్రతిపాదలను సమర్పించాలని టీఎస్‌ఆర్‌ఈడీ అధికారులను సీఎండీ కోరారు. బయటి ప్రాంతాల్లో వీటి నిర్మాణం కో సం యోచిస్తున్నామని, ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించి, విద్యుత్ కొనుగోలు అనుమతు లు పొందిన తర్వాతనే నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. -
అంత డబ్బు మా దగ్గర్లేదు..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆగస్టులో రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆ మేర వ్యయాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసి ముందస్తుగా ఎల్సీ జారీ చేసేందుకు మరో రెండు రోజులే ఉన్నాయి. ఈ నెల 31లోగా డిస్కంలు ఎల్సీ జారీ చేస్తేనే ఆ మేర విద్యుత్‌ను కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఎల్సీ జారీ చేసే సత్తా తమకు లేదని చేతులెత్తేశాయి. ఎన్టీపీసీ వంటి కేంద్ర విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు ప్రైవేటు జనరేటర్ల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ప్రతి నెలా రూ.1,089 కోట్లు అవసరమని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం డిస్కంల వద్ద రూ.400 కోట్ల నిధులు మాత్రమే ఉన్నాయని, విద్యుత్ కొనుగోళ్లకు ముందస్తు ఎల్సీ జారీ చేసేందుకు రూ.1,000 కోట్లను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆగస్టులో విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుతో పాటు ఇతర ఖర్చులకు డిస్కంల వద్ద ఉన్న రూ.400 కోట్ల నిధులు ఆవిరైపోతాయని, ముందస్తుగా ఎల్సీ జారీ చేసే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్సీ నిబంధన అమలును కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వాయిదా వేయని పక్షంలో, నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అత్యవసరంగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. డిస్కంల వద్ద నిధులు లేనిపక్షంలో కనీసం వారం, పక్షం రోజులకు అవసరమైన విద్యుత్ కొనుగోళ్లకు అయినా ఎల్సీ జారీ చేయాల్సిందేనని కేంద్రం నిబంధన పెట్టింది. అదీ సాధ్యం కాని పక్షంలో ఏ రోజుకు ఆ రోజు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఒక రోజు ముందుగానే విద్యుత్ కంపెనీలకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ రూపంలో నిధులను బదిలీ చేయాలని చెప్పింది. ఈ విషయంలో విఫలమైన డిస్కంలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లను ఆదేశించింది. మరో రెండు రోజుల్లోగా రాష్ట్ర డిస్కంలు ఎల్సీ జారీ చేయకపోయినా, కనీసం నగదు బదిలీ చేయకపోయినా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సమస్యలు తప్పవని ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు దక్షిణాది రాష్ట్రాల భేటీ.. లెటర్ ఆఫ్ క్రెడిట్ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ(ఎస్ఆర్పీసీ) సోమవారం బెంగళూరులో సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ట్రాన్స్‌కో ఎస్ఈ హాజరయ్యారు. కేంద్రం ఆదేశాల అమలుకు ఒక్కరోజు మాత్రమే వ్యవధి నేపథ్యంలో ఎల్సీ నిబంధనల అమలును వాయిదా వేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశాలున్నాయి. రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఇప్పటికే తప్పుబడుతూ కేంద్రానికి లేఖ రాసింది. -
ఫార్మాసిటీలో మూడు ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఔషధ నగరి పారిశ్రామికవాడలో ఔషధాలతో పాటు భారీ ఎత్తున విద్యుదుత్పత్తి జరగనుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని 19,333.20 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మించనున్న హైదరాబాద్ ఫార్మాసిటీలో సౌర, సహజవాయువులు, ఘన వ్యర్థాల విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) నిర్ణయం తీసుకుంది. ఈ పారిశ్రామికవాడ అవసరాలకు 985 మెగావాట్ల విద్యుత్ కావాల్సి ఉండ గా, ఈ మూడు రకాల విద్యుత్ ప్లాంట్ల ద్వారా 688 మెగావాట్ల విద్యుత్‌ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసి విని యోగించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 435 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్, 250 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం, మరో 3 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ(వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి) ప్లాంట్లను ఫార్మాసిటీలో నెలకొల్పుతామని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రాజెక్టు నివేదికలో టీఎస్ఐఐసీ ప్రతిపాదించింది. ఫార్మాసిటీ తుది విడత నిర్మాణం పూర్తయ్యే నాటికి ఈ విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటును పూర్తి చేస్తామని తెలిపింది. గ్యాస్ ఆధారిత విద్యుదు త్పత్తి ప్లాంట్‌కు అవసరమైన సహజవాయువులను సర ఫరా చేసేందుకు గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరే షన్ అంగీకరించింది. ఫార్మాసిటీలోని పరిశ్రమలు, నివాస సముదాయాల నుంచి ఉత్పత్తయ్యే ఘన వ్యర్థాలతో విద్యుదుత్పత్తి జరపనున్నారు. అతిపెద్ద రూఫ్ టాప్ ! ఫార్మాసిటీలో ఏర్పాటు కానున్న 435 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్దదిగా అవతరించనుంది. దేశంలో మరెక్కడా కనీసం 10 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా లేదు. ఫార్మాసిటీలో వేల ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమలు, వాణిజ్య భవనాలు, విశ్వవిద్యాలయం, నివాస సముదాయాలకు సంబంధించిన భవనాలను నిర్మించనుండటంతో భారీ విస్తీర్ణంలో భవనాలపైన ఖాళీ ప్రాంతం అందుబాటులోకి రానుంది. ఫార్మాసిటీ ప్రణాళిక ప్రకారం... 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కానుండగా, 9,535 ఎకరాల్లో పరిశ్రమలు, 1,507 ఎకరాల్లో రెసిడెన్షియల్ టౌన్షిప్, 322 ఎకరాల్లో ఫార్మా వర్సిటీ, 544 ఎకరాల్లో కార్యాలయాలు, 827 ఎకరాల్లో పరిశోధన కేంద్రం, 203 ఎకరాల్లో లాజిస్టిక్ హబ్, 104 ఎకరాల్లో ఆస్పత్రి, 141 ఎకరాల్లో హోటల్‌ను నిర్మించనున్నారు. వీటన్నింటికి సంబంధించిన భవనాలపై భాగంలో సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం ద్వారా 435 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. -
విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై పునరాలోచించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ భారత దేశంలో కరెంటు కోత ల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. దేశంలో యూనిట్ కరెంటు ధర ప్రస్తుతం రూ.2.2లకే అందుబాటులో ఉందని, దక్షిణాదికి కరెంటు కొరత లేకుండా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. దేశమంతా ఒకే గ్రిడ్-ఒకే ధర లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 2400 మెగావాట్ల ఉత్పత్తికి ప్లాంట్ల ప్రారంభంపై పునరాలోచన చేయాలని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే మిగులు విద్యుత్తు అందుబాటులో ఉందని, కొత్త థర్మల్ ప్లాంట్ల వల్ల రాష్ట్రాలపై అధిక ఆర్థిక భారం పడుతుందని వివరించారు. అయితే రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను బట్టి ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. -
ఉపసంహరణ!
► కొత్త విద్యుత్ ప్లాంట్లపై సర్కారు పునరాలోచన ► భవిష్యత్‌లో భారమనే అంచనాలతో అప్రమత్తం ► కొత్త ప్లాంట్ల కంటే కరెంటు కొనుగోలే మేలు ► మున్ముందు డిమాండ్ పెరిగినా సరిపడ విద్యుత్ ► ప్లాంట్ల పెట్టుబడి ఖర్చులు, నిర్వహణ భారం తడిసిమోపెడు ► రాష్ట్రానికి అనవసర భారమని హెచ్చరించిన కేంద్ర మంత్రి ► అటకెక్కనున్న దామరచర్ల, మణుగూరు ప్లాంట్ల నిర్మాణం సాక్షి, హైదరాబాద్: తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కంటే అవసరమైనప్పుడల్లా కరెంటు కొనుగోలు చేయటమే లాభసాటి నిర్ణయమని భావిస్తోంది. కొత్త ప్రాజెక్టులపై వెచ్చించే రూ.లక్ష కోట్ల పెట్టుబడి వ్యయంతో భవిష్యత్‌లో రాష్ట్రానికి మేలు జరగడం పక్కనపెడితే అపార నష్టం వాటిల్లుతుందనే అంచనాకు వచ్చింది. తాజా పరిస్థితుల్లో కొత్త ప్లాంట్లపై ముందడుగు వేయాలా? వెనకడుగు వేయాలా? అని తర్జనభర్జనలు పడుతోంది. అప్పటివరకు దామరచర్ల, మణుగూరు ప్రాజెక్టుల ప్రతిపాదనను కోల్డ్ స్టోరేజీలో పెట్టాలని భావిస్తోంది. ‘‘నాలుగేళ్లలో రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. 2018 నాటికి అదనంగా 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించేందుకు కొత్త ప్లాంట్లు నిర్మిస్తాం...’’ అని స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పలుమార్లు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో తలెత్తిన విద్యుత్ కొరత, ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల ఉల్లంఘన వివాదాల నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు సీఎం పట్టుదలతో వ్యవహరించారు. ఒకవైపు కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతోపాటు ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. మరోవైపు తాత్కాలిక, మధ్యకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, అవసరమైతే ఎక్ఛేంజీ నుంచి సరిపడేంత కొనుగోలు చేయటం ద్వారా విద్యుత్ సమస్యను అధిగమించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసిన ఘనత సాధించారు. కానీ గడిచిన రెండేళ్ల అనుభవాల నేపథ్యంలో.. కొత్తగా నిర్మించే విద్యుత్ ప్లాంట్లు రాష్ట్రానికి తలకు మించిన భారంగా మారుతున్నాయన్న నిపుణుల హెచ్చరికలు ప్రభుత్వానికి చురక అంటించాయి. దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం డిమాండ్‌కు మించి విద్యుత్ అందుబాటులో ఉంది. సగటున రోజుకు 3 లక్షల యూనిట్లు ఉత్పత్తి అవుతుంటే.. వినియోగం 1.40 లక్షల యూనిట్లకు మించి లేదు. ఏటేటా విద్యుత్ అవసరాలు 4 నుంచి 5 శాతం పెరిగినా రాబోయే పదేళ్ల వరకు విద్యుత్‌కు ఢోకా ఉండదని కేంద్రం అంచనా వేసింది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న కొత్త విద్యుత్ ప్లాంట్లు మరో రెండేళ్లలో ఉత్పత్తి స్థాయికి చేరుకుంటాయి. మరోవైపు సౌర విద్యుత్ వాడకం కూడా పెరుగుతోంది. ఫలితంగా భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా మరింత మిగులు విద్యుత్ ఉంటుందని, విద్యుత్ కొనుగోలు ధర గణనీయంగా పడిపోతుందని కేంద్ర ఇంధన శాఖ అంచనా. ప్రస్తుతం వర్షాలు పడుతుండటం, వాతావరణం చల్లగా ఉండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ సగానికి పడిపోయింది. కొనేవారెవరూ లేకపోవటంతో ఆదివారం పవర్ ఎక్ఛేంజీ పరిధిలో 4,900 మెగావాట్ల మిగులు విద్యుత్ ఉండటం గమనార్హం. దీంతో విద్యుత్ ధర కేవలం రూ.2.20కు పడిపోయింది. ప్రస్తుతం తెలంగాణ జెన్కో అధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌కు యూనిట్‌కు సగటున రూ.5 ఖర్చవుతోంది. దీంతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో సగానికంటే తక్కువ ధరకే దొరుకుతోంది. కొత్త ప్లాంట్లతో లాభం లేదన్న కేంద్రమంత్రి ఇటీవల కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్, సీఎం కేసీఆర్ మధ్య జరిగిన భేటీలో భవిష్యత్‌లో విద్యుత్, ఉత్పత్తి అవసరాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్రంలో చేపట్టే కొత్త ప్లాంట్ల నిర్మాణంతో తెలంగాణకు లాభమేమీ ఉండదని, అనవసరమైన భారం పెంచుకుంటున్నారని గోయల్ కరాఖండిగా తన అభిప్రాయం చెప్పినట్లు సమాచారం. దీంతోపాటు సింగరేణి, ఇంధన శాఖలో పని చేసిన అనుభవమున్న ఐఏఎస్ అధికారులు, విద్యుత్ రంగ నిపుణులు సైతం కొత్త ప్లాంట్ల నిర్మాణంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్లాంట్లపై ఆచితూచి అడుగులేయాలని, అవసరమైతే విసృ్తత సమాలోచనలు జరపాలని సీఎం యోచిస్తున్నారు. డిమాండ్ పెరిగినా కొరత ఉండదు! తెలంగాణలో సగటున ప్రతిరోజు కనిష్టంగా 5 వేల మెగావాట్ల నుంచి గరిష్టంగా 7 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. జెన్కో పరిధిలో ఉన్న థర్మల్ ప్లాంట్లు, కేంద్ర విద్యుత్ ప్లాంట్లు, తాత్కాలిక, మధ్యకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో 7 వేల మెగావాట్లకు మించి విద్యుత్ లభ్యమవుతోంది. దీంతో రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్‌కు ఢోకా లేదు. వ్యవసాయానికి 9 గంటల కరెంట్ ఇచ్చినా, మెట్రో రైలు ప్రాజెక్టు, పారిశ్రామిక అవసరాలు పెరిగినా ఈ డిమాండ్ 10 వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే.. ఈ డిమాండ్‌ను సునాయాసంగా అధిగమించే వీలుంది. సింగరేణి విద్యుత్ ప్లాంట్ నుంచి 1,200 మెగావాట్లు, భూపాలపల్లి కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌లో 600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ప్లాంట్ విస్తరణ జరుగుతోంది. పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంటు నిర్మించాల్సి ఉంది. ఇందులో భాగంగానే రామగుండంలో 1,600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. దీంతో మూడు వేల మెగావాట్ల డిమాండ్ పెరిగినా కొరత తలెత్తే పరిస్థితి రాదు. ఎక్స్ఛేంజీలో కొనుగోలు చేస్తేనే లాభం.. మణుగూరులో 1,080 మెగావాట్లు, దామరచర్లలో 4 వేల మెగావాట్ల ప్లాంట్లు, కేటీపీఎస్ విస్తరణ.. ఇలా నాలుగేళ్లలో మొత్తం 11,800 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తికి నిర్దేశించిన కొత్త ప్రాజెక్టులకు రూ.92 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం లెక్కలేసింది. వీటికి ఆర్ఈసీ రూ.24 వేల కోట్లు, పీఎఫ్సీ రూ.15 వేల కోట్లు రుణమిచ్చేందుకు ముందుకు రావటంతో ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇంత భారీగా రుణం తెచ్చి ప్లాంట్లు నిర్మించినా పెట్టుబడికితోడు ఏటేటా నిర్వహణ భారం తడిసి మోపెడవుతుంది. దీనికి బదులుగా గరిష్ట డిమాండ్ ఉన్న సందర్భంలో పవర్ ఎక్స్ఛేంజీల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తేనే సర్కారుకు ఎక్కువ లాభమని అధికార వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడి భారం, నిర్వహణ ఖర్చులు, జీతభత్యాలన్నీ కలిపితే కొత్త విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేసే కరెంటు ఖర్చు యూనిట్ రూ.10 దాటిపోతుంది. కానీ బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేటు అంతకంతకు తగ్గితే రూ.2 లేదా రూ.3 చొప్పున లభ్యమవుతుంది. ఒకవేళ డిమాండ్‌కు మించి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసినా.. అడ్డికి పావుశేరు అన్నట్లుగా యూనిట్‌కు రూ.10 వెచ్చించి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను రూ.2కు యూనిట్ చొప్పున తెగనమ్ముకోవాల్సి వస్తుంది. దీనికి వీటికి తోడు కేంద్రం అమల్లోకి తెచ్చిన ఉదయ్ పథకంలో రాష్ట్రం చేరటం కొత్త పరిణామం. దీంతో విద్యుత్ సరఫరా.. అదనంగా బొగ్గు సరఫరా మాటలెలా ఉన్నా.. నాణ్యమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా కేంద్రం సహకరిస్తోంది. ఫలితంగా కారిడార్లు అభివృద్ధి చెంది.. ఉత్తరాది రాష్ట్రాల్లో మరింత చౌక ధరకు దొరికే విద్యుత్ కొనుగోలు చేసే వీలుంటుంది. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకున్న వెయ్యి మెగావాట్లకు మార్గం సుగమమవుతుంది. -
నేటి నుంచి విద్యుత్ ప్లాంట్లకు సబ్సిడీ గ్యాస్ వేలం
న్యూఢిల్లీ: విద్యుత్ ప్లాంట్లకు ఉపయోగించే గ్యాస్‌పై సబ్సిడీకి సంబంధించి వేలం మంగళవారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే వేలంలో దాదాపు రూ. 1,600 కోట్ల విలువ చేసే సబ్సిడీ కోసం జీఎంఆర్, ఎన్టీపీసీ, ఎస్సార్ పవర్, టాటా పవర్ తదితర సంస్థలు పోటీపడనున్నాయి. ప్రభుత్వ రంగ ఎంఎస్టీసీ దీన్ని నిర్వహించనుంది. దిగుమతి చేసుకున్న ఖరీదైన గ్యాస్‌ను దేశీ కంపెనీలు తమ విద్యుత్ ప్లాంట్లకోసం కొనుగోలు చేసుకునేందుకు ఈ వేలం ఉపయోగపడనుంది. గ్యాస్ కొరతతో నిల్చిపోయిన ప్లాంట్లకు ఊపిరినిచ్చేందుకు ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. ఖరీదైన గ్యాస్‌ను కొనుగోలు చేసేందుకు విద్యుత్ కంపెనీలకు ప్రభుత్వం పవర్ సిస్టం డెవలప్మెంట్ ఫండ్ (పీఎస్డీఎఫ్) కింద కొంత సబ్సిడీ కల్పిస్తోంది. అత్యధికంగా సబ్సిడీ వదులుకునేందుకు సిద్ధపడిన సంస్థలకు దిగుమతి చేసుకున్న గ్యాస్ కేటాయింపుల్లో మొదటి ప్రాధాన్యం లభిస్తుంది. దీనికోసమే తాజాగా రివర్స్ ఈ-ఆక్షన్ నిర్వహిస్తోంది. 24 గిగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లకు ఈ గ్యాస్‌తో ప్రయోజనం చేకూరనుంది. -
'చినబాబు, పెదబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు'
నెల్లూరు: విద్యుత్ ప్లాంట్ల కోసం కృషి చేసిన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ను టీడీపీ ప్రభుత్వం విస్మరించడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సూచించారు. చినబాబు నారా లోకేష్.. పెదబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో పచ్చ చొక్కాల వారికే సంక్షేమ పథకాలు అందుతాయని మాజీ మంత్రి ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత ధ్వజమెత్తారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్తే సంతలో పశువుల్లా బేరమాడుతున్నారని కేసీఆర్‌ను దుమ్మెత్తిపోసిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు ఏపీలో చేసిన దానికి ఏమి సమాధానం చెప్తారని ఇటీవల సూటిగా ప్రశ్నవేస్తే సీఎం వద్ద సమాధానమే లేకపోయింది. -
విద్యుత్ ప్లాంట్లకు అనువుగా రామగుండం
10,000 మెగావాట్ల ప్రాజెక్టుగా స్థాపనకు అనుకూలం ఎన్టీపీసీ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి జ్యోతినగర్ (కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎన్టీపీసీల్లోకెల్లా అతిపెద్ద ప్రాజెక్టుగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ అరూప్‌రాయ్ చౌదరి అన్నారు. రామగుండంలో తెలంగాణ స్టేజీ-1 కింద చేపట్టనున్న 8, 9 యూనిట్ల(2+800=1,600 మెగావాట్లు) విద్యుత్ కేంద్రం స్థలాన్ని, మ్యాపును ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టులోని ఏడో యూనిట్‌ను సందర్శించి విద్యుత్ ఉత్పాదకతపై అధికారులతో చర్చించారు. అనంతరం ఎన్టీపీసీ డెరైక్టర్ (హెచ్ఆర్) యూపీ ఫణి, డెరైక్టర్(టెక్నికల్) కేకే శర్మలతో కలిసి అరూప్‌రాయ్ చౌదరి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎన్టీపీసీ, జాయింట్ వెంచర్స్‌తో కలిపి 40 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. వీటిలో 4,260 మెగావాట్ల అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మధ్యప్రదేశ్‌లోని వింధ్యాచల్ ఉందన్నారు. దానికంటే రామగుండం ప్రాజెక్టులో 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను నెలకొల్పడానికి అనుకూలంగా ఉందని వెల్లడించారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అనువైన వనరులు బొగ్గు, నీరు, స్థలం అందుబాటులో ఉన్నాయన్నారు. రామగుండంను అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రూపొందించడానికి ఎన్టీపీసీ ముందుందని, స్థానిక ప్రజలు, సంస్థ ఉద్యోగుల కృషితో అది సాధ్యమవుతుందని తెలిపారు. యాష్‌పాండ్ కోసం సింగరేణి సంస్థతో మాట్లాడి జీవితకాలం పూర్తవుతున్న ఓసీపీ ప్రాజెక్టులను యాష్పాండ్గా వినియోగించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లోని కంటిన్యూయస్ ఎమిషన్ మానిటరింగ్ సిస్టం(సీఈఎంసీ)ని, కోల్ టెస్టింగ్ లాబొరేటరీని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ గ్రూప్ ఆఫ్ జనరల్ మేనేజర్ ప్రశాంత్‌కుమార్ మహాపాత్ర, జనరల్ మేనేజర్లు రాంకుభేర్, రాజన్, భావరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
భెల్ నికర లాభం 62 శాతం డౌన్
మార్కెట్ మందగమనమే కారణమంటున్న కంపెనీ న్యూఢిల్లీ: విద్యుత్ రంగ పరికరాలు తయారు చేసే భెల్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 62 శాతం క్షీణించింది. ప్రభుత్వ నియమనిబంధనల కారణంగా మార్కెట్ మందగమనంగా ఉండటమే దీనికి కారణమని వివరించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.3,461 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 62 శాతం క్షీణించి రూ.1,314 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. మొత్తం టర్నోవర్ రూ.40,338 కోట్ల నుంచి రూ.30,806 కోట్లకు తగ్గిందని వివరించింది. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు లభ్యత విషయంలో అడ్డంకులు, నిధుల లభ్యత సరిగ్గా లేకపోవడం, భూ సమీకరణ, పర్యావరణ అనుమతులు, తదితర అంశాలు లాభంపై ప్రభావం చూపాయని పేర్కొంది. ఆర్డర్ బుక్ రూ. లక్ష కోట్లపైనే 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2014-15లో వచ్చిన ఆర్డర్లు 10 శాతం వృద్ధి చెంది రూ.30,794 కోట్లకు పెరిగాయని వివరించింది.. విద్యుత్‌రంగంలో ఆర్డర్లు రూ.24,873 కోట్లుగా, పరిశ్రమల విభాగం నుంచి రూ.5,201 కోట్లుగా, ఎగుమతుల అర్డర్లు రూ.720 కోట్లుగా ఉన్నాయని వివరించింది. మొత్తం మీద ఆర్డర్ బుక్ రూ.1,01,159 కోట్లుగా ఉందని పేర్కొంది. తెలంగాణలో ప్లాంట్: కాగా ఈ కంపెనీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఇటీవలనే తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.5,000 కోట్లు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మణుగూరులో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో ఇక్కడ విద్యుదుత్పత్తి చేయాలనేది ఈ ఒప్పందం లక్ష్యం. కాగా తెలంగాణ రాష్ట్రంలో 6,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు నిమిత్తం టీఎస్‌జెన్‌కోతో భెల్ ఒప్పందం కుదుర్చుకుంది. -
లక్ష కోట్లతో విద్యుదుత్పత్తి కేంద్రాలు
*భవిష్యత్తులో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ * 2018 ఫిబ్రవరి నాటికి 24 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి * భద్రాద్రి పవర్ ప్రాజెక్టు శంకుస్థాపనలో సీఎం కేసీఆర్ సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో దాదాపు రూ. లక్ష కోట్లతో విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. మణుగూరు సమీపంలో 1,080 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రానికి శనివారం శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2018 నాటికి తెలంగాణలో కొత్తగా నెలకొల్పే విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి సమృద్ధిగా విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందన్నారు. ఈ ఏడాది చివర్లోఆదిలాబాద్ జిల్లా జయపూర్ వద్ద 1,900 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభం కానుందన్నారు. అలాగే, కొత్తగూడెంలో 800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానున్నదని తెలిపారు. కరెంటు కోతలనుంచి ప్రజలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. శంకుస్థాపన చేసిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తిచేసి తీరుతామన్నారు. ఈ ప్లాంట్ ఈశాన్యంలో ఉండటం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును ఖమ్మం ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా డిజైన్ చేయాలని నిర్ణయించామన్నారు. జిల్లా రైతుల అవసరాల కు సాగునీటి ప్రాజెక్టులను సిద్ధం చేస్తామ న్నారు. 2018 ఫిబ్రవరికి రాష్ట్రంలో 24 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కానున్నదన్నారు. భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తాం తెలంగాణలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న భద్రాచలంను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని, భద్రాచలం ప్రాంతంలో ఉన్న గోదావరీ తీరం, రామాలయం, పర్ణశాల వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్లు కేసీఆర్ చెప్పారు. భద్రాచలం మండలం నుంచి ఆంధ్రా ప్రాంతంలో కలిసిన 4 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలోకి తీసుకువచ్చేందుకు, ఈ అంశాన్ని ప్రధానమంత్రికి వివరిస్తానన్నారు. ఈ గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతామని, ఆయన సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు నాయిని, తుమ్మల, జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మేల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు బాలసాని , పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
‘సౌర’భాలు
పరిగిలో మొదలైన సోలార్ విద్యుదుత్పత్తి సర్కారుకు కరెంటును విక్రయిస్తున్న ప్లాంట్ నిర్వాహకులు రూ.40 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం.. రోజుకు 5.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి.. మరో రెండు సోలార్ పవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వ యోచన ఒక్కోదాని సామర్థ్యం 10 మెగావాట్లు .. రెండింటికీ రూ.150 కోట్ల వ్యయంతో పనులు పవర్ జనరేటింగ్ హబ్‌గా మారనున్న పరిగి పరిగి: ‘సౌర’భాల వెలుగుజిలుగులకు పరిగి మండలం చిరునామా అయింది. జిల్లాలోనే సోలార్ పవర్ ప్రాజెక్టులకు కేంద్రస్థానంగా మారింది. ఇప్పటికే ఓ పవర్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా.. ఇక్కడ మరో రెండు సోలార్ పవర్ ప్రాజెక్టులకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో పరిగి ప్రాంతం రానున్న రోజుల్లో సోలార్ పవర్ జనరేటింగ్ హబ్‌గా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మండలంలోని కాళ్లాపూర్ శివారులో ఆరు నెలల క్రితం ప్రారంభమైన సోలార్ పవర్ జనరేటింగ్ ప్లాంట్ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో విద్యుదుత్పత్తి ప్రారంభించిన ప్రాజెక్టు నిర్వాహకులు వారంరోజుల క్రితం ట్రయల్ రన్ నిర్వహించారు. రె ండ్రోజులుగా ప్రాజెక్టులో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన ఎస్జే పవర్ కంపెనీ ప్రతినిధులు కాళ్లాపూర్ రెవెన్యూ పరిధిలోని 24వ సర్వే నంబర్లో ప్లాంటు నిర్మించారు. రెండు నెలల క్రితమే విద్యుదుత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా భూ కొనుగోళ్లు, అనుమతుల్లో నెల కొన్న పలు వివాదాల నెలకొన్నాయి. ఈ కారణంగా ప్లాంటు పనులు పూర్తయినా విద్యుదుత్పత్తిలో రెండు నెలలపాటు ఆలస్యం జరిగింది. 33 కేవీ విద్యుత్ లైన్ ద్వారా సరఫరా రూ.40 కోట్లతో 46 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా రోజుకు 5.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. దీనిని నేరుగా ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. ఇందుకోసం ముందుగానే ప్రభుత్వంతో ప్రాజెక్టు నిర్వాహకులు అగ్రిమెంటు చేయించుకున్నారు. దీని ప్రకారం ప్రస్తుతం పవర్‌ను ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. ఉత్పత్తి అయిన ఒక్కో యూనిట్ విద్యుత్‌ను రూ.6.48 పైసల లెక్కన సర్కారుకు అమ్ముతున్నారు. ఒక్కో మెగావాట్ కోటిన్నర లక్షల యూనిట్లతో సమానం కావడంతో.. ప్రస్తుతం పరిగిలో ఉత్పత్తి ప్రారంభమైన ప్రాజెక్టులో ఏడున్నర లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ ఉత్పత్తి అయిన కరెంటును33 కేవీ లైన్ ద్వారా పరిగి సమీపంలోని 133 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సరఫరా చేయనున్నారు. అక్కడినుంచి మిగతా ప్రాంతాలకు సరఫరా అవుతుంది. మరో రెండు పవర్ ప్లాంట్లకు అవకాశం.. పరిగిలో ఇప్పటికే 5.8 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల సోలార్ పవర్ ప్రాజెక్టు అందుబాటులోకి రాగా.. ఈ ప్రాంతంలోనే మరో రెండు సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటుచేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో ప్రాజెక్టు 10 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.150 కోట్ల వ్యయం చేయనున్నారు. ఇందులో 10 మెగావాట్ల సామర్థ్యం గల ఓ ప్రాజెక్టును ఇప్పటికే 5 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించి విద్యుదుత్పత్తి ప్రారంభించిన ఎస్జే పవర్ కంపెనీ వారు తీసుకోగా మరో ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఓ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కొంతమేర భూసేకరణ కూడా ఆ కంపెనీ వారు చేశారు. ఈ ప్రాజెక్టులు సైతం కాళ్లాపూర్, సయ్యద్‌మల్కాపూర్, రాఘవాపూర్ శివారు ప్రాంతాల్లోనే నెలకొల్పనున్నారు. -
సిటీ గ్యాస్‌కు ప్రాధాన్యత!
