నెన్నెల, న్యూస్‌లైన్ :
తూర్పు ప్రాంతంలో ప్రతిపాదించిన సోలార్ విద్యుత్ ప్లాంట్ అర్ధాంతరంగా నిలి చింది. భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అటవీ శాఖ అధికారులు అభ్యంతరం చెప్పడంతో పవర్ ప్లాంట్ నిర్మాణానికి గ్రహ ణం పట్టుకుంది. దీంతో నెన్నెల ప్రాంత ప్రజలుప్లాంట్‌పై పెట్టుకున్న ఆశలు సన్నగిల్లాయి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐటీసీ) ఆధ్వర్యంలో నెన్నెల మండలం బొప్పారంలో శివారుల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం బొప్పారం శివారులో 1,000 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. ఈ భూమిలో సర్వే నంబర్ 672లో 790.29 ఎకరాలు రెవెన్యూ శాఖ కొన్నేళ్ల క్రితం నిరుపేదలకు పంపిణీ చేసి పట్టాలు అందజేసింది. పవర్‌ప్లాంట్ నిర్మాణం కోసం ఆరుగురు సర్వేయర్లతో నెన్నెల, బొప్పారం శివారు ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం ముమ్మరంగా సర్వే చేపట్టింది. అటవీశాఖ అధికారులు మోకాలొడ్డటంతో పవర్‌ప్లాంట్ నిర్మాణ ప్రక్రియ విఘాతం కలిగింది. తెలంగాణ రాష్ట్రంలోనైనా ప్లాంటును ప్రారంభించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.
ఏం జరిగింది?
భూ సేకరణ జరుగుతున్న క్రమంలో అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 672లో కొంత భూభాగం రిజర్వు ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని అభ్యంతరం చెప్పారు. సర్వేయర్లు భూ సేకరణ జరపకుండా అడ్డుకోవడంతో సర్వే దశలోనే పవర్ ప్లాంట్ నిర్మాణం ఆగింది. ఆ తర్వాత రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేయాలని నిర్ణయించినా ఇప్పటికీ ఊసులేదు. ఈ రెండు శాఖల మధ్య నెలకొన్న వివాదం పరిష్కరించేందుకు అప్పటి మంచిర్యాల సబ్‌కలెక్టర్ వివేక్‌యాదవ్, బెల్లంపల్లి డీఎఫ్‌వో వెంకటరామనర్సయ్య వివాదాస్పద భూములు పరిశీలించి వెళ్లారు. అయినా భూ సమస్యల కొలిక్కిరాలేదు. సేకరించిన భూమిని ఏపీఐటీసీకి అప్పగిస్తే తప్పా సోలార్ పవర్‌ప్లాంట్ నిర్మాణానికి అడ్డంకులు తొలగవనేది నగ్నసత్యం. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటంతో ఇప్పట్లో పవర్‌ప్లాంట్ నిర్మాణం జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
ప్రయోజనం
రోజుకు ఆరు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చనే లక్ష్యంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కలుగుతున్న అవరోదాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గడంతోపాటు వాతావరణ కాలుష్యం ఏర్పడదు. మరోపక్క డిమాండ్‌కు తగ్గట్టుగా బెల్లంపల్లి, నెన్నెల, భీమిని మండలాలకు నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేయడానికి అవకాశాలు ఉంటాయి. సౌరశక్తి గంటలు అధికంగా ఉండటం, అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో బొప్పారం ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రైవేట్ సంస్థ యజమాన్యంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే అనేక ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చిన అటవీశాఖ లేవనెత్తిన భూ సమస్యతో ప్రయోజనం లేకుండా పోయింది. సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లయితే సుమారు 70 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు మరో 200 మందికి పరోక్షంగా జీవనోపాధి లభించేది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రెవెన్యూ, అటవీశాఖల మధ్య నెలకొన్న భూ వివాదం చిక్కుముడిని తొలగించి సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఉద్యోగం వస్తుందని ఆశపడ్డం..
సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశపడ్డం. సర్వే దశలోనే ప్లాంట్ ఆగిపోవడం నిరాశగా ఉంది. ప్లాంట్ ఏర్పాటుకు కలిగిన ఇబ్బందులు తొలగించి విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. స్థానికులకు ఉద్యోగావకాశం తప్పకుండా లభిస్తుందని నా వంటి నిరుద్యోగులు గంపెడాశతో ఉన్నారు. చిన్న చిన్న సమస్యలతో పెద్ద ప్రాజెక్టును నిలిపి వేయడం సమంజసం కాదు. ఇప్పటికైనా ప్లాంటు పనులు జరిగేలా చూడాలి. - మహేశ్, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, నెన్నెల
‘సోలార్’కు గ్రహణం
Published Tue, Feb 25 2014 12:45 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement
Advertisement