ఏకాభిప్రాయానికి వస్తేనే పరిష్కారం
విద్యుత్ ఆస్తుల పంపకంపై షీలాభిడే కమిటీ సూచన
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న విద్యుత్ ఆస్తుల పంపకంపై ఉభయరాష్ట్రాలూ ఏకాభిప్రాయానికి రావాలని, అప్పుడే తాము అవసరమైన సిఫారసులు చేయగలమని షీలాభిడే కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు, అప్పుల విభజనకు షీలాభిడే నేతృత్వంలో ఓ కమిటీని నియమించడం తెలిసిందే. ఈ కమిటీ ఎదుట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ అధికారులు సత్యమూర్తి(డెరైక్టర్, ఫైనాన్స్ ఏపీ), శ్రీనివాస్(జేఎండీ, తెలంగాణ) గురువారం హాజరయ్యారు. ఇరుపక్షాలూ తమ అభ్యంతరాల్ని కమిటీ సభ్యులు కేవీ రావు, ఏకే గోయల్‌కు తెలియజేశారు.
యూనిట్లవారీగా ఆస్తుల లెక్కింపుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించట్టేదని ఏపీ ఆరోపించినట్టు సమాచారం. అదేవిధంగా పూర్తి ఆడిట్ నివేదికల్ని తమకివ్వకుండా ఇష్టానుసారంగా ఆస్తుల పంపకాలు చేశారని, ఇందుకోసం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ కూడా ఏపీ అధికారుల అధీనంలోనే ఉందని తెలంగాణ ప్రత్యారోపణ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు అంతర్గత వ్యవహారాలపై చర్చించుకుని.. ఏకాభిప్రాయానికి రావాలని షీలాభిడే కమిటీ సభ్యులు ఇరుపక్షాలకు సూచించారు. దీంతో సమావేశం అర్ధంతరంగా వాయిదా పడింది.