కొత్త గ్యాస్ కేటాయింపుల విధానంపై చమురు శాఖ కసరత్తు న్యూఢిల్లీ: సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తూ సహజ వాయువు కేటాయింపుల విధానాన్ని కేంద్రం సవరించింది. దీని ప్రకారం సీజీడీ సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అటు పైన ఆటమిక్ ఎనర్జీ.. స్పేస్ రీసెర్చ్‌కి అవసరమయ్యేవి సరఫరా చేసే వాటికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని చమురు శాఖ భావిస్తోంది. ఇక పెట్రోకెమికల్స్ మొదలైనవి వెలికితీసే ప్రాజెక్టులకు రోజుకి 1.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంఎస్‌ఎండీ) గ్యాస్‌ను ఇవ్వాలని, నాలుగో ప్రాధాన్యత కింద గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లకు కేటాయించాలని యోచిస్తోంది. నియంత్రిత టారిఫ్‌ల కింద విద్యుత్‌ను సరఫరా చేసే షరతుపై పవర్ ప్లాంట్లకు తర్వాత స్థానం దక్కుతుంది. ఇక దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేం దుకు చిన్న, మధ్య తరహా సంస్థలకు గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కనుంది. ఈ మేరకు ప్రతిపాదనను చమురు శాఖ.. కేంద్ర క్యాబినెట్ ముందుకు తేనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ కేటాయింపుల్లో ప్రస్తుతం యూరియా తయారీ ప్లాంట్లకు మొదటి ప్రాధాన్యత లభిస్తోంది. ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ప్లాంట్లు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, వాహనాలు.. గృహాలకు గ్యాస్ సరఫరా చేసే సీజీడీ ప్రాజెక్టులు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
విద్యార్థి నాయకులకు పదవులు హర్షణీయం
టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సాధన ఉద్యమంలో పోరాడిన విద్యార్థి నాయకుల్లో అగ్రభాగాన ఉన్న వారందరికీ సీఎం కె చంద్రశేఖర్‌రావు ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిజాక్ చైర్మన్ పిడమర్తి రవికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్ష పదవి ఇవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం టీఆర్ఎస్ ఎంపీలు బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డిలు విజయ్‌చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యార్థి నాయకులను తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ విద్యార్థిలోకం స్వాగతిస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ఎంత చిత్తశుద్ధితో పనిచేశామో..ప్రజాప్రతినిధులుగా తెలంగాణ పునర్నిర్మాణానికి అంతే పట్టుదలతో పనిచేస్తామన్నారు. నిరుద్యోగుల కోసం త్వరలోనే లక్ష ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. మరో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, మెదక్ తరహాలో రైల్వే ప్రమాదాలు జరగకుండా లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లులేని చోట వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ కేంద్రాల శంకుస్థాపనకు రండి పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి ఆయన ప్రధానిని కలసి ఈమేరకు విజ్ఞప్తి చేశారు. రామగుండంలో నాలుగువేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో గతప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అందులో భాగంగా 1600 మెగావాట్ల ప్లాంట్ కోసం ఎన్టీపీసీ అధికారుల బృందం అధ్యయనం చేసిందన్నారు. మిగిలిన 2400 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉందని గుర్తుచేశారు. ఈ విద్యుత్ కేంద్రాలకు వీలైనంత త్వరగా శంకుస్థాపన చేసేందుకు తప్పనిసరిగా రావాలని ప్రధానిని ఆహ్వానించినట్టు సుమన్ అనంతరం విలేకరులకు తెలిపారు. అలాగే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరినట్టు తెలిపారు. తాను దత్తత తీసుకున్న మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం దొండేపల్లి మండలం గూడెం గ్రామంలో చేపట్టిన కార్యాచరణను ఈసందర్భంగా ఆయన ప్రధానికి వివరించారు. -
కొత్త విద్యుత్‌ప్లాంట్లపై కోటి ఆశలు
సత్వర వెలుగునిచ్చే ప్రాజెక్టుల్లో పెట్టుబడి కేటీపీపీ రెండోదశ పూర్తికి రూ.300 కోట్లు కొత్తగూడెం కొత్త ప్లాంట్‌కు రూ.300 కోట్లు బీహెచ్ఈఎల్ ప్రాజెక్టులకు రూ.400 కోట్లు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంక్షోభం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెంక్కించేందుకు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తయ్యే ప్రాజెక్టులకు సర్కార్ మొదటి ప్రాధాన్యమివ్వనుంది. ఇందుకోసం కొత్త కేంద్రాలపైనే ఆశలు పెట్టుకుంది. తెలంగా ణ జెన్కో సారథ్యంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు, బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకున్న థర్మల్ప్లాంట్లను శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరిం చింది. బడ్జెట్లో టీఎస్ జెన్కోలో పెట్టుబడికి నిర్దేశించిన రూ.1000 కోట్లను ఈ కొత్తప్లాంట్ల కోసం ఖర్చు చేయనుంది. భూపాలపల్లిలో నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ ప్రాజెక్టు రెండో దశకు రూ. 300 కోట్లు, కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ ఏడోదశలో తలపెట్టిన 800 మెగావాట్ల ప్రాజెక్టుకు మరో రూ. 300 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. మిగతా రూ. 400 కోట్లను బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకునే థర్మల్ ప్రాజెక్టులకు కేటాయించనుంది. 2012లోనే పూర్తికావాల్సింది.. భూపాలపల్లి ప్లాంట్‌కు ఆర్ఈసీ రూ.2170 కోట్ల రుణం మంజూరీ చేసింది. గత నెలాఖరు వరకే దాదాపు రూ.2565 కోట్లు దీనికి ఖర్చయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2009 ఫిబ్రవరిలో ఈ ప్లాంట్ పని ప్రారంభమైంది. ఒప్పందం ప్రకారం 2012లోనే పూర్తి కావాలి. కాంట్రాక్టర్ల జాప్యంతో రెండేళ్లు ఆలస్యమైంది. అంతేకాక గతనెలలో భారీయంత్రాలు అమర్చే క్రేన్ విరగడంతో బాయిలర్ నిర్మాణం మధ్యలో ఆగింది. దీంతో నెలరోజులు పనులన్నీ నిలిచిపోయాయి. ఇటీవలే టీఎస్జెన్కో ఛైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకరరావు అక్కడికివెళ్లి పనుల పురోగతిని పరిశీలించారు. ఆగస్టు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. దీంతో పాటు మణుగూరులో 1080 మెగావాట్ల (2704 యూనిట్లు) థర్మల్ విద్యుత్కేంద్ర నిర్మాణంపై జెన్కో దృష్టి సారించింది. దీనిని ఈపీసీ విధానంలో బీహెచ్ఈఎల్ కంపెనీకి అప్పగించనుంది. మణుగూరులో 1031.19 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుంది. అయితే, 270 మెగావాట్ల ఉత్పత్తికి అవసరమయ్యే టర్బైన్లు, జనరేటర్లు బీహెచ్ఈఎల్ దగ్గర అందుబాటులో ఉండడంతో రెం డేళ్ల వ్యవధిలోనే పూర్తిచేసేందుకు అంగీకారం కుదిరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక కొత్తగూడెం థర్మల్ పవర్‌ప్లాంట్‌లో 800 మెగావాట్ల కేంద్రాన్ని మూడేళ్లలో పూర్తి చేసేందుకు జెన్కో ఏర్పాట్లు చేస్తోంది. వీటికితోడు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న జల విద్యుత్కేంద్రాలు వచ్చే ఏడాది చివరినాటికి ఉత్పత్తిచేసే దశకు చేరుకుంటాయని అధికారులు అంచనా వేశారు. లోయర్ జూరాల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ద్వారా 240 మెగావాట్లు (640), పులిచింతల ప్రాజెక్టు ద్వారా 120 మెగావాట్లు (430) ఉత్పత్తి చేసే యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి 70 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. డిసెంబర్ 15 వరకు ఈ యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంటుందని జెన్కో అంచనా వేసింది. -
కొత్తగూడెం, మణుగూరులలో పవర్ ప్లాంట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం జెన్కో అధికారులతో సమావేశమయ్యారు. విద్యుత్ సమస్యను ఎదుర్కొనేందుకు వారితో చర్చించారు. 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, మణుగూరులలో పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని రెండేళ్లలో పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో విద్యుత్ సమస్యలను అధిగమిస్తామని కేసీఆర్ చెప్పారు. -
తెలంగాణలో కరెంటుకు లైనేది?
-
రెండేళ్లలో మణుగూరు.. మూడేళ్లలో కొత్తగూడెం
విద్యుత్ ప్లాంట్లను నిర్మించి ఇస్తాం ప్రభుత్వానికి భెల్ హామీ 1,880 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు పనులు అప్పగింత రెండేళ్లలో మణుగూరులో 1,080 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు నిర్మించి ఇస్తాం! మూడేళ్లలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును పూర్తిచేస్తాం!! ఇదీ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) ఇచ్చిన హామీ. మంగళవారం తెలంగాణ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు భెల్ సీఎండీ బీపీ రావు, డెరైక్టర్ అతుల్ సోక్తిలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకు తీసుకెళ్లి కలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా విద్యుత్ ప్లాంట్లను నిర్మించి ఇస్తామని సీఎంకు బీపీ రావు హామీ ఇచ్చారు. తమవద్ద ఇప్పటికే 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లకు సరిపడ బాయిలర్లు, టర్బై న్లు, జనరేటర్లు (బీటీపీ) సిద్ధంగా ఉన్నందున... కేవలం రెండేళ్లలోనే 1,080 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో మొత్తం 1,880 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులన్నీ అవగాహన ఒప్పందం రూపంలో భెల్‌కు అప్పగించాలని తెలంగాణ జెన్కోను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అదేవిధంగా రానున్న మూడేళ్లల్లో 6 వేల మెగావాట్ల నిర్మాణ బాధ్యతలను కూడా అవసరమైతే భెల్‌కే అప్పగించాలని కూడా సీఎం ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం- ప్రభుత్వం (జీ టు జీ) పద్ధతిలో ఎంవోయూ రూపంలో అప్పగించడం ద్వారా టెండర్ల ప్రక్రియకు పట్టే సుమారు పది నెలల కాలాన్ని తగ్గించవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా ఉందని ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి. ఈపీసీ పద్ధతిలో మొత్తం పనులు! వాస్తవానికి ప్రస్తుతం జెన్కోలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులను రెండుగా విభజించి అప్పగిస్తున్నారు. ఒకటి బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్ల (బీటీజీ) పనులు. ఈ పనులను ప్రస్తుతం కూడా జీ టు జీ కింద భెల్‌కే అప్పగిస్తున్నారు. యాస్ ప్లాంటు, కూలింగ్ టవరు వంటి బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ల (బీవోపీ) పనులను మాత్రం టెండర్ల ద్వారా ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తున్నారు. అయితే, ఈ రెండు కంపెనీల మధ్య పరస్పరం అవగాహనతో పనులు జరగకపోవడం వల్ల ప్లాంట్ల నిర్మాణ పనులు ఆలస్యమవుతోంది. అంతేకాక రెండు సంస్థలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. పెనాల్టీ చెల్లింపులో కూడా ఇదే ఆరోపణలకు దిగుతూ తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) పద్ధతిలో బీటీజీ, బీవోపీ పనులను కూడా ఒకే సంస్థకు అప్పగించడం ద్వారా సమన్వయంతో పనులు జరుగుతాయనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులతో పాటు ఎన్టీపీసీ కూడా ఈపీసీ పద్ధతిలోనే ఒకే సంస్థకు మొత్తం విద్యుత్‌ప్లాంట్ల పనులను అప్పగిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పద్థతినే అవలంభించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇవీ ప్లాంట్ల వివరాలు! రానున్న మూడేళ్లల్లో 6 వేల మెగావాట్ల విద్యు త్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెం వద్ద 800 మెగావాట్లు, మణుగూరులో 1,040 మెగావాట్లు, ఇల్లెందులో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లతోపాటు కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద 1,200 మెగావాట్ల ప్లాంట్లు కలిపి మొత్తం 7,040 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ జెన్కో ప్రణాళికలు తయారుచేసింది. ఇందులో భాగంగా మణుగూరులోని ఏడూళ్ల బయ్యారం సమీపంలో సుమారు 1,200 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని గుర్తించింది. ఇక్కడ ఇప్పటికే బెల్ వద్ద సిద్ధంగా ఉన్న 270 మెగావాట్ల ఆరు యూనిట్ల కు సరిపడా బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్లు (బీటీజీ)ను ఉపయోగించి త్వరగా ప్లాంటు సిద్ధమవుతుందని టీజెన్‌కో యోచిస్తోంది. ఇక కొత్తగూడెం వద్ద ఇప్పటికే 800 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు భూసేకరణ పూర్తయింది. పూర్తిస్థాయి ప్రాజెక్టు (డీపీఆర్) నివేదిక కూడా సిద్ధమయింది. మొ త్తమ్మీద మెగావాట్‌కు 6 కోట్ల చొప్పున 1,880 మెగావాట్లకు లెక్కిస్తే మొత్తం రూ. 11,280 కోట్ల కాంట్రాక్టు భెల్‌కు దక్కనుంది. -
గంత జాగెక్కడున్నది..?
