నాడు నోరెత్తలేదేం? : మైసూరారెడ్డి | why they don't ask in CWC resolution, says Mysura reddy | Sakshi
Sakshi News home page

నాడు నోరెత్తలేదేం? : మైసూరారెడ్డి

Published Fri, Aug 9 2013 3:23 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

నాడు నోరెత్తలేదేం? : మైసూరారెడ్డి - Sakshi

నాడు నోరెత్తలేదేం? : మైసూరారెడ్డి

 ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తిన మైసూరారెడ్డి
 సీడబ్ల్యూసీ ముందు సమస్యలన్నింటినీ వివరించారా?
 మీరు చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా?
 మీ మాటల్ని ఖాతరు చేయకపోతే మీరెందుకు రాజీనామా చేయలేదు?
రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటిపంపకాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యలున్నాయంటున్నారు
ఈ సమస్యలన్నీ కొద్దిరోజులుగా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ చెబుతున్నవే
విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది?
 ఇతర పార్టీలవి దొంగనాటకాలంటున్నారు... అసలు మీ నాటకమేమిటి?
 రాష్ట్రాన్ని విభజిస్తే చాలా ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలిపోతాయి..
రాష్ట్ర విభజన నెపాన్ని వైఎస్‌పై నెట్టడం తగదు    
 రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటి పంపకాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యలున్నాయని మీకు తెలుసుకదా?
 మీరు చెప్పినా అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా?..  అయితే మీరెందుకు రాజీనామా చేయలేదు?
 విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది?

 
రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటి పంపకాలు, విద్యుత్ సమస్యలు, ఉద్యోగులు, తదితర అంశాలపై సమస్యలున్నాయని చెప్తున్న ముఖ్యమంత్రి సీడబ్ల్యూసీ ముందు నోరెందుకు ఎత్తలేదని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం రాత్రి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి  మీడియా సమావేశానంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అన్ని విషయాలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలేమిటో తెలిసే ఉంటుంది. విభజన ప్రకటనకు ముందు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మీరూ పాల్గొన్నారు.
 
 అప్పుడు ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావించారా? మీరు చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా? అలా చేసుంటే మీరు వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుండాల్సింది. కానీ అలా చేయకుండా విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది?’’ అని నిలదీశారు. ఇతర పార్టీలవి దొంగ నాటకాలంటున్న కిరణ్... ఆయన ఆడుతున్న నాటకమేదో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇది తాను మంచివాడినని చెప్పుకోవడం కోసమో లేదా ప్రజల ఆగ్రహావేశాలనుంచి పార్టీని కాపాడేందుకో సీఎం కిరణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
 
 ప్రజలను మభ్యపెట్టడానికే ఆ కమిటీ..
 ఆంటోనీ నేతృత్వంలో వేసిన హైలెవెల్ కమిటీకి సమస్యలు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి సూచించడాన్ని మైసూరా తప్పుబట్టారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో సీడబ్ల్యూసీ అత్యున్నత కమిటీ. ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సబ్ కమిటీ ఎలా సవరించగలుగుతుంది. యజమాని చేసిన నిర్ణయంపై గుమాస్తా పంచాయతీ చేయగలడా? ఒక పార్టీ వేసుకున్న కమిటీకి మిగతా పార్టీలు అభిప్రాయాలెందుకు చెప్తాయి? ఒకవేళ చెప్పినా చెవికెక్కుతుందా? ఎవరెన్ని చెప్పినా ఆఖరికి వారి అధినేత్రి సోనియా చెప్పిన విషయాలనే రిపోర్టులో పొందుపరుస్తారు’’ అని విమర్శించారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య లక్ష్మణరేఖ ఉంటుంది.
 
 దాన్ని విస్మరించినట్లు కాంగ్రెస్‌పార్టీ ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. చట్టబద్ధంగా నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికనే తుంగలో తొక్కేసిన వారు ఎలాంటి అధికారాలు లేని ఆంటోనీ కమిటీ సూచనలను పాటిస్తారని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన కమిటీని నియమిస్తేనే అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలు వినిపిస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యనెలా పరిష్కరిస్తారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ చాలాకాలంగా ప్రశ్నిస్తోందని మైసూరా గుర్తుచేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కావేరీ, ఆల్మట్టి జల వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కావడంలేదు. ఈ సమస్యను హైపవర్ కమిటీ ఎలా పరిష్కరిస్తుందని నిలదీశారు.
 
 కాంగ్రెస్‌కు పది తలలుంటాయి...
 కాంగ్రెస్ పార్టీ పది తలల రావణాసురుడులాంటిదని, అందులో ఒక్కో తల ఒక్కొక్క మాట చెబుతోందని మైసూరా ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నాలుగేళ్లుగా కాంగ్రెస్ తన వైఖరి చెప్పకుండా రాజకీయ దుష్టచింతనతో ప్రవర్తించింది. హోంమంత్రి షిండేతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా రెండు ప్రాంతాల ప్రతినిధులు రెండు రకాలు చెప్పారు. పార్టీ వాదన చెప్పాలని తాము నిలదీస్తే... అధిష్టానం చెప్పేదే అంతిమ నిర్ణయమని షిండే చెప్పారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే సీడబ్ల్యూసీ ఇప్పుడు నిర్ణయం తీసుకుంది.
 
 రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. దాన్ని చల్లార్చేందుకే కమిటీలంటూ నాటకాలాడుతోంది. తాజాగా సీఎం కిరణ్ మాట్లాడుతూ... విభజన పార్టీకే పరిమితం తప్ప, కేంద్రం నిర్ణయం కాదంటూ ఇరుప్రాంతాల్లో సమస్యను మరింత జఠిలం చేశారు. వారి వాలకం చూస్తుంటే ఎలాంటి నిర్ణయమైనా ముందు, వెన క్కి తీసుకునే సౌలభ్యాన్ని చేతిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఓట్లు, సీట్ల కోసమే ఎన్నికల ముందు ఎత్తులు వేస్తున్నారు’’ అని మైసూరా విమర్శించారు. ఇది రాజకీయ లబ్ధికోసం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారని తెలిపారు.
 
 మాది ఒకే మాట...
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకే మాటకు కట్టుబడి ఉందని మైసూరా చెప్పారు. ప్లీనరీ నుంచి షిండే ఏర్పాటు చేసిన అఖిలపక్షం వరకు ఒకే మాట చెప్పామని, ఒక తండ్రిలా సమస్యను పరిష్కరించాలని కోరామని వివరించారు. అవేవీ చేయకుండా ఇతరులపై బురద చల్లడం సరైంది కాదన్నారు. నీటి పంపకాలు, రాజధాని, ఉద్యోగులు తదితర అంశాలపై తాము వారం రోజులుగా అనునిత్యం మీడియా సమావేశంలో చెబుతున్న వాటినే సీఎం ప్రస్తావించారని చెప్పారు.
 
 రాష్ట్ర విభజన నెపాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై నెట్టడాన్ని మైసూరా తప్పుపట్టారు. ‘‘ఆనాడు ఎమ్మెల్యేలందరూ వెళ్లి సోనియాగాంధీని కలిసినప్పుడు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశారు. రెండోఎస్సార్సీ ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. అప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి అదే తీర్మానాన్ని అందజేసింది తప్ప అంతకుమించి మరేమీ జరగలేదు’’ అని మైసూరారెడ్డి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement