మూడోరోజూ ముచ్చెమటలు
సాక్షి, హైదరాబాద్ : సమ్మెలో తొలి రెండు రోజులూ ప్రధానంగా విద్యుదుత్పత్తిని నిలిపేసిన సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు మూడో రోజైన మంగళవారం కరెంటు సరఫరా వ్యవస్థను దిగ్బంధించారు. కేంద్ర విద్యుత్ ప్లాంట్లపై గురిపెట్టడమేగాక విద్యుత్ సరఫరా వ్యవస్థ(గ్రిడ్)ను కూల్చడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా చీకట్లోకి నెట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) నుంచి వచ్చే ఆదేశాలను కూడా బేఖాతరు చేయడమేగాక ఉద్దేశపూర్వకంగా వాటికి విరుద్ధంగా వ్యవహరించారు. కరెంటును నిలిపేయమంటే సరఫరా చేశారు, సరఫరా చేయమంటే నిలిపేశారు.
దాంతో గ్రిడ్‌ను కాపాడుకునేందుకు ఎస్‌ఎల్‌డీసీ అధికారులు ఆపసోపాలు పడ్డారు. మంగళవారం కూడా సీమాంధ్రలో జెన్‌కోకు చెందిన విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. సోమవారం మూతబడ్డ లాంకో, స్పెక్ట్రం, రిలయన్స్ వంటి ప్రైవేట్ ప్లాంట్లలోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. మంగళవారం రాత్రి నుంచి యూనిట్‌కు ఏకంగా రూ.15 వెచ్చించి నాఫ్తా ద్వారా స్పెక్ట్రం ప్లాంటులో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఇందుకోసం కాకినాడలో 220 కేవీ సబ్‌స్టేషన్ వద్ద ట్రాన్స్‌కో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసుకుంది. దీంతోపాటు డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా ప్రైవేట్ ప్లాంట్ల నుంచి కరెంటును కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కాకతీయ, కొత్తగూడెం విద్యుత్ ప్లాంట్లలో సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కోతలు కొనసాగాయి. రైల్వేలు, ఆసుపత్రులతో పాటు విమానాశ్రయాలకు కూడా సమ్మె సెగ తాకింది.
ఎస్‌ఎల్‌డీసీ చెబితే వినాల్సిందే...!
గ్రిడ్ ఫ్రీక్వెన్సీ కచ్చితంగా పాటించేందుకు రాష్ట్ర స్థారుులో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి సమస్త సమాచారం ఈ సెంటర్‌కు ఎప్పటికప్పుడు చేరుతుంది. పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా విద్యుత్ వ్యవస్థను నియంత్రించే వ్యవస్థ ఎస్‌ఎల్‌డీసీలో ఉంటుంది. ఎక్కడి నుంచి ఎంత విద్యుత్ డిమాండ్ ఉంది, ఎంత సరఫరా చేయాలి, ఏయే ప్రాంతాల్లో నిలిపేయాలి, ఎక్కడ సరఫరా చేయాలి వంటి ఆదేశాలన్నీ ఇక్కడి నుంచే వెళ్తుంటాయి. గ్రిడ్ ఫ్రీక్వెన్సీని స్థిరంగా ఉంచేందుకు వీలుగా ఎప్పటికప్పుడు ఎస్‌ఎల్‌డీసీలు జారీచేసే ఆదేశాలను కిందిస్థాయి సిబ్బంది విధిగా పాటించాల్సిందే. లేదంటే గ్రిడ్ కుప్పకూలుతుంది. కానీ, సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు మంగళవారం ఎస్‌ఎల్‌డీసీ ఆదేశాలను పాటించకపోగా, అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. అయినా ఎస్‌ఎల్‌డీసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. ట్రాన్స్‌కో గ్రిడ్ డెరైక్టర్ అన్వరుద్దీన్ 24 గంటల పాటు ఇక్కడే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాన్స్‌కో సీఎండీ(ఇన్‌చార్జి) మునీంద్ర, జేఎండీ రమేశ్ కూడా ఎస్‌ఎల్‌డీసీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉద్యోగులు ఆడుతున్నది చాలా ప్రమాదకరమైన ఆట అని, ఎంత అప్రమత్తంగా ఉన్నా సెకన్ల వ్యవధిలోనే ప్రమాదం జరగవచ్చని అధికారులంటున్నారు.