గోదావరిఖని(కరీంనగర్) : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను ఎన్టీపీసీ సహకారంతో రామగుండం ప్రాంతంలో నెలకొల్పేందుకు సిద్దంగా ఉండగా... ఇం దుకు అవసరమైన భూమిని సింగరేణి నుంచి ఇప్పిస్తా మని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సుమారు 4,500 ఎకరాల స్థలం అవసరం కానుం డ డంతో అంత భూమి ప్రస్తుతం సింగరేణి వద్ద అందు బాటులో లేదు. దీంతో ఈ ప్లాంట్లకు సింగరేణి నుంచి భూ కేటాయింపులు ఎలా చేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇందుకు 4 వేల మెగావాట్ల విద్యుత్ అవ సరం పడుతుందని ప్రభుత్వం భావించింది. ఇందుకను గుణంగా ఎన్టీపీసీ సహకారంతో రామగుండంలో విద్యు త్ ప్లాంట్లను నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఇదే సమ యంలో స్థలం కేటాయిస్తే 800 మెగావాట్ల మొదటి ప్లాంట్‌ను 39 నెలల్లో పూర్తి చేసి ఇస్తామని ఎన్టీపీసీ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి కూడా ముఖ్యమంత్రి కేసీ ఆర్కు హామీ ఇచ్చారు. దీంతో ప్లాంట్‌కు అవసరమైన భూమిని సింగరేణి నుంచి ఇప్పిస్తామని సీఎం ఎన్టీపీసీ వర్గాలకు హామీ ఇచ్చారు. కానీ ప్లాంట్ ఏర్పాటు కోసం అవసరమైన భూమి సింగరేణి వద్ద ప్రస్తుతం అందుబాటులో లేదు. సింగ రేణికి చెందిన మొత్తం 22వేల ఎకరాలలో భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల తో పాటు నివాస ప్రాంతాలున్నాయి. ఖాళీ స్థలాలుంటే అతితక్కువ మొత్తంలో మాత్రమే ఉం డడంతో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం ప్రభు త్వం అన్వేషణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగ రేణి భూగర్భ గనుల పైభాగంలో ఉన్న స్థలాన్ని కేటా యించిన పక్షంలో భవిష్యత్‌లో భూగర్భం లో ఏర్పడ్డ కందకాల మూలంగా తీరని నష్టం జరిగే అవకాశాలు కలుగుతాయని ఆ వైపు అధికారులు ఆలో చించడం లేదు. ఇక ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు వెలి కితీసిన తర్వాత అందు లో మట్టిని నింపి ఉపయో గించాలంటే ఆ భూమి లో గట్టితనం ఉండదు. దీంతో అక్కడ కూడా ప్లాంట్ల ఏర్పాటు అంత మంచిది కాద నే అభిప్రాయా నికి అధికారులు వచ్చి నట్లు సమాచారం. సింగరేణి సంస్థ గతంలో కమా న్పూర్ మండలం జూలపల్లి వద్ద 135 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు 135 ఎకరాల స్థలాన్ని సేకరించింది. ప్రస్తుతం కంపెనీ వద్ద రామ గుండం ప్రాంతంలో ఖాళీగా ఈ భూమి తప్ప మరెక్కడ స్థలం లేదు. దీంతో ప్రభుత్వం ఎన్టీపీసీ లేదా బీపీఎల్‌కు కేటాయించిన భూములను కొత్త విద్యుత్ ప్లాంట్ల కోసం ఆయా శాఖలను అడిగేందుకు సిద్ధమ వుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీపీసీ ప్లాంట్‌లో 800 మెగావాట్ల రెండు యూనిట్లను నెలకొల్పేందుకు అవసరమైన స్థలం ప్రస్తు తం అందుబాటులో ఉంది. అలాగే ఎన్టీపీసీకి బొగ్గును సరఫరా చేసేందుకు నిర్మించిన ఎంజీఆర్ (మెరిగో రౌండ్) రైల్వే లైన్లో మార్పులు చేస్తే ఎన్టీపీ సీకి, లక్ష్మిపురం, ఎల్కల పల్లి గేట్ మధ్య స్థలంలో కూడా మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఒకవేళ ఇక్కడ ప్లాంట్లను నెలకొల్పితే వెలువడే బూ డిదను సింగరేణి గనులకు పంపించి మిగిలిన బూడి దను 2020లో మూసివేయ నున్న సింగరేణి మేడిపల్లి ఓసీపీ కందకాలలో నింపే ఆస్కారం కలుగుతుంది. ఇందుకు సింగరేణి కూడా అంగీకరించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే బ్రిటీష్ ఫిజి కల్ ల్యాబొరేటరీ (బీపీఎల్)కు కేటాయించిన భూము ల్లో ఆ సంస్థ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్ప లేకపోవ డంతో ఆ స్థలాల్లో కూడా ప్రభుత్వం కొత్తగా యూని ట్లను నెలకొల్పడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్టీపీసీ లేదా బీపీఎల్ స్థలాలను కోరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
విద్యుత్ కోతలకు బాబే కారణం
పరిగి: తెలంగాణలో విద్యుత్ కోతలకు చంద్రబాబే కారణమని, గత పాలన లో ఇక్కడి వనరులను తరలించుకెళ్లి సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పారని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన తాండూరులో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారా వు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మేని ఫెస్టోలో పేర్కొన్న విధంగా అధికారం చేపట్టిన 11 వారాల్లోనే 43 అంశాలపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే దళితులకు మూడెకరాల భూమి పథకం ప్రారంభమైంద ని, రూ.మూడు లక్షలతో ఇంటి నిర్మా ణం పథకం త్వరలో కార్యరూపం దాల్చనుందని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ ప్రాంతంలోని తాగు, సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నెట్టెం పాడు, బీమా-1, బీమా-2, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టి త్వర లో పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, బాల్‌రాజ్‌లు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఒకేరోజున నాలుగున్నర కోట్ల ప్రజల వివరాలు సేకరించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రతిపక్షాలు అవగాహనా రాహిత్యంతో చవకబారు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తుంటే ఇక్కడి టీడీపీ నాయకులు కనీస అవగాహన లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం 2009 నుంచి ఇప్పటివరకు పంటనష్ట పరిహారం చెల్లించకుండా జాప్యంచేస్తే తమ ప్రభుత్వం అన్నికలిపి ఒకేసారి చెల్లిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల మహేష్‌రెడ్డి, కొప్పుల నాగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు భాస్కర్, పార్టీ సీనియర్ నాయకులు సురేందర్, వెంకటయ్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదుత్పత్తికి మేము సహకరిస్తాం
* అతి తక్కువ సమయంలోనే విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తాం * ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చైనా కంపెనీ ప్రతినిధుల భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి సహకారం అందిస్తామని చైనాకు చెందిన డాన్ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ (డీఈసీ) ముందుకు వచ్చింది. డీఈసీ అంతర్జాతీయ అధ్యక్షుడు హన్ జికియో, డీఈసీ ఇండియా ఎండీ లియాంగ్ జియాన్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సచివాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణతో దీర్ఘకాలిక భాగస్వామ్యం కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా వారు కేసీఆర్‌కు తెలిపారు. అతి తక్కువ కాలంలో 660 మెగావాట్ల నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తామని పేర్కొన్నారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో 40 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ప్లాంట్లకు ఉపకరణాలను సరఫరా చేస్తున్నామని వివరించారు. చైనాలో విద్యుత్ ఉపకరణాల తయారీ, ఇతర ప్రాజెక్టులను పరిశీలించేందుకు ‘చెంగ్డు’ను సందర్శించాలని భావిస్తున్నట్టు సీఎం తెలిపారు. హైదరాబాద్‌లో 30 శాతానికిపైగా ఇళ్లలో చైనా నుంచి కొనుగోలు చేసిన ఫర్నిచర్ ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషీ, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
‘సుప్రీం’కు పీపీఏల రద్దు వివాదం!
-
‘సుప్రీం’కు పీపీఏల రద్దు వివాదం!
