విద్యుత్ లైన్లను విభజించేదెలా ? | while on state bifurcation, how to separate Power supply lines ? | Sakshi
Sakshi News home page

విద్యుత్ లైన్లను విభజించేదెలా ?

Published Mon, Aug 12 2013 3:12 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

విద్యుత్ లైన్లను విభజించేదెలా ? - Sakshi

విద్యుత్ లైన్లను విభజించేదెలా ?

ప్రస్తుతం జిల్లాల మధ్య లైన్లు కాస్తా ఇక రాష్ట్రాల మధ్య లైన్లు    
 వాటిని ఎలా పంచాలనే దానిపై చర్చ
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజిస్తున్న నేపథ్యంలో విద్యుత్ పంపిణీ, నిర్వహణ అంశాలు ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. విద్యుత్ ప్లాంట్లను విభజించే విషయంలో పెద్దగా సమస్య ఉండబోదని, విద్యుత్ సరఫరా లైన్లు(ట్రాన్స్‌మిషన్ కారిడార్)ను విభజించే విషయంలోనే సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య ఉన్న విద్యుత్ సరఫరా లైన్లు(ట్రాన్స్‌మిషన్ లైన్లు) కాస్తా విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య లైన్లుగా మారనున్నాయి.
 
 అయితే, వీటి విభజన ఎలా అనే విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ప్లాంటు(వీటీపీఎస్) నుంచి హైదరాబాద్‌కు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు 400 కేవీ లైన్‌ను ఏర్పాటు చేశారు. ఈ లైను విజయవాడ సమీపంలోని మల్కారం నుంచి మేడ్చల్ వరకు ఏర్పాటైంది. అయితే, విభజన తర్వాత వీటీపీఎస్‌లోని విద్యుత్ అక్కడి ప్రాంతానికే సరఫరా అవుతుంది. తద్వారా ఈ లైన్‌ను ఎవరికి కేటాయించాలి? కేటాయించినప్పటికీ విద్యుత్ సరఫరా కాకపోవడం వల్ల ఉపయోగం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
 వివరాలు సేకరిస్తున్న అధికారులు..
 అలాగే విజయవాడ నుంచి నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి వరకు 220 కేవీ లైను ఉంది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం నుంచి చంద్రాయణగుట్ట వరకు మరో 220 కేవీ విద్యుత్ లైను ఉంది. వీటితో పాటు ఖమ్మంలోని పాల్వంచ నుంచి సీలేరు వరకూ 132 కేవీ లైను ఉంది. ఇలా మరికొన్ని లైన్లు కూడా ఇరు రాష్ట్రాల మధ్య లైన్లుగా మారనున్నాయని ట్రాన్స్‌కో వర్గాలు అంటున్నాయి. వీటి పూర్తి వివరాలను ఇవ్వాలని ఇప్పటికే ఇంధనశాఖ ఉన్నతాధికారులు ఆదేశించిన నేపథ్యంలో ఆ వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. నదీ జలాలతో పాటు విద్యుత్ పంపిణీపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఇప్పటికే దిగ్విజయ్‌సింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగానే విభజన ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ జెన్‌కోకు చెందిన విద్యుత్ ప్లాంట్ల విషయం కూడా పెద్ద సమస్య కాబోదని జెన్‌కో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లు ఆ ప్రాంతానికే వస్తాయని అంటున్నారు.
 
 ఆ విద్యుత్ రెండు రాష్ట్రాలకూ!
 నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్లాంటు నుంచి వచ్చే విద్యుత్ మాత్రం ఇరు రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో అక్టోబరు నుంచి విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఎందుకంటే... ఈ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ఇటు జెన్‌కోతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కూడా పెట్టుబడి పెట్టాయి. ఈ ప్లాంటులో రాష్ట్రంలోని నాలుగు డిస్కంలకు 49 శాతం వాటా ఉంది. ఇందులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న రెండు డిస్కంలు(సీపీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్) కూడా పెట్టుబడి పెట్టినట్టే.
 
  ఇందుకు అనుగుణంగా కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటు నుంచి తెలంగాణకు కూడా విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉంది. అయితే, ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్ల విషయంలో మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లతో పాటు మరికొన్ని ప్రైవేటుప్లాంట్లతో విద్యుత్ సంస్థలు ఇప్పటికే కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) కుదుర్చుకున్నాయి. ప్రధానంగా ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లన్నీ సీమాంధ్రలోనే ఉన్నాయి. ఈ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్ మొత్తం సీమాంధ్ర ప్రాంతానికే పోతుందా? తెలంగాణకు కూడా ఇస్తారా? అన్న విషయం తేలాల్సి ఉంది.
 
 - వరంగల్ జిల్లా భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటులో వచ్చే ఏడాది మార్చిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది.
 -    నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 1600 మెగావాట్ల ప్లాంటులో అక్టోబర్‌లో ఉత్పత్తి ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement