పరిగిలో మొదలైన సోలార్ విద్యుదుత్పత్తి
సర్కారుకు కరెంటును విక్రయిస్తున్న ప్లాంట్ నిర్వాహకులు
రూ.40 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం..
రోజుకు 5.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి..
మరో రెండు సోలార్ పవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వ యోచన
ఒక్కోదాని సామర్థ్యం 10 మెగావాట్లు ..
రెండింటికీ రూ.150 కోట్ల వ్యయంతో పనులు
పవర్ జనరేటింగ్ హబ్‌గా మారనున్న పరిగి
పరిగి: ‘సౌర’భాల వెలుగుజిలుగులకు పరిగి మండలం చిరునామా అయింది. జిల్లాలోనే సోలార్ పవర్ ప్రాజెక్టులకు కేంద్రస్థానంగా మారింది. ఇప్పటికే ఓ పవర్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా.. ఇక్కడ మరో రెండు సోలార్ పవర్ ప్రాజెక్టులకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో పరిగి ప్రాంతం రానున్న రోజుల్లో సోలార్ పవర్ జనరేటింగ్ హబ్‌గా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మండలంలోని కాళ్లాపూర్ శివారులో ఆరు నెలల క్రితం ప్రారంభమైన సోలార్ పవర్ జనరేటింగ్ ప్లాంట్ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో విద్యుదుత్పత్తి ప్రారంభించిన ప్రాజెక్టు నిర్వాహకులు వారంరోజుల క్రితం ట్రయల్ రన్ నిర్వహించారు. రె ండ్రోజులుగా ప్రాజెక్టులో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన ఎస్‌జే పవర్ కంపెనీ ప్రతినిధులు కాళ్లాపూర్ రెవెన్యూ పరిధిలోని 24వ సర్వే నంబర్‌లో ప్లాంటు నిర్మించారు.
రెండు నెలల క్రితమే విద్యుదుత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా భూ కొనుగోళ్లు, అనుమతుల్లో నెల కొన్న పలు వివాదాల నెలకొన్నాయి. ఈ కారణంగా ప్లాంటు పనులు పూర్తయినా విద్యుదుత్పత్తిలో రెండు నెలలపాటు ఆలస్యం జరిగింది. 33 కేవీ విద్యుత్ లైన్ ద్వారా సరఫరా రూ.40 కోట్లతో 46 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా రోజుకు 5.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
దీనిని నేరుగా ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. ఇందుకోసం ముందుగానే ప్రభుత్వంతో ప్రాజెక్టు నిర్వాహకులు అగ్రిమెంటు చేయించుకున్నారు. దీని ప్రకారం ప్రస్తుతం పవర్‌ను ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. ఉత్పత్తి అయిన ఒక్కో యూనిట్ విద్యుత్‌ను రూ.6.48 పైసల లెక్కన సర్కారుకు అమ్ముతున్నారు. ఒక్కో మెగావాట్ కోటిన్నర లక్షల యూనిట్లతో సమానం కావడంతో.. ప్రస్తుతం పరిగిలో ఉత్పత్తి ప్రారంభమైన ప్రాజెక్టులో ఏడున్నర లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ ఉత్పత్తి అయిన కరెంటును33 కేవీ లైన్ ద్వారా పరిగి సమీపంలోని 133 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సరఫరా చేయనున్నారు. అక్కడినుంచి మిగతా ప్రాంతాలకు సరఫరా అవుతుంది.
మరో రెండు పవర్ ప్లాంట్లకు అవకాశం..
పరిగిలో ఇప్పటికే 5.8 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల సోలార్ పవర్ ప్రాజెక్టు అందుబాటులోకి రాగా.. ఈ ప్రాంతంలోనే మరో రెండు సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటుచేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో ప్రాజెక్టు 10 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.150 కోట్ల వ్యయం చేయనున్నారు.
ఇందులో 10 మెగావాట్ల సామర్థ్యం గల ఓ ప్రాజెక్టును ఇప్పటికే 5 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించి విద్యుదుత్పత్తి ప్రారంభించిన ఎస్‌జే పవర్ కంపెనీ వారు తీసుకోగా మరో ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఓ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కొంతమేర భూసేకరణ కూడా ఆ కంపెనీ వారు చేశారు. ఈ ప్రాజెక్టులు సైతం కాళ్లాపూర్, సయ్యద్‌మల్కాపూర్, రాఘవాపూర్ శివారు ప్రాంతాల్లోనే నెలకొల్పనున్నారు.
‘సౌర’భాలు
Published Fri, Dec 26 2014 11:17 PM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement
Advertisement