సీఈఏ కమిటీ నిర్ణయంపై ఏపీ మండిపాటు తుది నివేదిక అనంతరం సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయం నేడు వాడివేడిగా జరుగనున్న సమావేశం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దు వివాదం చివరకు సుప్రీంకోర్టుకు చేరేట్టుగా ఉంది. రెండు రాష్ట్రాల్లోని విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం విద్యుత్ సరఫరా జరగాల్సిందేనన్న కమిటీ ముసాయిదా నివేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండిపడుతోంది. కమిటీ నివేదికను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తుండగా, దానిపై సంతకం చేయరాదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో జరిగే సీఈఏ కమిటీ సమావేశం వేడివేడిగా సాగనుంది. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు సీఈఏ చైర్పర్సన్ నీర్జా మాథూర్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకసారి సమావేశమైన కమిటీ సోమవారం మరోసారి సమావేశం కానుంది. ఈ సందర్భంగా కమిటీ ఇరు రాష్ట్రాలకు ఒక ముసాయిదాను పంపింది. ‘గ్రిడ్ సంరక్షణ కోసం ఇరు రాష్ట్రాల్లోని విద్యుత్ ప్లాంట్ల నుంచి వాటా మేరకు తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ సరఫరా కావాల్సిందే. పీపీఏలకు ఈఆర్సీ అనుమతి ఉందా? లేదా అన్న న్యాయపరమైన అంశాల జోలికి మేం వెళ్లలేం. కేవలం సాంకేతిక అంశాల మీద ఆధారపడి మాత్రమే మేం నిర్ణయం తీసుకుంటున్నాం’ అంటూ ముసాయిదాలో కమిటీ పేర్కొంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ నుంచి న్యాయసలహా కూడా తీసుకుంది. సుప్రీంకోర్టు, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఈఆర్సీ అనుమతి లేని పీపీఏలు రద్దవుతాయని ఈ మేరకు ఏజీ సలహా ఇచ్చారు. ‘న్యాయపరమైన అంశాన్ని న్యాయ నిపుణులు లేని కమిటీ నిర్ణయించడం సరియైనది కాదు. కమిటీ ఇచ్చే నిర్ణయం న్యాయపరంగా ఉండాలి. కేవలం సాంకేతికంగా ఇస్తే సరిపోదు’ అని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. కేంద్రం కూడా ఇదే నిర్ణయం ప్రకటిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణపట్నం ప్లాంటు నిర్వహణ మాకే! కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్‌లో తమకే మెజారిటీ వాటా ఉన్నందున నిర్వహణ బాధ్యతలు తమకే అప్పగించాలని కొత్త వాదనను తెలంగాణ తెరమీదకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) ఆధ్వర్యంలో 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే పూర్తయిన 800 మెగావాట్ల మొదటి యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ ప్లాంట్‌ను జెన్కోతో పాటు విద్యుత్‌పంపిణీ సంస్థ(డిస్కం)లు కలిసి సంయుక్తంగా చేపడుతున్నాయి. ఈ ప్లాంటులో ఉమ్మడి రాష్ట్రంలోని జెన్కోకు 51 శాతం వాటా, నాలుగు డిస్కంలకు 49 శాతం వాటా ఉంది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ జెన్కోతో పాటు తెలంగాణ డిస్కం అయిన టీఎస్పీడీసీఎల్ (గతంలో సీపీడీసీఎల్)కు అధిక శాతం వాటా ఉంది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ట్రాన్స్‌కో, జెన్కోలు కొనుగోలు చేసిన వివిధ రకాల సాఫ్ట్వేర్ ఖర్చులో తమ వాటా తమకు ఇవ్వాలని కూడా తెలంగాణ వాదించనున్నట్టు సమాచారం. మరోవైపు కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని సంప్రదాయేతర ఇంధన వనరుల (ఎన్సీఈ) విద్యుత్ మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే అన్న కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. -
మూడేళ్లలో మిగులు విద్యుత్
గణపురం : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధించే దిశలో విద్యుత్ ప్లాంట్ల విస్తరణను ప్రణాళిక బద్ధంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో శుక్రవారం తెలంగాణ ఇంజినీర్స్డేను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన మధుసూదనాచారి తెలంగాణ ఇంజినీర్స్ పితామహు డు అలీనవాజ్ బహదూర్జంగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయనను తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియోషన్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియోషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని.. ఇది గత ప్రభుత్వం చేసిన తప్పిదమేనన్నారు. రైతులు, పారిశ్రామిక అవసరాలకు సరిపోను విద్యుత్ అందించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఈ మేరకు పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సమాయత్తమవుతున్నాయని చెప్పారు. చెల్పూరు రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నుంచి 2015 జూన్‌లోగా విద్యుత్ ఉత్పత్తి అయ్యేవిధంగా కార్యాచరణ అమలవుతోందన్నారు. మరో 800 మెగావాట్ల ప్లాంట్‌కు సంబంధించిన భూసేకరణ తదితర పనులను వేగవంతం చేయూలని జెన్కో అధికారులకు ఇప్పటికే అదేశాలు ఇచ్చామని చెప్పారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాల్సిన గురుతబాధ్యత ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు, ఉద్యోగులపై ఉందని పేర్కొన్నారు. భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారని, అందుకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో కేటీపీపీ సీఈ శివకుమార్, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, మంగేష్‌కుమార్, ఈఈ అంజయ్య, తెలంగాణ రాష్ట్ర ఇంజినీర్స్ అసోసియేషన్, ఏఈల సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షులు సదానందం, సంతోష్, కార్యదర్శులు గడ్డం బుచ్చయ్య, పుట్ట తిరుపతి, నరేష్, లింగనాయక్, ప్రమీల, లీల, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మాకు గ్యాస్ ఇప్పించండి: పీపీఏ బృందం
హైదరాబాద్: నిరుపయోగంగా ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ ఇప్పించాలని ఏపీ సీఎం చంద్రబాబుతో విద్యుత్ ఉత్పత్తిదారుల అసోసియేషన్ (పీపీఏ) కోరింది. అసోసియేషన్ డెరైక్టర్ జనరల్ అశోక్ ఖురానా నేతృత్వంలో అనిల్ అంబానీ, ల్యాంకో మధుసూదన్, జీవీకే రెడ్డి తదితరులు సోమవారం లేక్ వ్యూలో బాబుతో సమావేశమయ్యారు. రాష్ర్టంలో ఏడు వేల మెగావాట్ల గ్యాస్ ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయని... త్వరలో ఓఎన్జీసీ ఉత్పత్తి చేయనున్న రోజుకు 6 మిలియన్ మెట్రిక్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ (ఎంఎంసీఎండీ)లో వాటా వచ్చేలా చూడాలని కోరారు. ఎల్ఎన్జీ యూనిట్‌తో పాటు ఫ్లోటింగ్ స్టోరేజీ అండ్ రీ-గ్యాసిఫికేషన్ యూనిట్ (ఎఫ్‌ఎస్‌ఆర్‌యూ) ఏర్పాటు చేసేందుకూ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు బాబు సానుకూలంగా స్పందించారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి గ్యాస్ సరఫరా కోసం అసోసియేషన్ కలిసినప్పటికీ... సమావేశం అనంతరం చంద్రబాబుతో అనిల్ అంబానీ పది నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమై నెల్లూరు జిల్లాలోని రిలయన్స్ ప్లాంటు విద్యుత్ ధరను పెంచేందుకు సహకరించాలని కోరినట్టు తెలుస్తోంది. -
తెలంగాణకు కరెంటు షాక్ కొట్టనుంది.
-
తెలంగాణకు ‘కరెంటు’ షాక్
* జెన్కో పీపీఏలు రద్దు! * అదే జరిగితే తెలంగాణకు 370 మెగావాట్ల నష్టం * ఎక్కడి ప్లాంట్లు అక్కడే: ఏపీ జెన్కో ఈఆర్సీ, డిస్కంలకు లేఖ * నేటి ఈఆర్సీ భేటీలో నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కరెంటు షాక్ కొట్టనుంది. ఆంధ్రప్రదేశ్ జెన్కోకు చెందిన అన్ని విద్యుత్ ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) అన్నీ రద్దవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)తో పాటు తెలంగాణలోని రెండు డిస్కంలు (సీపీడీసీఎల్, ఎన్పీడీసీఎల్), ఆంధ్రాలోని రెండు డిస్కం (ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్)లకు ఏపీ జెన్కో మంగళవారం ఈ మేరకు లేఖ రాసింది. దీనిపై బుధవారం ఈఆర్సీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకవేళ పీపీఏల రద్దుకు అనుమతిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎక్కడి విద్యుత్ ప్లాంట్లు ఆ ప్రాంతానికే చెందనున్నాయి. అంటే ఏ రాష్ట్రంలోని ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్ ఆ రాష్ట్రానికే చెందనుంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం సుమారు 370 మెగావాట్లు, అంటే 9 మిలియన్ యూనిట్ల మేరకు విద్యుత్‌ను నష్టపోనుందని అంచనా. పీపీఏలు రద్దయ్యూక ఏ రాష్ట్రంలోని డిస్కంలతో ఆ రాష్ట్రంలోని జెన్కో పీపీఏలు చేసుకోవచ్చంటున్నారు. ఈ దెబ్బకు తెలంగాణలో విద్యుత్ కోతలు మరింత పెరగవచ్చని విద్యుత్ రంగ నిపుణులంటున్నారు. దీనికితోడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 2,450 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన విద్యుత్ ప్లాంటు నిర్మాణంలో ఉండగా తెలంగాణలో కేవలం 960 మెగావాట్ల ప్లాంట్లే నిర్మాణంలో ఉన్నాయి. పైగా వాటి పీపీఏలకు కూడా ఈఆర్సీ అనుమతివ్వలేదు. అంటే వాటి పరిస్థితి ఎక్కడి గొంగడి అక్కడే చందం కానుంది. అలా కూడా తెలంగాణ రాష్ట్రం భారీగానే నష్టపోనుంది. ఈఆర్సీ అనుమతి లేక... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జెన్కోకు 8924.9 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్లాంట్లున్నాయి. వీటిలో 6,530 మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్లతో నాలుగు డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏలు 2002తో ముగిశాయి. వాటిని కొనసాగించాలంటూ 2009లో జెన్కో, డిస్కంలు లేఖలు రాసినా ఈఆర్సీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మిగతా కొత్త విద్యుత్ ప్లాంట్లకు జెన్కో, డిస్కంలు 2009లోనే పీపీఏలు కుదుర్చుకున్నారుు. వాటిని అనుమతించాలంటూ దరఖాస్తు చేసుకున్నా ఈఆర్సీ ఇప్పటిదాకా అధికారికంగా అనుమతివ్వలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారమే పీపీఏలు కొనసాగుతాయని ఆ మేరకే ఇరు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతుందని పేర్కొంది. ఫలితంగా పీపీఏలకు అనుగుణంగా ప్లాంట్లు ఎక్కడున్నాయన్న దానితో నిమిత్తం లేకుండా తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ సరఫరా అవుతోంది. అరుుతే పీపీఏలకు అధికారికంగా ఈఆర్సీ అనుమతివ్వలేదు గనుక అవి కొనసాగుతున్నట్టు కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఇందుకనుగుణంగా గతంలో తాము సమర్పించిన పీపీఏ ప్రతిపాదనలను పరిశీలించాల్సిన అవసరం లేదని ఈఆర్సీకి రాసిన లేఖలో పేర్కొంది. గతంలో నాలుగు డిస్కంలతో కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేసుకుంటున్నట్టు తెలిపింది. విభజన చట్టంలోనే పేర్కొన్నట్టుగా ఎక్కడి విద్యుత్ ప్లాంట్లు అక్కడికే చెందుతాయని కూడా తెలిపింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్ పూర్తిగా ఆ రాష్ట్రానికే చెందనుంది. ఈఆర్సీ నుంచి అనుమతి వచ్చినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్‌లోని జెన్కో ప్లాంట్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉండబోదని ఇంధన శాఖ వర్గాలంటున్నాయి. అదేవిధంగా తెలంగాణలోని ప్లాంట్లు కూడా ఆ రాష్ట్రానికే చెందనున్నాయి. అయితే ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం తక్కువ. ఆ కారణంగా తెలంగాణకు వెంటనే విద్యుత్ నష్టం వాటిల్లనుంది. నష్టం ఇలా... - ఉమ్మడి రాష్ట్రంలో జెన్కోకు 8924.9 మెగావాట్ల ప్లాంట్లున్నాయి. ఇందులో తెలంగాణలో 4235.3 ఎంవీ, ఆంధ్రప్రదేశ్‌లో 4689.6 ఎంవీ ప్లాంట్లున్నారుు - వర్షాకాలంలో నడిచే హైడల్ ప్లాంట్లను మినహాయిస్తే నిరంతరం విద్యుదుత్పత్తి చేసే థర్మల్ ప్లాంట్లు ఆంధ్రప్రదేశ్‌లో 2810 మెగావాట్లు, తెలంగాణలో 2282.5 మెగావాట్ల మేరకున్నాయి. వీటిలో ప్రస్తుతం తెలంగాణకు 53.89 శాతం లెక్కన 2651.9 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం లెక్కన 2440.5 మెగావాట్ల విద్యుత్ అందుతోంది. - పీపీఏల రద్దు అమల్లోకి వస్తే ఏ రాష్ట్ర ప్లాంట్లు ఆ రాష్ట్రానికే చెందుతాయి. దాంతో తెలంగాణకు 2282.5 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 2810 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. అంటే తెలంగాణ 369.5 మెగావాట్ల (సుమారు 9 ఎంయూ) విద్యుత్‌ను నష్టపోనుంది. మనమెందుకు అనుమతివ్వలేదు? పీపీఏల రద్దు కోరుతూ మీడియాలో కథనాలు, జెన్కో నుంచి లేఖ అందడం తదితరాల నేపథ్యంలో ఈఆర్సీ చైర్మన్ భాస్కర్ తాజాగా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. పీపీఏల కోసం 2009లో దరఖాస్తు చేసుకున్నా మనమెందుకు అనుమతివ్వలేదనే ప్రశ్నను భేటీలో లేవనెత్తారని సమాచారం. పీపీఏల రద్దుపై న్యాయపరమైన అంశాలను పరిశీలించి బుధవారం నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ఈఆర్సీ అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. మరోవైపు జెన్కో-డిస్కంల మధ్య ఏటా పీపీఏ ప్రకారమే పెట్టుబడి వ్యయం, విద్యుత్ కొనుగోలు, అమ్మకం ప్రక్రియ జరుగుతున్నందున పీపీఏలు అమల్లో ఉన్నట్టేననే అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. మొత్తమ్మీద పీపీఏల భవితవ్యం ఈఆర్సీ తీసుకునే నిర్ణయంతో తేలనుంది. పీపీఏ రద్దు లేఖ అందింది ‘‘పీపీఏలను రద్దు చేసుకుంటామంటూ ఏపీ జెన్కో రాసిన లేఖ మాకందింది. దాన్ని పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. ఈ లేఖపై బుధవారం విద్యుత్ సౌధలో సమావేశమై కార్యాచరణను నిర్ణయిస్తాం’’ - తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి సురేశ్ చందా -
మూడేళ్లు.. 6,000 మెగావాట్లు
-
మూడేళ్లు.. 6,000 మెగావాట్లు
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం రాజకీయ ఒత్తిళ్లుండవని భరోసా తెలంగాణలో రానున్న మూడేళ్లలో 6 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇంధన శాఖ ఉన్నతాధికారులకు ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆయన ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఉన్న విద్యుత్ లోటు దృష్ట్యా నిర్దిష్ట కాలపరిమితిలో ప్లాంట్లను నిర్మించాలన్నారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడేళ్లల్లో 6 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారు. ‘‘వరంగల్ జిల్లా భూపాలపల్లి, కరీంనగర్ జిల్లా రామగుండం వద్ద ప్లాంట్ల నిర్మాణ పనులను వెంటనే చేపట్టండి. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల సమీపంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకోండి. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోండి’’ అని సూచించారు. ఇంధన శాఖ ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఉన్న విద్యుత్ లోటు దృష్ట్యా నిర్దిష్ట కాలపరిమితిలో ప్లాంట్లను నిర్మించాలన్నారు. విద్యుదుత్పత్తిని ప్రైవేటు రంగానికి వదిలేసేది లేదని, కొత్త ప్లాంట్ల ఏర్పాటును పూర్తిగా ప్రభుత్వపరంగానే చేపడతామని చెప్పారు. తద్వారా ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా లైన్ల ఏర్పాటుపై అధికారుల బృందం వెళ్లి అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీనిపై ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్‌తో మాట్లాడానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా విద్యుత్ నియంత్రణ మండలి (టీఈఆర్సీ) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ కార్యదర్శి సురేశ్ చందాను ఆదేశించారు. నగరాలు, పట్టణాలు, చిన్న పట్టణాలల్లో రూఫ్ టాప్ సోలార్ విద్యుదుత్పత్తిని పెంచాలన్నారు. అది తన ఫామ్ హౌస్‌లో విజయవంతమైందని తెలిపారు. అధికారులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లూ ఉండబోవని భరోసా ఇచ్చారు. పూర్తి అవినీతిరహిత పాలనను అందిస్తామని, అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. కాంక్రీట్ జంగిల్తోనే కరువుకాటకాలు ‘‘వ్యక్తిగతంగా నేను రైతును. వ్యవసాయమన్నా, చెట్ల పెంపకమన్నా నాకు చాలా ఇష్టం. మీరేం చేస్తరో తెల్వదు. వచ్చే ఐదేండ్లల్ల పచ్చదనం బాగా పెరగాలె. చెట్లు, అడవుల పెంపకాన్ని విస్తృతంగా చేపడుదాం. హైదరాబాద్‌తో పాటు పరిసరాల్లో రింగ్‌రోడ్లు, పెద్ద రోడ్లు, గ్రామాల్లోనూ రోడ్ల నిర్మాణం సందర్భంగా చెట్లను విధిగా పెంచడం వంటి చర్యలు తీసుకోవాలె’’ అని అటవీ శాఖ అధికారులతో కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు కావాల్సిన బడ్జెట్, సిబ్బంది వంటివాటిపై పూర్తి నివేదికలతో రావాలని సచివాలయంలోని తన చాంబర్లో అటవీ శాఖ సమీక్షలో ఆదేశించారు. ‘‘15 రోజుల్లో మరో సమావేశం పెట్టుకుందాం. నిర్దిష్టమైన ప్రణాళికలతో భారీగా అడవులను పెంచుదాం’ అని సూచించారు. అడవుల విస్తీర్ణం పెరిగితే సర్వసమస్యలూ దూరమవుతాయన్నారు. అందుకు బడ్జెట్ ఎంతైనా వెనకాడొద్దని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, జిల్లాలవారీగా పరిస్థితి, దశాబ్ద కాలంలో ఎక్కడెక్కడ తగ్గింది, కారణాలేమిటి, పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, సిబ్బంది, బడ్జెట్ వంటివాటిపై లోతుగా సమీక్షించారు. అయితే అటవీ శాఖ భూముల సరిహద్దులు, ఆక్రమణలు తదితరాలపై కేసీఆర్ ప్రశ్నలకు అధికారులు సరైన సమాచారం, సమాధానం ఇవ్వలేకపోయారు. అటవీ శాఖకు బడ్జెట్ కేటాయింపులు ఏటేటా తగ్గుతున్నాయన్నారు. నాగార్జునసాగర్, ఆదిలాబాద్, ఖమ్మం అడవుల పరిస్థితి, సమస్యలను వివరించారు. మొత్తం భూబాగంలో అడవులు 33 శాతం ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలో 25 శాతమే ఉన్నాయని చెప్పారు. అడవులు, చెట్లు ఎక్కువగా ఉంటే వానలు సమృద్ధిగా ఉంటాయని కేసీఆర్ వారికి గుర్తు చేశారు. ‘‘మొన్న బాన్సువాడ నుండి ఒక యువకుడు వచ్చిండు. వాళ్ల ఊళ్లె ఎన్నడూ కరువే రాలేదని మాటల సందర్భంగా అన్నడు. అదేందని అడిగితె ఊళ్లె, పొలాల కాడ బాగా చెట్లు పెంచినమన్నడు. ఇగ వానలెందుకు రావు చెప్పమన్నడు. ఆ మాటలు మనకు ఆదర్శంగా ఉండాలె’’ అంటూ దిశానిర్దేశం చేశారు. రిజర్వు ఫారెస్టులనే కాకుండా సామాజిక అడవులను కూడా వీలైనంత ఎక్కువగా పెంచాలన్నారు. అటవీ మంత్రి జోగు రామన్న, శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఎస్.బి.ఎల్.మిశ్రా, అధికారులు భేటీలో పాల్గొన్నారు. -
జేపీ జల విద్యుత్ కేంద్రాలు టీఏక్యూఏ చేతికి!
న్యూఢిల్లీ/అబుదాబి: దేశీయ సంస్థ జైప్రకాష్ పవర్ వెంచర్స్‌కు చెందిన రెండు జల విద్యుత్ కేంద్రాలను అబుదాబి నేషనల్ ఎనర్జీ కంపెనీ(టీఏక్యూఏ) ఆధ్వర్యంలో ఏర్పాటైన కన్సార్షియం కొనుగోలు చేయనుంది. ఇందుకు 160 కోట్ల డాలర్లను(రూ. 10,000 కోట్లు) చెల్లించనున్నట్లు టీఏక్యూఏ తెలిపింది. దీనిలో ఈక్విటీ రూపేణా 61.6 కోట్ల డాలర్లను(రూ. 3,820 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. మిగిలిన మొత్తం ప్రధానంగా సెక్యూర్డ్(నాన్‌రికోర్స్) రుణం రూపేణా ఉంటుందని తెలిపింది. డీల్‌లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని కినౌర్ జిల్లాలోగల బాస్పా రెండో దశ, కర్చాం వాంగ్టూ ప్లాంట్లను సొంతం చేసుకోనుంది. వీటి సంయుక్త విద్యుదుత్పత్తి సామర్థ్యం 1,391 మెగావాట్లుకాగా, ఈక్విటీ పెట్టుబడులలో టీఏక్యూఏ 51% వాటాను సమకూరుస్తుంది. త ద్వారా రెండు జల విద్యుత్ ప్లాంట్లకు సంబంధిం చిన యాజ మాన్యం, కార్యకలాపాల నిర్వహణలను అబుదాబీ నేషనల్ ఎనర్జీ కంపెనీ సొంతం చేసుకోనుంది. కన్సార్షియంలో కెనడాకు చెందిన సంస్థాగత ఇన్వెస్టర్ సంస్థకు(పేరు వెల్లడించలేదు) 39% వాటా, ఐడీఎఫ్సీ ఆల్టర్నేటివ్స్ ఇండియా ఇన్ఫ్రా ఫండ్‌కు 10% వాటా ఉంటుందని టీఏక్యూఏ వివరించింది. ఈ కొనుగోలు ద్వారా ఇండియా జల విద్యుత్ రంగంలో తాము అతిపెద్ద ప్రయివేట్ కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు టీఏక్యూఏ తెలిపింది. -
‘సోలార్’కు గ్రహణం
నెన్నెల, న్యూస్‌లైన్ : తూర్పు ప్రాంతంలో ప్రతిపాదించిన సోలార్ విద్యుత్ ప్లాంట్ అర్ధాంతరంగా నిలి చింది. భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అటవీ శాఖ అధికారులు అభ్యంతరం చెప్పడంతో పవర్ ప్లాంట్ నిర్మాణానికి గ్రహ ణం పట్టుకుంది. దీంతో నెన్నెల ప్రాంత ప్రజలుప్లాంట్పై పెట్టుకున్న ఆశలు సన్నగిల్లాయి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐటీసీ) ఆధ్వర్యంలో నెన్నెల మండలం బొప్పారంలో శివారుల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం బొప్పారం శివారులో 1,000 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. ఈ భూమిలో సర్వే నంబర్ 672లో 790.29 ఎకరాలు రెవెన్యూ శాఖ కొన్నేళ్ల క్రితం నిరుపేదలకు పంపిణీ చేసి పట్టాలు అందజేసింది. పవర్‌ప్లాంట్ నిర్మాణం కోసం ఆరుగురు సర్వేయర్లతో నెన్నెల, బొప్పారం శివారు ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం ముమ్మరంగా సర్వే చేపట్టింది. అటవీశాఖ అధికారులు మోకాలొడ్డటంతో పవర్‌ప్లాంట్ నిర్మాణ ప్రక్రియ విఘాతం కలిగింది. తెలంగాణ రాష్ట్రంలోనైనా ప్లాంటును ప్రారంభించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. ఏం జరిగింది? భూ సేకరణ జరుగుతున్న క్రమంలో అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 672లో కొంత భూభాగం రిజర్వు ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని అభ్యంతరం చెప్పారు. సర్వేయర్లు భూ సేకరణ జరపకుండా అడ్డుకోవడంతో సర్వే దశలోనే పవర్ ప్లాంట్ నిర్మాణం ఆగింది. ఆ తర్వాత రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేయాలని నిర్ణయించినా ఇప్పటికీ ఊసులేదు. ఈ రెండు శాఖల మధ్య నెలకొన్న వివాదం పరిష్కరించేందుకు అప్పటి మంచిర్యాల సబ్‌కలెక్టర్ వివేక్‌యాదవ్, బెల్లంపల్లి డీఎఫ్‌వో వెంకటరామనర్సయ్య వివాదాస్పద భూములు పరిశీలించి వెళ్లారు. అయినా భూ సమస్యల కొలిక్కిరాలేదు. సేకరించిన భూమిని ఏపీఐటీసీకి అప్పగిస్తే తప్పా సోలార్ పవర్‌ప్లాంట్ నిర్మాణానికి అడ్డంకులు తొలగవనేది నగ్నసత్యం. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటంతో ఇప్పట్లో పవర్‌ప్లాంట్ నిర్మాణం జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రయోజనం రోజుకు ఆరు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చనే లక్ష్యంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కలుగుతున్న అవరోదాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గడంతోపాటు వాతావరణ కాలుష్యం ఏర్పడదు. మరోపక్క డిమాండ్‌కు తగ్గట్టుగా బెల్లంపల్లి, నెన్నెల, భీమిని మండలాలకు నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేయడానికి అవకాశాలు ఉంటాయి. సౌరశక్తి గంటలు అధికంగా ఉండటం, అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో బొప్పారం ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రైవేట్ సంస్థ యజమాన్యంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే అనేక ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చిన అటవీశాఖ లేవనెత్తిన భూ సమస్యతో ప్రయోజనం లేకుండా పోయింది. సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లయితే సుమారు 70 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు మరో 200 మందికి పరోక్షంగా జీవనోపాధి లభించేది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రెవెన్యూ, అటవీశాఖల మధ్య నెలకొన్న భూ వివాదం చిక్కుముడిని తొలగించి సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఉద్యోగం వస్తుందని ఆశపడ్డం.. సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశపడ్డం. సర్వే దశలోనే ప్లాంట్ ఆగిపోవడం నిరాశగా ఉంది. ప్లాంట్ ఏర్పాటుకు కలిగిన ఇబ్బందులు తొలగించి విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. స్థానికులకు ఉద్యోగావకాశం తప్పకుండా లభిస్తుందని నా వంటి నిరుద్యోగులు గంపెడాశతో ఉన్నారు. చిన్న చిన్న సమస్యలతో పెద్ద ప్రాజెక్టును నిలిపి వేయడం సమంజసం కాదు. ఇప్పటికైనా ప్లాంటు పనులు జరిగేలా చూడాలి. - మహేశ్, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, నెన్నెల -
పరిశ్రమలకూ కోతలు
సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం కంటే ముందే ఉక్కపోత షురూ అయ్యింది. ఇప్పటికే గ్రామాలకు, వ్యవసాయానికి అధికారికంగా కోతలు ప్రకటించిన విద్యుత్ సంస్థలు... పరిశ్రమలపైనా గురిపెట్టాయి. అధిక విద్యుత్ వినియోగ వేళల్లో (పీక్ అవర్స్) అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ కోతలు అమలు చేయాలని నిర్ణయించాయి. అనధికారికంగా శనివారం నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ సమయంలో కేవలం లైటింగ్‌కు మాత్రమే విద్యుత్‌ను వినియోగించాలని పరిశ్రమలకు ఆదేశాలు ఇప్పటికే జారీచేసినట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటివారంలోనే ఇంత భారీస్థాయిలో విద్యుత్ కోతలు అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మార్చి, ఏప్రిల్‌లో పరిస్థితిని తలచుకుని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. - రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. వర్షాలు బాగా కురవడం వల్ల భూగర్భజల మట్టం పెరిగింది. దీంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరిగింది. - ఈ నెల 6న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 283 మిలియన్ యూనిట్లు (ఎంయూలు). సరఫరా కేవలం 263 ఎంయూలు. - విద్యుత్ లోటు 20 ఎంయూలు. అంటే 2 కోట్ల యూనిట్లు అన్నమాట. దీన్ని పూడ్చుకునేందుకు భారీగా కోతలను అమలు చేస్తున్నారు. వ్యవసాయానికి అధికారికంగా గంట విద్యుత్ కోతలు విధించాయి. - అదనపు విద్యుత్‌ను పొందేందుకు తాపీగా విద్యుత్ సంస్థలు చర్యలు ప్రారంభించాయి. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. - దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న వివిధ విద్యుత్ సంస్థల నుంచి 125 మెగావాట్ల విద్యుత్‌ను తాజాగా కొనుగోలు చేశాయి. - నాఫ్తా, రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు (ఆర్-ఎల్ఎన్జీ) ద్వారా మరో 400 మెగావాట్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. బహుశా మార్చి నుంచి ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇదీ కోతల కాలం! - గ్రామాల్లో 12 గంటలు - మండల కేంద్రాల్లో 8 గంటలు - జిల్లా కేంద్రాలు, మున్సిపాల్టీల్లో 4-6 గంటలు - హైదరాబాద్, వరంగల్, తిరుపతిల్లో 2 గంటల మేరకు కోతలు అమలుచేస్తున్నారు. - వ్యవసాయానికి అధికారికంగా ఒక గంట కోత. కేవలం 6 గంటలు మాత్రమే సరఫరా చేయాలని ఆదేశాలు. - వ్యవసాయానికి నికరంగా 2-3 గంటలు కూడా రాని దుస్థితి. రబీ నారు ఎండిపోతోంది. -
బొగ్గు దొంగలు
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : కోల్ మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. సింగరేణి నుంచి బొగ్గు అక్రమంగా రవాణా చేస్తోంది. అనుమతి లేకుండా పవర్ప్లాంట్లు, సిమెంట్, సిరామిక్స్ ఫ్యాక్టరీ లు, ఇటుక తయారీ కేంద్రాలు, ఇతర పరిశ్రమలకు తరలిస్తోంది. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన దందా ప్రస్తుతం యథేచ్ఛగా కొనసాగుతోంది. మామూళ్ల మత్తులో పడి అధికారులు బొగ్గు అక్రమ రవాణాను ‘మామూలు’గానే తీసుకుంటున్నారు. బెల్లంపల్లి ఏరియాలో భూగర్భ గని గోలేటీ-1ఎ, కైరిగూ డ, డోర్లి-1, డోర్లి-2 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి నుంచి వెలికితీసిన బొగ్గును టిప్పర్లు, లారీల ద్వారా తాండూర్ మండలంలోని రేచిని రోడ్ రైల్వేస్టేషన్, బోయపల్లి శివారులోని మామిడి తోటలలో ఏర్పాటు చేసిన కోల్ యార్డులలో డంప్ చేయాలి. అక్కడ నుంచి ప్ర త్యేక రైలు వ్యాగన్ల ద్వారా సింగరేణితో ఒప్పం దం కుదుర్చుకున్న పరిశ్రమలకు బొగ్గు రవాణా అవుతోంది. మరోపక్క బొగ్గు గనుల నుంచి నేరుగా రామకృష్ణాపూర్(ఆర్కేపీ) పరిధిలోని ఆర్కే-1, ఆర్కే-5 సీఎస్పీలకు టిప్పర్లలో బొగ్గు సరఫరా అవుతోంది. షిప్ట్లవారీగా ఉత్పత్తి చేసి న బొగ్గును లారీలు, టిప్పర్లలో కోల్ ట్రాన్స్‌పోర్టుల ద్వారా చేరవేస్తుంటారు. ఇది సాధారణంగా జరిగే బొగ్గు రవాణా ప్రక్రియ. సరిగ్గా ఈ తరహాలోనే బొగ్గు అక్రమ రవాణా జరుగుతుండటం చేదు నిజం. జరుగుతున్న తీరు.. తాండూర్ మండలం బోయపల్లి శివారులో ఐ దు కోల్‌యార్డులు ఉన్నాయి. గనుల నుంచి బొ గ్గును టిప్పర్లు, లారీలు నేరుగా ఆయా కోల్యార్డులకు, ఆర్కేపీ సీఎస్పీలకు చేరవేయాలి. అలా కాకుండా తాండూర్ ఐబీ చౌరస్తా సమీపంలో ఉన్న సింగరేణి చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేసిన తర్వాత రాత్రి టిప్పర్లు, లారీల వారు దర్జాగా కొన్ని సిమెంట్, సిరామిక్స్ ఫ్యాక్టరీలకు, ఇటుక బట్టిలకు బొగ్గును చేరవేస్తున్నారు. కోల్ యార్డులలో బొగ్గు డంప్ చేయకుండానే ఆ రకంగా దం దా నిర్వహిస్తున్నారు. మరోవైపు గోలేటీ టౌన్షిప్ మీదుగా మహారాష్ట్రకు లారీలలో బొగ్గును అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతినెలా లారీలు, టిప్పర్లలో బొగ్గు అక్రమ రవాణా అవుతోంది. అదెలా సాధ్యమంటే.. సాధారణంగా ఏదేని పరిశ్రమకు బొగ్గును రవా ణా చేయాలంటే లోడైన గని నుంచి సదరు పరి శ్రమ వరకు తీసుకెళ్లడానికి వే బిల్లు ఉండాలి. అదేమి లేకుండానే బొగ్గును మాఫియా రవాణా చేస్తూ అక్రమ దందాలో గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. కొన్ని కోల్యార్డులలో పనిచేస్తున్న కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది, సింగరేణి ఎస్అండ్పీసీ అధికారులు మాఫియాతో చేతులు కలపడం మూలంగానే అక్రమ దందా జోరుగా సాగుతోంది. కోల్‌యార్డులో బొగ్గు డంప్ కాకపోయిన సిబ్బంది డంప్ అయినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి మాఫియాకు సహకరిస్తున్నారు. బొగ్గు వే బిల్లు లేకుండా తరలివెళ్తున్న నిఘా పెట్టి పట్టుకోవల్సిన సింగరేణి ఎస్అండ్పీసీ, విజిలెన్స్, పోలీసు, రవాణా శాఖల అధికారులు రూ.లక్షలు ముడుపులు పుచ్చుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కరీంనగర్, గోదావరిఖని ప్రాంతాల మాఫియా కాకుండా మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూర్, మందమర్రి, గోలేటీ ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కొందరు కోల్మాఫియాతో చేతులు కలిపి అక్రమ దందాకు సహకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా బొగ్గు అక్రమ రవాణాను అరికట్టి, మాఫియా గుత్తాధిపత్యాన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది. అవినీతి అధికారులను బదిలీ చేసి నిజాయితీ కలిగిన అధికారులను నియమిస్తే తప్పా బొగ్గు అక్రమ రవాణా ఆగే అవకాశాలు ఉండవని పలువురు పేర్కొంటున్నారు. -
నేడో, రేపో విద్యుత్ ప్లాంట్ల మూత
సింహాద్రి, రామగుండంలో నిండుకున్న బొగ్గు 4,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ జెన్కో ప్లాంట్లకూ బొగ్గు ఇబ్బందులు తుపానులు, ఎంసీఎల్లో స్థానిక గొడవల ఫలితం అప్రకటిత విద్యుత్ కోతలు అమలయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)కి చెందిన రెండు విద్యుత్ ప్లాంట్లు మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఎన్టీపీసీకి చెందిన ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటడమే ఈ పరిస్థితికి కారణం. ప్రస్తుతం ఈ ప్లాంట్లలో ఒక్క రోజుకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. బొగ్గు కొరత కారణంగా తక్కువ సామర్థ్యంతో విద్యుత్‌ను ఎన్టీపీసీ ఉత్పత్తి చేస్తోంది. మరోవైపు తుపానుతో పాటు ఒడిశాలో స్థానిక స్వతంత్ర ఎమ్మెల్యేని పోలీసులు అరెస్టు చేయడంతో మహానది కోల్ ఫీల్డ్స్(ఎంసీఎల్)లో శుక్రవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శనివారం కూడా బొగ్గు ఉత్పత్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీకి చెందిన రెండు ప్లాంట్లలో నేడో, రేపో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేజరిగితే 4,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుంది. రాష్ట్రంలో ఎన్టీపీసీకి విశాఖపట్నం సమీపంలోని 1,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సింహా ద్రితో పాటు రామగుండంలో 2,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్ ఉంది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుండటంతో రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో) ప్లాంట్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. జెన్కోకు చెందిన విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)తో పాటు వరంగల్ జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు (కేటీపీపీ)లో ఐదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయి. ఇక వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీపీ)తో పాటు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో కూడా ఒక రోజుకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. ఎంసీఎల్ నుంచి ఎన్టీటీపీఎస్తో పాటు ఆర్టీపీపీకి కూడా బొగ్గు సరఫరా అవుతుంది. ఎంసీఎల్ నుంచి బొగ్గు సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో ఆర్‌టీపీపీలోనూ ఒక రోజుకు సరిపడా నిల్వే ఉండటంతో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వాస్తవానికి కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) నిబంధనల ప్రకారం పిట్ హెడ్ ప్లాంట్ల (బొగ్గు గని పక్కనే ఉండే విద్యుత్ ప్లాంట్లు)లో 12 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. అలాగే బొగ్గు గనులకు దూరంగా ఉండే విద్యుత్ ప్లాంట్లలో 15 రోజులకు సరిపడే నిల్వలు ఉండాలి. ఈ లెక్కన రాష్ట్రంలో కొత్తగూడెం మినహా అన్ని విద్యుత్ ప్లాంట్లలోనూ 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. అయితే బొగ్గు నిల్వలు ఉంచుకోవడంలో అధికారుల వైఫల్యం వల్లే ప్లాంటు మూతపడే పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు ఉన్నాయి. -
జెన్కో ఎండీకి ఉత్తమ సీఈవో పురస్కారం
సాక్షి, హైదరాబాద్: గ్యాస్, బొగ్గు సరఫరా లేక దేశంలో 45 నుంచి 50 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుదుత్పత్తి ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఫలితంగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు నిరర్థకంగా మారాయన్నారు.కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీ సంస్థ శుక్రవారం నగరంలో నిర్వహించిన ఇండియన్ పవర్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ అందించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన విద్యుత్ రంగ నిపుణులను కోరారు. అలాగే, విద్యుత్ పొదుపుపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జెన్కో ఎండీ విజాయానంద్‌కు ఉత్తమ ముఖ్య కార్యనిర్వహణాధికారి(బెస్ట్ సీఈఓ) పురస్కారాన్ని అందించారు. ఉత్తమ ఆర్థిక నిర్వహణ(బెస్ట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్) అవార్డును జెన్కో మాజీ జేఎండీ ప్రభాకర్‌రావుకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీ సంస్థ అధ్యక్షుడు సీవీజే వర్మ పాల్గొన్నారు. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో రచ్చబండకు సీఎం మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లాల పర్యటన అనంతరం సోమవారం సాయంత్రం 4.20 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. -
మూడోరోజూ ముచ్చెమటలు
సాక్షి, హైదరాబాద్ : సమ్మెలో తొలి రెండు రోజులూ ప్రధానంగా విద్యుదుత్పత్తిని నిలిపేసిన సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు మూడో రోజైన మంగళవారం కరెంటు సరఫరా వ్యవస్థను దిగ్బంధించారు. కేంద్ర విద్యుత్ ప్లాంట్లపై గురిపెట్టడమేగాక విద్యుత్ సరఫరా వ్యవస్థ(గ్రిడ్)ను కూల్చడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా చీకట్లోకి నెట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ) నుంచి వచ్చే ఆదేశాలను కూడా బేఖాతరు చేయడమేగాక ఉద్దేశపూర్వకంగా వాటికి విరుద్ధంగా వ్యవహరించారు. కరెంటును నిలిపేయమంటే సరఫరా చేశారు, సరఫరా చేయమంటే నిలిపేశారు. దాంతో గ్రిడ్‌ను కాపాడుకునేందుకు ఎస్ఎల్డీసీ అధికారులు ఆపసోపాలు పడ్డారు. మంగళవారం కూడా సీమాంధ్రలో జెన్కోకు చెందిన విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. సోమవారం మూతబడ్డ లాంకో, స్పెక్ట్రం, రిలయన్స్ వంటి ప్రైవేట్ ప్లాంట్లలోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. మంగళవారం రాత్రి నుంచి యూనిట్‌కు ఏకంగా రూ.15 వెచ్చించి నాఫ్తా ద్వారా స్పెక్ట్రం ప్లాంటులో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఇందుకోసం కాకినాడలో 220 కేవీ సబ్‌స్టేషన్ వద్ద ట్రాన్స్‌కో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసుకుంది. దీంతోపాటు డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా ప్రైవేట్ ప్లాంట్ల నుంచి కరెంటును కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కాకతీయ, కొత్తగూడెం విద్యుత్ ప్లాంట్లలో సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కోతలు కొనసాగాయి. రైల్వేలు, ఆసుపత్రులతో పాటు విమానాశ్రయాలకు కూడా సమ్మె సెగ తాకింది. ఎస్ఎల్డీసీ చెబితే వినాల్సిందే...! గ్రిడ్ ఫ్రీక్వెన్సీ కచ్చితంగా పాటించేందుకు రాష్ట్ర స్థారుులో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ) ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి సమస్త సమాచారం ఈ సెంటర్‌కు ఎప్పటికప్పుడు చేరుతుంది. పూర్తిగా ఆన్లైన్ ద్వారా విద్యుత్ వ్యవస్థను నియంత్రించే వ్యవస్థ ఎస్‌ఎల్‌డీసీలో ఉంటుంది. ఎక్కడి నుంచి ఎంత విద్యుత్ డిమాండ్ ఉంది, ఎంత సరఫరా చేయాలి, ఏయే ప్రాంతాల్లో నిలిపేయాలి, ఎక్కడ సరఫరా చేయాలి వంటి ఆదేశాలన్నీ ఇక్కడి నుంచే వెళ్తుంటాయి. గ్రిడ్ ఫ్రీక్వెన్సీని స్థిరంగా ఉంచేందుకు వీలుగా ఎప్పటికప్పుడు ఎస్‌ఎల్‌డీసీలు జారీచేసే ఆదేశాలను కిందిస్థాయి సిబ్బంది విధిగా పాటించాల్సిందే. లేదంటే గ్రిడ్ కుప్పకూలుతుంది. కానీ, సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు మంగళవారం ఎస్ఎల్డీసీ ఆదేశాలను పాటించకపోగా, అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. అయినా ఎస్ఎల్డీసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. ట్రాన్స్‌కో గ్రిడ్ డెరైక్టర్ అన్వరుద్దీన్ 24 గంటల పాటు ఇక్కడే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాన్స్‌కో సీఎండీ(ఇన్చార్జి) మునీంద్ర, జేఎండీ రమేశ్ కూడా ఎస్ఎల్డీసీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉద్యోగులు ఆడుతున్నది చాలా ప్రమాదకరమైన ఆట అని, ఎంత అప్రమత్తంగా ఉన్నా సెకన్ల వ్యవధిలోనే ప్రమాదం జరగవచ్చని అధికారులంటున్నారు. -
సబ్సిడీ చెల్లించకుంటే కేంద్రం విద్యుత్తు కట్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం సకాలంలో సబ్సిడీ చెల్లించకుంటే కేంద్ర ప్రభుత్వరంగ విద్యుత్ ప్లాంట్ల నుంచి రాష్ట్రాలకు సరఫరా చేసే విద్యుత్ కోటాలో కోత పడనుంది. వివిధ ప్రభుత్వ శాఖలు కూడా ప్రతి నెలా కరెంటు బిల్లులు చెల్లించాల్సిందే. లేని పక్షంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందే విద్యుత్ కోటా కట్ కానుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ నిర్వహణ బాధ్యత బిల్లు-2013ను కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ సిద్ధం చేసింది. ముసాయిదా బిల్లును ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు పంపింది. ముసాయిదా బిల్లుపై సూచనలు చేయాలని పేర్కొంది. అనంతరం ఈ బిల్లును రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆదేశించింది. తాజా ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రానికి విద్యుత్ కోటా కోత పొంచి ఉందని ఇంధనశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వస్తోందే తక్కువ...!: వాస్తవానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రానికి కేంద్ర నుంచి విద్యుత్తు కోటా తక్కువగా ఉంది. మన రాష్ట్రానికి కేంద్రం నుంచి 2010లో 3006 మెగావాట్ల విద్యుత్ రాగా... 2013 నాటికి ఇది కేవలం 3,700 మెగావాట్లకు మాత్రమే పెరిగింది. మరోవైపు 2010 నాటికి కేవలం 3433 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే పొందిన మహారాష్ర్ట 2013 నాటికి ఏకంగా 6396 మెగావాట్ల విద్యుత్‌ను పొందగలిగింది. మధ్యప్రదేశ్‌కు కూడా 2010లో కేవలం 2268 మెగావాట్లు రాగా 2013 నాటికి ఏకంగా 4295 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్రం నుంచి రాబట్టగలిగింది. డిస్కంలకు ప్రభుత్వశాఖల నుంచి కరెంటు బకాయిలు ఏళ్ల తరబడి భారీగా పేరుకుపోతున్నాయి. ప్రభుత్వ శాఖలు కరెంటు బకాయిల రూపంలో విద్యుత్ సంస్థలకు రూ.1300 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంది. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్రానికి అందే విద్యుత్తులో మరింత కోత పడే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గ్యాస్ ఆధారిత విద్యుత్‌పై సబ్సిడీ!
న్యూఢిల్లీ: దేశీయంగా సహజవాయువు(గ్యాస్) లభ్యత అడుగంటిపోయి విద్యుత్ ప్లాంట్లకు సరఫరాలు ఆవిరవుతున్న నేపథ్యంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ భారీ సబ్సిడీ ప్రణాళికకు తెరలేపింది. అధిక గ్యాస్ రేట్ల కారణంగా పెరిగిపోతున్న కరెంట్ చార్జీల భారం ప్రజలపై పడకుండా ప్లాంట్లకు సుమారు రూ.11 వేల కోట్ల సబ్సిడీని చెల్లించే ప్రతిపాదనను రూపొందించింది. దీనికి సంబంధించి ముసాయిదా నోట్‌ను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ)కి సమర్పించింది. దీని ప్రకారం దేశీయంగా లభిస్తున్న చౌక గ్యాస్, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఖరీదైన ద్రవీకృత సహజవాయువు(ఎన్ఎన్జీ) ధరల సగటు రేటును(దీన్నే పూలింగ్గా కూడా వ్యవహరిస్తారు) అన్ని గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లకు ఏకరూప(యూనిఫాం) రేటుగా వర్తింపజేయాలనేది కూడా తాజా ప్రతిపాదనలో ఉంది. ‘ఇలాచేసిన తర్వాత కూడా యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం సుమారు రూ.10 వరకూ అయ్యే అవకాశం ఉంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ మాత్రం కేవలం యూనిట్‌కు రూ.5.50ను మాత్రమే వినియోగదారులపై చార్జీగా విధించగలదు. మిగతా భారాన్ని ప్లాంట్లకు ప్రత్యక్ష నగదు చెల్లింపుద్వారా ప్రభుత్వం సబ్సిడీగా భరించాల్సి ఉంటుంది’ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2015-16 నాటికి... రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి పాతాళానికి పడిపోవడంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు సరఫరాలు లేక మూతపడేస్థాయికి చేరాయి. దేశీ గ్యాస్ క్షేత్రాల నుంచి విద్యుత్ ప్లాంట్లకు రోజుకు 71.29 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్ కేటాయించగా.. కేవలం 17.25 ఎంఎంఎస్‌సీఎండీలు మాత్రమే సరఫరా జరుగుతోంది. మరో 3.5 ఎంఎంఎస్‌సీఎండీల ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుంటున్నా అనేక ప్లాంట్లు ఇంధనం లేక నిలిచిపోయాయి. దీంతె ఈ ఆర్థిక సంవత్సరం నుంచే గ్యాస్ పూలింగ్/సగటు ధర విధానాన్ని అమలు చేయాలనేది విద్యుత్ శాఖ వాదన. దీని ప్రకారం చూస్తే ఒక్కో బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) గ్యాస్ రేటు 11.43 డాలర్లుగా పడుతుంది. ఈ లెక్కన ప్లాంట్లకు విద్యుదుత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.10.47కు చేరుతుంది. ఇంత భారీ రేటును వినియోగదార్లు భరించే అవకాశం లేదనేది విద్యుత్ శాఖ వాదన. అందుకే యూనిట్ చార్జీ రూ.5.50కి మించి.. ఆపై పడే రేటును ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించాలని ప్రతిపాదించింది. దీనికి సీసీఈఏ ఆమోదం తెలిపి అమల్లోకివస్తే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి నాలుగు నెలలకు ప్రభుత్వం విద్యుత్ ప్లాంట్లకు రూ.2,498 కోట్లను సబ్సిడీగా చెల్లించాల్సి వస్తుందని అంచనా. వచ్చే ఏడాది ఈ సబ్సిడీ మొత్తం రూ.8,646 కోట్లకు, 2015-16లో రూ.10,849 కోట్లకు చేరనుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. దేశీ గ్యాస్ ధర ఎంబీటీయూకి 4.2 డాలర్లే ఉన్నా ఉత్పత్తి పడిపోవడంతో తీవ్ర కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ పూలింగ్ విధానం అమలుతో క్రమంగా అన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అవకాశం లభిస్తుందని, తద్వారా రుణాలను తిరిగి చెల్లించేందుకు వీలవుతుందని విద్యుత్ శాఖ అభిప్రాయపడింది. కాగా, గతంలో గ్యాస్ పూలింగ్ను వ్యతిరేకించిన ఈ శాఖ.. విద్యుదుత్పత్తి కంపెనీల అసోసియేషన్ విజ్ఞప్తుల మేరకు తాజా ప్రతిపాదనను సీసీఈఏకు సమర్పించడం గమనార్హం. -
విద్యుత్ లైన్లను విభజించేదెలా ?
ప్రస్తుతం జిల్లాల మధ్య లైన్లు కాస్తా ఇక రాష్ట్రాల మధ్య లైన్లు వాటిని ఎలా పంచాలనే దానిపై చర్చ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజిస్తున్న నేపథ్యంలో విద్యుత్ పంపిణీ, నిర్వహణ అంశాలు ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. విద్యుత్ ప్లాంట్లను విభజించే విషయంలో పెద్దగా సమస్య ఉండబోదని, విద్యుత్ సరఫరా లైన్లు(ట్రాన్స్మిషన్ కారిడార్)ను విభజించే విషయంలోనే సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య ఉన్న విద్యుత్ సరఫరా లైన్లు(ట్రాన్స్మిషన్ లైన్లు) కాస్తా విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య లైన్లుగా మారనున్నాయి. అయితే, వీటి విభజన ఎలా అనే విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ప్లాంటు(వీటీపీఎస్) నుంచి హైదరాబాద్‌కు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు 400 కేవీ లైన్‌ను ఏర్పాటు చేశారు. ఈ లైను విజయవాడ సమీపంలోని మల్కారం నుంచి మేడ్చల్ వరకు ఏర్పాటైంది. అయితే, విభజన తర్వాత వీటీపీఎస్‌లోని విద్యుత్ అక్కడి ప్రాంతానికే సరఫరా అవుతుంది. తద్వారా ఈ లైన్‌ను ఎవరికి కేటాయించాలి? కేటాయించినప్పటికీ విద్యుత్ సరఫరా కాకపోవడం వల్ల ఉపయోగం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వివరాలు సేకరిస్తున్న అధికారులు.. అలాగే విజయవాడ నుంచి నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి వరకు 220 కేవీ లైను ఉంది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం నుంచి చంద్రాయణగుట్ట వరకు మరో 220 కేవీ విద్యుత్ లైను ఉంది. వీటితో పాటు ఖమ్మంలోని పాల్వంచ నుంచి సీలేరు వరకూ 132 కేవీ లైను ఉంది. ఇలా మరికొన్ని లైన్లు కూడా ఇరు రాష్ట్రాల మధ్య లైన్లుగా మారనున్నాయని ట్రాన్స్‌కో వర్గాలు అంటున్నాయి. వీటి పూర్తి వివరాలను ఇవ్వాలని ఇప్పటికే ఇంధనశాఖ ఉన్నతాధికారులు ఆదేశించిన నేపథ్యంలో ఆ వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. నదీ జలాలతో పాటు విద్యుత్ పంపిణీపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఇప్పటికే దిగ్విజయ్‌సింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగానే విభజన ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ జెన్కోకు చెందిన విద్యుత్ ప్లాంట్ల విషయం కూడా పెద్ద సమస్య కాబోదని జెన్కో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లు ఆ ప్రాంతానికే వస్తాయని అంటున్నారు. ఆ విద్యుత్ రెండు రాష్ట్రాలకూ! నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్లాంటు నుంచి వచ్చే విద్యుత్ మాత్రం ఇరు రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో అక్టోబరు నుంచి విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఎందుకంటే... ఈ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ఇటు జెన్కోతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కూడా పెట్టుబడి పెట్టాయి. ఈ ప్లాంటులో రాష్ట్రంలోని నాలుగు డిస్కంలకు 49 శాతం వాటా ఉంది. ఇందులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న రెండు డిస్కంలు(సీపీడీసీఎల్, ఎన్పీడీసీఎల్) కూడా పెట్టుబడి పెట్టినట్టే. ఇందుకు అనుగుణంగా కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటు నుంచి తెలంగాణకు కూడా విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉంది. అయితే, ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్ల విషయంలో మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లతో పాటు మరికొన్ని ప్రైవేటుప్లాంట్లతో విద్యుత్ సంస్థలు ఇప్పటికే కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) కుదుర్చుకున్నాయి. ప్రధానంగా ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లన్నీ సీమాంధ్రలోనే ఉన్నాయి. ఈ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్ మొత్తం సీమాంధ్ర ప్రాంతానికే పోతుందా? తెలంగాణకు కూడా ఇస్తారా? అన్న విషయం తేలాల్సి ఉంది. - వరంగల్ జిల్లా భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటులో వచ్చే ఏడాది మార్చిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. - నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 1600 మెగావాట్ల ప్లాంటులో అక్టోబర్‌లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. -
తెలంగాణకే కరెంట్ కెపాసిటీ!
జెన్కో ఆస్తులు, ప్లాంట్ల సామర్థ్యం ఇక్కడే ఎక్కువ ఆస్తులతో పోలిస్తే.. అప్పులూ తక్కువే తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల ఆస్తులు రూ.12,500 కోట్లు.. అప్పులు 6,800 కోట్లు ఆంధ్రాలో ఆస్తులు 6,800 కోట్లు, అప్పులు 4,539 కోట్లు జెన్కో ప్లాంట్ల సామర్థ్యంలో 54% తెలంగాణలో.. 46% ఆంధ్రలో.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మొత్తమ్మీద జెన్కోకు చెందిన విద్యుత్ ప్లాంట్ల ఆస్తులు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఆస్తులతో పోలిస్తే.. అప్పులు తక్కువగా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణలో జెన్కోకు చెందిన విద్యుత్ ప్లాంట్ల ఆస్తులు రూ.12,500 కోట్లు. ఈ ప్లాంట్ల కోసం తెచ్చిన అప్పులు రూ.6,800 కోట్లు మాత్రమే. అంటే ఆస్తులు-అప్పుల నిష్పత్తి 100:54.4గా ఉందన్నమాట. అదే ఆంధ్రా ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్ల ఆస్తులు రూ.6,800 కోట్లు కాగా అప్పులు రూ.4,539 కోట్లు ఉన్నాయి. ఆస్తులు-అప్పుల నిష్పత్తి 100:66.75 శాతంగా ఉంది. అయితే, ఇరు ప్రాంతాలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నిధులతో నిర్మించిన నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటు(1,600 మెగావాట్లు) ఆస్తులు-అప్పులు రెండూ రూ.8 వేల కోట్లుగా ఉన్నాయి. ఇది ఇరు ప్రాంతాలకు చెందనుంది. ప్రతీ ప్రభుత్వ విభాగం నుంచి ఆస్తులు-అప్పుల వివరాలను రాష్ట్ర ప్రణాళిక శాఖ ఇప్పటికే సేకరించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇంధనశాఖ కూడా ఇరు ప్రాంతాల్లోని ఆస్తులు-అప్పుల వివరాలను సేకరిస్తోంది. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి ఇంధనశాఖ నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. విభజన అనంతరం కూడా ఈ అప్పులను మరో 15 ఏళ్లపాటూ చెల్లించాల్సి ఉంటుందని ఇంధనశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం ఆధారంగా చూస్తే మాత్రం ఆంధ్రాలోనే అధిక విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2282.5 మెగావాట్లు కాగా.. ఆంధ్రా ప్రాంతంలో 2810 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అయితే, జల విద్యుత్ ప్లాంట్లు మాత్రం తెలంగాణలోనే ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో జల విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2541.8 మెగావాట్లు. ఆంధ్రా ప్రాంతంలో 1287.6 మెగావాట్లు మాత్రమే. ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను పరిగణనలోని తీసుకుంటే ఆంధ్రా ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం ఎక్కువగా ఉంది. మొత్తమ్మీద రాష్ట్రవ్యాప్తంగా జెన్కోకు 8924.86 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ ప్రాంతంలో 4825.26 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అంటే మొత్తం జెన్కో సామర్థ్యంలో 54 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. ఇక ఆంధ్రా ప్రాంతంలో 4099.60 మెగావాట్ల ప్లాంట్లు... అంటే 46 శాతం ఉన్నాయి.